కార్పొరెట్‌ విద్యాసంస్థల్లో ఆత్మహత్యలకు నిరసనగా దీక్షలు 

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యార్ధుల ఆత్మహత్యలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఎబివిపి ఆధ్వర్యాన నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్‌ కె.వేదవ్యాస్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ కళాశాలల్లో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం వల్ల ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎస్‌ బాలు, ఆశిష్‌, వీరేంద్ర, మురళీ, సాయి వర్మ, సాయి, సువర్ధన, శాంతి, గోపి, రవితేజ, జ్యోతి ప్రకాష్‌ పాల్గొన్నారు.

మొక్కలు నాటండి..పచ్చదనం పెంచండి

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : కాతేరులోని జిల్లా ప్రజా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ప్రక తి పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.సుజాత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా గంగిన హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులందరూ పాఠశాలలో, ఇంటి వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటాలని, గ్రామాన్ని హరిత గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ ఎలిపే బాబురావు, పాఠశాల సిబ్బంది, అధ్యాపకులు పాల్గొన్నారు

చూడముచ్చటైన వేషధారణలు.. చక్కనైన నృత్యాలు

హ్యాపి సండేలో ఆకట్టుకున్న మున్సిపల్‌ పాఠశాలల విద్యార్ధులు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో పుష్కర్‌ఘాట్‌ వద్ద నిర్వహించిన హ్యాపీ సండేలో జాతీయ గీతాలు, జానపద, ఆ పాత మధుర గీతాలకు చిన్నారులు చూడ ముచ్చటైన వేషధారణలతో చక్కటి న త్యాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. మేజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ సంస్ధ పోషకాహార విలువలు, ఆరోగ్య సూత్రాలను వివరించారు. శ్యామలాంబ యూపి స్కూల్‌, మెరక వీధి నగరపాలక సంస్ద, ఓల్డ్‌ టౌన్‌ మునిసిపల్‌ స్కూల్‌, మేదరపేట పాఠశాల, ఇన్నీస్‌పేట నగరపాలక సంస్ధ పాఠశాల, సిటీ మునిసిపల్‌ హైస్కూల్‌, నాగరాజా మునిసిపల్‌ స్కూల్‌ విద్యార్ధులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని పాటలకు అనుగుణంగా డాన్స్‌ లు వేసి ఆకట్టుకున్నారు. డిఎన్‌ఎ బ ందం ఫ్లాష్‌ మోబ్‌తో సందడి చేసారు. నగరపాలక సంస్ధకు చెందిన ఉద్యోగి గోవింద్‌ డప్పు వాయించి అందరి ప్రశంసలు అందుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, గొర్రెల సురేష్‌, డిప్యూటీ కమిషనర్‌ ఫణిరామ్‌, మేనేజర్‌ శ్రీనివాస్‌ పాల్గొనగా  స్కూల్స్‌ సూపర్వైజర్‌ దుర్గాప్రసాద్‌, రాజేష్‌, రమాదేవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

వాగ్ధానాన్ని అమలు చేశారు 

కోటిలింగాల ఘాట్‌ వద్ద ఆక్రమణదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 22 : గోదావరి పుష్కరాల సందర్బంగా కోటిలింగాల ఘాట్‌ వద్ద అప్రోచ్‌ రోడ్ల కోసం తొలగించిన 50 మంది ఆక్రమణదారులకు రామకృష్ణ ధియేటర్‌ వెనుక దేవాదాయ శాఖ స్ధలంలో నిర్మించిన గ హాలను కేటాయించి వారికి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ పుష్కరాల సమయంలో తొలగించిన వారికి గ హాలు కేటాయించాలని సిఎం చంద్రబాబునాయుడు ఆదేశించారని, వారికి గ హాలు కేటాయించే వరకు తాత్కాలిక వసతి కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా 41వ డివిజన్‌ కార్పొరేటర్‌ మర్రి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు క్షత్రియ బాల సుబ్రహ్మణ్య సింగ్‌, నాళం పద్మశ్రీ, అడ్డాల ఆదినారాయణ, గేదెల అప్పారావు, తంగుడు వెంకట్రావు, అడ్డాల నాగేశ్వరరావు, రౌతు వాసు, విజయలక్ష్మి, ఒమ్మి తులసి పాల్గొన్నారు.

లబ్ధిదారులకు ముద్ర చెక్‌ అందజేసిన గన్ని కృష్ణ 

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘ముద్ర’ పథకంలో మంజూరైన రూ. 50 వేల చెక్కును లబ్ధిదారులు మారెళ్ళ ధనలక్ష్మీ, మారెళ్ళ సుగుణలకు గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అందజేశారు. స్ధానిక 42 వ డివిజన్‌కు చెందిన ధనలక్ష్మీ, సుగుణలు కిరాణా వ్యాపారం నిమిత్తం ముద్ర పథకంలో దరఖాస్తు చేసుకోగా రూ. 50 వేలు మంజూరయ్యాయి. కోరుకొండరోడ్డులోని సిండికేట్‌ బ్యాంక్‌ ద్వారా ఈ రుణ సౌకర్యాన్ని  వారికి కల్పించారు. బ్యాంక్‌ చెక్‌ను గన్ని చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, డివిజన్‌ తెదేపా అధ్యక్షులు మళ్ళ వెంకట్రాజు పాల్గొన్నారు.

వైద్యులారా తీరు మార్చుకోండి 

లోక్‌సత్తా, పౌర నిఘావేదిక విజ్ఞప్తి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : నగరంలోని వైద్యులు ఏకస్వామ్య విధానాలు వీడి, రోగులపట్ల కొంత మానవీయత చాటుతూ సేవలు అందించాలని లోక్‌సత్తా, పౌర నిఘావేదిక విజ్ఞప్తి చేసింది. వైద్యోనారాయణ హరి అని ఆర్యోక్తని, వైద్యం చేసి ప్రాణాలను కాపాడే వైద్యుడిని ప్రజలు దేవుడిగా భావిస్తారని, అయితే కొంతమంది వైద్యులు ఏకస్వామ్య విధానాలను అవలంభిస్తూ రోగులను ఇబ్బందుల పాలు చేయడం సరికాదని పౌర నిఘావేదిక కోరింది.  స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర కోఆర్డినేటర్‌ ఎంవి రాజగోపాల్‌, కోశాధికారి ఎన్‌ఎస్‌ రామచంద్రమూర్తి, సిఎస్‌ కామేశ్వరరావులు మాట్లాడుతూ కొంతమంది వైద్యులు నిబంధనలు పాటిస్తూ, సేవా దృక్పదంతో వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ, కొంతమంది మాత్రం వైద్య వృత్తిని ధనార్జనగా భావిస్తూ అవలంభిస్తున్న విధానాలు కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపధ్యంలో వైద్యులకు పలు సూచనలు చేస్తూ ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించడం జరిగిందన్నారు. ప్రిస్కిప్షన్‌, హెల్త్‌ రికార్డులలో దస్తూరి అర్ధమయ్యేలా ఉండాలని, మందులను ఆసుపత్రి కౌంటర్‌లోనే కాకుండా జనరిక్‌, ఇతర మందుల షాపుల్లో ఎక్కడైనా కొనుక్కొనేందుకు వీలుగా ప్రిస్కిప్షన్‌ అందరికీ అర్ధమయ్యే విధంగా పొడి అక్షరాలలో రాయాలని, మందులు వాడే విధానాన్ని వైద్యులు తెలియజేయాలని, ఆసుపత్రిలోని మందుల కౌంటర్‌లలోనూ మందుల అమ్మకాలపై 10నుంచి 15శాతం డిస్కౌంట్‌ కల్పించాలని, రోగుల సౌకర్యం కోసం స్వైపింగ్‌ మెషిన్‌లు అందుబాటులో ఉంచాలని కోరారు. డయాగ్నోసిక్‌ సెంటర్‌లు, డాక్టర్‌ల మధ్య క్విడ్‌ ప్రోకోను ఆపాలన్నారు. ఓపి కార్డును 15 రోజులకు కాకుండా 30 రోజులకు వర్తింపు చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో బిఎన్‌ వర్మ పాల్గొన్నారు.

సౌకర్యాలు కల్పిస్తే తరలిపోతాం 

రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : ప్రజారోగ్యం కోసం నగరం నుంచి పందులను ఏరివేసి తమ ఉపాధిని దూరం చేయొద్దని పందుల పెంపకందార్లు నగరపాలక సంస్ధ కమిషనర్‌ను కోరారు. స్ధానిక సూర్య ¬టల్‌లో ఆలిండియా కుర్రు(ఎరుకుల) సేవాసమితి, ఫోరం ఫర్‌ ఆర్టీఐ సంస్ధల ప్రతినిధులు విలేకరుల సమావేశం నిర్వహించారు. సేవా సమితి అర్బన్‌ జిల్లా అధ్యక్షులు మంగర అప్పారావు, నాయకులు సింగం పెన్నయ్య తదితరులు మాట్లాడుతూ తమకు నగరానికి దూరంగా స్ధలం కేటాయించి, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పిస్తే అక్కడకు తరలిపోవడానికి సిద్ధమేనన్నారు. కౌన్సిల్‌లో పందుల పెంపకందార్లు కొరకు 2 ఎకరాల స్ధలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేసినప్పటికీ తమకు ఆ స్ధలాన్ని కేటాయించడం గానీ, మౌళిక సదుపాయాలు కల్పించడం కానీ చేయలేదన్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే పందులను తరలించాలని కోర్టు చెప్పినప్పటికీ కూడా బలవంతంగా తమను తరలించడం కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. గత 32 సంవత్సరాలుగా తమను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఊరి చివరనే పందులను పెంచుకుంటూ జీవిస్తున్నామని, అయితే ఊరు పెరిగినప్పుడల్లా తమను అక్కడ నుంచి తరలించేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఇప్పటికైనా తమకు అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి స్ధలాన్ని కేటాయిస్తే తరలిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కోర్టు ధిక్కారానికి పాల్పడటం, తమను వేధింపులకు గురిచేయడంపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. ఫోరం ఫర్‌ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు చేతన మాట్లాడుతూ పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపించాలన్నారు.  విలేకరుల సమావేశంలో సింగం కృష్ణ, గాడ ప్రసాద్‌, గాడ సత్యవరప్రసాద్‌, పాస్టర్‌ ఎలీషా, ఫోరం ఫర్‌ ఆర్టీఐ నాయకులు ముచ్చకర్ల సత్యనారాయణ, న్యాయ పరిరక్షణ సమితి వ్యవస్ధాపకులు జుజ్జవరపు కాళేశ్వరరావులు పాల్గొన్నారు.

ప్రజల రక్షణే మా కర్తవ్యం 

ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : అర్బన్‌ పోలీసు జిల్లా కార్యాలయంలో ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యాన ఈరోజు ఉదయం పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించారు.  పార్లమెంటు సభ్యులు మాగంటి మురళీమోహన్‌, మేయర్‌ పంతం రజనీశేషసాయి, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌  అతిధులుగా హాజరయ్యారు. వారితో పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ చిహ్నం వద్ద ఎస్పీ బి.రాజకుమారి తదితరులు పుష్పగుచ్చాలు  వుంచి  నివాళులు అర్పించారు. అమరవీరులను సంస్మరిస్తూ పోలీసులు గౌరవ వందనం చేశారు. అనంతరం  నగరంలో  భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ సాగింది. శాంతిభద్రతల పరిరక్షణకోసం, ప్రజల రక్షణ కోసం విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులు అర్పించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు తగిన విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపి మాగంటి మురళీ మోహన్‌ అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వమే కాకుండా సహచర సిబ్బంది  అండగా నిలబడి ఆదుకోవాలని ఆయన కోరారు.

రక్తదానంపై అవగాహన అవసరం

సేవా కార్యక్రమాల నడుమ బాక్స్‌ ప్రసాద్‌ జన్మదిన వేడుకలు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : రక్తదానం  ఆవశ్యకతను గుర్తెరిగి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని పలువురు నాయకులు సూచించారు. మాజీ డిప్యూటీ మేయర్‌ బాక్స్‌ ప్రసాద్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని జె.ఎన్‌.రోడ్డులో ఉన్న సూర్య గార్డెన్స్‌లో తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 400 మంది రక్తదానం చేసి బాక్స్‌ ప్రసాద్‌ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ,  శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, సిటి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆదిరెడ్డి వాసు, సిసిసి ఎండి పంతం కొండలరావు, కార్పొరేటర్‌ కోసూరి చండీప్రియ, తలారి భగవాన్‌ తదితరులు పాల్గొని రక్తదాన శిబిరాన్ని సందర్శించి బాక్స్‌ ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అభినందించారు. వివిధ రంగాల కార్మికుల సమక్షంలో బాక్స్‌ ప్రసాద్‌ పుట్టినరోజు కేక్‌ కట్‌ చేసారు. వందలాది మంది కార్మికులు, నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బాక్స్‌ ప్రసాద్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు చేరువ కావాలి

30వ డివిజన్‌లో ఉత్సాహంగా సాగిన ఇంటింటికీ తెలుగుదేశం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 21 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు చేరువ కావాలన్న సంకల్పంతోనే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తలపెట్టారని గుడా చైర్మన్‌  గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 30వ డివిజన్‌లో మాజీ కార్పొరేటర్‌ రెడ్డి మణి ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. గంటాలమ్మ గుడి వీధిలోని విక్టోరియా పాఠశాల నుంచి పార్టీ నాయకులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గన్ని, ఆదిరెడ్డితోపాటు రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పార్టీ నాయకులు ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో ఊరటనిస్తున్నాయని కొంతమంది ముస్లిం నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, పార్టీ నాయకులు కాశి నవీన్‌కుమార్‌, రాచపల్లి ప్రసాద్‌, కార్పొరేటర్లు గరగ పార్వతి, పైడిమళ్ళ మెర్సీప్రియ, ద్వారా పార్వతి సుందరి, కోరుమిల్లి విజయశేఖర్‌, మజ్జి పద్మ, చాన్‌ భాషా, నాయకులు మరుకుర్తి రవి యాదవ్‌, శీలం గోవింద్‌, మహబూబ్‌ జానీ, మాకాని లక్ష్మణరావు, మజ్జి శ్రీనివాస్‌, గరగ మురళీకృష్ణ, మునుకోటి వెంకటేశ్వరరావు, ఆశపు సత్యనారాయణ, కర్రి కాశీ విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు.