నిందితులు – బాధితులు

మనస్సాక్షి  – 1039
వెంకటేశం కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. వెంకటేశం యిలా కాలుగాలిన పిల్లిలాగానో, తోక తెగిన కోతిలాగానో తిరిగాడంటే దానర్థం ఏదో ఎడాపెడా ఆలోచిస్తున్నట్లే. ప్రస్తుతానికయితే అలా ఆలోచిస్తున్నది మాత్రం డబ్బు సంపాదన గురించి. రాజకీయాల్లో చెలరేగిపోవడానికి బుర్రనిండా బోల్డంత జ్ఞానం నిండిపోయిందాయె. అయితే  తడిలేకపోతే ఆ నాలెడ్జ్‌ ఎందుకూ పనికిరాదని వెంకటేశానికి బాగా తెలిసొచ్చింది. అందుకే అర్జంటుగా ఈ డబ్బుల వేట. పోనీ వడ్డీకి తెచ్చేసి ఆ డబ్బుల్తో ఎలక్షన్లో దూకేద్దామంటే అదీ భయమే. ఒకవేళ ఆ డబ్బంతా ఖర్చుపెట్టి ఎలక్షన్లో గెలిచినా ఆ ప్రైవేటు అప్పుల మీటరు వడ్డీలు ఆ వచ్చే సంపాదనకని మింగెయ్యడం ఖాయం. అలాగని బేంకుల నుంచి లోను తెద్దామన్నా సవాలక్ష ప్రశ్నలు అడుగుతారు. మరింకేం చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడు తగిలాడు మలేషియా మల్లన్న అనబడే మల్లేశ్వరరావు. అసలా పరిచయమే గమ్మత్తుగా జరిగింది. ఆరోజు వెంకటేశం తన ఫ్రెండ్‌ మూర్తి యింట్లో ఉండగా ఎవరో వచ్చారు. ఆ వచ్చిన శాల్తీ అయితే ఖరీదయిన దుస్తుల్లో హడావిడిగా ఉంది. జేబులో ఒకటి, చేతిలో ఒకటి యాపిల్‌ ఫోన్లున్నాయి. మనిషిని చూస్తుంటే సంపదలోంచి ఊడిపడ్డట్టున్నాడు. ఆ శాల్తీని చూడగానే  మూర్తి మొహమయితే తెగ వెలిగిపోయింది. అదేదో కుబేరుడో తనింటికి వచ్చేశాడా అన్నంత లెవెల్లో మూర్తి లేచెళ్ళి ఆ శాల్తీని సాదరంగా ఆహ్వానించాడు. వెంకటేశం నోరు తెరుచుకుని అలా చూస్తుండగానే మూర్తి ‘ యిదిగో వెంకూ… ఈయన మలేషియా మల్లన్నగారు. ఏదో అదృష్టం కొద్ది యిలా వచ్చారు” అన్నాడు.ఈలోగా మలేషియా మల్లన్న ఓ కుర్చీలో సెటిలయ్యాడు. కొంతసేపు మాటలయ్యాక  ఆ మలేషియా శాల్తీ ”యిదిగో మూర్తి నీ పనయినట్టే. వచ్చే గురువారానికి నీ లోనోచ్చేస్తుంది” అన్నాడు. దాంతో మూర్తి సంతోషంగా తలాడించాడు. ఆ సంతోషంతోనే కాఫీలవీ తేవడానికి లోపలికి పోయాడు. ఈలోగా మలేషియా మల్లన్న వెంకటేశం వైపు తిరిగి ” ఏంటీ…ఏదో టెన్షన్‌లో ఉన్నట్టున్నావ్‌…ఏదయినా ఫైనాన్స్‌ ప్రోబ్లమా?” అన్నాడు. వెంకటేశం అవునన్నట్లు తలూపి ” అవును గానీ… మీరేవయినా లోన్‌ యిప్పించగలరా?” అన్నాడు. దానికి మలేషియా మల్లన్న తేలిగ్గా ” అసలు నా పనే అది కదా…ఎంత కావాలేంటీ? ” అన్నాడు. వెంకటేశం ఏదో వేళాకోళాం ఆడుతున్నట్లుగా ” ఓ కోటి యిప్పిస్తారా?” అన్నాడు.  దాంతో మల్లన్న కొంచెం నిరాశపడ్డట్టు ” ఒకటా…! అంత తక్కువయితే యివ్వరు. కనీసం పదయినా తీసుకోవలసిందే” అన్నాడు. వెంకటేశం అదిరిపోయి ” ఏంటీ పది కోట్లా….ఎవరిస్తారు?” అన్నాడు. ఈసారి మల్లన్న ” యిక్కడ వాళ్ళయితే యివ్వరు. ఆ యిచ్చేది ఫారిన్‌ బేంకులోళ్ళు. వడ్డీ కూడా 3 శాతం అంతే. తీసుకున్న అప్పు కూడా వెంటనే తీర్చక్కరలేదు. రెండు మూడు సంవత్సరాల్లో నెమ్మదిగా తీర్చొచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం  చెవులు గట్టిగా మెదిలాయి.  మరి సెక్యూరిటీ అదీ….” అన్నాడు. దాంతో మల్లన్న మళ్ళీ ” అవన్నీ యిస్తే వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకంట? అయినా ఆ ఏర్పాటేదో నేను చేస్తాలే” అన్నాడు. దాంతో వెంకటేశం ఆ మల్లన్న వంక గొప్ప ఆరాధనగా చూశాడు. యింతలో మల్లన్న అయితే ఈలోనిప్పించినందుకు  నా కమీషన్‌ 10 శాతం అంటే కోటి రూపాయలు నాకిచ్చేయ్యాలి” అన్నాడు. వెంకటేశం తలూపి ” అలాగే… లోనొచ్చాక అందులోంచి యిచ్చేస్తా” అన్నాడు. దానికి మల్లన్న తల అడ్డంగా ఊపి ‘ అదెలా కుదురుతుందీ….ముందుగా లోన్‌ సెక్యూరిటీకి  ఖర్చదీ పెట్టాలి కదా. సరే… అంతా కాకపోయినా ముందుగా ఓ యాభ్బై లక్షలన్నా యిస్తే చాలు” అన్నాడు. మల్లన్న చెప్పిందేదో వెంకటేశానికి సబబుగానే అనిపించింది. యిక  ఆ క్షణం నుంచీ వెంకటేశం ఆ డబ్బుల వేటలో పడ్డాడు. తన బంధువర్గంలో అందరి నుంచీ వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి ఎంత అప్పులాగాలో నిర్ణయించేసు కున్నాడు. అంతే కాదు. దానికి వాళ్ళని ఒప్పించేశాడు. సాధిం చేశాడు కూడా. మొత్తానికి ఎనిమిదోరోజుకల్లా యాభైలక్షలూ పోగు చేసేశాడు. అంతే కాదు. గబగబా పరుగెత్తుకెళ్ళి ఆ మొత్తాన్ని  మల్లన్న చేతిలో పోసేశాడు. యిక అక్కడ్నుంచి ఆ పది కోట్లు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూడడం మొదలెట్టాడు. యిక్కడ వరకూ బాగానే ఉంది. అసలు సమస్య యిక్కడే మొదలైంది. వారం కాదు. నెల కాదు. నాలుగు నెలలయినా ఆ లోనేదో రాలేదు. మల్లన్నయితే ‘ యిదిగో వస్తుంది….అదిగో వస్తుంది” అని చెబుతున్నాడు. ఈలోగా డబ్బులు తెచ్చిన చోట నుంచి  వొత్తిడి ఎక్కువయింది. దాంతో  వెంకటేశం ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఆ రోజు తిన్నగా కత్తి నాగరాజు దగ్గరకెళ్ళాడు. విషయం అంతా చెప్పి ” యిదిగో నాగరాజూ.. నీకో లక్షిస్తాను. నువ్వెలాగైనా వాడికి నాలుగు తగిలించి నా డబ్బు నాకు యిప్పించాలి” అన్నాడు. అలా అనేసి అడ్వాన్స్‌ క్రింద  ఓ యాభై వేలు నాగరాజు చేతిలో పెట్టాడు. దాంతో నాగరాజు ఖుషీ అయిపోయి ‘ మీ పనయిపోయినట్టే బాబూ” ఎల్లిపొండి, మేం చూసుకుంటాం” అన్నాడు. వెంకటేశం అయితే  యిక తన డబ్బులు తనకి వచ్చేసేయన్నంత ధీమాగా యింటికెళ్ళిపోయాడు. తర్వాత ఆ కత్తుల నాగరాజు ఏం చూసుకున్నాడో, ఏం చేశాడో తెలీదు కానీ మూడోరోజు ఉదయమే వెంకేశం కోసం పోలీసులయితే వచ్చేశారు.యింతకీ సదరు నాగరాజు తన బేచ్‌ని పంపి మలేషియా మల్లన్నని లాక్కోచ్చి ఉతికేశారు. మొత్తానికి మల్లన్న ఎలాగో తప్పించుకుని పోయి పోలీసులకి కంప్లయింట్‌ చేశాడు. దాంతో పోలీసులు నాగరాజుని పట్టుకుని  తన్నేసరికి వెంకటేశం పేరు చెప్పాడు.

—–

” అమ్మో నన్నొదలండి” అంటూ వెంకటేశం అరుస్తూ లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే అంతా కల…..! దాంతో ‘ ఛ ఛ….యిలాంటి కలొచ్చిందేంటీ’ అని తిట్టుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఈ సారి యింకో కలొచ్చింది.

—–

వెంకటేశ ఓ నిర్ణయానికి వచ్చాడు. తన పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌కెళ్ళి ఎస్సైతో జరిగిదంతా చెప్పాడు. అంతా విన్న ఎస్సై తేలిగ్గా నవ్వేసి ‘యింత చదువుకునీ ఎలా మో సపోయావ్‌? అయినా యిదంతా శుద్ధ అనవసరం. రేపు యిన్‌కంటాక్స్‌ వాళ్ళు  ఈ డబ్బు ఎక్కడిదని అడుగుతారు. అదంతా పెద్ద తలనొప్పయి పోతుంది” అని నీరుగార్చేశాడు. అయినా వెంకటేశం ఊరుకో లేదు. తిన్నగా ఎస్పీ దగ్గరకెళ్ళిపోయాడు. అయితే ఎస్పీ యువ కుడు. చురుకైన వాడు. వెంకటేశం చెప్పిందాంతో అప్పటికప్పుడే కేసు బుక్‌ చేయించడం, మలేషియా మల్లన్నని లోపలేయిం చడం, కొంత ఎమౌంటేదో రికవరీ చేయించి వెంకటేశానికి అప్పగించడం జరిగింది. అంతేనా… జరిగిందంతా మీడియాలో ప్రము ఖంగా రావడంతో వెంకటేశం ధైర్యానికి ప్రశంసలు వెల్లువెత్తాయి.

—–
 ఎవరో తడుతుండేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశం….! ”ఏవివాయ్‌ వెంకటేశం….. కలల్లో విహరించేస్తున్నట్టున్నావ్‌….”  అన్నాడు చుట్ట ఊదుతూ….వెంకటేశం లేచి కూర్చుని తన నోటికొచ్చిన రెండు  కలలూ చెప్పాడు. అంతా విన్న గిరీశం” అవునోయ్‌…. నీకొచ్చిన కలలు ఒకే సమస్యకి రెండు రకాల పరిష్కారాలు. అయితే ఏ పరిష్కారం ఎంచుకోవాలన్నది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మొన్నటికి మొన్న విజయవాడలో ఏం జరిగింది? సమాజంలో పేరు ప్రతిష్టలు, హోదా ఉన్న డాక్టర్లు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అజ్ఞాతంలో ఉండవలసి వచ్చింది. తాము డబ్బిచ్చిన వ్యక్తిని పట్టుకుని  కొట్టడం జరిగింది.దాంతో యిప్పుడేం జరిగింది? డబ్బు తీసుకున్నవాడు కాస్తా సానుభూతిపొందే స్థాయికెళ్ళిపోయాడు. యిక ఆ కోటి రూపాయులు  హుళక్కే. పైగా డబ్బులిచ్చిన ఆ వైద్యులు నిందితులుగా మిగిలిపోయారు. పోలీసుల్ని తప్పించుకోడానికి అజ్ఞాతంలో గడపవలసి వస్తోంది. పోయిన డబ్బు కంటే వందల రెట్ల విలువయిన పరువు ప్రతిష్టలు మంటగలిసిపోయాయి. అందుకే ఏ సమస్యకయినా పరిష్కారం చేయవలసి వచ్చినప్పుడు విజ్ఞత ఉపయోగించాలి. అదేదో నీ రాజకీయాలకి కూడా వర్తిస్తుందోయ్‌” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

అభాండాల నేర్పరి – తనకు తానే తీర్పరి

మనస్సాక్షి  – 1038
వెంకటేశం వస్తూనే ”గురూగారూ… యిలా గయితే మీకు విడాకులు యిచ్చేస్తానంతే” అన్నాడు. ఆపాటికి చుట్ట గుప్పుగుప్పుమని పిస్తున్న గిరీశం కంగారుపడి ”చదవేస్తే ఉన్న మతి పోయిందని… ఆ మాటలేంటంట? ఎంత యినా నీ భాష బొత్తిగా భ్రష్టుపట్టిపోతుందనుకో” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచుకుని ”ఆ…భాషేదయినా భావం అదేలెద్దురూ… అయినా నాకేం వెలగబెట్టేసేరంట… బుర్రనిండా మీ చుట్ట పొగ తప్ప యింకొకటుంటేనా?” అన్నాడు. ఆపాటికి తేరుకున్న గిరీశం ”యిదిగో.. మీ తాత వెంకటేశంలాగ నసపెట్టడం మాని విషయ మేంటో చెప్పవోయ్‌” అన్నాడు. దాంతో గిరీశం తేలిగ్గా ”అలాగేనోయ్‌… మావాడికి చెప్పి నీకిప్పుడే ఓ బడా నాయకుడి కొలువులో  పనియిప్పించేస్తా” అన్నాడు. వెంకటేశం ఆశ్చర్యంతో అలా నోరు తెరిచి ఉండగానే గిరీశం ఎవరికో ఫోన్‌ చేసి మాట్లాడడం, ఆనక వెంకటేశాన్ని ఆ పెద్ద తలకాయ కూడా అప్పటికప్పుడే ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడాడు. ఫోనయింతర్వాత వెంకటేశం వైపు తిరిగి ”చిన్నబాబు గారితో మాట్లాడేసేనబ్బాయ్‌.. నిన్ను రమ్మంటున్నారు” అన్నాడు. వెంకటేశం తలూపి,  అంతలోనే అనుమానంగా ”చిన్నబాబు అంటున్నారు. యింతకీ ఎవరు?” అన్నాడు. దాంతో ఆ శాల్తీ నవ్వేసి ”యింకెవరూ… లోకేష్‌బాబు గారు” అన్నాడు. వెంకటేశం అయితే ఆనందాశ్చర్యాలతో నోరెళ్ళబెట్టాడు.
అఅఅఅ
లోకేష్‌ నివాసం… వెంకటేశం వెళ్ళి తనని పరిచయం చేసు కున్నాడు. లోకేష్‌కయితే వెంకటేశం పిచ్చపిచ్చగా నచ్చేశాడు. మాటతీరదీ బాగుంది. యింకా ఆ మాటల్లో పదునైన తెలివి తేటలేవో ప్రతిఫలిస్తున్నాయి. కొంతసేపు మాటలవీ అయింతర్వాత లోకేష్‌ ”యిదిగో వెంకటేశం.. యిప్పుడు నా దృష్టంతా రాబోయే ఎన్నికల మీదే. మళ్ళీ మన పార్టీయే అధికారంలోకి రావాలంటే అన్నిచోట్లా గెలుపు గుర్రాల్నే ఎంపిక చేసుకోవాలి. అందుకే ఓ పని చేయాలి” అంటూ ఆపాడు. వెంకటేశం కూడా ఆసక్తిగా ఏం చేయాలన్నట్టు చూశాడు. అప్పుడు లోకేష్‌ ”నిన్ను యిప్పటి కిప్పుడు అధికారికంగా ఏ పదవిలో నియమించలేను. దానికి పెద్ద ప్రొసీజరే ఉంటుంది. అనధికారికంగానే ముందు పని ప్రారం భించు. ముందుగా ఓ ఆపరేషన్‌ యిస్తాను. జిల్లాలవారీగా, ప్రాంతాలవారీగా కొందరి నాయకుల పేర్లున్న లిస్ట్‌ నీకిస్తాను. నువ్వు చెయ్యవలసిందల్లా వాళ్ళ గురించి సర్వే చేసి మార్కు లెయ్యాలి. వాళ్ళకి ప్రజల్లో ఉన్న పలుకుబడి, వెనకున్న మందీ మార్బలం, ఓట్లు రాబట్టుకునే సత్తా, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ ఆధారంగా మార్కులెయ్యాలి” అన్నాడు. వెంకటేశం హుషారుగా తలూపాడు. ఈలోగా లోకేష్‌ టేబుల్‌ లోంచి కొన్ని కాగితాలు తీసిస్తూ ”యివన్నీ తూర్పుగోదావరి జిల్లాకి చెందినవి. ముందుగా యిక్కడ సర్వే పూర్తిచెయ్‌… అదయింతర్వాత యింకా ముందుకి వెళదాం” అన్నాడు. వెంకటేశం తలూపి బయటికి నడిచాడు.
అఅఅఅ
యింటికి వచ్చీ రాగానే వెంకటేశం గబగబా ఆ లిస్ట్‌లన్నీ చదివాడు. వాటిలో ప్రాంతాలవారీగా వేర్వేరు నాయకుల పేర్లున్నాయి. అమలాపురం, రాజోలు, రాజమండ్రి, కాకినాడ.. యిలా ప్రాంతాల వారీగా ఉన్నాయి. తన సొంతూరు అమలా పురం ప్రాంతంలోకే వస్తుంది కాబట్టి అక్కడ నాయకుల లిస్ట్‌లో తన పేరు కూడా ఉందేమో నని ఆత్రంగా చూశాడు. అయితే ఎక్కడా అలాంటిదేంలేదు. దాంతో కొంచెం నిరాశ పడ్డాడు. అయినా ఊరుకోలేదు. ఆ లిస్ట్‌లో తన పేరు కూడా కింద రాసేసుకున్నాడు. అప్పుడు తీరిగ్గా సర్వే పనిలోకి దిగాడు.
అఅఅఅ
పదిహేను రోజుల తర్వాత ఆరోజు వెంకటేశం వెళ్ళి లోకేష్‌ని కలుసుకున్నాడు. ప్రాంతాల వారీగా వేర్వేరు నాయకులకి యిచ్చిన పాయింట్లుతో తయారు చేసిన రిపోర్ట్‌ యిచ్చాడు. అయితే అప్పుడో విశేషం జరిగింది. లోకేష్‌ ముందుగా అమలాపురం ప్రాంత నాయకులకి సంబంధించిన రిపోర్టు చూశాడు. ప్రజల్లో ఉన్న పలుకుబడి, ఎలక్షన్లో ఖర్చు పెట్టడం, ఓట్లు రాబట్టుకునే సత్తా, ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌… యిలా అన్ని అంశాలకూ కలిపి వందకి మార్కులు 55, 60, 63… అలా వచ్చాయంతే. అందరికంటే ఎక్కువొచ్చిన నాయకుడికే 66 వచ్చాయి. దాంతో లోకేష్‌ కొంచెం నిరాశపడ్డాడు. యింకా ఆ లిస్టేదో చూస్తూ పోతుండగా అప్పుడు కనిపించిందా పేరు. వెంకటేశప్రసాద్‌ అన్న పేరున్న ఓ వ్యక్తికయితే నూటికి నూరు మార్కు లొచ్చేశాయి…! దాంతో లోకేష్‌ అదిరిపోయి ”ఎవరితను? ఏకంగా నూటికి నూరు మార్కు లిచ్చేశావ్‌…!” అన్నాడు. దాంతో వెంకటేశం తలూపి ”అవును. యితనొక్కడికు అన్నిటిలో ఫుల్‌ మార్కులు పడ్డాయి. చాలా గొప్పవాడు లెండి” అన్నాడు. దాంతో లోకేష్‌ ఆ పేరు ఎదురుగా టిక్‌ పెట్టి, తర్వాత రాజోలు ప్రాంత జాబితా తీశాడు. దాంట్లోనూ ఎవరికీ అరవై మించి మార్కులు పడలేదు. అయితే ఆ జాబితా చివర్లో ఉన్న ఒక పేరుకి నూటికి నూరు మార్కులూ పడిపోయాయి. ఆ వ్యక్తి పేరు కూడా వెంకటేశప్రసాద్‌. దాంతో లోకేష్‌ బుర్రగోక్కుని ”యిదేంటీ… యిదే పేరున్న వ్యక్తికే అమలాపురం ప్రాంతంలో కూడా వందమార్కులు వచ్చినట్టు న్నాయ్‌..” అన్నాడు. దాంతో వెంకటేశం  ”లేదు, యిద్దరూ ఒక్కటే. అతనికి యిక్కడ కూడా అంత పలుకుబడీ, పేరూ ఉంది” అన్నాడు. లోకేష్‌ తలూపి ”యింతకీ అంత గొప్ప మనిషి ఎక్కడ? నేను అర్జంటుగా కలవాలి” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం సిగ్గుపడి ”అదెంతపని… ఆ మహాను భావుడు యిప్పుడు మీ ముందే ఉన్నాడు. నేనే ఆ వెంకటేశ ప్రసాద్‌ని” అన్నాడు. దాంతో అంతటి లోకేషూ నోరెళ్ళబెట్టాడు.
అఅఅఅ
”గురూగారూ…నాకలాంటి కలొచ్చింది. కలయితే బ్రహ్మాండంగా ఉంది గానీ బొత్తిగా లాజిక్కు మిస్సయి చచ్చినట్టుంది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”లాజిక్కు మిస్సవడం చాలా కరెక్టోయ్‌… లేకపోతే సర్వేలో నీకు నువ్వే వందమార్కులు వేసేసుకుంటావా అని…! అయినా ఈ కల రావడానికి కారణం సుప్రీంకోర్టు అరెస్టు వారెంటు జారీ చేయడంతో తప్పించుకు తిరుగుతున్న ఆ న్యాయమూర్తి గారి వ్యవహారంలే. అదేంటో కొంచెం వివరంగా చెప్పాలంటే… సదరు న్యాయమూర్తిగారయితే మొదట్నుంచీ వివా దాలలో ఉండే వ్యక్తే. యిటీవలే ఆయన సుప్రీంకోర్టు న్యాయ మూర్తుల్లో యిరవై మంది అవినీతిపరులని మోడీకి లేఖ రాయడం జరిగింది. అయితే సరయిన సాక్ష్యాధారాలేవీ సమ ర్పించకపోవడం అభాండాలు వెయ్యడంతో  సుప్రీంకోర్టు ఆయనని తప్పుపట్టింది. అంతేకాకుండా సీజేఐ నేతృత్వంలో ఏడు గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించింది. న్యాయస్థాన ధిక్కారణ కింద ఆయనకు నోటీసులు జారీచేసినా సుప్రీంకోర్టుకు వచ్చేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు. ఆ న్యాయమూర్తులే తన ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. వారు రాకపోవడంతో అయిదేళ్ళ చొప్పున శిక్ష విధిస్తు న్నట్టు ప్రకటించారు. అలాగే గతంలో తొమ్మిదిమంది న్యాయ మూర్తులు యిచ్చిన బదిలీ ఉత్తర్వుపై తనంతట తానే స్టే విధిం చేసుకున్నారు. యిక చట్టానికి సంబంధించిన రెండు ముఖ్యమయిన విషయాల్ని తీసుకుంటే… తనకి సంబంధించిన ఏ కేసు విషయంలోనూ ఏ న్యాయమూర్తీ తీర్పు యిచ్చుకోగూడదు. అలాగే రెండు పక్షాలకీ తమ వాదన వినిపించే అవకాశం యివ్వాలి. అంతేగానీ ఒకవైపు వాదన మాత్రమే తీసుకోకూడదు. సదరు న్యాయమూర్తి గారి తీరులో ఈ రెండులాజిక్కులూ బాగా మిస్సయిపోయాయి.  అదే సింబాలిక్‌గా నీ కలలో వచ్చింది.  సదరు న్యాయమూర్తి గారు అలా లాజిక్కులు మిస్సవడం వలనే  ఈరోజు అరెస్టవకుండా పోలీసుల్ని తప్పించుకుని అజ్ఞాతంలో తిరగవలసి వస్తోంది” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

వెయ్యి గుళ్ళ భక్తులు

 మనస్సాక్షి
సినిమా రంగంలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఎవరూ అంటే ప్రభాస్‌ అనే పేరు వినపడుతోంది. అందులోనూ బాహుబలి తర్వాత అదేదో యింకా ఎక్కువయిపోయింది. సినిమా రంగం సంగతి అలా ఉంచితే మన గోదావరి జిల్లాల్లో అలాంటి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ఎవరూ అంటే ముందుగా చెప్పుకోవలసి వెంకటేశం పేరు. చదువుంది.అందముంది. యింకా బోల్డంత మంచివాడాయో. అసలే ఈ మధ్య మూడు పదుల వయసు దాటిందేమో వెంకటేశం పెళ్ళి కోసం యింట్లో కంగారు మొదలయింది. దాంతో వెంకటేశం తండ్రి గిరీశానికి ఫోన్‌ చేశాడు. ”యిదిగో … ఆ రాజకీయాల గోల తర్వాత….ముందు మా వెధవ ముదిరిపోకముందే ఓ యింటివాడయ్యేలా చూడు” అంటూ స్మూత్‌గా వార్నింగిచ్చాడు. దాంతో గిరీశం అర్జంటుగా వెంకటేశానికి ఎలా పెళ్ళి చేయాలా అన్న ప్రయత్నాల్లో పడ్డాడు. ముందు అర్జంటుగా వెళ్ళి వెంకటేశాన్ని కలుసుకున్నాడు. ” యిదిగో వెంకటేశం నువ్వర్జంటుగా ప్రేమలో పడిపోతావా…లేకపోతే  నన్నే ఏదయినా సంబంధం చూడమంటావా ?” అంటూ అడిగాడు దాంతో వెంకటేశం ‘ ఆ అటువంటి ప్రేమ కళలవీ నాలో లేవులెండి. అలాంటి దిక్కుమాలిన కళలన్నీ ఉన్నది మీ తాత గిరీశంగారిలో లెండి” అన్నాడు దెప్పి పొడుస్తున్నట్లుగా. దాంతో గిరీశం ” ఆ… ఈ వేళాకోళాలకేం తక్కువ లేదు.” అని  యింకి ఏదో అనబోతుండగా వాళ్ళ మాటలన్నీ వింటున్న సుందరం దగ్గరకొచ్చాడు. సుందరం అంటే గిరీశానికి మంచి ఫ్రెండ్‌. ” ఏంటీ….వెంకటేశం పెళ్ళి గురించా ?” అన్నాడు. యిద్దరూ అవునన్నట్లుగా తలూపారు. దాంతో సుందరం ” దానికింత టెన్షనెందుకూ….దుప్పలపూడి తెలుసు కదా. అక్కడ ఊరిచివర కళ్యాణలక్ష్మీ గుడుంది. ఆ గుడిలో అమ్మవారిని దర్శించి ఆ గుడి బయటున్న మర్రి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆ మర్రి చెట్టుని కౌగిలించుకుంటే  నెల తిరక్కుండా పెళ్ళయిపోతుంది” అన్నాడు. దాంతో యిద్దరికీ చెవులు మెదిలాయి. యింకేముంది….వెంకటేశం అప్పటికప్పుడే ఎర్రబస్సెక్కి దుప్పలపూడి బయలుదేరాడు…. అయితే రెండు నెలలయినా వెంకటేశానికి పెళ్ళి కుదరలేదు. అయినా అలా అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చింతర్వాత కొంచెంగా దైవచింతనయితే పెరిగింది. దాంతో తరుచు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. యింతలోనే వెంకటేశం ఫ్రెండ్‌ వామనరావు యింకో వివరం చెప్పాడు. ” ఏరా…. పెళ్ళి కోసం గుళ్ళ చుట్టూ తిరుగుతున్నావంట. శివాలయానికి వెళ్ళావా?” అన్నాడు. వెంకటేశం లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు. అప్పుడు వామనరావు ” శివుడిని భోళా శంకరుడంటారు. కోరుకున్నదేదో అలా అనుకుంటే యిలా తీర్చేస్తాడంతే ” అన్నాడు. దాంతో వెంకటేశం మళ్ళీ స్కూలు మార్చుకున్నాడు. యిక ఆ రోజు నుంచీ రెండు పూట్లా శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలెట్టాడు. రెండు నెలలు గడిచినా వెంకటేశం యింకా ఒకింటివాడు కాలేదు. ఆ రోజు వెంకటేశం శివాలయంలో ప్రదక్షిణలు ముగించుకని  తిరిగొస్తుండగా ఆనందరావు కనిపించాడు. వెంకటేశాన్ని చూడగానే దగ్గరకొచ్చి ”  ఏంట్రా….పెళ్ళి కావడం లేదని బెంగపెట్టుకున్నావంట…! గిరీశం గారు మా వైజాగ్‌ మావయ్యకి చెప్పుకుని బాధపడ్డారంట” అన్నాడు. దాంతో వెంకటేశం ఓ సారి గిరీశాన్ని కసితీరా తిట్టుకున్నాడు. అంతలోనే  ఆనందరావు ” నువ్వు విష్ణుమూర్తీ, శివుడు అంటూ  ఆ పాతకాలం నాటి దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నావుగానీ యిప్పుడంతా నడుస్తోంది బాబాగారి ట్రెండ్‌రా. బాబాగారికి ఏదయినా చెప్పుకుంటే స్వయంగా ఆయనే వింటారు. వెంటనే ఫలితమూ చూపించేస్తారు. అందుకే ఆయనకి అంతమంది భక్తులు” అన్నాడు. యింకేముంది. మర్నాటి నుంచి వెంకటేశం బాబాగారి భజనలు, హారతులతో బిజీ అయిపోయాడు. ….మూడు నెలలు గడిచిపోయాయి. వెంకటేశం యింకా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. అయితే ఆ రోజో విశేషం జరిగింది. వెంకటేశం పార్కు నుంచి యింటికి తిరిగొస్తుండగా ఎదురుగా వచ్చిన ఓ శాల్తీ వెంకటేశాన్ని చూసి ఆగిపోయింది.  ”  రేయ్‌….నువ్వు మా వెంకూలే కదా ? ” అన్నాడు సంభ్రమంగా. వెంకటేశం తలూపి ఆ శాల్తీ వంక పరిశీలనగా చూశాడు. ఒక్కసారిగా  ” ఓరేయ్‌….సుబ్రహ్మణ్య శాస్త్రీ ” అన్నాడు. దానికా శాల్తీ తల అడ్డంగా ఊపి ” కాదు. జాన్‌ సుబ్రహ్మణ్య శాస్త్రి” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి” అదేంట్రా…అలా  మారిపోయావేం? ” అన్నాడు శాస్త్రి మెడలో శిలువ వంక పరిశీలనగా చూస్తూ. దాంతో శాస్త్రి మరేంలేదురా…. మన దేవుళ్ళు ఎంత మొర పెట్టుకున్నా ఓ పట్టాన పట్టించుకోరు. అందుకే యిలా ప్రభువుని నమ్ముకున్నా! అబ్బబ్బ…యిప్పుడు నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయనుకో ! అన్నాడు. దాంతో వెంకటేశం చెవులు గట్టిగానే మెదిలాయి. ‘ సరే రా.. నన్నర్జంటుగా చర్చికి తీసుకెళ్ళు. పీటర్‌ వెంకటేశంగా మారిపోతా  !” అన్నాడు.   ….. అక్కడ్నుంచీ వె ంకటేశం హలెలూయ పాటలు పాడుతూ చర్చిలో దర్శనమిస్తున్నాడు….
                        —————                ——————-             ——————
 ‘అల్లాహో అక్బర్‌ అంటూ వెంకటేశం అరుస్తూ లేచి కూర్చున్నాడు. ఆ పాటికి మంచం పక్కన  కూర్చుని ఉన్న గిరీశం అయితే ఆ అరుపు విని అదిరిపడ్డాడు. ‘ ఏవివాయ్‌ వెంకటేశం…యిస్లాంలోకి గానీ దూరావా! అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం అయోమయంగా చూసి…అయితే  యిదంతా కలన్న మాట” అంటూ తన కొచ్చిన  కలంతా చెప్పాడు. అంతా చెప్పిం తర్వాత ” గురూగారూ… ఈ లెక్కన దేవుళ్ళంతా తలుచుకున్నా నా పెళ్ళి కాదంటారా? ” అన్నాడు దిగులుగా. దాంతో గిరీశం విసుక్కుని ”శుభ్రంగా అవుతుంది. అయినా ఒక్క దేవుడిని నమ్ముకోకుండా యింతమంది దేవుళ్ళ దగ్గరికి జంపింగ్‌ లేంటంటా?” అన్నాడు. దానికి వెంకటేశం ఏం మాట్లాడలేదు. యింతలో గిరీశం ” అయినా ఈ కలలో గొప్ప రాజకీయ పాఠం ఒకటుంది. అదేందో తెలుసా?’ అన్నాడు.  దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. అప్పుడు వివరంగా  చెప్పడం మొదలెట్టాడు. ” నా కలలో దేవుళ్ళని మార్చడంలాంటి జంపింగ్‌ వ్యవహారం రాజకీయాల్లో బాగా చూస్తాం. ఎన్ని వంకాయల కబుర్లు చెప్పినా దాదాపు అంతా రాజకీయాల్లో కొచ్చేది ఏదో పదవుల కోసమే. దాని కోసం ఓ పార్టీలో చేరడం, అక్కడ ఆశించినవి జరక్కపోతే యింకో పార్టీలోకి జంప్‌ చేయడం చేస్తుంటారు. అంతే కాకుండా ‘ ఫలాన పార్టీలో సిద్ధాంతాలేవో నన్ను  ఆకర్షించేశాయి’ లాంటి స్టేట్‌మెంట్లు కూడా యిస్తుంటారు. యిదంతా చాలా చాలా మాములుగా అందరూ చేసేదే. అయితే వీళ్ళందరికీ భిన్నమైన  ఓ రాజకీయ నాయకుడిని మనం చూడొచ్చు. ఎప్పుడో ముఫ్పై అయిదేళ్ళ క్రితం ఓ పార్టీలో ఆ పార్టీ నాయకుడి మీద  అభిమానంతో చేరిన ఆ నాయకుడు యిప్పటికే  అదే పార్టీలో ఉండిపోయాడు. యిన్నేళ్ళలో ఆ పార్టీ తన సేవలకి తగిన గుర్తింపు యిచ్చిందా లేదా అని కూడా చూడలేదు. తనకి సరయిన గుర్తింపు లభించని పరిస్థితిల్లో కూడా స్థితప్రజ్ఞుడిలా అలా ఉండిపోయాడంతే. అతడు…. రాజకీయాల్లోనూ, పార్టీలోనూ తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న ఘనుడు గన్ని కృష్ణ. ‘ ఎంతకాలమయినా ఈ పార్టీలో ఉంటే ఒరిగేదేవీ ఉండదు’ అని ఎందరో శ్రేయోభిలాషులు చెప్పినా అతడు పట్టించుకోలేదు. కనీసం తన అసంతృప్తిని కూడా  వ్యక్తం చేయలేదు. అలాగే ఒక మేరు పర్వతంలా ఉండిపోయాడంతే. అలాంటి రాజకీయ దిగ్గజానికి యిన్నాళ్ళకు సరయినా గుర్తింపు వచ్చింది….అదీ గుడా  చైర్మన్‌ పదవి రూపంలో. యిలా జరగడం ఒక ఆరోగ్యకరమైన  సందేశాన్ని వ్యవస్థకి అందించినట్టయింది. విలువలకీ కట్టుబడి ఒకే పార్టీని నమ్ముకుని అలాగే ఉండిపోతే ఎప్పటికయినా తగిన గుర్తింపు  వస్తుందని నిరూపితమైంది” అంటూ వివరించాడు. యిదేదో కరెక్టే అన్నట్టుగా గిరీశం యింకో చుట్ట అంటించేశాడు.
 డా. కర్రి రామారెడ్డి

పంక ప్రక్షాళన

మనస్సాక్షి  – 1036
ఉత్తరాదికి చెందిన రాష్ట్రమది. ఈసారి ఎన్నికల్లో అక్కడో విశేషం జరిగింది. రకరకాల రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అంతగా రాజకీయ అనుభవం లేని, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని సీఎంని చేయడం జరిగింది. ఆ సీఎం వేరెవరో కాదు. మన గోదావరి జిల్లాలకి చెందిన వెంక టేశం…! యిల్లలకగానే పండక్కాదన్నట్టుగా వెంక టేశం సీఎం అయిపోగానే సరిపోలేదు. అసల యిన సవాళ్ళన్నీ అప్పుడు ఎదురయ్యాయి. వాటిలో చాలా వాటికి కారణం గత ప్రభుత్వాలు చేసిన పాపాలే. అయితే దేన్నయినా ఎడాపెడా ఆలోచించగలిగే వెంకటేశం వాటన్నిటినీ అధిగ మించేశాడు. అయితే ఒక సమస్య మాత్రం కొరకరానికొయ్యలా మిగిలిపోయింది. అసలా సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థమయి చావడం లేదు. దాంతో సిఎస్‌ అయిన త్రివేదీని పిలిచాడు. సదరు త్రివేదీ కూడా డైనమిక్కే. దాంతో కొత్తగా సీఎం పదవిలోకొచ్చిన వెంక టేశానికి తన ఆలోచనలు పంచుకోవడం బాగా సులవయింది. త్రివేదీ వచ్చింతర్వాత సమస్యంతా చెప్పి ”యిప్పుడేం చేస్తే బాగుంటుంది?” అన్నాడు. ఆ సమస్య విని త్రివేదీ కూడా ”సార్‌… ఈ సమస్యని సాల్వ్‌ చేయడం అంత ఈజీ అయితే కాదు. అయితేగియితే సంవత్సరంలో ఉండే 365 రోజుల్నీ ఏ అయిదొందల రోజులకో పెంచాలి” అన్నాడు. దాంతో వెంకటేశం ”అది కుదరదు కదా… మరేంటి దారి?” అన్నాడు. దాంతో సమస్య సమస్యలాగే ఉండిపోయింది. యింతకీ వాళ్ళిద్దరూ అంతిదిగా చర్చిస్తున్న సమస్య గత ప్రభుత్వం జారీచేసిన ఓ జీవో గురించి. అదీ నాయకులకి సంబంధించిన జయంతులకీ, వర్ధంతులకీ శెలవులు ప్రకటించడం గురించి.  మాజీ సీఎంల జయంతులు, వర్ధంతులకి వారమేసి రోజులు, మామూలు మంత్రుల జయంతులు, వర్థంతులకి మూడేసి రోజులు, యింకా యితరత్రా ప్రజాప్రతినిధుల జయంతులు, వర్ధంతులకు ఒకోరోజు శెలవివ్వా లన్నది ఆ జీవో సారాంశం. మొత్తానికి ఆ జీవో పుణ్యమాని సంవత్సరంలో సగానికి సగం రోజులు శెలవులొచ్చేస్తున్నాయి. యింతలో వెంకటేశం ”అసలీ జీవోని రద్దు చేసి పారేస్తే ఎలా ఉంటుంది?” అన్నాడు. దాంతో త్రివేదీ కంగారుపడి ”లేద్సార్‌… అసలే మనది తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రభుత్వం. యిలా జీవో రద్దు చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. అదీగాక మనమలా చేస్తే మనకి ఆ నాయకులంటే బొత్తిగా గౌరవంలేదని ప్రతిపక్షాలు అల్లరి చేయొచ్చు” అన్నాడు. దాంతో వెంకటేశం తెగ బాధపడిపోతూ ”యిలా అయితే ఎలా?… మొత్తం వర్కింగ్‌డేసన్నీ శెలవుల రూపంలో పోతుంటే యిక రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంట?” అన్నాడు. దాంతో త్రివేదీ కూడా ఆలోచనలో పడ్డాడు. యింతలోనే వెంకటేశం ఏదో ఆలోచన తట్టినట్టుగా ”ఓ పనిచేద్దాం. పాత జీవో స్థానే మార్పులతో కొత్త జీవో ఒకటి రిలీజ్‌ చేద్దాం…” అంటూ అదెలా ఉండాలా చెప్పాడు. మర్నాటికల్లా ఆ కొత్త జీవో ఏదో ప్రభుత్వం రిలీజ్‌ చేసేసింది. ‘…గతంలో సీఎంలుగా పనిచేసిన, మంత్రులుగా పనిచేసిన, ప్రజాప్రతి నిధులుగా పనిచేసిన వాళ్ళంతా ఎవరు? ప్రజల కోసం పుట్టిన వాళ్ళు. అంతేకాదు. వారి త్యాగ ఫలాలే ఈరోజు మనమింత అభివృద్ధిపథంలో ఉండడానికి కారణం. అందుకే వారి జయంతులు, వర్ధంతులు ఘనంగా జరుపు కోవాలి. స్మరించు కోవాలి. ఉత్సవాలు జరుపు కోవాలి. యింకా నివాళులు అర్పించాలి. అందులో భాగంగా యికపై రాష్ట్రంలో మాజీ సీఎంలు జయంతు లకు ఏడురోజులపాటు ప్రతిరోజూ ఆఫీసుల్లో ఓ రెండు నిమిషాలు మౌనం పాటిం చాలి. అలాగే వారి వర్ధంతులనాడూ వారం పాటు రోజుకి రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆఫీసుల్లో పని యింకో గంట ఎక్కువ చేయాలి. అలా చేస్తేనే వారి ఆత్మలకి నిజమైన శాంతి. అలాగే మాజీ మంత్రుల విషయంలో మూడేసి రోజులు యిలాగే చేయాలి. యిక ప్రజాప్రతి నిధుల విషయంలో ఓరోజు యిలా చేయాలి…’ యిలా సాగిందది.
అఅఅఅ
”అది గురూగారూ… నాకొచ్చిన కల. అయితే మొత్తానికి నాయకుల జయంతులూ, వర్ధంతులకు శెలవులు తెలివిగా ఎత్తేసి నట్టయింది. అయినా ఈ కలెందుకు వచ్చినట్టంటారు?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”మరి ఈమధ్యనే యూపీ సీఎం ఆదిత్యనాధ్‌ నాయకుల జయంతులు, వర్ధంతులకి శెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దానిమీద విమర్శలు రేగాయి కూడా. అదే నీ కలలో వచ్చినట్టుంది” అన్నాడు. దాంతో వెంకటేశం ”మరి అలా ఆ మాత్రం శెలవు కూడా యివ్వకపోతే ఆ నాయకులికి విలువ యివ్వనట్టవుతుంది కదా. దాంతో వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయా అని…” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”యిదిగో వెంకటేశం… నువ్వీ ఆత్మల గురించి కొంచెం పరిశోధన చేయాలోయ్‌… అవి ఎందుకు క్షోభిస్తాయో, ఎందుకు శాంతి స్తాయో నీకు సరిగ్గా తెలుస్తున్నట్టులేదు” అన్నాడు. దాంతో వెంక టేశం బుర్రగోక్కుని ”ఆ… మామూలు మనుషుల్ని పరిశోధించ డానికే టైము కుదిరి చావడం లేదు గానీ ఈ ఆత్మల సంగతి నేనేం చేసేది?” అన్నాడు. ఈలోగా గిరీశం ఓ చుట్ట అంటించుకుని చిన్న వివరణొకటి యివ్వడం మొదలెట్టాడు. ”ఈ నాయకుల జయంతులూ, వర్ధంతుల పేరు చెప్పి శెలవులిస్తే ఏం జరుగు తుందంట? ఎవరయినా వాళ్ళని తలుచుకుంటూ గడుపుతారా అని… లేదే… శుభ్రంగా ఏ సినిమాకో చెక్కేస్తారు. లేకపోతే  యింకో ఉపయోగంలేని సరదా కార్యక్రమాలతో గడిపేస్తారు. మర లాంటప్పుడు వాళ్ళ పేరు చెప్పి శెలవులివ్వడంలో అర్థమేలేదు. వాళ్ళ ఆత్మలకి శాంతి తమ త్యాగఫలాలతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ మరింత అభివృద్ధి పథంలోకి వెళ్ళినప్పుడే. మరి వాళ్ళ పేరు చెప్పి యిచ్చే శెలవుల వలన ఆ అభివృద్ధికి ఆటంకం ఏర్పడడంలేదూ. అందుకే నాయకుల జయంతులకీ, వర్థంతులకీ శెలవులు రద్దు చేయడం సమంజసమే. ఎప్పుడో  ప్లేటో అనబడే దార్శనికుడు ‘ఈ వ్యవస్థని పాలించే వాడు వేదాంతి అయి ఉండాలి అన్నాడు. అదేదో అక్షరాలా నిజమే. మోడీ, ఆదిత్యనాథ్‌ లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళంతా వేదాంతం వంటబట్టించు కున్న మహారాజుల్లాంటి రాజర్షులు. వారు చేసే పనుల్లో, తీసు కునే నిర్ణయాల్లో నియంతృత్వ పోకడలు కనిపించినప్పటికీ అంతర్లీనంగా అవి అన్ని కోణాల్లోనూ వ్యవస్థ మూలాల్ని బల పరిచేవే” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

ఇదిగో నలక – కాబట్టి అలక

మనస్సాక్షి  – 1034
వెంకటేశం యిల్లంతా ఒకటే కళకళలాడిపోతోంది. దానిక్కారణం వెంకటేశానికి పెళ్ళి కుదరడమే. అదీ కుదరక కుదరక కుదిరిన సంబంధమాయె. అలాగని వెంకటేశంలో వంకపెట్టడానికి ఏంలేదు. చదువుకున్నోడూ, ఆస్తిపాస్తులున్నోడూ. అయితే సమస్యంతా వెంకటేశంలోనే ఉంది. ‘తనలాంటి చదువుకున్నోడూ, మేధావీ, రేపు రాజకీయాల్లో దున్నెయ్యబోతున్నవాడూ దొరకడం అవతలివాళ్ళ అదృష్టం’ అన్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. అందుకే యింతకాలం వచ్చిన సంబంధమల్లా వచ్చిన దారినే పోవడం. అయితే అదృష్టం కొద్దీ ఈ సంబంధమేదో కుదిరిందంతే యిక ఎలాగా పెళ్ళికి టైం ఉంది కదాని నిశ్చితార్థం తాంబూలాలు ఏర్పాటు చేశారు. ఆరోజు కార్యక్రమానికి రెండువైపుల నుంచీ చెరో వందమందినీ పిలుచుకున్నారు. కార్యక్రమం జరిపించడానికయితే శాస్తుర్లూ, అసిస్టెంట్‌ చిన్న శాస్తుర్లూ పొద్దున్నే నిడదవోలు నుంచి దిగిపోయారు. యిద్దరూ టిఫిన్లవీ లాగించి హాల్లో ఓ మూల సెటిలయ్యారు. యింతలో చిన్న శాస్తుర్లు గొంతు తగ్గించి ”గురూగారూ… నాకు యిందాకట్నుంచీ ఎడమకన్ను అదురుతోంది. కార్యక్రమం సజావుగా జరుగుతుందంటారా?” అన్నాడు. దాంతో శాస్తుర్లు కయ్యిమని ”నోర్ముయ్‌ వెధవాని. అందరినీ చూడు. ఎంత ఆనందంగా ఉన్నారో… కార్యక్రమం భేషుగ్గా జరుగుతుంది” అన్నాడు. అయినా చిన్న శాస్తుర్లు ఊరుకోలేదు. ”అలాక్కాదు గురూగారూ… నాకెందుకో మనసు కీడు శంకిస్తోంది. ఏ అప్రాచ్యుడి వలనో కార్యక్రమం ఆగిపోతుందనిపిస్తుంది” అన్నాడు నమ్మకంగా. అయితే యింతలోనే వెంకటేశం అటుగా వచ్చేసరికి యిద్దరూ మాటలాపేశారు. అయితే వాళ్ళకి తెలీందల్లా అంతకుముందు చిన్న శాస్తుర్లు చెప్పిన అప్రాచ్యుడు ఆ వెంకటేశమేనని…! యింకొంచెంసేపటి తర్వాత భోజనాలు మొదలయ్యాయి. అప్పుడు జరిగిందది. భోజనాలు వడ్డించేటప్పుడు పెళ్ళి కూతురి తరపు వాళ్లందరికీ ఓవైపు, పెళ్ళి కొడుకి తరపు వాళ్ళందరికీ యింకో వైపూ పెట్టారు. భోజనాలయితే బ్రహ్మాండంగా పూర్తయ్యాయి. అప్పుడు వెంకటేశం ఓ గమ్మత్తు చేశాడు. గబగబా ఓ గదిలోకి వెళ్ళిపోయి తలుపులేసుకున్నాడు. అలా వెళ్ళి నోడూ ఎంతసేపటికీ బయటికి రాడాయె. దాంతో పెద్ద హడావిడే మొదలయింది. అసలు వెంకటేశం లోపలకెళ్ళి ఏం చేస్తున్నాడో అందరికీ మిస్టరీయే. అంతా ఆత్రంగా ఎదురు చూడసాగారు. మొత్తానికి రెండు గంటల తర్వాత వెంకటేశం తలుపులు తీసుకుని బయటపడ్డాడు. మొహమయితే అంత ప్రసన్నంగా లేదు. గబగబా తనక్కాబోయే మామ దగ్గరికి నడిచాడు. ”మీరిలాంటి వాళ్ళనుకోలేదు. అందుకే తాంబూలాలు కౌన్సిల్‌” అన్నాడు గట్టిగా. దాంతో రామనాధం అనబడే ఆ శాల్తీ అదిరిపోయి ”అదేంటి బాబూ… మావల్ల పొరబాటు ఏవయినా జరిగిందా?” అన్నాడు. దాంతో వెంకటేశం ”యింకా యింతకంటే ఏం జరగాలంట? అయినా మరీ యింత అవమానమా? అసలిదంతా పై లోకాల్నుంచి చూసే మా తాతలు వెంకటేశం, గిరీశం గార్ల ఆత్మలు ఎంత క్షోభిస్తాయని..” అన్నాడు. దాంతో రామనాధం అయింకా కంగారు పడిపోయి ”అసలేమయింది బాబూ…” అన్నాడు వెంకటేశం చేతులు పట్టుకుని. దాంతో వెంకటేశం ”యిందాక వడ్డనలప్పుడు ఏం జరిగింది? ఆ కుర్రాడెవడో స్వీట్లు పట్టుకుని మా వాళ్ళ దగ్గర ఒక్కసారే  తిరిగాడు. అదే మీ వాళ్ళ దగ్గరయితే  నాలుగయిదుసార్లు తిరిగాడు. అలాగే మావాళ్ళ పంక్తి దగ్గర ఎవరో పెరుగు పట్టుకుని తెగ తిరిగారు. అదీ భోజనాలు మొదలయిన వెంటనే. అంటే తొందరగా పెరుగు వేసేస్తే యింక మిగతా కూరలవీ లేవనేగా. యిదంతా రూమ్‌లో కూర్చుని వీడియోల్లో  చూసొచ్చా. మరి యిదంతా మాకు అవమానం కాదా… యిప్పుడే యింత అవమానం జరిగితే యిక భవిష్యత్తులో ఎలా ఉంటుందా అని. అందుకే నిశ్చితార్థం కౌన్సిల్‌” అంటూ అరిచాడు. దాంతో రామనాధం”అదేంటి బాబూ… ఆ స్వీట్ల కుర్రాడు ఎన్నిసార్లు అటూ యిటూ తిరిగినా అందరు వేసుకొనేదీ ఒక్క స్వీటే కదా. యిక పెరుగంటారా… మీ వాళ్ళలో అల్సర్‌ పేషంట్‌ ఎవరో ఉన్నట్టున్నారు. ముందే పెరుగు వేసెయ్యమన్నారు. అందుకే తొందరగానే పెరుగు బకెట్‌ తెచ్చేసింది” అంటూ వివరణ యివ్వబోయాడు. అయినా వెంకటేశం ఊరుకోలేదు. ”అబ్బే… లాభం లేదు. ఈ వివరణలతో మాకు జరిగిన అవమానం ఏవీ తీరదు. నిశ్చితార్థం కౌన్సిల్‌” అంటూ బయటికి దయ చేశాడు.
అఅఅఅ
”అది గురూగారూ… నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. అంతా విన్న గిరీశం ”ఏవివాయ్‌ వెంకటేశం. ఆశకయినా అంతుండాలి. లేకపోతే నీకు పెళ్ళి సంబంధాలేవయినా వచ్చి చస్తున్నాయా అని. పోనీలే… జన్మానికో శివరాత్రి అన్నట్టుగా అదేదో వచ్చిందా… దాన్నీ తోలేస్తావా…! పైగా మీ తాతా, మా తాతా పై నుంచి చూసి క్షోభిస్తారని బోడి స్టేట్‌మెంట్‌ ఒకటి… అయినా వాళ్ళకింక పనీపాటా ఏవీ లేవనుకున్నావా…” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం సిగ్గూ, మరికొంచెం యిబ్బందీ పడాడు. యింతలో గిరీశం ”అయినా ఈ కలేదో నీ పెళ్ళి గురించి కాదు. అంతా వర్తమాన రాజకీయాల్లో జరుగుతున్న తంతే. అదెలాగన్నది చెప్పు. అదే ఈ వారం ప్రశ్ననుకో” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. అలా ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”చూస్తుంటే యిదేదో ఆ టిడిపి  ఎంపీ శివప్రసాద్‌ తీరులాగుంది. సదరు ఎంపీ గారికి పార్టీలోనూ, నాయకుడి దగ్గరా మంచి గుర్తింపు ఉంది. అంతగా అర్హత లేకపోయినా సదరు ఎంపీ గారికి ఎప్పుడూ ఎలక్షన్లో సీటిస్తూనే వచ్చారు. అలాంటి శివప్రసాద్‌ మొన్న జరిగిన ఓ పబ్లిక్‌ ఫంక్షన్‌లో ‘బాబుగారు తమ వాళ్ళకి అది చేయలేదనీ, యిది చేయలేదనీ… దాని వలన ఎంతో అన్యాయం జరిగిపోయిందనీ’ ధిక్కార స్వరం వినిపించడం జరిగింది. అలాగే  యింకో పక్క పార్టీ మారే ఉద్ధేశ్యమూ కనపరచడం లేదు. అయితే  యిలా పబ్లిక్‌ ఫంక్షన్‌లో తమ నాయకుడిని విమర్శించడం పార్టీ ప్రతిష్ఠకు దెబ్బే. యింకా తప్పుడు సంకేతాలూ యిస్తుంది. సదరు ఎంపీగారు నిజంగానే ఆ సమస్యకి పరిష్కారం కావాలనుకుంటే వెళ్ళిన దారి సరయింది కాదు. యిలా చేయడం వలన సమస్య సమస్యలాగే ఉండిపోవడం తప్ప పరిష్కారం ఏం వచ్చేయదు. యిదే విషయాన్ని పార్టీ అంతర్గత సమావేశాల్లో నేరుగా బాబు గారికి చెబితే సరిపోయేది. అయితే సదరు ఎంపీగారికి  రకరకాల పగటి వేషాలు వేసి పబ్లిసిటీ సంపాదించడంలో ఉన్న శ్రద్ధ, ఆసక్తులలో పదోవంతయినా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే యిలాంటి దారిలో వెళ్ళేవాడేకాదు” అంటూ వివరించాడు. యిదేదో బాగానే ఉందన్నట్టుగా గిరీశం తలూపి యింకో చుట్ట అంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

విచారాలు – క్షమాపణలు

మనస్సాక్షి  – 1033
ఉదయాన్నుంచీ ఎడమకన్ను ఒకటే యిదిగా అదురుతోంది. దాంతో వెంకటేశం కంగారుపడ్డాడు. యిలా ఎప్పుడో గానీ జర గదు. జరిగిందంటే  కొంపలంటుకున్నట్టే. అప్పుడెప్పుడో ఎలక్షన్‌లో పోటీ చెయ్య డానికి నామినేషన్‌ వేస్తుండగా  అలా అదిరింది. ఆ తర్వాత ఎలక్షన్లో ఖర్చులికి రెండెకరాల పొలం హారతయిపోవడం, ఎలక్షన్లో డిపాజిట్లు గల్లంతయిపోవడం జరిగింది. యింకోసారి పెళ్ళిచూపుల కెళ్ళినప్పుడూ యిలాగే జరిగింది. అప్పు డయితే ఆ పెళ్ళిచూపులేవో జరుగు తుండగానే పెళ్ళి కూతురు కాస్తా బుళుక్కు మని వాంతి చేసుకుంది. దాంతో అక్క డున్న  ఓ పెద్దాయనయితే ”అదృష్ట మంటే నీదేనోయ్‌… కలిసొచ్చే కాలం వ స్తే నడిచొచ్చే కొడుకు పుట్టడం అంటే యిదే’ అని శెలవిచ్చాడు కూడా. యిదిగో… మళ్ళీ యిప్పుడు కూడా ఎడమకన్ను అదురుతోంది. యిప్పుడేం కొంప లంటుకుంటాయో అనుకుంటూ ముందుకి నడిచాడు. యింత లోనే తను వెళ్ళవలసిన ఆఫీసేదో రానేవచ్చేసింది. వెంక టేశం చేతిలో ఫైల్స్‌ సర్దుకుంటూ సదరు ఆఫీసులోకి నడిచాడు. లోపల కెడుతుంటే వెంకటేశం మనసెం దుకో కీడు శంకించింది. అసలే వెడుతోంది ఉద్యోగం కోసమాయె. ‘యిక ఈ ఉద్యోగం రానట్టే’ అను కుంటూ భయంగానే  లోపలికి నడిచాడు. లోపలకెళ్ళే సరికి కౌంటర్లో ఓ అమ్మాయి కూర్చుని ఉంది. వెంక టేశాన్ని చూడగానే ఆ అమ్మాయయితే టీవీ యాంకర్‌లా తెగ నవ్వేస్తూ కనిపించింది. దాంతో వెంక టేశం ‘యిదేంటీ… అమ్మడికి ఎక్స్‌ప్రెషన్‌లు కొంచెం ఎక్కువయినట్టున్నాయి’ అనుకున్నాడు. అంతే కాదు. తను కూడా ఓ చిరునవ్వు పారేసి మీనాక్షి అనబడే ఆ అమ్మాయి దగ్గరకి నడిచాడు.  వెంకటేశం చేతిలో ఫైల్సవీ చూస్తూ ”ఉద్యోగం కోసం వచ్చి నట్టున్నారు” అంది. వెంకటేశం తలూపి తన అప్లికేషన్‌ యిచ్చే శాడు. ఆ అప్లికేషన్ని మీనాక్షి అనే ఆ అమ్మాయి లోపల బాస్‌ గదిలోనికి పంపించేసింది. ఈలోగా వెంక టేశం నెమ్మదిగా మీనాక్షిని కబుర్లలో పెట్టి ఆ ఆఫీసు గురించి కూపీలాగే  పన్లో పడ్డాడు. ”యిక్కడ జీతాలవీ ఎలా ఉంటాయ్‌?” అంటూ అడి గాడు. దాంతో మీనాక్షి మొహం యింత చేసుకుని ”అబ్బో… బ్రహ్మాండంగా ఉంటాయి. అసలి క్కడ ఉద్యోగం దొరకడమే అదృష్టం. నామటుకు నాకు తొమ్మిది వేలదాకా వస్తుంది. మీకయితే పదివేల దాకా వచ్చేయొచ్చు” అంది. యిక అలా చెపుతున్నప్పు డయితే మీనాక్షి మొహమయితే తెగ వెలిగిపోయిందాయె. అయితే అది వినగానే వెంకటేశం మాత్రం అదిరిపోయాడు. ‘అదేదో నెలకి లక్షో రెండు లక్షలో యిచ్చేస్తు న్నట్టు చెపుతుందే… దీని ఎక్స్‌ప్రెషను తగలెయ్య’ అని తిట్టుకున్నాడు. యింకోపక్క వెంకటేశానికి ఆ ఉద్యోగం మీదయితే ఆసక్తి పూర్తిగా చచ్చిపోయింది. ‘అసలు గురువుగారిని అనాలి. ఏదో టాటా కంపెనీలోనో, బిర్లా కంపెనీలోనో సీ.ఈ.వో. అన్న లెవెల్లో రికమెండ్‌ చేసి పంపించాడు. తీరా యిప్పుడు ఈ ఉద్యోగంలో చేరకపోతే నానా గంతులూ వేస్తాడు. మరేం చేయాలా అని ఆలోచిస్తుంటే అప్పుడు లోప ల్నుంచి రమ్మని పిలుపొచ్చింది. లోపలకెళ్ళేసరికి ఆ కంపెనీ బాపతు ఓనర్‌ ఆనందరావు ఉన్నాడు. ఆనందరావు కూడా బయట మీనాక్షి బాపతులాగే ఉన్నాడు. అవ సరమయిన దాని కంటే కొంచెం ఎక్కువగానే ఎక్స్‌ ప్రెషన్‌ యిస్తున్నాడు. వెంకటేశాన్ని చూడగానే చాల ఆనందపడ్డట్టు కనిపించాడు. ”రా బాబూ రా… నీ గురించి గిరీశం చెప్పాడు. అసలు గిరీశం చెప్పాడంటే యిక తిరుగుండదు. అయినా నీలాంటి కుర్రాడిని యింతకాలం ఎందుకు పంపలేదో వాడిని అడుగుతా” అన్నాడు. వెంకటేశం అయితే యిబ్బందిగా నవ్వాడు. యిక్కడ్నుంచి ఎలా పారి పోవాలా అని ఆలోచిస్తున్నాడాయె. యింతలో ఆనంద రావు బోయ్‌ని పిలిచి ”మా యిద్దరికీ కాఫీ పట్రా. కాఫీ అద్దిరిపోవాలని ఆ హోటల్‌ వాడికి చెప్పు. పంచదార తక్కువ. స్ట్రాంగ్‌గా ఉండాలి” అన్నాడు.  తర్వాత వెంకటేశం వైపు తిరిగి ”యిప్పుడు జాబ్‌లో జాయినయిపోతావా బాబూ..” అన్నాడు. ఊ అనేస్తే ఆ ఆనంద రావు పరిగెత్తుకెళ్ళి ఆ అపా యింట్‌మెంట్‌ ఆర్డరేదో తెచ్చేసే లాగున్నాడు. దాంతో వెంకటేశం ”అలాగే గానీ… అలా చేరడా నికి ముందు యింటర్వ్యూ లాంటిది ఉంటుందేమో” అన్నాడు. దాంతో ఆనందరావు మొహం మళ్ళీ చాటంతయింది. గబగబా లేచొచ్చి ”అబ్బబ్బ… ఎంత పద్ధతి! సరే.. ఓ చిన్న ప్రశ్నడుగుతా. యిందాక కాఫీ చెప్పా కదా. దాని స్పెల్లిం గేంటో చెప్పెయ్‌” అన్నాడు. వెంకటేశం వెంటనే ”ఏవుందీ… ఖూఖూన్‌” అన్నాడు. అది విన గానే ఆనందరావు అదిరిపోయాడు. అంతలోనే ”నేనడిగింది మనం తాగే కాఫీ” అన్నాడు. అయినా వెంకటేశం ధీమాగా ”నే చెప్పిందీ అదే.  అది తప్ప యింకొకటి కావడానికి వీల్లేదు” అన్నాడు. దాంతో ఆనందరావు ముందుగా బోరుమ న్నాడు. తర్వాత అమాంతంగా వెంకటేశం కాళ్ళమీద పడిపో యాడు” బాబూ… నా పాతికేళ్ళ సర్వీసులో కాఫీ స్పెల్లింగు యిలా చెప్పిన వాళ్ళు లేరు. అయినా నువ్వు చెప్పిన స్పెల్లింగ్‌లో ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా టేలీ అవలేదు. నీ అంత మేధావికి ఉద్యోగం యిచ్చే శక్తి నాకు లేదు. దయచేసి వెళ్ళిపోబాబూ” అన్నాడు. దాంతో వెంక టేశం కాలరెగరేసుకుంటూ దర్జాగా బయటికొచ్చేశాడు.
అఅఅఅ
”గురూగారూ… రాత్రి అలాంటి కలొచ్చింది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం”ఆ..నీకు బొత్తిగా వేళాకోళం అయిపోయిందోయ్‌… లేకపోతే నీకు విప్రోలోనో, యిన్ఫోసిస్‌లోనో సియివో కింద జాబ్‌ వచ్చేస్తుం దంటావా” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”అదేంటి గురూగారూ… నా కాలిబర్‌కి ఆఫ్ట్రాల్‌ పదివేలా..!’ అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ”అద్సరే… యింతకీ నీకీ కల ఎందు కొచ్చిందో తెలుసా?” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”అసలిదంతా ఆ శివసేన ఎం.పి., గైక్వాడ్‌ వ్యవహారం. ఈ మధ్య సదరు ఎంపీ విమానంలో అసంబద్ధంగా ఓ సీనియర్‌ అధికారిని పాతికసార్లు కొట్టడం జరిగింది. అదెంత దారుణమని… అంతేనా… ఈ విషయంగా అశోకగజపతిరాజు గారిని కూడా ఆ పార్టీ ఎంపీలు కొట్టినంత పని చేసినట్టు వార్తలొ చ్చాయి. అయితే జరిగిందాంట్లో తప్పంతా గైక్వాడ్‌దే అని తెలుస్తూనే ఉంది. అయినా క్షమాపణ చెప్పలేదు. చెప్పే ఉద్ధేశం కూడా ఏమాత్రం కనపడ్డంలేదు. మాటల్లో పశ్చా త్తాపమూ లేదు. అయితే యింకోపక్క ఎయిర్‌ లైన్స్‌వాళ్ళు సదరు ఎంపీగారిని విమానం ఎక్కనిచ్చేది లేదని తేల్చిచెప్పేశారు దాంతో ఏదో కొంచెం దిగి ‘జరిగిందానికి విచారం వ్యక్తం చేస్తున్నా అంటే సారీ అన్నాడు. అన్నట్టుగా ఎయిర్‌లైన్స్‌వాళ్ళు నిషేధం ఎత్తివేశారు. రేపెప్పుడో సదరు ఎంపీగారు ‘అబ్బే… నేను విచారం వ్యక్తం చేసింది నేను చేసిందానికి కాదు. సదరు విమాన సంస్థ వాళ్ళు నామీద ఆరోపణలు చేసినందుకు’ అని శెలవిచ్చినా ఆశ్చర్యం లేదు. అదీ ఆ ఎంపీగారి పొగరు స్థాయి. ఏతావాతా చెప్పేదేం టంటే… ఈ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, లేకపోతే యింకో నాయ కులూ… అంతా ప్రజలసేవ కోసం నిర్ధేశించబడ్డవాళ్ళే. అలాంటిది అధికారమదంతో ఆ ప్రజల్నే యిబ్బంది పెట్టాలనుకోవడం ఎంత హేయమని..! అంతేగానీ తామేం చేసినా చెల్లిపోతుందనీ, తామే మాత్రం మెట్టు దిగకుండా ఆ అధికార మదంతో తామనుకున్నదే చేసేస్తామంటే  కుదరదు. అలా చేస్తే వాళ్ళకీ, వాళ్ళ పార్టీకీ నష్టమే” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

కార్యకర్తలు-కార్యఖర్మలు

మనస్సాక్షి -1032
ఎన్నో ఏళ్ళ క్రిందట… వెంకూ మహారాజు గారు మగధ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులు. రాజ్యమయితే సుభిక్షంగానే ఉంది. అయితే మహారాజుగారికి కొంచెం హుషారెక్కువ. అప్పట్లో ఐపీసీలూ, యింకో బహుభార్యా నిషేధ చట్టాలూ లాంటివి లేవాయె. ఏ రాజయినా తాననుకున్నది శుభ్రంగా అమలు చేసి పారేసేవాడంతే. దాంతో వెంకూ మహారాజు గారికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది…. అదీ పెళ్ళిళ్ళ విషయంలో. ఏదయినా యుద్ధానికి వెళ్ళినప్పుడో, ఎక్కడికో విహారానికి వెళ్ళినప్పుడో మనసుకి నచ్చిన అమ్మాయి కనిపిస్తే పెళ్ళి చూసుకుని తీసుకొచ్చేసేవాడు. దాంతో అంత:పురుం కాస్తా రాజుగారి వందమంది భార్యలతో నిండిపోయింది. అయితే   అలాంటి మహారాజు గారికి చిన్న ఆందోళన మొదలయింది.  అదేదో రాజ్యం గురించో, ప్రజల గురించో అనుకుంటే పొరబాటే. అచ్చంగా తన వందమంది భార్యల గురించి….! వాళ్ళందరికీ సమయం కేటాయించడం వెంకూ మహారాజుకి కుదరడం లేదాయె. అక్కడకీ రోజుకో రాణితో గడుపుతున్నాడు. అలా అయినా ఆ రాణితో యింకో వందరోజుల వరకూ గడపలేని పరిస్థితి. యిలాంటి పరిస్థితుల్లో  వెంకూ మహారాజుకో పెద్ద అనుమానమే వచ్చింది. తన వీళ్ళందరితో గడిపే సమయం బొత్తిగా తక్కువయిపోయింది కదా. మరి వాళ్ళేవయినా అడ్డదారులు తొక్కుతున్నారా అని. దాంతో బాగా ఆలోచించి ఓ గొప్ప పథకం వేశాడు. ఆ వందమంది రాణుల దగ్గరా ఉండే పరిచారి కలసీ  తన మాట వినేవారిని నియమించాడు. వాళ్ళు ఆ రాణులకి పరిచారికలుగా మాత్రమే కాకుండా రాజుగారికి సమాచారం అందించే గూఢచారులుగా పనిచేయడం మొదలెట్టారు. నెల రోజుల తర్వాత వెంకూ మహారాజు పెద్ద భార్య వసుంధరాదేవి దగ్గరుండే పరిచారికని పిలిపించాడు. ఆ పరిచారిక గబగబా తన రిపోర్టేదో చెప్పింది. ” అమ్మగారు ఎప్పుడూ మీ ధ్యాసలోనే ఉంటారు మహారాజా. అసలయితే ప్రతిరోజు మధ్యాహ్నం మూడింటి వరకూ మీరొస్తారేమోనని ఎదురు చూస్తుంటారు. ఆ తర్వాతే భోజనం చేస్తారు. అలాగే రాత్రి కూడా అలాగే పదింటి వరకూ ఎదురు చూస్తుంటారు” అంది. దాంతో మ హారాజుగారు చాలా సంతోష పడిపోయారు. తర్వాత యింకో రాణి చిత్రాంగిదేవి పరిచారికని పిలిపించాడు. ఆ పరిచారికయితే వచ్చిన వెంటనే ఏం మాట్లాడలేకపోయింది. మహరాజు గట్టిగా అడిగిన మీదట అప్పుడు చెప్పింది. ” ఏం లేదు మహారాజా… ఈ మధ్య అమ్మగారి ప్రవర్తనలో తేడా వచ్చింది. తరుచుగా రాజభవనానికి మూడ వీధులు అవతల ఉన్న  ఉద్యానవనానికి వెళ్ళి కూర్చుంటున్నారు. అక్కడికి యింకో అందమైన యువకుడొస్తున్నాడు. యిద్దరూ చాలా సేపు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవడమే ! అంతకు మించి వేరే కాదు అంది. దాంతో మహారాజు మొహం మాడిపోయింది. ఏం చేయాలా అని ఆలోచనలో పడ్డాడు.
——
 యింకో వారం తర్వాత….. వెంకూ మహారాజు తన వందమంది రాణులనీ సమావేశపరిచి అంతే కాకుండా అప్పుడే ఓ ప్రకటన చేశాడు. ” మీరంతా నా భార్యలు….యింకా ఈ దేశానికి రాణులు. యిక మీదట మీలో కొందరికీ మహారాణి హోదా కల్పిద్దామనుకుంటున్నా” అన్నాడు. అంతా ఆసక్తిగా చూశారు. అప్పుడు మహారాజు ఆ జాబితా ఏదో ప్రకటించాడు. అందులో 35 మంది రాణుల పేర్లున్నాయి. అందులో మొదటిపేరు చిత్రాంగి దేవిది…! ఆ  మిగతా 34 పేర్లూ కూడా చిత్రాంగిదేవి బాపతు కాస్త ఎందుకైనా మంచిదన్న కేండిడెట్లు. యింకో నెల గడిచింది. వెంకూ మహారాజు గారు మళ్ళీ నాణుల సమావేశం ఏర్పాటు చేశాడు. మహారాజుగారు ఈ సారేం చేస్తారా అని అంతా ఆసక్తిగా చూశారు. అప్పుడు మహారాజు చెప్పడం మొదలెట్టాడు. ” మీలో కొందరు రాణులు మరి కొందరు మహారాణులు. యిప్పుడు మీలో కొందరికి ఉన్నత స్థానం కల్పిద్దామనుకుంటున్నా. యింతవరకూ రాణులుగా ఉన్న కొందరిని మహారాణులని చేస్తా… అలాగే మహారాణులుగా ఉన్నవాళ్ళలో కొందరికి పరిపాలనలో కీలకమయిన పదవులిస్తా. ఒకరినయితే పట్టపురాణిని చేస్తా” అన్నాడు. దాంతో అంతా ఆశగా, ఆసక్తిగా చూశారు. అప్పుడు వెంకూ మహారాజు ” చిత్రాంగిదేవిని పట్టపురాణిని చేస్తున్నా. యిక మహారాణులుగా ఉన్న….” అంటూ చెప్పడం మొదలెట్టాడు. మహారాజు గారు యిలా ప్రమోషన్‌ లిస్ట్‌లో పేర్లు చెప్పినవాళ్ళంతా ఈ మధ్య కాలంలో   ఎంతో కొంత శృతి మించుతున్న వాళ్ళే…! యిక మహారాజుగారినే దైవంగా భావించి కిక్కురుమనకుండా పడున్న వసుంధరా దేవి లాంటి వాళ్ళందూ యిప్పటికీ కేవలం రాణులుగానే మిగిలిపోయారు….!
——-
మొహానికి వేడిగా తగిలేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. కంగారుగా ‘ అమ్మో….నన్ను కాల్చొద్దు….నేను మీ మహారాజును…. మీ భర్తని” అంటూ కేకలెయ్యడం మొదలెట్టాడు. దాంతో పక్కనున్న గిరీశం కంగారుగా ” ఏవివాయ్‌ వెంకటేశం….పగటి కలలేవన్నా కంటున్నావా? అన్నాడు. ఆ పాటికి వాస్తవంలోకొచ్చిన వెంకటేశం ” అయితే యిదంతా కలన్నమాట” అంటూ  తనకొచ్చిన కలంతా చెప్పాడు. అంతా చెప్పాక ” అవును గురూ గారూ… ఓ ప్రక్కన ఓ పెళ్ళి కూడా జరక్క నానా ఏడుపులూ ఏడుస్తుంటే  మధ్యలో ఈ వంద పెళ్ళిళ్ళు గోలేంటంటారు? కొంపదీసి మీ తాత గిరీశంగారేవయినా ఆవహించారంటారా? ” అన్నాడు. దానికి గిరీశంగారేవయినా ఆవహించారంటారా?” అన్నాడు  దానికి గిరీశం విసుక్కుని ” అనవసరంగా మా తాతని లాగావంటే  బాగోదు. అసలిదంతా రాజకీయాల్లో నడుస్తున్న తంతే అన్నాడు. వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. యింతలో గిరీశమే మళ్ళీ ” సరే…అదేదో నువ్వే విశ్లేషించు. అదే ఈ వారం ప్రశ్ననుకో”… అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు…” మన రాజకీయాల్లో ఓ విచిత్రమైన పరిస్థితి నడుస్తూ ఉంటుంది. అది అయినవాళ్ళకి ఒకలాగ….అతిథులకు మరొకలాగ లాంటి పరిస్థితి. ఒక పార్టీ అని కాదు. దాదాపు అన్ని పార్టీల్లోనూ యిదే పరిస్థితి. ఓ వ్యక్తి పార్టీ పుట్టిన్పటి  నుంచి జెండాలు మోస్తూ పార్టీలో తిరుగుతూ ఉండొచ్చు. తన జీవితమంతా పార్టీకే అంకితం చేయెచ్చు. కలలో కూడా యింకో పార్టీలోకి వెళ్ళే ఆలోచన చేయకపోవచ్చు. అయినా అతడికి ఎప్పటికీ ఎప్పటికీ పార్టీలో గుర్తింపు రాకపోవచ్చు. అలాగే యింకో శాల్తీని తీసుకుంటే తనకో వర్గం ఉండడం తప్ప పార్టీకి పెద్దగా చేసిందేవీ ఉండకపోవచ్చు. అంతేనా… ఏ క్షణంలో అయినా యింకో పార్టీలోకి దూకేయెచ్చు. అలాంటి శాల్తీకి పదవి  దక్కొచ్చు. చూడటానికి యిదంతా బొత్తిగా లాజిక్‌ లేకుండా ఉన్నా జరుగుతున్నదిదే. అలా జరిగీ తీరాలంతే. లేకపోతే కుదరని పరిస్థితాయె..దీనిక కారణమేంటా అని ఆలోచిస్తే…. పార్టీకి అత్యంత విధేయులూ, పార్టీని తమ సొంతంగా భావించేవాళ్ళూ ఏ పదవులూ యివ్వకపోయినా పార్టీని వదిలిపోరు. మనసులో  అసంతృప్తితో బాధపడుతారంతే. అదే…వేరే పార్టీల నుంచి వచ్చినవాళ్ళో,లేకపోతే అవకాశాల కోసం యింకో పార్టీ వైపు చూసేవాళ్ళో ఆశించిన పదవులు రాకపోతే ఠక్కున జంప్‌ జిలానీలయిపోతారు. అందుకే వాళ్ళని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళకి ప్రాధాన్యత యివ్వవలసి వస్తోంది. ఓ రకంగా యిది తప్పయినా రాజకీయాల్లో తప్పని పరిస్థితి” అంటూ తేల్చాడు. అంతా విన్న గిరీశం ” ఆ బాగా చెప్పావోయ్‌… నువ్వు చెప్పినలాంటి అభిప్రాయమే ఎన్నో ఏళ్ళుగా పార్టీల్లో వెన్నెముకలా ఉండి సరయిన గుర్తింపునకు నోచుకోని నాయకుల్లో ఉండిపోయింది. వీళ్ళు సంవత్సరాల తరబడి అలా సహనంగా సరయిన గుర్తింపు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే ఎప్పుడో ఆ అసహనం కట్టలు తెగితే అది ఆ పార్టీ మనుగడకి  ఎంతమాత్రం మంచిది కాదు’8 అంటూ యింకో చుట్ట వెలిగించాడు.
డా. కర్రి రామారెడ్డి

వైద్య నారాయణులు – వైద్యాసురులు

మనస్సాక్షి  – 1031
గిరీశం అప్పుడప్పుడూ నగర సంచారం చేస్తుంటాడు. అంటే మరేంలేదు. ఏవీ తోచు బడి కానప్పుడు అలా అలా ఊరంతా ఓ రౌండు వేసొస్తుంటాడు. ఆరోజు కూడా అలాగే నగర సంచారం ముగించుకుని యింటి మొహం పట్టాడు. అప్పుడు జరి గిందది. తన వీధి దాకా వచ్చేసరికి ఆ వీధి చివర యింటరుగుమీద పెద్దబ్బాయి కని పించాడు. మొహమయితే  పదిలంఖ ణాలు చేసినట్టుంది. దాంతో గిరీశం గబగబా అటు నడిచాడు. ”ఏవివాయ్‌ పెద్ద బ్బాయ్‌… అలా ఉన్నావేం?” అన్నాడు. పెద్దబ్బాయి తల తిప్పి ”ఏం చెప్ప మంటారు గురూగారూ… సమస్యలన్నీ కట్ట గట్టుకుని మరీ వచ్చిపడ్డట్టున్నాయి… ఎలా బయటపడాలో తెలీడంలేదు. దగ్గర్లో డబ్బులొచ్చే దార్లూ కనపడ్డం లేదు” అన్నాడు. దాంతో గిరీశం ”ఓస్‌… దానికంత టెన్షన్‌ ఎందుకూ… రా…నీకో దారి చూపెడతా” అన్నాడు. అది వినగానే పెద్దబ్బాయిలో హుషారొచ్చేసింది. గబగబా అరుగుమీంచి దిగొచ్చేశాడు. అక్కడ్నుంచి గిరీశం ముందు నడుస్తుంటే పెద్దబ్బాయి వెనుకే అనుసరించాడు.  అయితే గిరీశం తిన్నగా గుడివైపుకి దారితీశాడు. దాంతో పెద్దబ్బాయి ”అంటే యిప్పుడు మనమిక్కడ పూజలూ, వ్రతాలూ చేయలం టారా?” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”నోర్మూసుకుని నేను చెప్పినట్టు చెయ్‌” అంటూ గుడిగి కొంచెం అవతలగా ఉన్న బిచ్చగాళ్ళు దగ్గరకి నడిచాడు. అక్కడ ఓ బిచ్చగాళ్ళ కుటుంబం రోడ్డు పక్కనుంది. వారిలో ఓ ముసలమ్మయితే ముడుచుకుని పడుకు నుంది. మధ్యమధ్యలో గట్టిగా దగ్గుతోంది. ఓ పక్కన గట్టిగా వణుకు తోంది. ఆ పక్కనే ఆ ముసలి బిచ్చగత్తె తాలూకా బంధువులున్నారు. యింతలో గిరీశం వారిలో ఒకరిని ”ఏంటీ… ఈవిడని హాస్పిటల్‌కి తీసుకెళ్ళరా?” అన్నాడు. దాంతో అబ్బులు అనబడే ఆవిడ కొడుకు ”ఏం తీసుకెళ్ళేది బాబయ్యా… దాని పనయిపోయింది. యియ్యాలో రేపో అన్నట్టుంది. అయినా ఆ ఆసుపత్రుల్లో చూపించడానికి మాకాడ డబ్బులుండాలిగా” అన్నాడు. యిదంతా పెద్దబ్బాయి ఆసక్తిగా గమ నిస్తున్నాడు. యింతలో గిరీశం ఏదో శక్తి ఆవహించినట్టు చెలరేగి పోయాడు. గబగబా 108కి ఫోన్‌ చేశాడు. యింకో పదినిమిషాల్లో ఆ వ్యానేదో అక్కడకొచ్చేసింది. గిరీశం అబ్బులు వంక తిరిగి ”మీ ముసలమ్మకి వైద్యం చేయించే ఏర్పాట్లు చేయిస్తున్నా” అన్నాడు. దాంతో వాళ్ళంతా గిరీశం వంక దేవుడిలా చూశారు. యింతలోనే ఆ ముసలమ్మని ఆ వ్యాన్‌లోకి ఎక్కించడం, అక్కడ్నుంచి దగ్గరే ఉన్న సదానందం హాస్పిటల్‌కి తీసుకుపోవడం జరిగిపోయాయి.
—–
సదానందంగారి హాస్పిటల్‌ దగ్గర… 108 వేన్‌లోంచి ముసలమ్మని దింపారు. అక్కడ్నుంచి చకచకా లోపలికి తీసుకుపోయారు. అబ్బు లొచ్చి హాస్పిటల్‌ రిసెప్షన్లో తన తల్లి వివరాలన్నీ చెప్పాడు. రిసెప్షన్లో అమ్మాయి ”మరి ఎమౌంటదీ” అనబోతుంటే గిరీశం ముందు కొచ్చాడు. ”ముందా పేషంటుకి వైద్యం చెయ్యండీ… అలా అని కోర్టు చెప్పింది కదా. డబ్బుల సంగతేదో తర్వాత చూడొచ్చు” అన్నాడు గట్టిగా. దాంతో ఆ అమ్మాయి యింకేం మాట్లాడలేకపోయింది.  యింత లోనే ముసలమ్మని లోపల అడ్మిట్‌ చేసేసి వైద్యం ప్రారంభిం చారు. పెద్దబ్బాయీ, అబ్బులూ పేషంట్‌ దగ్గరుంటే గిరీశం బయట కొచ్చే శాడు. మధ్యాహ్నం వరకూ ఆ వైద్యమేదో నడిచింది. ముసలమ్మకి కొన్ని టెస్ట్‌లు చేయించడం, కొన్ని మందులు వాడడం జరిగింది. మధ్యాహ్నం మూడు దాటింతర్వాత ముసలమ్మ కాస్తా గుటుక్కు మంది. అప్పటికే ఎప్పట్నుంచో అనారోగ్యం ముదరబెట్టేసిందాయె. ముసలమ్మ గుటుక్కుమనేసరికి పెద్ద బ్బాయి కాస్తా పులయిపోయాడు. ”ఏదో ప్రాణం పోస్తారని తెస్తే శుభ్రంగా ఉన్నావిడ ప్రాణం తీసేస్తారా…” అన్నాడు పెద్దగా కేకలు పెడుతూ.  దాంతో అక్కడ వాతావరణమంతా టెన్షన్‌గా మారిపోయింది. ఈలోగా చనిపోయిన ముస లమ్మ తాలూకా బంధువులు మొత్తం వాలి పోయారు. దాంతో డాక్టర్‌లో టెన్షన్‌ యింకా పెరిగిపోయింది. ఈలోగా పెద్దబ్బాయి ఎవ రికో ఫోన్‌ చేసి ”మీరంతా అర్జంటుగా సదా నందం హాస్పిటల్‌కి వచ్చెయ్యండి. యిక్కడ మన ముసలమ్మని అన్యాయంగా చంపే శారు” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దాంతో అక్కడ డాక్టర్‌లోగానీ, హాస్పిటల్‌ స్టాఫ్‌లో గానీ టెన్షన్‌ యింకా పెరిగిపోయింది. డాక్టరయితే కంగారుగా ”కొంచెం ఆలోచించు బాబూ… ఆ పేషంటు చనిపోయింది మా వలన కాదు” అన్నాడు. అయినా పెద్దబ్బాయి ఊరుకోలేదు. యింకెవరికో ఫోన్‌ చేసే పనిలో పడ్డాడు.  సరిగ్గా అప్పుడే గిరీశం అక్కడకొచ్చాడు. గిరీశాన్ని చూడగానే డాక్టర్‌ మొహంలో వెలు గొచ్చింది.  గబగబా గిరీశాన్ని పక్క గదిలోకి తీసికెళ్ళాడు. ”చూడండి సార్‌… మీరు పెద్ద మనుషుల్లా ఉన్నారు. వాళ్ళు అనవసరంగా గొడవ చేస్తున్నారు. మీరే ఏదోలా చెప్పి వాళ్ళని పంపించేయండి” అన్నాడు. గిరీశం తలూపి ”దీనికొకటే పరిష్కారం డాక్టర్‌గారూ.. వాళ్ళ మొహాన ఓ రెండు లక్షలు పారెయ్యండి. వాళ్ళే పోతారు” అన్నాడు తేలిగ్గా. దాంతో డాక్టర్‌ అదిరిపోయి ”ఏంటీ… రెండులక్షలా… అసలు ఉదయం పేషంటుని జాయిన్‌ చేసిందగ్గర్నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేదు. యింకా టెస్ట్‌లకీ, మందులకీ చాలా అయింది. అదీ తీసుకోలేదు. యిప్పు డింకో రెండు లక్షలంటే ఎలా యిచ్చేది?” అన్నాడు. ఈసారి గిరీశం ఎంతో ఉదారంగా ”సరే… ఓ లక్షివ్వండి. నేను మాట్లాడతా” అన్నాడు. దాంతో డాక్టర్‌ ”లక్షా..! నేనెందుకివ్వాలి?” అన్నాడు. దాంతో గిరీశం ”ఎందుకా.. వాళ్ళ ఆవేశానికి మీ హాస్పిటల్‌ ఫర్నీచరు నాశనం కాకుండా ఉండడానికీ, యింకా మీరు క్షేమంగా ఉండడానికీ” అన్నాడు. దాంతో డాక్టర్‌ మొహంలో భయం ప్రవేశించింది. యింకేం మాట్లాడకుండా వెళ్ళి లక్ష తెచ్చిచ్చాడు. వాటిలో ఓ ఎనభై వేలు పెద్దబ్బాయికి చేరితే, యిరవై వేలు ముసలమ్మ కొడుకు అబ్బులికి అందింది.
—–
”అది గురూగారూ… నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం కయ్యిమని ”అంటే చివరికి నన్ను విలన్‌ని చేసి పారేశా వన్నమాట” అన్నాడు. దానికి వెంకటేశం పళ్ళికిలించి ”ఏదో కలే కదా. యింతకీ ఈ కల అర్థం ఏంటంటారు?” అన్నాడు. దాంతో గిరీశం చెప్పడం మొదలెట్టాడు. ”మొన్న మహారాష్ట్రలో డాక్టర్‌ మీద జరిగిన దాడి గురించి తెలుసు కదా. కేవలం తన హాస్పిటల్లో న్యూరోసర్జరీకి సంబంధించిన సదుపాయాలు లేవని, అందుకే పేషంటుని వేరే హాస్పి టల్‌కి తీసుకెళ్ళమని సూచించినందుకే డాక్టర్‌ని చితకబాదారు. దేశవ్యాప్తంగా యిలాంటి పరిస్థితి డాక్టర్లు ఎదు ర్కొంటున్నారు. యిటు వంటి పరిస్థితుల్లో వైద్య వృత్తి చేపట్టాలన్న ఆసక్తి చచ్చిపోవడం ఖాయం. ప్రతీ వృత్తిలో ఉన్నట్టే వైద్యవృత్తి లోనూ కొద్దిమంది స్వార్ధ పరులు ఉండొచ్చు. వాళ్ళ వలన కొంతమంది సేషంట్లు బాధపడుం డొచ్చు. అంతంతమాత్రం చేత మొత్తం డాక్టర్లందరినీ అలాగే లెక్క వేయడం ఎంతవరకూ సమం జసం? యిక నీ కలలోలాంటి వ్యవహారాలు డాక్టర్లని మరింత ఆందోళనలోనికి నెడుతున్నాయి. ఈ పరిస్థితులు యిలాగే కొన సాగితే అందరి మనుగడకి ఎంతో కీలకమయిన వైద్యవృత్తిలోనికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. అదెంత మాత్రం మంచి పరి ణామం కాదు. ఒక రోగికి వైద్యం విషయంలో ఆరోగ్య భద్రత ఎంత ముఖ్యమో ఆ రోగికి వైద్యం చేసే డాక్టర్‌కి ప్రశాంతంగా వైద్యం చేసే పరిస్థితులు కల్పించడం అంతే ముఖ్యం” అన్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

ప్రతి ప్రక్షాళన

మనస్సాక్షి  – 1030
”గురూగారూ… నన్నర్జంటుగా బాబు గారి దగ్గరకో, మోడీగారి దగ్గరకో పంపిం చేయండి. యిక్కడయితే అంతా కథల కాలక్షేపంలా ఉంటుంది తప్ప ఎదుగూ బొదుగూ ఉండడం లేదు” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి యింట్లోంచి బయటకు వస్తున్న గిరీశం ”మీ తాత వెంకటేశంలాగే నీకూ ఆలోచన తక్కువ. ఆవేశం ఎక్కువ. కావలిస్తే రికమెండ్‌ చేసి నిన్ను వాళ్ళ దగ్గరికి పంపించెయ్యగలను. అయితే వాళ్ళిద్దరూ యిప్పుడు అధి కారంలో ఉన్నారు కదా. చుట్టూ జనాలు సముద్రంలా ఉంటారు. నీకే ప్రాధాన్యతా ఉండదు. అదే ప్రతి పక్ష నాయకుడి దగ్గర కెడితే అక్కడ నీ తెలివితేటలు చూపించు కోవచ్చు. యింకా తొందరగా ఎదగొచ్చు” అన్నాడు. దానికి వెంక టేశం వెంటనే ఒప్పేసుకున్నాడు. యింకేముంది… గిరీశం వెంటనే ఊళ్ళో ఉన్న మాజీ ఎంపీ గారితో మాట్లాడటం, సదరు మాజీ  ఎంపీగారు తమ పార్టీ నాయకుడు రాహుల్‌కి ఓ లెటర్‌ రాసివ్వడం, ఆ లెటరేదో చూపించి వెంకటేశం కాస్తా  రాహుల్‌గాంధీ కోటరీలో చేరిపోవడం జరిగిపోయాయి.  అసలే రాహుల్‌కి ఏదో అలా అలా జాలీ ట్రిప్‌ లేయాలనో, లేకపోతే వీధి చివరున్న చాయ్‌ దుకాణంలో చాయ్‌ తాగాలనో, సమోసా తినాలనో టైపు మనస్థత్వం. అందుకే చుట్టూ ఉండే దిగ్విజయ్‌లాంటి వృద్ధ సింహాల పొడ పెద్దగా గిట్టదు. అలాంటి పరిస్థితుల్లో తన దగ్గరకొచ్చిప వెంకటేశం రాహుల్‌కి పిచ్చపిచ్చగా నచ్చేశాడు. అసలే వెంకటేశం చదువుకున్న వాడు. మేధావి. పైగా అన్నీ బాగా విశ్లేషిస్తాడు. దాంతో రాహుల్‌ అన్ని విషయాలూ వెంకటేశంతో చర్చించే  నిర్ణయం తీసుకుంటున్నాడు.
——-
ఆరోజు రాహుల్‌, వెంకటేశం రోడ్‌ పక్కన బడ్డీకొట్టు దగ్గర చాయ్‌ తాగుతున్నారు. యింతలో రాహుల్‌ ”ఎంతయినా ఈ మీడియా తీరేమీ బాలేదు” అన్నాడు. దాంతో వెంకటేశం ”అదేంటి భాయ్‌..” అన్నాడు. ఈసారి రాహుల్‌ ”లేకపోతే ఒకప్పుడు ఆ సంఘ పరివార్‌ వాళ్ళు ఏం చేసినా మీడియాలో ఏకి పారేసేవారు. మరిప్పుడు అలా జరుగుతుందా అని. పైగా మొన్న ఎలక్షన్లో పంజాబ్‌లో గెలిచేశాం. గోవా, మణిపూర్‌లలో ఎక్కువ సీట్లు సాధించాం. అయినా ఈ మీడియాలో బీజేపీనే హైలైట్‌ చేస్తున్నారు” అన్నాడు తెగ బాధపడి పోతూ వెంకటేశం అవునన్నట్టుగా తలూపాడు. యింతలో యింకేదో పాయింటు తట్టినట్టుగా ”ఆ…యింకో విషయం భాయ్‌… బయట పబ్లిక్‌లో రకరకాలుగా అనుకుంటున్నారు. మీరు ప్రచారం చేసిన యూపీలో మన పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉత్తరాఖండ్‌లో పరిస్థితీ అదే. అలాగే మీరసలు అడుగుపెట్టని పంజాబ్‌లో మన పార్టీ బ్రహ్మాండంగా గెలిచింది. మీరేదో అలా పైపైన టచ్‌ చేసిన గోవా, మణిపూర్‌లలో సీట్లు బాగానే వచ్చాయి.  ఈ లెక్కన మీరు అడుగుపెట్టి ప్రచారం చేయడం గురించి రకరకాలుగా అనుకుంటున్నారు” అన్నాడు. వెంకటేశం అన్న దాంతో రాహుల్‌ కొంచెం యిబ్బందిగా నవ్వాడు. అయినా  అంతలోనే సర్ధుకుని ”ఏంటో… ఈ జనాలకి యిలాంటి పాయింట్లు తడుతుంటాయి” అన్నాడు. ఈసారి వెంకటేశం కొంచెం చనువు తీసుకుని ”అందుకే భాయ్‌… గోవా, మణిపూర్‌లలో మన పార్టీకే ఎక్కువ సీట్లొచ్చినా అధికారంలోకి రావడానికి సరిపోదు. యితరులతో కలిసే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అసలే మీరు అడుగుపెడితే అదేదో పార్టీకి కలిసి రాదంటున్నారు కదా. అందుకే మీరు ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడే వరకూ అటు తొంగిచూడొద్దు” అన్నాడు. యిదేదో రాహుల్‌కి నిజమేననిపించింది. దాంతో ఆ రెండు రాష్ట్రాలవైపు తొంగి చూడకూడదన్న నిర్ణయానికి వచ్చేశాడు. అయితే ఈలోగా యింకో విశేషం జరిగింది. సీట్ల పరంగా ఆ రెండు రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న బిజెపి చకచకా పావులు కదిపింది. ఆగమేఘాలమీద రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌ని రాజీనామా చేయించి ముఖ్యమంత్రి కేండిడేట్‌ కింద గోవాకి తీసుకొచ్చేశారు. పారికర్‌ అనేసరికి మిగతా అన్ని పార్టీలూ బిజెపికి సపోర్ట్‌ చేసేశాయి. దాంతో సీట్ల పరంగా రెండోస్థానంలో ఉన్న బీజేపీ గోవా పీఠం దక్కించేసుకోగలిగింది. అలాగే వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో మణిపూర్‌ కూడా బిజెపి ఖాతాలో చేరి పోయింది. దాంతో రాహుల్‌గాంధీ మీద విమర్శలు గట్టిగా వచ్చాయి. సరయిన సమ యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించకపోవడం వల్లే ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌ చెయ్యి జారిపోయాయన్నది వారి వాదన. దాంతో రాహుల్‌ తలపట్టుకున్నంత పని చేశాడు. ఆనక గబగబా వెంకటేశం దగ్గరకొచ్చి ”చూడు. నీ మాటలు వినడం వలన ఎంత దారుణం జరి గిందో” అంటూ వెంకటేశం నెత్తిమీద రెండు మొట్టికాయలేశాడు.
——
”అమ్మో…కొట్టొద్దు… కొట్టొద్దు” అంటూ వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఆపాటికి గిరీశం ఎదురుగా కూర్చుని ఉన్నాడు. ”ఏవివాయ్‌ వెంకటేశం… పగటి కలలేవయినా కంటున్నావా?” అన్నాడు. దాంతో వెంకటేశం ఓసారి నెత్తిమీద తడుముకుంటూ తన కొచ్చిన కలంతా చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే మొత్తానికి జరుగుతున్న చరిత్రంతా నీ కలలోకి వచ్చేసినట్టుంది. సరే… యిందులో మనకి పనికొచ్చే పొలిటికల్‌ లెసన్‌ ఏంటి?” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం విశ్లేషణాత్మకంగా చెప్పడం మొద లెట్టాడు. ”ఏం లేదు గురూగారూ… రాహుల్‌గాంధీ అడుగుపెట్టిన చోట ఆ పార్టీకేదో నష్టం జరిగిపోతుందనేలాంటి వాదనలు అన వసరం. అసలది తప్పు కూడా. మొన్న జరిగిన ఎలక్షన్‌ ఫలితాల్ని బట్టి ఆ పార్టీకి యింకా జీవం, భవిష్యత్తూ ఉందనే. అర్థమవుతుంది. కొన ఊపిరితో ఉన్న ఆ పార్టీ బతికి బట్టకట్టాలంటే కావలసింది సమూల ప్రక్షాళన. ఆ పార్టీని నిర్వీర్యం చేస్తోంది వారసత్వ పాలన, అడుగడుగునా బయటపడ్డ స్కాంలు, అవినీతిలో ఆరోపణల్లో కూరుకుపోయిన సీనియర్లు. యిప్పటికయినా కుటుంబ పాలనకి స్వస్తి చెప్పడం, అవినీతి నాయకుల్ని  పార్టీ నుంచి సాగనంపడం,  చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసే యువతరానికి ఆహ్వానం పలకడం లాంటి చర్యలు చేపట్టాలి. యిక యింకోపక్క బీజేపీని తీసుకుంటే పార్టీలో కొంతమంది పక్కా వ్యాపారవేత్తలున్నా దిగ్గ జాలయిన వాజ్‌పేయి, అద్వానీ, మోదీ, మురళీమనోహర్‌ జోషి, రామ్‌ మాధవ్‌… యిలా ఎవర్ని తీసుకున్నా వారెవరూ వారసత్వంగా పార్టీలోకి రాలేదు. పైగా వారి వారసులంటూ పార్టీలో లేరు కూడా. వారంతా ప్రజల కోసం తమ జీవితాలు ఫణంగా పెట్టినవాళ్ళే. ఎలాంటి మచ్చా లేనివాళ్ళు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం ఆలో చించేవాళ్ళు. అంతేకాదు. వ్యూహాత్మకంగా వ్యవహరించగల మేధా వులు. అందుకే ఈరోజు చాలా కష్టతరమయిన మణిపూర్‌ లాంటి చోట్ల పాగా వేయగలిగారు. అదీ… ఒక పార్టీ అంచెలంచెలుగా ఎదిగే క్రమం. పార్టీలో అది సాధ్యపడుతుంది” అన్నాడు. యిదేదో బాగానే ఉందన్నట్టుగా గిరీశం తలూపాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

గెలవలేక…. ఈవీయం ఓడన్నట్టు !

రెండు నెలల క్రితం…..
ఆ రోజు ఎలక్షన్‌ కమీషన్‌ ఆఫీస్‌కి ఓ ఉత్తరం వచ్చింది. అదేదో చిన్నపాటి సంచలనం రేపింది. యింతకీ అది రైట్‌ టూ యిన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద పోలింగ్‌లో ఉపయోగించే ఈవీయమ్‌లు ఎక్కడ కొంటున్నారు….ఎంతకి కొంటున్నారు….’ లాటి వివరాలు కావాలని ఎవరో అడుగుతూ రాసిన ఉత్తరం. దాంతో క్లర్క్‌ ఆ ఉత్తరాన్ని పట్టుకెళ్ళి కమీషనర్‌కి చూపించాడు… ” సార్‌.. ఈ వివరాలు యివ్వొచ్చా?” అంటూ అడిగాడు. దానికి కమీషనర్‌ కొంచెం ఆలోచించి ” యిందులో అంత సీక్రెట్‌ ఏముంది! మనమెలాగా టెండర్లు పిలిచి  తక్కువ కోట్‌ చేసిన కంపెనీకి యిచ్చాం. మరేం ఫర్వాలేదు. ఆ వివరాలన్నీ పంపించు” అన్నాడు. అయితే ఆ కమీషనర్‌కి తెలియంది  ఆ యిన్ఫర్మేషన్‌తో ఓ రాష్ట్రం తలరాత మారబోతోందని….! ఒకవేళ తెలిసినా చేయగలిగేందేవీ లేదు కూడా. యివ్వవలసిందే. యింతకీ ఆ యిన్ఫర్మేషన్‌ కోసం లెటర్‌ పెట్టింది వెంకటేశం. అదేదో చేతికొచ్చిం తర్వాత వెంకటేశం రాంచీ బయలుదేరాడు….
                        …………………….                    ………………………....                ………………………
 రాంచీలోని ఎవరెస్ట్‌ యిండస్ట్రీస్‌ ఆఫీస్‌….
ఆ యిండస్ట్రీ ఏదో రాంచీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో  ఉంది. అదో మధ్య తరహా కంపెనీ. వెంకటేశం వెళ్ళేసరికి ఆ కంపెనీ ఎండి అగర్వాల్‌ ఉన్నాడు. తను ఆంధ్రా నుంచి వచ్చానని చెప్పేసరికి వెంకటేశాన్ని బాగా రిసీవ్‌ చేసుకున్నాడు. కొంతసేపు మాటలయిన తర్వాత వెంకటేశం ” సార్‌…మీరు ఈవీయమ్‌లు తయారు చేస్తుంటారు కదా. వాటి మీద ఆదాయం అదీ ఎలా ఉంటుంది? అన్నాడు. దాంతో అగర్వాల్‌ కొంచెం అసహనంగా ” అదంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదు” అన్నాడు. దాంతో వెంకటేశం ”నేనొచ్చింది మీకు ఉపయోగపడే డీల్‌ మాట్లాడ్డానికే. మేడమ్‌ పంపించారు” అన్నాడు. వెంకటేశం అలా చెప్పేసరికి అగర్వాల్‌ దిగిపోయాడు. ” అసలయితే దేశం మొత్తం మీద ఏదో చోట ఎలక్షన్లు జరగుతూనే ఉంటాయి. అందుకే ఈవీయంల సప్లయి ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది.  అ యితే మేము నామమాత్రపు లాభానికే చేసేస్తుంటాం. లెక్కేసుకుంటే సగటున నెలకో రెండు లక్షల ఆదాయం ఉంటుంది” అన్నాడు. అప్పుడు వెంకటేశం అసలు విషయంలోకి వచ్చాడు. ‘ మీకు ఒక్కసారిగా పది కోట్ల ఆదాయం వస్తే ఎలా ఉంటుందంటారు?” అన్నాడు. దాంతో అగర్వాల్‌ మొహంలో ఆశ్చర్యానందాలు కనపడ్డాయి. ఎలా అన్నట్లు ఆసక్తి చూశాడు. అందులో కొంత అపనమ్మకం కూడా కనిపిస్తోంది. దాంతో వెంకటేశం తన కూడా తె చ్చిన సూట్‌కేస్‌ తెరిచి చూపించాడు. అందులో డబ్బు కట్టలయితే చాలానే ఉన్నాయి”. యిది కోటి రూపాయలు. మీరు ఊ అంటే యిది అడ్వాన్స్‌గా యిచ్చేస్తాను. మిగతాదంతా పనయిం తర్వాత” అన్నాడు. దాంతో అగర్వాల్‌ హుషారుగా ‘మరి మేం  చేయవలసిందేంటి?” అన్నాడు. వెంకటేశం కొంచెం ముందుకి వంగి ” ఏం లేద్సార్‌.. ఈవీయమ్‌లో ఓ టు వేయడానికి బటన్‌ నొక్కుతారుకదా. ఏ బటన్‌ నొక్కినా ఆ ఓటేదో మనం అనుకున్న పార్టీకే పడేలా చేయగలమా?” అన్నాడు. దాంతో అగర్వాల్‌ ” అదంతా మా ట్రేడ్‌ సీక్రెట్‌. ఎలా చెపుతాననుకున్నావ్‌… అన్నాడు. అయితే అంతలోనే  ‘ చేయెచ్చు… అయితే దానికోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలి. ఈవీయం కింద వైపు ఓ బటన్‌ ఏర్పాటు చేస్తాం. ఆ బటనేదో నొక్కితే చాలు అనుకున్నట్టే చేయొచ్చు. అలాగే అదే బటన్‌ యింకోసారి నొక్కితే పద్ధతి మారిపోతుంది. ఈవీయమ్‌ మాములుగా పనిచేయ్యడం మొదలెడుతుంది” అన్నాడు. వెంకటేశం మరికొన్ని సూచనలు చేసి ఆ అడ్వాన్సేదో యిచ్చి బయటకొచ్చేశాడు. ఆ క్షణమే ‘ఆపరేషన్‌ ఈవీయం’ మొదలయింది.
                ………………………………                           ………………………………          ………………………..………
అక్కడో ముఖ్యమయిన సమావేశం జరుగుతోంది. మహరాణిగారయితే అధ్య్షస్థానంలో ఉన్నారు. ఆవిడతో పాటుగా యింకా పార్టీలో ముఖ్యలంతా ఉన్నారు. వాళ్ళందరి తో పాటుగా మహరాణిగారి పక్క కుర్చీలో వెంకటేశం కూర్చుని ఉన్నాడు….! యింతలో మహరాణి   ఓసారి అందరివంకా చూసి ” వచ్చే ఎలక్షన్స్‌లో మన రాష్ట్రంలో ఓ ట్లు వేసే బూత్‌లు దాదాపు పన్నెండు వేల దాకా ఉన్నాయి. అందుకే మనకి దాదాపు 24000 మంది కావాలి. ఒకో బూత్‌కీ కావలసింది యిద్దరు. అయితే యింకో ముఖ్యమైన విషయం ఏంటంటే… ఆ యిద్దరికీ ఆ బూత్‌లోనే ఓటు హక్కుండాలి” అంది. దాంతో అంతా ఆసక్తిగా చూశారు. యింతలో మహరాణి కొనసాగిస్తూ  ” అందులో ఒకరు తను ఓటేసే బూత్‌లో తన ఓటే మొదటిది కావాలి. దాని కోసం ఏ తెల్లవారుజామునో బూత్‌ దగ్గర క్యూలో నిలబడిపోవాలి. అలాగే రెండో వాడు ఆ బూత్‌లో  చివర్లో ఆఖరి ఓటు వేసేవాడు కావాలి. వాళ్ళిద్దరూ చేయవలసింది ఒకటే. ఉదయాన్నే  మొదటి ఓటు వేసినవాడు ఈవీయమ్‌ కింద స్పెషల్‌గా ఉన్న బటన్‌ నొక్కి బయటకు రావాలి. అలాగే సాయంత్రం ఆ బూత్‌లో ఆఖర్న ఓటేసే రెండోవాడు ఆ బటన్‌నే మళ్ళీ నొక్కాలి” అంటూ వివరించింది. అక్కడితో  సమావేశం ముగిసిం ది.
      ………………………………………….                                   …………………………………….                  ……………………….
యూపీలో ఎలక్షన్‌ రోజొచ్చింది. అన్ని చోట్లా ఉదయాన్నే కలెక్టర్‌ ప్రతినిధి ఉద్యోగి వచ్చి ఈవీయమ్‌లు బాగా పనిచేస్తున్నాయా లేదా అని నిర్ధారించుకున్నాడు. తర్వాత పోలింగ్‌ మొదలయింది. మహరాణి సూచించినట్లుగా ప్రతి బూత్‌లో యిద్దరూ ప్రారంభంలోనూ, చివర్లోను బటన్‌ నొక్కారు. సాయంత్రం పోలింగ్‌ పూర్తయ్యాక మళ్ళీ సంబంధిత అధికారులొచ్చి ఈవీయం  పనితీరు సక్రమంగా నే ఉందని నిర్ధారించుకున్నారు. మొత్తానికి ఈవీయంలలో ఏ బటన్‌ నొక్కినా ఆ ఓటేదో మహారాణి గారి పార్టీకి పడిపోయింది. యిక ఫలితాలొచ్చేసరికి అంతా అదిరిపోయారు. దానిక్కారణం ఆ రాష్ట్రంలో పోలయిన ఓట్లలో  99.8 శాతం మహారాణి గారి పార్టీకే పడ్డాయి. యిక సీట్లన్నీ మొ త్తంగా ఆ పార్టీ స్వీప్‌ చేసేసింది. యింకేముంది….మహారాణి గారు ఏనుగెకి ్క వచ్చి మరీ పీఠమెక్కేసిం ది . ఆనక వెంకటేశం పార్టీకి చీఫ్‌ అడ్వయిజర్‌గా ని యమించబడ్డారు.
                 ………………………..…..                    ………………………..………                                  ………………………..………..
” అది గురుగారూ నా కొచ్చిన కల.” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ” ఈ లెక్కన ప్రజల కోసం ఏం చేయనక్కరలేదు. ఏదో నీలాంటోడి తెలివితేటలతో చిన్న ప్రయోగం చేసి సీఎం అయిపోవచ్చన్నమాట” అన్నాడు చుట్టపొగ ఊదుతూ  ఆ మాటల్లో వేళాకోళానికి వెంకటేశం గతుక్కుమని ” అబ్బే అలా చేయమని కాదు గురూ గారు.” అన్నాడు. గిరీశ ం నవ్వేసి ” అది సర్లే గానీ…అసలు ఈ కలెందుకు వచ్చిందో తెలుసా? అన్నాడు. వెంకటేశం ఎందుకన్నట్లుగా చూశాడు. అప్పుడు గిరీశం ” యూపీలో మహారాణి గారి స్టేట్‌మెంట్‌ నీ మనసులో  దూరి యిలాంటి కలొచ్చుంటుంది. ఆవిడ ‘ ఆ యిదంతా మోసం. ఏ పార్టీకి ఓటేసినా అదేదో బిజెపికే వోట్లు పడేలాఈవీయంలు ఏర్పాటు చేశారు’ అంది. సరే… యిందోల మనకు పనికొచ్చే,మనం నేర్చుకోవలసిన పొలిటికల్‌ లెసన్‌ ఏంటంటావ్‌? ” అన్నాడు. దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ” రాజకీయాల్లో ఉండేవాళ్ళు అలవర్చుకోవలసింది హుందాతనం. మోడీ నోట్ల రద్దు విషయం చాలా పెద్ద రిస్క్‌ తీసుకోవడం జరిగింది. దేశ భవిష్యత్‌ బాగుండాలనే ఉద్ధేశ్యంతో తీసుకున్న ఆ నిర్ణయం విషయంలో తన రాజకీయ జీవితాన్నీ, పార్టీనీ ఫణంగా పెట్టేశాడు. మోడీ నిర్ణయాన్ని  ప్రజలు ఆమోదించారనడానికి సూచనే ఈ ఎన్నికల ఫలితాలు. అలాంటప్పుడు మహారాణిగారు  కూడా హుందాగా తమ పార్టీ ఓటమి ఒప్పుకుని మోడీని అభినందిస్తే ఎంత బాగుండేదని. అలా చేసుంటేనా…. ఎలక్షన్లో ఓడిపోయినా ప్రజల మనసులు గెలుచుకునేది” అన్నాడు.