మీలో మార్పు రాదా?

పని తీరు మారని ప్రభుత్వ వైద్యులపై ఆదిరెడ్డి ఆగ్రహం
మళ్ళీ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్సీ
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 24 :  ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగుల పట్ల మర్యాదగా మెలగాలని  శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. వారం రోజుల క్రితం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ప్రసూతి విభాగంలో సీనియర్‌ వైద్యురాలు విష్ఠువర్థిని తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ముందుగా చెప్పినట్టే నిన్న మధ్యాహ్నం ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణీలను  వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా  ఆదిరెడ్డి మాట్లాడుతూ   ఎనిమిది మంది గైనకాలజిస్టులు ఉన్నా  పని విభజనలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, సూపరింటెండెంట్‌ అనుమతి లేకుండా రిజిష్టర్‌ బుక్‌లో సెలవు చీటి పెట్టి వెళ్ళిపోయిన వైద్యురాలి తీరుపై ఆదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల పట్ల సేవాభావంతో మెలగాలని, వైద్య సేవలు ఇంకా మెరుగుపడాలని సూపరింటెండెంట్‌ రమేష్‌ కిషోర్‌కు సూచించారు. ఆసుపత్రికి అవసరమైన ఇతర వసతులను, సిబ్బంది ఖాళీల భర్తీ అంశాలను తన దృష్టికి తీసుకొస్తే  ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట తెదేపా నాయకులు మరుకుర్తి  రవి యాదవ్‌, మేరపురెడ్డి రామకృష్ణ తదితరులు ఉన్నారు.