సెల్ఫ్‌ గోల్స్‌

మనస్సాక్షి  – 1018
కలకత్తా… సీఎం ఆఫీసు ఆరోజు హడా విడిగా ఉంది. దానిక్కారణం ఢిల్లీ నుంచి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ఫ్లయిట్‌లో అర్జంటుగా వస్తుండడమే. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జైట్లీ రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యింతకీ ఆ సమావేశం ఎందుకనేది అంతా ఆసక్తిగా మారింది. యింకో గంట తర్వాత ఆ సమావేశమేదో మొదల యింది. కొంతసేపు మామూలు మాటల యిన తర్వాత జైట్లీ ”మమతాజీ… ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులుమీకు తెలుసు. ఈ సమయంలో ప్రభుత్వానికి మీలాంటి వాళ్ళందరి సహకారం చాలా అవసరం” అన్నాడు. మమత తలూపి ”నేనేదో స్టేట్‌మెంట్‌ యిచ్చానంటే దాని వెనుకో అర్థం ఉంటుంది. మొన్న తమిళనాడులో హఠాత్తుగా సీఎస్‌ మీద ఐ.టి., రెయిడ్‌ ఎందుకు జరిపించినట్టు? అసలే ఓ పక్క తమ సీఎంని కోల్పోయి ప్రజలంతా ఎంతో బాధలో ఉన్నారు. అలాంటిదిప్పుడు సీఎస్‌మీద ఐటి దాడులు చేయించేస్తారా? అసలు సీఎస్‌ అంటే ఎవరు? ఓ రకంగా సీఎం కంటే ఎక్కువ. పేరుకి సీఎం పరిపాలన చేసినా వెనకాల ఉండి నడిపించేదంతా  సీఎస్సే కదా.  అలాంటి సీఎస్‌ మీద యిలాంటి ఆకస్మిక దాడులు చేయించడం ఏంటని?” అంది. దాంతో అరుణ్‌ జైట్లీ యిబ్బందిపడి ”అబ్బే… అందులో గవర్నమెంట్‌ పాత్ర ఏవీ లేదు. ఐ.టి. డిపార్ట్‌మెంట్‌ తన పని తను చేసుకుపోతుందంతే” అన్నాడు. అయితే  ఆ మాటలేవీ మమతకి రుచించినట్టుగా లేదు. మొహంలో అసహనం తొంగిచూసింది. దాంతో జైట్లీ ”అయితే ఓ పనిచేద్దాం మమతాజీ… ఆ డిపార్ట్‌ మెంట్లో రెండు రీజియన్‌లకి మీరే చీఫ్‌ అడ్వయిజర్‌గా ఉండండి. వాళ్ళు చేసే పనులన్నీ మీ మార్గదర్శకంలోనే నడుస్తాయి” అన్నాడు.  దానికి మమత మమతతో తలూపింది. అక్కడితో సమావేశం ముగిసింది. ఆరోజు నుంచీ రెండు రీజియన్లలో ఐ.టి.రెయిడ్‌లన్నీ మమత సూచించిన విధానాల్లోనే జరగడం మొదలయింది….
—-
సీఎం కార్యాలయం… సీఎం బాబు ఫైల్సేవో చూస్తుండగా యిన్‌ కంటాక్స్‌ ఛీఫ్‌ కమీషనర్‌ వెంకటేశం రావడం జరిగింది. సదరు వెంకటేశం సివిల్స్‌ రాసి  ఐఆర్‌ఎస్‌ ద్వారా డిపార్ట్‌మెంట్‌లో కొచ్చి అంచెలంచెలుగా చిన్న వయసులోనే ఈ స్థాయికి ఎదిగినవాడు. మామూలుగా అయితే అతగాడు యిప్పుడిలా సీఎంగారి దగ్గర కొచ్చే పనిలేదు. అయితే ఈమధ్యే డిపార్ట్‌మెంట్లో వచ్చిన మార్పు… అదే… తన రీజియన్‌ అంతా మమతాబెనర్జీ సూచన లతో నడిచే పరిస్థితి రావడంతో యిప్పుడు చేయబోయే ఓ రెయి డింగ్‌ నిమిత్తం మాట్లాడడానికి యిక్కడికి రావలసి వచ్చింది. వెంకటేశం విష్‌ చేసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తను వచ్చిన పని చెప్పాడు. ”సర్‌… మీ ఆత్మబంధువు అయిన సురేంద్ర గారి మీద రెయిడ్‌ చేద్దామనుకుంటున్నాం. అందుకే ముందుగా మీకో మాట చెబుదామని” అన్నాడు. అంతలోనే మళ్ళీ ”మీ వ్యవహారాలన్నీ ఆయనే చూస్తాడని తెలుసు. ఆయన మీద రెయిడింగదీ చేస్తే ఒకట్రెండు రోజులు మీ పని పాడవుతుంది కదా. అందుకే ఎప్పుడా రెయిడింగ్‌ పెట్టుకోవాలో చెబితే అప్పుడే పెట్టుకుంటాం. నెలా ఖరుకి పెట్టుకోవచ్చా?” అన్నాడు. బాబు ఏవో లెక్కలేసుకుని ”యింకా రెండువారాలుందా…సరే…” అన్నాడు. దాంతో వెంక టేశం శెలవు తీసుకుని అక్కడ్నుంచి బయటపడ్డాడు. అక్కడ్నుంచి నేరుగా సురేంద్ర దగ్గరకెళ్ళాడు. తానొచ్చిన పనిచెప్పి ”సార్‌… మీమీద ఆకస్మిక దాడి…అదే… ఐ.టి.రెయిడ్‌ చేద్దామను కుంటున్నాం. సీఎం సార్‌కి కూడా చెప్పాం… నెలాఖరుకి” అన్నాడు. దాంతో సురేంద్ర విసుక్కుని ”ఏం వేళాకోళంగా ఉందా? రెండు వారాల టైం ఎలా సరిపోద్దంట? నెలన్నా కావాలి. అందుకే పండగల తర్వాత జనవరి 20న పెట్టుకోండి. ఆ… యింకో విషయం ఆరోజు తెల్లవారుజామునే వచ్చి నిద్రలేపొద్దు. తొమ్మిదిన్నరా పదింటికొస్తే టిఫిన్లవీ చేసేసి ఉంటాం” అన్నాడు.  ఈసారి వెంకటేశం నసుగుతున్నట్టుగా ”సీఎం గారికి నెలాఖరునే అని చెప్పేశాం. ఎలాగా?” అన్నాడు. దాంతో సురేంద్ర నవ్వేసి ”అది నేను చూసుకుంటా” అంటూ ఫోన్‌ చేసి ”సార్‌… నాకు సర్ధుకో డానికి నెలన్నా కావాలి. అందుకే ఈ రెయిడిం గేదో జనవరి 20న పెట్టుకోమంటున్నా” అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దాంతో వెంకటేశం సంతృప్తిగా వెనుదిరిగాడు. అలాగే జనవరి 20వ తేదీన వెంకటేశం టీం ఉదయం తొమ్మిదిన్నరకి సురేంద్ర యింటికి రెయి డింగ్‌కి వెళ్ళిపోయింది. ఆ ముందురోజు కూడా వెంకటేశం ఎందు కయినా మంచిదని సురేంద్రకి ఈ రెయిడింగ్‌ విషయం గుర్తు చేశాడు. ఆ రెయిడింగ్‌ తంతేదో రెండుగంటలపాటు సాగింది. ఏవీ దొరకలేదు. దాంతో ఆఫీసర్‌ ”సారీ సర్‌… మాకేదో రాంగ్‌ యిన్ఫర్‌మేషనొచ్చింది అంటూ సురేంద్రకి సారీ చెప్పేసి తన వాళ్ళతో బయటికొచ్చేశాడు.
—–
”గురూగారూ… అదీ నాకొచ్చిన కల. చదవేస్తే  ఉన్నమతిపోయిం దన్నట్టుగా బొత్తిగా యిలాంటి కలొచ్చిందేంటంటారు? మెడ కాయ మీద తలకాయ ఉన్న వాళ్ళెవరయినా యిలా రెయిడింగ్‌ చేస్తారా అని…! అసలు ఐ.టి. రెయిడింగంటే ఎంత ప్రొసీజర్‌ ఉంటుందని.  ఎవరి మీద రెయిడింగ్‌ జరిగేదీ చివరి నిమిషం దాకా రెయిడ్‌ చేసేవాళ్ళకి కూడా తెలీదు. సీల్డ్‌ కవర్‌లలో పేర్లు రాసి మూడు అంచెలుగా ఆ కవర్లు అందజేయబడతాయి. ఆ రెయి డింగ్‌ చేసే టీమ్‌లో వాళ్ళకి సైతం చివరి నిమిషం దాకా తాము ఎవరి మీదకి రెయిడింగ్‌కి వెళ్ళేదీ తెలీదు కదా” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”నీ తెలివితేటల కొచ్చిన లోటేంలేదోయ్‌. అసలిదంతా బాధ్యతారాహిత్యానికి సంబంధించిన కలనుకో” అన్నాడు. వెంకటేశానికయితే ఏం అర్థం కాలేదు. యింతలో గిరీశం ”అదేంటో నువ్వే చెప్పాలి. అదే ఈ వారం ప్రశ్ననుకో” అన్నాడు చుట్ట అంటిస్తూ. దాంతో వెంకటేశం ఆలోచనలోపడ్డాడు. ఆలోచించి ఆలోచించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”ఒక సామాన్యుడు మాట్లాడే మాటకి అంతగా ప్రాముఖ్యత ఉండదు. దానిక్కారణం అతడికున్న పరిధి పరిజ్ఞానం చాలా తక్కువ. ప్రభావిత శక్తీ తక్కువే. అయితే  స్థాయి పెరిగే కొద్దీ వ్యక్తులు మాట్లాడే ప్రతీమాటా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విషయానికి వస్తే… బెంగాల్‌ సీఎం మమత ఎంతో బాధ్యతాయుతమయిన పోస్ట్‌లో ఉన్న వ్యక్తి. అలాంటి మమత ‘తమిళనాడు సిఎస్‌ మీద ఆకస్మిక ఐ.టి. రెయిడ్‌లు చేయడం తప్పనీ, అయినా అలా చేయవలసి వస్తే ముందే తెలియజేసి మరీ దాడులు చేయాలనీ శెలవిచ్చింది. ఆవిడని అనుసరిస్తే నీకలలోలాంటి వ్యవహారాలే జరుగుతాయి. అలాగే రాహుల్‌ గాంధీని తీసుకున్నా ‘మోదీ నలభై కోట్లు లంచం తీసుకున్నారు’ అని ఓ ప్రకటన చేయడం జరిగింది. అయితే మోదీ తలుచు కుంటే వేలకోట్లు సంపాదించడం ఓ లెక్కా… ప్రజలకి ఏదో సేవ చేయాలన్న తపనతో సర్వం వదులుకుని వచ్చిన రాజర్షి మోదీని అలా నిందించడం ఎంతవరకూ సబబని? చివరికి అది కాంగ్రెస్‌కి సెల్ఫ్‌గోల్‌ అయింది. యిలాంటి ప్రకటనలు ఆయా నాయకుల పొలిటికల్‌ మైలేజ్‌ని పెంచవచ్చు. కానీ తమ వ్యక్తిత్వాన్నీ, గౌర వాన్నీ పోగొడతాయి. అందుకే బాధ్యతాయుతమయిన పోస్టుల్లో ఉన్నవాళ్ళు బాధ్యతారహిత్యమయిన స్టేట్‌మెంట్లు యివ్వకూడదు” అంటూ తేల్చాడు. వెంకటేశం చెప్పిందేదో బాధ్యతాయుతంగా ఉందన్నట్టుగా గిరీశం చుట్ట ఓసారి గుప్పుగుప్పుమనిపించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

నల్ల పరుగు

గిరీశం బొత్తిగా తీరిగ్గా ఉన్నాడు. ఆ మాటకొస్తే గిరీశం ఎప్పుడూ తీరికే. ఏదో ఆ వెంకటేశంతో కథలూ, ఊళ్ళో జనాలతో కబుర్లూ, నోట్లో చుట్టా… యిదీ లోకం. యితరత్రా ఏ వ్యవహారాల జోలికీ పోడు. టెన్షన్‌లూ పెట్టుకోడు. ఆరోజు కూడా అలాగే నోట్లో చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ యింటి అరుగుమీద కూర్చుని ఉండగా వెంకటేశం దిగబడ్డాడు. అయితే వెంకటేశం రావడం రావడంతోనే కొంత వేదాంత ధోరణిలో కనిపించాడు. పైగా ‘ఏ నిమిషాన ఏమి జరుగునో’ అని పాత పాటేదో పాడు కుంటూ మరీ వస్తున్నాడు. దాంతో గిరీశం కంగారుపడి ”ఏవివాయ్‌ వెంకటేశం… కొంపదీసి పెళ్ళీ గిళ్ళీ గానీ కుదిరిందా?” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం నిట్టూర్చి ”ఆ… యిప్పుడు అదొక్కటే తక్కువ ” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”యింతకీ నీ బాధేంటో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఏం లేదు గురూగారూ… రాత్రో కలొచ్చిందిలెండి. 2000 రూపాయల నోట్లు  రద్దు చేసేశా రంట. దాంతో నేను కష్టపడి మార్చుకున్న  2000 నోట్ల కట్టలు పట్టుకుని పరుగులెట్టానంట…” అన్నాడు.  దాంతో గిరీశం నవ్వేసి ”సరే… ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగించేద్దాం. నీ కలలో వచ్చిన నీ పాత్రనే వివ్లేషించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి చిన్న ఊహలాంటిది చెప్పసాగాడు…
అఅఅఅ
చాలా ఏళ్ళనాటి మాట… అప్పట్లో గంగలకుర్రు సంస్థానాన్ని వెంకటేశం జమీందారు పాలించడం జరిగింది. యిక వెంకటేశం జమీందారయితే అటు మంచి పాలనా దక్షుడే కాదు. యిటు దాన కర్ణుడు కూడా. అసలే సంస్థానానికి కోనసీమలోనూ, యింకా మెట్ట ప్రాంతంలోనూ వేలాదిగా ఎకరాల భూమి ఉంది. దాంతో ప్రతిభావంతులు ఎవరొచ్చినా వారి ప్రతిభకి తగ్గట్టుగా నజ రానాలిచ్చేవాడు. అలాంటి జమీందారు గారి దగ్గరికి ఆరోజు కోటి లింగం రావడం జరిగింది.  సదరు కోటిలింగం గణితశాస్త్రంలో నిష్ణాతుడు. లెక్కల్లో తన ప్రావీణ్యం చూపించేసరికి అంతా నోరెళ్ళ బెట్టారు. యిరవై అంకెల సంఖ్యని యింకో యిరవై అంకెల సంఖ్యతో గుణిస్తే ఎంతొస్తుందో సైతం క్షణాల్లో అవలీలగా చెప్పేస్తు న్నాడు. దాంతో వెంకటేశం జమీందారు గారయితే చాలా ముచ్చట పడిపోయారు. ”శభాష్‌ పండితోత్తమా… నీ మేధస్సు అపారం. నీకేం కావాలా కోరుకో. మణులా… మాణిక్యాలా… భూమి కావాలా?” అనడిగారు. దాంతో కోటిలింగం నసుగుతూ  ”ఏదో కొద్దిగా భూమి యిప్పించండి జమీందారుగారూ..” అన్నాడు. దాంతో వెంకటేశం జమీందారుగారు ”కొంచెం కాదు. ఎక్కువే తీసుకో. ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్త మయం వరకు తిరిగినంత మేరా భూమిని తీసుకో” అన్నారు. జమీందారు అలా అనేసరికి కోటిలింగం చాలా ఆనందపడ్డాడు. పైగా ఆశ కూడా పెరిగిపోయింది. అలాగేనని తలూపి శెలవు తీసుకున్నాడు.
అఅఅఅ
మర్నాడు సూర్యోదయంతోనే కోటిలింగం భూమి వేటలో పడ్డాడు.  తిరిగినంతమేరా భూమిని యిస్తామని జమీందారుగారు అనడంతో కోటిలింగానికి ఆశ పెరిగిపోయింది. దాంతో అలా సూర్యుడు ఉదయించాడో లేదో యిలా పరుగందుకున్నాడు. వెనుకే జమీందారుగారి సంస్థానంలో ఉండే సేవకులిద్దరు ఆ పరిగెత్తిన మేరా ముగ్గువేస్తూ గుర్రాలమీద అనుసరిస్తున్నారు. తొందర్లోనే కోటిలింగం అలిసిపోయాడు. అయినా పరుగాపలేదు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నమయింది. ఆపాటికి సూర్యుడు నడినెత్తిమీదకొచ్చేశాడు. ఈలోగా ఆ సేవకుల్లో కన్నప్ప ”బాబుగారూ… చాలా దూరం వచ్చేశాం. మళ్ళీ బయల్దేరిన చోటుకి చేరుకోవాలి కదా” అన్నాడు. అయితే దాన్నేవీ కోటిలింగం పట్టించుకోలేదు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం మూడు కావస్తుండగా కన్పప్ప మళ్ళీ హెచ్చరించాడు. దాంతో ఏవనుకున్నాడో కోటిలింగం ఆ పరుగాపి వెనుదిరిగాడు. అయితే అప్పటికే బాగా అలిసిపోయిన కోటిలింగం పరిగెత్తలేకపోయాడు. పైగా రొప్పు వస్తోంది. అయినా యింకోపక్క సూర్యుడు దిగిపోతుంటే కంగారెక్కువయిపోయింది. సూర్యుడు అస్తమించే లోగా గమ్యం చేర గలనా లేదా అన్న అనుమానం వచ్చేసింది. దాంతో మళ్ళీ పరుగు మొదలెట్టాడు. మొత్తా నికి సూర్యాస్త మయం కావస్తుండగా  బయలుదేరిన చోటుకి కనుచూపు మేరలోకి వచ్చేశాడు. అయితే అప్పుడు జరిగిందది. అలా పరిగెడుతున్న కోటిలింగం హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. కన్నప్ప దగ్గరకొచ్చి చూసేసరికి కోటిలింగం అప్పటికే మరణించి ఉన్నాడు. దాంతో కన్నప్ప గబగబా జమీందారు గారి దగ్గరకెళ్ళి ”ఆ కోటి లింగం బయల్దేరిన చోటుకి రాలేక పోయాడు” అంటూ జరిగింది చెప్పాడు. దాంతో జమీందారుగారు నిట్టూరుస్తూ ”చని పోయినవాడికి యింక భూమితో పనే ముందిలే… అయినా తనకి అవసరమయిన ఆరడుగులు సాధించుకున్నాడు కదా. ఆ ఆరడుగుల నేలలో అతనిని సమాధి చేసెయ్యండి” అన్నారు.
అఅఅఅ
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”అయితే చిన్న పిల్లల కధ చెప్పి సరిపెట్టేసేవన్నమాట” అన్నాడు. దాంతో వెంకటేశం ”చిన్న పిల్లల కధేంటి గురూగారూ.. అందులో అంతా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఉంది” అన్నాడు. గిరీశం తలూపి ”సరే…అదేదో కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”నా కథలో కోటిలింగం ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు. డబ్బు సంపాదన కోసం నిరంతరాయంగా అడ్డూ అదుపూ లేకుండా వెంపర్లాడే వాళ్ళందరూ అతడి ప్రతినిధులే. డబ్బు సంపాదించడం అవ సరమే. అయితే అదేదో మన అవసరాలు తీర్చుకోడానికో, కొంచెం విలాసంగా ఉండడానికో, యింకా భవిష్యత్‌ భద్రత కోసమో ఉండాలి. అంతేగానీ డబ్బే పరమావధి అన్నట్టుగా వందల తరాలు తిన్నా తరగనంత అక్రమంగా సంపాదించాలనుకోవడం సరియైన ఆలోచన కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పేదవాడు ప్రశాంతంగా నిద్రపో గలుగుతాడు. అదే వందల కోట్లో, వేల కోట్లో ఉన్న కుబేరుడు హాయిగా నిద్రపోలేడు. అనుక్షణం తన డబ్బుని ఎలా పరి రక్షించు కోవాలా అన్న ఆందోళనలో ఉంటాడు. దాంతో బీపీ, షుగరూ, హార్ట్‌ ఎటాక్‌ల్లాంటి రోగాలు బోనస్‌గా వచ్చి చేరతాయి. పోనీ యింత కష్టపడి సంపాదించినా డబ్బు, బంగారం, యితరత్రా ఆస్తుల్ని  తనతో చనిపోయినప్పుడు పట్టుకుపోతాడా అంటే ఏంలేదు. అన్నీ యిక్కడే వదిలేసి వెళ్ళాల్సిందే. తర్వాత అవి ఎవరెవరి పరమవుతాయో ఎవరికీ తెలీదు. అంతమాత్రానికే జీవించడంలో ఎన్నో ఆనందాల్ని కోల్పోయి యిన్ని టెన్షన్‌లూ, వెంపర్లాటలూ కొని తెచ్చుకోవడం అవసరమా? అంతెందుకూ… ఈ మధ్యే వెళ్ళి పోయిన ద్రవిడ మహారాణిని తీసుకుంటే  ఎన్నో వేలకోట్లు వెన కేయడం, ఆనక విచారణ సమయంలో జైలుకెళ్ళడం, తర్వా తెప్పుడో నిర్దోషిగా ప్రకటించబడి బయటికి రావడం జరిగింది. యిక ఆవిడ చివరి దశ ఎంత దారుణంగా గడిచిందని… అన్ని వేల కోట్లూ ఆవిడని కాపాడగలిగాయా? తన కూడా తీసుకెళ్ళ గలిగిందా? యిప్పుడా సంపదంతా ఎవరెవరికో వెళ్ళిపోతోంది. అంత సంపాదించడానికి సదరు మహారాణి గారు ఎంత చెడ్డ పేరు మాటగట్టుకున్నారని… అయితే అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే… పదికోట్లున్నా, లక్ష కోట్లున్నా తినేతిండీ, ఉండే యిల్లూ, జీవిత విధానం… వీటిలో పెద్దగా వ్యత్యాసం వచ్చెయ్యదు. అయినా యింకా యింకా సంపాదించాలనే వెంప ర్లాట ఎందుకని?” అంటూ ముగించాడు. అంతా విన్న  గిరీశం ”ఆ… బాగా చెప్పావోయ్‌… యిదేదో అందరూ అర్థం చేసుకుని మోడీగారు తలపెట్టిన మహా యజ్ఞానికి సహకరిస్తే  బాగుం టుంది. అది భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడడానికి ఎంతో ఉపకరి స్తుంది. ఆ…యింకో విషయమోయ్‌… నీ కలలోలాగ 2000 రూపాయల నోట్ల రద్దేవీ యిప్పట్లో ఉండదు. యింకా అప్పటి నోట్ల రద్దు హడావిడి సద్దుమణగకముందే ప్రభుత్వం అలాంటి సాహసం చేయదు” అంటూ ముక్తాయించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

జన ధనలక్ష్మి

గిరీశానికి ఉన్నట్టుండి  తన సొంతూరి మీద ప్రేమ ఎక్కువయిపోయింది. దాంతో ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రిందటే వదిలేసిన గంగలకుర్రుకి మకాం మార్చేశాడు. అంతేనా… అక్కడ పాతబడి పోయిన యింటిని బాగు చేయించి అందులో మకాం పెట్టేశాడు. అక్కడితో ఆగలేదు. ఊళ్ళో ఉన్న ఓ నలభైమంది పేద రైతుల కుటుంబాల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. రోజూ అలవాటయిన వాకింగేదో ఆ నలభై యిళ్ళ చుట్టూ చేస్తున్నాడు. అలాగని  ఏ  మహాత్ముడి ఆత్మో గిరీశంలో ఆవహించిందనుకుంటే పొర బాటే. తన దగ్గర ఎప్పట్నుంచో ఉండిపోయిన ఎనభై లక్షలూ ఆ నలభైమంది జన్‌ధన్‌ ఎకౌంట్లలో వేసేశాడాయె. ఈలోగా మోడీ గారు ఈ వ్యవహారాలేవో కనిపెట్టిన ట్టుఆ నెలకి పదివేలకి మించి డ్రా చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. దాంతో గిరీశం యిక చేసేదేంలేక ఆ నలభైమందినీ జాగ్రత్తగా చూసుకునే పన్లో పడ్డాడు. యిదంతా నాణానికి ఒకవైపు.
 
————–
 
నాణేనికి యింకోవైపు… హఠాత్తుగా వెంకటేశానికి ప్రాధాన్యత పెరిగిపోయింది. అర్జంటుగా రమ్మని జిల్లా కలెక్టర్‌ నుంచి కబు రొచ్చింది.  దాంతో విషయం ఏముంటుందా అనుకుంటూ వెంక టేశం వెళ్ళాడు. వెంకటేశాన్ని కలెక్టర్‌ సాదరంగా ఆహ్వానించి ”ఈ మధ్య పత్రికల్లో, నెట్‌లో నీ ఆర్టికల్స్‌ చూస్తున్నా. సొసైటీ పట్ల నీకున్న తపనని గమనించాను. అందుకే  నిన్నీ పనికి ఎన్నుకుని పిలిచాను” అన్నాడు. వెంకటేశం అదేంట న్నట్టు ఆసక్తిగా చూశాడు. అప్పుడు కలెక్టర్‌ చెప్పడం మొదలెట్టాడు. ”నీకు తెలిసే  ఉంటుంది.  ఈ మధ్య వేల కోట్లలో బ్లాక్‌మనీ జనధన్‌ అకౌంట్లలో చేరింది. ప్రభుత్వం ఉద్దేశ్యమయితే ఆ అకౌంట్లలో డబ్బంతా ఆ రైతులకే చెందాలని. దీని కోసం క్రియేటివ్‌గా ఏదన్నా చేయాలి. దాని కోసం క్రియేటివ్‌గా ఏదన్నా చేయాలి. దాని కోసం  దేశం నలుమూలల నుంచీ నాలుగు పైలట్‌ ప్రాజెక్టులు నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి చేపట్టమన్నారు. అస్సాం, మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లలో ఒక్కో జిల్లాతోపాటు మన తూర్పుగోదావరినీ ఎన్ను కున్నారు. ఆ పైలట్‌ ప్రాజెక్ట్‌లు సక్సెస్‌ కావ టాన్ని బట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. యిదంతా మోడీ గారి నుంచి అరుణ్‌ జైట్లీకి, అరుణ్‌ జైట్లీ నుంచి నాకూ వచ్చిన ఆర్డర్‌. నేను నీకు యిస్తున్నాను. ఈ విష యంలో  నువ్వే నిర్ణయం తీసుకున్నా ఫరవాలేదు” అన్నాడు. వెంకటేశం తలూపి మరి కొన్ని వివరాలు తీసుకుని బయటికి నడిచాడు.
 
————
 
ఆ మర్నాడు పొద్దున్నే వెంకటేశం రంగంలోకి దూకాడు. ముందుగా గంగలకుర్రు వెళ్ళిపోయాడు. ఆటో ఒకటి ఏర్పాటు చేసు కున్నాడు. తనూ ఆటోలో ఎక్కి మైక్‌లో ‘ఊళ్ళో జన్‌ధన్‌ ఎకౌంట్లు ఉన్న వారంతా సాయంత్రం గుడి దగ్గరికి రావలసిందిగా చెబు తున్నాడు. ఆ ప్రకటన మధ్యలో ‘ఈ ఖాతా మనదిరో… అందులో డబ్బు మనదిరో… ఆ నల్లదొర ఎవడురో… ఆడి పీకు డేందిరో…’ అన్న పాటేదో ఉద్వేగంగా విన్పిస్తోంది. మొత్తానికి  ఆరోజు సాయంత్రం అయిదుగంటలకి ఊళ్ళో జనధన్‌ ఎకౌం ట్లున్న 350 మంది రైతులు గుడి దగ్గర చేరారు. ”నేను ప్రధాని నుంచి అరుణ్‌జైట్లీకి, ఆయ న్నుంచి మన జిల్లా కలెక్టర్‌ గారికీ, అక్కడ్నుంచి నాకూ ఆదేశాలొచ్చాయి అన్నాడు. దాంతో అంతా భయభక్తులతో చూశారు. యింతలో వెంకటేశం ”యిప్పుడు చెప్పండి. మీ ఎకౌంట్లలో ఉన్న డబ్బు ఎవరిది?” అన్నాడు. దాంతో వారిలో కొందరు ”అంతా గిరీశం బాబు గారిది” అన్నారు. అంత లోనే వారిలో వారు  ఏవను కున్నారో ”అబ్బే… అదంతా మా డబ్బే నండీ” అన్నారు. దాంతో వెంకటేశం ”అదే నాకు కావల సింది. అంటే ఈ డబ్బంతా మీదే. యిప్పుడు నేనొచ్చింది మీకు మంచి చేయ డానికే” అంటూ ఆపాడు. దాంతో అంతా ఆసక్తిగా చూశారు. యింతలో వెంకటేశం ”మీలో యిల్లు కావలసినవాళ్ళు ఎంతమంది?” అని అడి గాడు.  దాంతో వారిలో ఓ 60 మంది చేతులెత్తారు. అప్పుడు వెంకటేశం ”మీ అకౌంట్లలో రెండేసి లక్షలు న్నాయి. ప్రభుత్వం ఆ మొత్తానికి యింకో అంత చేరు స్తుంది. యిప్పుడా మొత్తం నాలుగు లక్షలతో ప్రభుత్వమే  మీకు యిళ్ళు కట్టించే ఏర్పాటు చేస్తుంది. అయితే ఆ కట్టిన యిల్లేదో ఓ 20 సంవత్సరాల వరకూ ఎవరికీ అమ్మే వీలుండదు” అన్నాడు. వెంకటేశం చెప్పిందానికి ఆమోదయోగ్యంగా వాళ్ళంతా చప్పట్లు కొట్టేశారు. తర్వాత వెంకటేశం మిగతావాళ్ళ వంక తిరిగి ”మీకు యిన్సూరెన్స్‌ పాలసీ ఒకటి యిద్దామనుకుం టున్నాం. మీ అకౌంట్‌లోని రెండు లక్షలకీ మరికొంత కలిపి ఒక్కసారే కట్టేస్తాం. ఓ పదిహేనేళ్ళ తర్వాత మీ పిల్లలు పెద్దవాళ్ళయ్యే నాటికి వాళ్ళ చేతికో పాతిక లక్షలు ఒక్కసారే వస్తుంది. ఈలోగా దుర దృష్టవశాత్తూ మీకేవయినా జరిగినా మీ కుటుంబానికి చాలా పెద్ద  మొత్తం అందుతుంది” అన్నాడు. యిది నచ్చి యింకో నూట యాభై మంది చేతులెత్తారు. వెంకటేశం తర్వాత మిగతావాళ్ళ వంక తిరిగి ”ఈ చుట్టుపక్కల ఊళ్ళలో బియ్యం, కిరాణా, కూర గాయలు… యిలా ఏద యినా, వ్యాపారం పెట్టాలనుకుంటే మీ అకౌంట్లలో రెండులక్షలకీ  యింకో అంత కలిపి ఆ ఏర్పాట్లేదో మేం చేయిస్తాం” అన్నాడు. దానికి మిగతా అందరూ తమ అంగీ కారం తెలిపారు. ఆ తర్వాత వెంకటేశం కావలసిన ఏర్పాట్లన్నీ చేయించేశాడు. అవసరమయిన డాక్యుమెంట్లు తయారు చేయడం. సంతకాలు తీసుకోవడం జరిగిపోయింది. ఆ సాయంత్రమే వెంకటేశం  వెళ్ళి అది చూసి కలెక్టరయితే అదిరి పోయి, వెంకటేశాన్ని అభినందించడం జరిగింది. అంతేకాదు. ఈ ప్లాన్‌ని అమలు చేయడానికి మండలాల వారీగా అధికారు లందరికీ ఆదేశాలు పంపించాడు. యింకా కేంద్రానికి కూడా ఆ రిపోర్టు పంపించాడు. యింకేముంది… యిదేదో పై స్థాయిలో కూడా పిచ్చపిచ్చగా నచ్చెయ్యడంతో దేశవ్యాప్తంగా అమలుకు  క్లియరెన్స్‌ యిచ్చేశారు. యిక ఆ క్షణం నుంచీ జనధన్‌ అకౌంట్లు ధన్‌ధన్‌ మంటూ ఖాళీ అయిపోవడం, అదేదో ఆ అకౌంటు హోల్డర్ల సౌభా గ్యంగా మారడం జరిగింది. గిరీశం సమా చాలా మంది కుబేరులను హాస్పిటల్‌కి మోసుకుపోవడం జరిగింది.
 
————
 
”అది గురూగారూ… నాకొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”ఆ… కలయితే బాగుందోయ్‌… అయితే నన్ను విలన్‌ని చేయడమే బాలేదు” అన్నాడు. చుట్ట అంటిస్తూ. ”దాంతో వెంకటేశం ”విలనంటూ ఎవరూ ఉండరు గురూ గారూ.. పరిస్థితుల్ని బట్టి అలా నడుచుకుంటూరంతే. మోడీగారు చేసేది అలాంటివాళ్ళని కొం,చెం దారిలో పెట్టే  ప్రయత్నమే అన్నాడు. గిరీశం తలూపాడు.
 
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి  

స్వచ్చందమే సుందరం

మనస్సాక్షి  – 1015
తెల్లగా తెల్లారిపోయింది. గిరీశం గారింటికి తాళం వేసుంది. వెంకటేశం మాత్రం యింటరుగుమీద కూర్చుని పాత పాటేదో పాడుకుంటున్నాడు. ఈలోగా సైకిలు తొక్కుకుంటూ అబ్బులు అక్క డికి రావడం జరిగింది. గిరీశం గారింటికి తాళం వేసుండడం చూసి కొంచెం నిరాశపడ్డాడు. అంత లోనే అరుగుమీదున్న వెంకటేశం కనపడేసరికి ”నమస్కారం బాబయ్యా… పెద్దబాబు గారు లేరా?” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ”యిందాక నేనొచ్చేసరికే లేరు. వాకింగ్‌కి వెళ్ళి నట్టున్నారు” అన్నాడు. దాంతో అబ్బులు ”మరేం ఫర్వాలేదు బాబయ్యా… చిన్న పని మీదొచ్చాను. మీరయినా సరిపోతారు” అన్నాడు. వెంకటేశం ఏంటన్నట్టుగా చూశాడు. ఈలోగా అబ్బులు అరుగుమీద చతికిలబడుతూ ”ఏం లేదు బాబయ్యా… నేనేదో చిన్నపాటి యాపారం చేసుకుంటుంటా. ఎప్పట్నుంచో ఎనకేసు కున్న డబ్బులు ఓ పదిలక్షల దాకా ఉంటాయి. అయ్యన్నీ అయి దొందలూ, వెయ్యి నోట్లే. గవురుమెంటోడు ఆటన్నిటినీ రద్దు చేసేత్తాడండి. ఏం చేయాలో పాలుపోక సలహా అడుగుదామని వచ్చా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఓస్‌ అంతేనా…ఆ పది లక్షలూ ఉన్నాయని గవర్నమెంటుకి తెలియజెయ్యడమే. దాంతో సగం వాళ్ళు తీసేసుకుని మిగతా అయిదు లక్షల్లో ఓ రెండున్నర లక్షలు నాలుగేళ్ళ తర్వాత యిస్తారు. ఓ రెండున్నర లక్షలు వెంటనే నీకిచ్చేస్తారు. వాటిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకోవచ్చు” అన్నాడు. దాంతో అబ్బులు దిగాలుగా ”అంటే నాలుగో వంతే చేతికి వస్తుందన్నమాట” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవును. యిప్పుడు నాలుగోవంతు చేతికిచ్చినా యింకో నాలుగేళ్ళ తర్వాత యింకో నాలుగో వంతు వస్తుంది కదా” అన్నాడు. అబ్బులు తలూపి అసంతృప్తిగానే వెనుదిరిగాడు.
అఅఅఅ
మర్నాడు మధ్యాహ్నం… ఎవరో తలుపులు కొట్టేసరికి గిరీశం వెళ్ళి తలుపులు తెరిచాడు. ఎదురుగా అబ్బులు. అయితే మనిషే కొంచెం దిగాలుగా ఉన్నాడు. దాంతో అబ్బులు ”నాకో సమస్యొ చ్చింది బాబయ్యా.. ఎప్పట్నుంచో పోగేసుకుంటున్న పది లచ్చల డబ్బూ పనికి రాకుండా పోద్దంట. నిన్నొత్తే మీ బామ్మర్ది గారు ఏదో సలహా యిచ్చేరు. అలా చేత్తే నా చేతికొచ్చేదేం ఉండదు ఎంత యినా మీలెక్క ఏరు కదా. అందుకే మీతో మాట్లాడదావని వచ్చా” అన్నాడు. దాంతో గిరీశం ఓసారి చుట్ట గుప్పుగుప్పుమనిపించి ”ఎంతయినా నాతో మాట్లాడ్డవే ఎడ్యుకేషన్‌ని అంతా అంటారు. నీకు బ్రహ్మాండమయిన ఉపాయం నేను చెబతా. అలా కూర్చో” అన్నాడు. ఆపాటికి అబ్బులు మొహంలో వెలుగొచ్చింది. అక్కడే హాల్లో కింద చతికిలబడ్డాడు. అప్పుడు గిరీశం ఏం చేయాలో చెప్పడం మొదలెట్టాడు. ”ఈ పదిలక్షలూ పట్టుకెళ్ళి నీకు బాగా నమ్మకమున్న రైతుల ఖాతాల్లో తలో లక్షా వేయించెయ్‌. తర్వాత వారానికింతని డ్రా చేయించి తీసేసుకో. యిలా చేసేసింతర్వాత వాళ్ళందరికీ  తలో అయిదు వేలూ యిచ్చెయ్‌. వెరసి నీకో యాభైవేలు ఖర్చవుతుంది. ఆనక తొమ్మిదిన్నర లక్షలూ నీచేతికొచ్చేస్తాయి. ఏవంటావ్‌?” అన్నాడు. అది వినగానే అబ్బులు మొహం వెలిగిపోయింది. ”బాబయ్యా… ఎంతయినా మీ తెలివితేటలే వేరు. మళ్ళీ వచ్చినప్పుడు జున్ను పాలు పట్టు కొత్తా” అంటూ లేచి చక్కాపోయాడు.
అఅఅఅ
”అది గురూగారూ…నాకొచ్చిన కల ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం కయ్యిమని ”అంటే నువ్వేదో గొప్ప దేశభక్తుడివీ, ఆదర్శవంతుడివీ అన్నమాట. నేనేమో టుమ్రీ సలహాలిచ్చే వెధ వాయినీ అన్నమాట” అన్నాడు. దాంతో వెంక టేశం కంగారుపడి ”అదేం కాదు గురూగారూ… జరుగుతున్న  చరిత్రని బట్టి అలాంటి కలొచ్చుంటుంది” అన్నాడు. గిరీశం తలూపి ”సరే… ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగించేస్తా. ఈ కలల గురించి కొంచెం విశ్లేషించు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఏవుంది గురూగారూ… జరుగుతున్న పరిస్థితులు సగటు మనిషిని రకరకాలుగా ఆలోచించేలా చేస్తున్నాయి. ఓ పక్కన ప్రభుత్వం స్వచ్చందంగా నల్లధనాన్ని ప్రకటించేస్తే సగం తీసేసుకుని నాలుగోవంతు యిచ్చి, యింకో నాలుగోవంతు నాలుగేళ్ళ తర్వాత వడ్డీ లేకుండా యిస్తానంటుంది. ఏతావాతా ఈ పద్ధతిలో లెక్కేసుకుంటే వెంటనే చేతికొచ్చే 25 శాతం, నాలుగేళ్ళ తర్వాత వడ్డీ లేకుండా వచ్చే 25 శాతంతో కలిపి చేతికొచ్చేది. దాదాపుగా 37 శాతానికి సమానం. అంటే 63 శాతం నష్టపోవడమే. అలాక్కాకుండా వాళ్ళే పట్టుకుంటే నష్టపోయేది 85 శాతం. ఓ రకంగా ఈ రెండింటి మధ్యా తేడా అంత ఆకర్షణీయంగా లేదు. అందుకే ఈ స్వచ్చంధ స్కీమ్‌ అంతా సక్సెస్‌ కాకపోవచ్చు. యిక కలలో మీరు చూపించిన అడ్డదారి ఉండనే ఉంది కదా. దానివైపే మొగ్గు చూపే అవకాశం ఎక్కువుంది” అన్నాడు. దాంతో గిరీశం ”అయితే నువ్వు కూడా ఈ తప్పుడు దారికే సపోర్టా?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఛ…ఛ… లేదు గురూగారూ… నేను సిసల యిన దేశభక్తుడిని.  ప్రభుత్వం ఏం చేసినా అది వ్యవస్థ బాగు కోసం, బంగారు భవిష్యత్తు కోసం అని నేను నమ్ముతాను. అందరూ నమ్మాలి కూడా. యిప్పుడు జరిగే ఈ నల్లధనం వెలికితీత అనబడే  మహాయజ్ఞం వలన వ్యవస్థ బాగుపడుతుంది. కేవలం కొన్ని వేలమంది దగ్గర ఉండిపోయిన లక్షల కోట్ల ధనాన్ని వెలికితీసి కోట్లాదిమందికి లబ్ధి చేకూర్చడమే ఈ యజ్ఞం ధ్యేయం. అయితే అందరూ గమనించవలసింది ఏంటంటే… ఊరంతా బాగుపడా లని కోరుకున్నవాడు ముందుగా తన యింటి ముందు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తన యిల్లు కూడా ఆ ఊరిలో భాగమే అని గుర్తెరగాలి. అలాగే వ్యవస్థలో నల్లధనం అనేది అంత రించిపోవాలి అని కోరుకున్నవాడు తన దగ్గరున్న నల్లధనం విషయంలోనూ ఆ నిజాయతీ పాటించాలి. అది ఎక్కువయినా తక్కువయినా సరే” అంటూ వివరించాడు. వెంకటేశం చెప్పిం దంతా వినేసరికి గిరీశం చాలా ఆనందపడ్డట్టే కనిపించాడు. శభాష్‌ అంటూ వెంకటేశం భుజం తట్టాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

మిషన్‌ రంధ్రాన్వేషణ

 గిరీశం యింటరుగు మీద కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అలాగని అక్కడేం పెద్ద పెద్ద సమస్యలేం లేవు. ఉదయం ఎప్పుడో రావల్సిన వెంకటేశం యింకా రాలేదంతే. యింతలోనే  వెంకటేశం నెమ్మదిగా దిగాడు. పైగా మనిషి కూడా పది లంఖణాలు చేసినట్టు ఉన్నాడాయె. దాంతో గిరీశం ” ఏవివాయ్‌ వెంకటేశం…. పొద్దుట్నించి  ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నావంట?” అన్నాడు. దాంతో వెంకటేశం కయ్యిమని ” ఆ…మీకన్నీ  అలాగే ఉంటాయ్‌… అవతల రెండు వేల రూపాయలు మార్చడానికి పొద్దుట్నించి ఏటీఎమ్‌ల దగ్గర ప్రదక్షిణాలు  చేసి యిప్పడొస్తున్నా” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ‘ ఆ మాత్రం దానికే అంత హైరానా పడిపోతున్నావా…. మరి రేపు  రాజకీయాల్లో ఏం చక్రం తిప్పేస్తావంట? ” అన్నాడు కుర్చీలో సెటిలవుతూ. వెంకటేశం అక్కడే అరుగు మీద సెటిలయి ‘ ఆ చూస్తుండండి… ఎలా చక్రం తిప్పుతానో…అయినా అదేదో మీకు తెలవడానికి ఓ పని చేయనా… నాలుగు రోజుల్లో  ఓ పది లక్షలు కొత్త నోట్లు మార్చి తీసుకొస్తా” అన్నాడు. దాంతో గిరీశం అదిరిపోయి ” పది లక్షలు మార్చడం అంటే పది లక్షలు సంపాదించాడమంత ఈజీ అనుకుంటున్నావా?…కొంప దీసి దొంగనోట్లుగానీ ముద్ర కొట్టేస్తావా?” అన్నాడు. వెంకటేశం కోపంగా ” ఛ…ఛ… అలాంటివి నేనెందుకు చేస్తానంట… ఆ నోట్లేవో రాజమార్గంలో  తెస్తా” అన్నాడు. గిరీశం ఆసక్తిగా అదెలాగన్నట్టు చూశాడు. దాంతో వెంకటేశం చిన్న ఊహలా తనేం చేయబోయేది చెప్పసాగాడు….
                                    ………………                 …………………….                  ………………..
 మూర్తి ఒక్కసారిగా అదిరిపోయాడు. ” రేయ్‌…నువ్వింత పని చేస్తావనుకోలేదురా. అయినా పెళ్ళంటే ఎప్పుడూ తిట్టేవాడివి కదరా” అన్నాడు. దాంతో వెంకటేశం విసుక్కుని ” ఆ…యిదేం నిజం పెళ్ళి కాదురా. ఉత్తుత్తి పెళ్ళంతే… ఓ అరడజను వెడ్డింగ్‌ కార్డులు డీటీపీలో కొట్టివ్వు” అన్నాడు. దాంతో మూర్తి కంగారుపడిపోయి ” అంటే కొంపదీసి ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఏ దుబాయికో అమ్మేస్తావా? ” అన్నాడు. దాంతో  వెంకటేశం విసుక్కుని  ” రేయ్‌….నాకు లేని ఐడియాలు యివ్వకురా…యిదేదో చిన్న డబ్బుల గొడవలే” అన్నాడు. దాంతో మూర్తి యింకేం మాట్లాడకుండా ఆ  వెడ్డింగ్‌ కార్డులేవో డీటీపీలో చేసిచ్చేశాడు.
                                     ………………..                 ………………………               ………………………..
 కలెక్టర్‌ గారి కార్యాలయం….
ఉదయం నుంచి కలెక్టర్‌ గారికీ అసహనంగా ఉంది. ఓ పక్క  నోట్ల మార్పిడి గొడవలూ, యింకో పక్క సీఎం గారి పర్యటన హడావిడీ…. అదీ అసహనానికి కారణం. సరిగ్గా ఆ సమయంలోనే  వెంకటేశం రావడం జరిగింది. వస్తూనే  ” ఈ వారంలో  నా పెళ్ళి సార్‌. పెళ్ళి ఖర్చుల కోసం  రెండున్నర లక్షలు నో ట్ల మార్పిడి చేస్తారని తెలిసింది. మీరు సంతకం పెట్టాలి సార్‌” అంటూ తన చేతిలో వెడ్డింగ్‌ కార్డు యిచ్చాడు. అది చూడగానే  కలెక్టర్‌ అసహనంగా ” అబ్బబ్బ….పొద్దుట్నించీ ఈ పెళ్ళిల గోలేంటీ… యివాళ యిది పన్నెండో కార్డనుకుంటా” అంటూ పీఏని పిలిచి ” యిదిగో… ఈ కార్డులో వివరాలూ, యితరత్రా పేపర్లూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి నా టేబుల్‌ మీద పెడితే సంతకం పెడతా ” అన్నాడు. దాంతో యింక చేసేదేం లేక వెంకటేశం బయట కొంచెం సేపు తిరిగొచ్చాడు. ఆ పాటికీ కలెక్టర్‌గారి సంతకం అయి పోయింది. వెంకటేశం వచ్చాక కలెక్టర్‌ గారు ” అయితే  మా నిడదవోలు అమ్మాయిని  పెళ్ళి చేసుకుంటున్నావన్నమాట” అంటూ తను సంతకం పెట్టిన పేపరు యిచ్చేశాడు. అది… పెళ్ళి ఖర్చుల కోసం రెండున్నర లక్షలు విలువయిన పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు యిమ్మని బ్యాంక్‌లకిచ్చే ఆదేశం. ఆ మర్నాడు వెంకటేశం వెస్ట్‌ గోదావరి కలెక్టర్‌ని  కలిశాడు. అక్కడా అదే తంతు నడిపాడు. అయితే ఈ సారి కార్డులో ఉన్న పెళ్ళికూతురి తరఫున మాట్లాడాడు. ” పెళ్ళి కూతురు సుగుణ నా మేనకోడలులెండి . గ ంగలకుర్రులో ఉండే వెంకటేశం అనే కుర్రాడితో సంబంధం కుదిర్చా.కలెక్టర్‌ ఆ వెడ్డింగ్‌ కార్డూ,యితరత్రా పేపర్లూ పరిశీలించి ” అవునూ… పెళ్ళి కూతురి పేర్న గానీ, వాళ్ళమ్మ పేర్న గానీ బేంక్‌ అకౌంట్‌ లేదా? ఆ వివరాలు యివ్వలేదేం?” అన్నాడు. దాంతో వెంకటేశం ” అబ్బే…వాళ్ళకి అలాంటివేవీలేవు సార్‌… అంతా నేనే చూసుకోవాలి…”  అన్నాడు. దాంతో ఏమనుకున్నాడో కలెక్టర్‌ గారు రెండున్నర లక్షల కొత్త నోట్లు మార్పిడి కోసం బేంకులని ఆదేశిస్తూ ఉత్తరమొకటి సంతకం చేసిచ్చేశాడు.
                                      …………………..                 ……………………………                ………………………..…        ఆ మర్నాడు వెంకటేశం బందరులో ఉన్న తన మేనమూమ కృష్ణశాస్త్రి యింట్లో వాలిపోయాడు. అలా వెళ్ళి వెళ్ళగానే తన పెళ్ళి కార్డు కాస్తా అతగాడి చేతిలో పెట్టేశాడు. యింతకీ అది…. వెంకటేశానికీ, సుగుణకుమారికి జరిగే పెళ్ళి కార్డు. అయితే విశేషమేంటంటే ఆ కార్డేదో కృష్ణశాస్త్రి రాసినట్టుగా కిందపేరుంది. అది చూడగానే కృష్ణశాస్త్రి కళ్ళు ఆనందభాష్పాలు రాల్చాయి. ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ  లోపల వంట గదిలో ఉన్న లలితాంబని పిలిచాడు. ” చూశావుటే… నన్నెవరూ బొత్తిగా పట్టించుకోరనీ, అవసరాల కోసం కరివేపాకులా వాడుకుని వదిలేస్తారనీ దెప్పి పొడుస్తుంటావు కదా. యిదిగో… నా మేనల్లుడు పెళ్ళి కార్డులో  వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా కాదని  నా పేరు వేయించాడు” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.  ఈ లోగా వెంకటేశం” మావయ్యా….అంత లేదు కానీ…. బేంక్‌లో నోట్లు మార్చుకోవడానికి యిలా ఉత్తుత్తి కార్డులు వేయించాలే. ముందు కలెక్టర్‌గారి దగ్గరికి పద” అన్నాడు. దాంతో లలితాంబ తన పతిదేవుడి వంక ఎప్పుడూ కంటే యింకొంచెం ఎక్కువ పురుగులా చూసి  లోపలికి వెళ్ళిపోయింది. దాంతో కృష్ణ శాస్త్రి మళ్ళీ కిక్కురుమంటేనా…. కొంచెం తేరుకున్న  తర్వాత ” కలెక్టర్‌ గారి దగ్గరకెందుకురా”….అన్నాడు. వెంకటేశం తేలిగ్గా ” మరేం లేదు…. నా మేనల్లుడికి పెళ్ళి చేస్తున్నా”…. బేంకులో నోట్లు మార్చుకోవడానికి లెటర్‌ కావాలని అడగాలంతే” అంటూ  ఏం చేయాలో చెప్పాడు.
                                 ………………………....                      ………………………..……               ………………………….
రెండు రోజుల తర్వాత….
 వెంకటేశం రైల్వే రిజర్వేషన్‌   క్యూలో ఉన్నాడు.  ఆలోచనలు మాత్రం గత మూడు రోజులుగా బేంకుల్లో మార్చుకున్న నోట్ల గురించే .  అదేదో ఏడున్నర లక్షల దాక ఉంటుంది. యింకో రెండున్నర లక్షలూ చేసేస్తే అదేదో పది లక్షలయిపోతుందని అనుకున్నాడు. ఈలోగా తన వంతు వచ్చేసరికి తను పూర్తి చేసిన ఫారాలేవో లోపలికిచ్చాడు. లోపల క్లర్క్‌ అది చూసి  ‘ రాజమండ్రీ నుంచి ఢిల్లీకి రానూపోనూ ఏసీ ఫస్ట్‌ క్లాస్‌’  అంటూ  కంప్యూటర్‌లో చూసి ” రానూపోనూ ఈ పన్నెండూ టిక్కెట్లకి లక్షా నలభై ఒక్క వేల దాకా అవుతుంది.” అన్నాడు. వెంకటేశం ఆ మొత్తమేదో పాతనోట్లు ఇచ్చేశాడు.  తర్వాత గోదావరి స్టేషన్‌కు వెళ్ళి ముంబాయికీ కూడా అలాగే రానుపోనూ టిక్కెట్లు తీసేశాడు. అదీ  దాదాపు అంతే అయింది. మళ్ళీ సాయంత్రం ఆ రెండు చోట్లకీ వెళ్ళి మొత్తం టిక్కెట్లు కేన్సిల్‌ చేసేసి వాళ్ళిచ్చిన కొత్త నోట్లు పుచ్చుకుని చక్కా వచ్చేశాడు. ఛార్జ్‌లవీ ఓ రెండువేల దాకా పోయిందంతే….!
                                     ………………………..……..                        ………………………..….                 ……………………
” అది గురూగారు చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం అదిరిపోయి ” నువ్వు అసాధ్యుడివోయ్‌… యిసుకలోంచి కూడా తైలం తీసేస్తావనిపిస్తుంది. యిక రాజకీయాల్లోకి వెళితే దున్నేయెచ్చు” అంటుంటే టీవీలో వార్త చెపుతున్నారు. రైల్వే టిక్కెట్లకి క్యాష్‌ రిఫండ్స్‌ ఉండవనీ, పెళ్ళిళ్ళికు కల్యాణమండపం బుక్‌ చేసిన రసీదు సబ్మిట్‌ చెయ్యాలనీ” ఇద్దరూ అవాక్కయ్యారు.
                                                                                                                    డాక్టర్‌ కర్రి రామారెడ్డి

‘చెద’ రంగం

గంగలకుర్రులోని రాజుగారి అంత:పురం… అదే… కాబోయే పొలిటికల్‌ కింగ్‌ వెంకటేశం గారి పెంకు టిల్లు.  ప్రస్తుతానికయితే వెంకటేశం ఆ యింట్లో హాల్లో పడక్కుర్చీలో పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తు న్నాడు. ఆ ఆలోచనంతా రాబోయే ఎలక్షన్స్‌లో దున్నెయ్యడం ఎలా అని. అంతలోనే యింకో ఆలో చిస్తున్నాడు. ఆ ఆలోచనంతా రాబోయే ఎలక్షన్స్‌లో దున్నేయ్యడం ఎలా అని. అంతలోనే యింకో ఆలో చనొచ్చింది. ఏదో ఎలక్షన్ల ముందు హడా విడిగా ఖర్చుపెడితే పెద్దగా ఉపయోగం కనపడ్డం లేదు. అదేదో యిప్పట్నుంచే కొంచెం కొంచెంగా ఖర్చుపెడితే బావుం టుందనిపించింది. వెంకటేశం యిలా ఆలోచనల్లో ఉండగానే ఎవరో పిలిచినట్టయింది. తల తిప్పి చూస్తే ఎదురుగా రంగన్న చేతులు కట్టుకుని నిలబడున్నాడు. వెంకటేశం తనని చూడగానే ”నమస్కారం బాబయ్యా” అన్నాడు. వెంకటేశం కూడా ఆప్యాయంగా ”ఏంటీ రంగన్నా… యిలా వొచ్చావే?” అన్నాడు. దాంతో రంగన్న ”ఏం లేదు బాబయ్యా… మా పరిస్థితులేం బాలేదు. పంటలు సరిగ్గా పండలేదు. యిప్పుడు ఎరువులవీ కొనడానికి డబ్బులు లేకుండా పోయాయి” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవునూ…మేమూ అంటున్నావేంటి… యింకా ఎవరయినా ఉన్నారా?” అన్నాడు. ఆ మాటనేసరికి అప్పటి దాకా గుమ్మం బయట నిలబడున్న యింకో తొమ్మిదిమంది రైతులూ లోపల కొచ్చేసి నమస్కారం పెట్టారు. ఈసారందరూ ముక్తకంఠంతో ”మీరే ఏదోలా కాపాడాలి బాబయ్యా… మా అందరికీ అప్పు కింద ఎంతో కొంత యిస్తే రూపాయి వడ్డీ వేసి యిచ్చేసుకుంటాం” అన్నారు. దాంతో వెంకటేశం ఓ పిచ్చి నవ్వు నవ్వి ”యిదేదో మింగ మెతుకులేనివాడికి మీసాలు లెక్కపెట్టడానికి ఎవడో వచ్చినట్టుంది” అన్నాడు. దాంతో అంతా మొహాలు వేలాడేశారు. రంగన్న నీరసంగా ”మరి మా సంగతెలా బాబయ్యా?” అన్నాడు. దాంతో వెంకటేశం తేలిగ్గా ”ఏవుందీ… ఆ దేవుడు కరుణించడమే” అన్నాడు. దాంతో అంతా నీరసంగా వెనుదిరిగాడు.
—–
యిది జరిగిన వారంరోజులకి నిజంగానే ఆ దేవుడు కరుణించేశాడు. అదీ మోడీ రూపంలో… మోడీ చేసిన ఓ ప్రకటన దేశాన్ని కుది పేసింది. అది పెద్ద నోట్ల రద్దు గురించిన ప్రకటన. దాంతో చాలా మంది డీప్‌ షాక్‌లోకెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయినోళ్ళలో వెంక టేశం కూడా ఉన్నాడు. అసలే పొలం అమ్మిన డబ్బు ఓ యిరవై లక్షల దాకా పెద్దనోట్లు యింట్లో పెట్టుకున్నడాయె. అదంతా బ్లాక్‌మనీయే. యిప్పుడా డబ్బునేం చేయాలో తోచడం లేదు. దాంతో ఎడాపెడా ఆలోచించడం మొదలెట్టాడు. అప్పుడు మెరుపులాంటి ఆలోచనొకటి వచ్చింది. దాంతో రంగన్నని అర్జంటుగా రమ్మని కబురు పంపిం చాడు. రంగన్న మొహం మాడ్చుకునే వచ్చాడు. ”కబురంపించేరేంటి బాబయ్యా?” అన్నాడు నిరాసక్తంగా. వెంకటేశం మొహం యింత చేసుకుని ”రాత్రి నా కలలో మా తాతలు వెంకటేశం, గిరీశంలు కనిపించి నీలాంటి పేద రైతులికి సాయం చేయమని గట్టిగా చెప్పారు. అందుకే నిన్ను పిలిపించింది” అన్నాడు. దాంతో రంగన్న మొహం యింతైంది. యింతలో వెంకటేశం ”వెళ్ళి నీ మిగతా తొమ్మిదిమంది రైతుల్నీ కూడా పిలుచుకొచ్చెయ్‌… వాళ్ళకీ సాయం చేద్దాం” అన్నాడు. రంగన్న హుషారుగా తలూపి వెళ్ళి పోయాడు. అలా వెళ్ళినోడు అరగంటలో అందర్నీ తోలుకొచ్చేశాడు. అందరూ వచ్చాక వెంకటేశం ”మీ అందరికీ ఓ రెండు లక్షలు అప్పుగా యిద్దా మనుకుంటున్నా” అన్నాడు. అంతా సంతోషంగా తలూపి ”అలాగే బాబయ్యా… సరిపెట్టేసుకుంటాం. మరి వడ్డీ అదీ రూపాయికి మించి యిచ్చుకోలేం” అన్నారు. వెంకటేశం తలూపి ”నేను రెండులక్షలిచ్చేది అందరికీ కలిపి కాదు. ఒక్కొక్కళ్ళకి” అన్నాడు. దాంతో వాళ్ళంతా ఆనందం పట్టలేక మూర్ఛపోయారు. వాళ్ళంతా తేరుకున్న తరువాత వెంకటేశం లోపలకెళ్ళి యిరవై లక్షలూ తెచ్చి ఆ పదిమంది చేతుల్లో పోసేశాడు. యింతలో వారిలో నారాయణ ”అవును బాబయ్యా… యియ్యన్నీ పాత నోట్లు కదా. చెల్లుతాయంటారా? అన్నాడు. వెంక టేశం తలూపి ”ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీ బేంక్‌ అకౌంట్‌లలో వేసేసుకోండి. ఆ తర్వాత మీ ఖర్చు లకి వారానికో యిరవై వేలు తీసుకోండి” అన్నాడు. అంతా అలాగేనని తలూపారు.
—–
”అది గురూగారూ… నాకొచ్చిన కల. ఆ రకంగా రిస్క్‌లో ఉన్న నా డబ్బుని రైతుల దగ్గర దాచు క్కున్నట్టయింది” అన్నాడు వెంకటేశం. గిరీశం తలూపి ”బావుందోయ్‌… అయితే మొత్తానికి. యిరవై నాలుగ్గంటలూ యిదే  ధ్యాసలో ఉంటున్నావన్న మాట. సరే… ఈ వారం ప్రశ్నేదో నీ కలలోంచే లాగిద్దాం” అన్నాడు. వెంకటేశం అదేం టన్నట్టు ఆసక్తిగా చూశాడు. అప్పుడు గిరీశం ”మరేం లేదోయ్‌.. తాడిని తన్నేవాడు ఒకడుంటే వాడి తల తన్నేవాడు యింకొక డుంటాడు. ఆ లెక్కలో నీ కలకో మంచి ఫినిషింగ్‌ టచ్‌ యివ్వు” అన్నాడు. వెంకటేశం తలూపి ఆలోచనలోపడ్డాడు. చాలాసేపు ఆలో చించి అప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ”మోడీగారు ముందుగా ఓ ఎత్తు వెయ్యడం జరిగింది. ఆ ఎత్తుకి బ్లాక్‌మనీ గాళ్ళంతా చిత్తయి పోవాలి. అయితే దానికి నాలాంటి వాళ్ళందరూ పై ఎత్తు వేశారు… అదే… రైతులకి అప్పిచ్చినట్టుగా ఆ బ్లాక్‌మనీ ఏదో వదిలించు కోవడం… అయితే అదక్కడితో ఆగదు. ఆ పై ఎత్తుకి ప్రభుత్వం యింకో కుయ్యెత్తు వేస్తుంది…
—–
ఏడాది తర్వాత ఓ శుభ ముహూర్తంలో రంగన్నకీ, మిగతా తొమ్మిది మంది రైతులకీ ప్రభుత్వం నంఱఉచి నోటీసులొచ్చాయి… ఎప్పుడూ బేంక్‌లో పైసా కూడా వేయంది ఆ రెండేసి లక్షలు ఎక్కడ్నుంచి వచ్చాయని. దాంతో రంగన్న తదితరులు పరిగెత్తుకెళ్ళి ‘అదంతా తమ ఎకరం పొలంలో సంవత్సరంలో పండిన పంట బాపతు డబ్బు’ అని వెంకటేశం చెప్పమన్నట్లుగానే చెప్పేశారు. దాంతో అక్కడున్న అధికారి ”ఏంటీ… మీ పొలంలో ఎకరాకి రెండు లక్షల ఆదాయం సంపాదిస్తున్నారా…!’ అని అడగడం జరిగింది. దాంతో రంగన్న  గడుసుగా ”అదేంటి బాబయ్యా… అవతల కేసిఆర్‌ గారు ఎకరాకి ఏకంగా కోటి రూపాయలు సంపాదించినట్టు చెప్పారు కదా. యిదే మూల?” అంటూ ఎదురు ప్రశ్న వేశాడు. యిది జరిగిన పదిరోజుల తర్వాత వాళ్ళం దరికీ లెటర్స్‌ వచ్చాయి. వాటిలో మీరు ఎకరాకి రెండు లక్షల ఆదాయం సంపాదించగలిగే గొప్ప రైతు. మీ ఆదాయ స్థాయి యింతిదిగా ఉన్నత స్థాయిలో ఉంది కాబట్టి యికపై మీకు వైట్‌ కార్డు అక్కరలేదని భావి స్తున్నా. అలాగే యితరత్రా సబ్సిడీలూ అవ సరం లేదని భావి స్తున్నాం. అందుకే మొత్తం వాటన్నింటినీ రద్దు చేసే స్తున్నాం’… అనుంది. దాంతో రంగన్న సహా ఆ రైతులంతా మూర్ఛ పోయి, ఆనక తేరుకున్న తర్వాత వెంకటేశం దగ్గరికి పరిగెత్తికెళ్ళి పీక పట్టుకున్నారు.
—–
”అది గురూగారూ… ఫినిషింగ్‌ టచ్‌. మొత్తానికి ఏ వ్యవస్థలోనయినా ఎత్తులు, పై ఎత్తులు, కుయెత్తులు, యింకా ఆపై యింకో ఎత్తులూ నడుస్తూనే ఉంటాయి. దానికి తగ్గట్టు మనం వెళ్ళిపోవలసిందే” అన్నాడు వెంకటేశం. గిరీశం అవునన్నట్టుగా తలూపి పైకి లేచ్చాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

చెట్టు పేరు – తాత నెయ్యి

యిల్లంతా ఒకటే హడావిడిగా ఉంది. ముందు బాబీగాడు పరిగెడుతుంటే వెనకాలే వాడిని పట్టుకో డానికి గిరీశం వెంటపడుతున్నాడు. మొత్తానికి యిదేదో టామ్‌ అండ్‌ జెర్రీలా ఉంది. వెంకటేశం వచ్చేసరికి కనిపించిన దృశ్యమిది. వెంకటేశానికైతే యిదేవీ అర్థం కాలేదు. అయినా ఎందుకయినా మంచిదని చటుక్కున లోపలికి పోయి బాబీగాడిని పట్టేసుకున్నాడు. ఈలోగా గిరీశం దగ్గరకొచ్చేశాడు. వెంకటేశం ఆసక్తిగా ”ఏంటి గురూగారూ… దొంగ తనంలాంటిదేవయినా చేశాడా?” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”దాదాపు అలాంటిదే అనుకో. పరీక్షల్లో కాపీ కొట్టాడు. లేకపోతే అన్నిటిలో నూటికి 95 మార్కులొచ్చాయి. అసలు మొన్న పరీక్షలప్పుడు ఏం చేశాడని… ఆ టీవీ చూస్తూ గడిపేశాడు. యిన్ని మార్కులెలా వచ్చాయని?” అన్నాడు. వెంకటేశానికి అదీ నిజమేననిపించింది. దాంతో బాబీగాడి వైపు తిరిగి ”ఏరా.. కాపీ కొట్టావా?” అన్నాడు. దాంతో బాబీగాడు ”ఛ…ఛ…లేదు బాబాయ్‌.. నిజంగా అవన్నీ నాకొచ్చిన మార్కులే” అన్నాడు. ఈసారి గిరీశం ”మరేం చదవకుండా అన్నేసి మార్కులు ఎలా వచ్చాయిరా?” అన్నాడు. ఈసారి బాబీగాడు ”అవును. ఏం చదవలేదు. పరీక్షల్లో అడిగిన ప్రశ్నలూ నాకు రానివే. అందుకే నేను ‘చంద్రగుప్తుడి పాలన గురించి రాయమంటే ‘చంద్రగుప్తుడి  పాలన చక్కగా సాగింది.’ అని మొదలెట్టి తర్వాత మీరిద్దరూ మాట్లాడుకునే మాటలూ, యింకా టీవీ సీరియల్స్‌  కథలూ శుభ్రంగా పేజీలకి పేజీలు రాసి పారేశాను. అన్ని పరీక్షలూ యింతే. మరి దిద్దేవాళ్ళు ఏవనుకున్నారో ఏంటో అన్నీ 95లు వేసేశారు” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ అదిరిపోయి నోరెళ్ళబెట్టారు. ఈలోగా ఎందుకయినా మంచిదని బాబీగాడు అక్క డ్నుంచి తుర్రుమన్నాడు. ఈసారి గిరీశం ”చూశావుటోయ్‌ వెంక టేశం… ఏ సరుకూ లేకపోయినా ఉన్నట్టే భ్రాంతి కలిగిస్తే చాలు. దున్నేయొచ్చు” అన్నాడు. వెంకటేశం అవునన్నట్టుగా తలూపాడు. యింతలో గిరీశం ”అయితే ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగిం చేద్దాం. రాజకీయాల్లో యిలా సత్తా లేకపోయినా దున్నేసే వ్యవహారం గురించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం ఆలోచించి చిన్న ఊహలాంటిది చెప్పడం మొదలెట్టాడు.
—–
వెంకటేశానికి హఠాత్తుగా దురదలు మొదలయ్యాయి. అవేవీ అర్జంటుగా డాక్టర్‌ దగ్గరకెళ్ళి చూపించుకోవలసిన దురదలు కాదు. రాజకీయాల్లో దూరాలన్న దురదలు. యింకేముంది… ఊళ్ళో సభొకటి ఏర్పాటు చేశాడు. అసలే తనంటే ఊళ్ళో బోల్డంత మంచి పేరుందని వెంకటేశం నమ్మకం. తన సభకి తండోపతండాలుగా జనా లొస్తారని లెక్కలేశాడు. అయితే అలాగేం జరగలేదు. ఏదో వందల్లో  వచ్చారంతే. దాంతో వెంకటేశం చాలా నీరసం పడిపోయాడు. ఏదో అలా అలా మాట్లాడాననిపించాడు. మరి తన సభకి జనాల్ని రప్పిం చడం ఎలాగా అని ఆలోచనలోపడ్డాడు. అప్పుడొచ్చిందా ఆలోచన. దాంతో గబగబా పాపారావు దగ్గరికి పరిగెత్తాడు. పాపారావంటే ఎవరో కాదు. ‘కళాకుటీర్‌’ అనే సంస్థ పేరుతో సన్మానాలవీ చేసి జనాల్ని ప్రమోట్‌ చేసే బాపతు. అలాంటి పాపారావు దగ్గరకెళ్ళి తేలిగ్గా ”ఓస్‌ అంతేనా… ముందు మీ తాతముత్తాతల వివరాలవీ చెప్పు” అన్నాడు. వెంకటేశం యింత నోరేసుకుని ఆ వివరాలేవో చెప్పాడు. మర్నాడే ఊరిలో కొన్ని బోర్డులు వెలిశాయి. ‘అగ్నిహోత్రావధాన్లు గారికి స్వయానా ముని మన వడయిన వెంకటేశం గారు రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు. తన ముత్తాతగారిలాగే ఆయనా నిప్పులాంటివాడని అందరికీ తెలిసిందే. ఆయన ఆశయం కూడా అవినీతిరహిత సమాజాన్ని స్థాపించడం. ఆ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఆయన ప్రసంగిస్తారు. రావలసింది.. యిలా సాగాయవి. మొత్తానికి అనుకున్నరోజు రానే వచ్చింది. యిక జనాలయితే బ్రహ్మాండంగా వచ్చారు. యిక వెంకటేశమయితే  తనదైన శైలిలో మాట్లాడి అందర్నీ కట్టిపడేశాడు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చింది అవినీతి రహిత సమాజం కోసం. దాని కోసం ఓ ఉద్యమం నడపబోతున్నా. అయితే అందు కోసం నేనెవరినీ ఏ నిధులూ అడగదలుచు కోలేదు. అయితే నేను చేపట్టే ఉద్యమం మన వ్యవస్థకి ఉపయోగకరమని మీరు భావిస్తే స్వచ్చం  దంగా సాయం చెయ్యండి” అన్నాడు. వెంకటేశం మాట లేవో అందరినీ సూటిగా తాకాయి. దాంతో ఆ మీటింగేదో పూర్తయ్యే సరికి అక్కడ పెట్టిన డిబ్బీలన్నీ డబ్బులతో నిండిపోయాయి. ఆ ఒక్క మీటింగ్‌లోనే కాదు. ఆ రోజు నుంచీ జిల్లావ్యాప్తంగా జరిగిన అలాంటి యింకొన్ని మీటింగ్‌లలోనూ అదే స్పందన. పైగా ‘అపర చాణక్యుడు లాంటి గిరీశం గారి మనవడు గిరీశం కూడా వెంకటేశం వెనక ఉన్నా రంట’ అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. దాంతో జనాలు యింకా హుషారుగా తరలిరావడం, డిబ్బీలు నిండడం మామూలైపోయింది.
—-
”అది గురూగారూ.. చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”ఆ…బాగుందోయ్‌… మొత్తానికి చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వ్యవహారం అన్నమాట. అయినా మనలో మాట. మీ ముత్తాత అగ్ని హోత్రావధాన్లు గారు అంత గొప్ప వ్యక్తేం కాదు. కొంచెం కక్కుర్తి వ్యవ హారమే” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”ఆ…ఆ మాటకొస్తే మీ తాత గిరీశం గారు మాత్రం ఎన్ని లీలలు చేశారని…” అన్నాడు. దాంతో గిరీశం కంగారుపడి ”సర్లే..సర్లే.. యిప్పుడా చర్చలు ఎందు కంట… యిందాక నువ్వు చెప్పిందాన్ని కొంచెం వాస్తవాలకి అన్వయించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఈ తరహా వ్యవహారాలు అటు రౌడీయిజంలోనూ, యిటు రాజకీయాల్లోనూ బాగా కనిపిస్తున్నాయి.  ఆ మధ్య ఎన్‌కౌంటరైపోయిన  నయీమ్‌కి అనుచరులమంటూ ఎవరెవరో దందాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. యిక రాజకీయాల్లోకి వస్తే… ఈ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే వ్యవహారం అనబడే వారసత్వ రాజకీయాలు బాగా కనిపిస్తున్నాయి. తమలో అంత సత్తా లేకపోయినా చాలామంది నాయకులు తమ తాతల పేరో, తండ్రిపేరో చెప్పి నెట్టు కొట్టేస్తుంటారు. వందేళ్ళ పార్టీనే తీసుకుంటే.. యిందిరాగాంధీ ఎంత పవర్‌ఫుల్‌ లీడరని… యిప్పుడు మూడో తరం వచ్చేసరికి ఆ వారసులు ఎంతమాత్రం ప్రభావం చూపించలేని నామమాత్రులుగా మిగిలి పోయారు. అయినా తమ నాన్నమ్మ పేరు చెప్పుకుని  లాగించేస్తున్నారు. అన్ని పార్టీలలో యిలాంటి పరిస్థితి కన్పిస్తోంది. చెప్పేదేంటంటే… ఎవరయినా యిలా వారసత్వంతో కాకుండా తమ టాలెంట్‌ నిరూపించు కోగలిగితేనే రాణించేది” అంటూ తేల్చాడు. అంతా విన్న గిరీశం ”బాగా చెప్పావోయ్‌” అన్నాడు చుట్ట అంటించుకుంటూ. వెంకటేశం తలూపి పైకి లేస్తూ ”ఆ…నా సమాధానం దేవుంది గానీ… రేపెలాగా నేను రాజ కీయ ఆరంగేట్రం చేస్తా కదా. ఈలోగా మా ముత్తాత, మీ తాతల ఫొటోలు సంపాదించి పెట్టకూడదూ.. నాకు పని జరుగుతుంది” అన్నాడు…!
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

అనుకున్న దొక్కటి

అక్కడ వాతావరణం బరువుగా ఉంది. అలా గని అక్కడేవీ కొంపలంటుకుపోయేంత దారుణం జరిగిపోలేదు. అక్కడున్న యిద్దరూ ఎడాపెడా ఆలోచిస్తున్నారంతే. ఆ యిద్దరిలో ఒకరు కాబోయే కింగ్‌ననుకునే వెంకటేశం అయితే రెండోవారు అలాంటి కింగుల్ని తయారు చేసే గిరీశం. గిరీశం అయితే చుట్ట పొగలోంచి రింగులు రప్పిస్తూ మరీ ఆలోచించేస్తున్నాడు. యింకోపక్క వెంకటేశం కాలుగాలిన పిల్లిలా అటూయిటూ పచార్లు చేస్తున్నాడు. చాలాసేపు యిద్దరూ ఏం మాట్లాడుకోలేదు. యింతలో ఆ నిశ్శబ్ధాన్ని బద్దలు కొట్టడానికా అన్నట్టుగా వెంకటేశం ”ఏంటి గురూగారూ… ఏదో తెగ ఆలోచించేస్తున్నట్టు?” అన్నాడు. గిరీశం తలూపి ”ఆ…మన నాయకుల తీరు గురిం చిలే. నా సంగతి సరేగానీ… నువ్వలా ఉన్నావేం?” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఓ అదా… మొన్నోసారి రాజకీయాల్లో అర్జంటుగా ఎదిగి పోవాలంటే అంచెలంచెలుగా ఎదగడం కంటే అలక్షణంగా వెడితేనే తొందరగా ఎదగొచ్చని అనుకున్నాం కదా. దాని గురించే ఆలోచి స్తున్నా” అన్నాడు. దాంతో గిరీశం ”చదవేస్తే ఉన్న మతి పోయినట్టుం దోయ్‌ నీ తీరు. సలక్షణానికి  వ్యతిరేకం అలక్షణం కాదని విలక్షణ మని నా అనుమానం” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచు కుని.. ఏదో లెద్దురూ… మొత్తానికి ఏదో చెడు దారి అనుకోండి. అలా నెగెటివ్‌ దారిలో వెళ్ళినప్పుడే వెంటనే రిజల్ట్‌ రావచ్చు. అయితే అలాంటి ప్రయత్నంలో ఏదయినా తేడా జరిగితే పరిస్థితి ఏంటంట?” అన్నాడు. గిరీశం తలూపి ”యింకేముంది… ఉన్నది కూడా ఊడు తుంది అన్నట్టుగా అసలుకే  ఎసరు రావడం ఖాయం. సరే… ఈ వారం ప్రశ్నేదో దీని మీదే లాగించేద్దాం. యిదే విషయాన్ని కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొంచెం ఆలోచించి అప్పుడు చిన్న ఊహ లాంటిది చెప్పసాగాడు…
——-
గంగలకుర్రు… ప్రపంచానికి అంతగా తెలీని చాలా చిన్న ఊరు. ఎప్పుడూ ఆ ఊరి పేరు వార్తల్లోకి రాదు. ఒకే ఒక్క కారణంగా ఆ ఊరు కొద్దిపాటి ప్రాధాన్యత సంతరించుకుంది. మరేంలేదు… గిరీశం, వెంకటేశం ఆ ఊరివాళ్ళు కావడమే. అలాంటి తన ఊరంటే వెంకటేశానికి వల్ల మాలిన ప్రేమ. అందుకే వీలున్నప్పుడల్లా ఏ ఊళ్ళో ఉన్నా తన ఊరొచ్చి పడిపోతుంటాడు. ప్రస్తుతం కూడా అలాగే ఊరొచ్చి ఉన్నాడు. అయితే ఈసారి కొంచెం ఎక్కువరోజులు ఉండి పోయాడు. ఆరోజు పొద్దున్నయితే ఏదో ఆలోచన వచ్చినట్టుగా ఆ ఊరి సర్పంచ్‌ సత్తిబాబుని కలుసుకున్నాడు. వెంకటేశాన్ని చూడగానే సత్తిబాబు విశాలంగా నవ్వేసి ”ఏంటబ్బాయ్‌… ఈ మధ్య యిక్కడే ఎక్కువగా ఉంటున్నట్టున్నావ్‌…” అన్నాడు. వెంకటేశం తలూపి ”అవు నండీ… ఎంతయినా మన ఊరు మన ఊరే కదా. ఏదో ఒకటి చేసి మన ఊరి పేరు దేశమంతా మార్మోగిపోయేలా చేయాలని ఉంది. ఎలా ఉంటుందంటారు?” అన్నాడు. దాంతో సత్తిబాబు మొహంలో ఆసక్తి ప్రవేశించింది. ”అయినా అది చాలా కష్టమబ్బాయ్‌… అలా మనూరి పేరు మార్మోగిపోవాలంటే మనూళ్ళో గొప్పోళ్ళెవరయినా పుట్టాలి కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”నేను పుట్టా కదా. అలా చూస్తుండండి. బ్రహ్మాండమయిన కార్యక్రమం ఒకటి చేసి ఊరి పేరుని ఎక్కడికో తీసుకుపోతా” అన్నాడు. దాంతో సత్తిబాబు చాలా ఆనందపడిపోయాడు. ”యిదిగో అబ్బాయ్‌… పనిలో పనిగా ఆ కార్యక్రమంలో నా పేరు యిరికించు. అసలే ఎలక్షన్లొస్తున్నాయి” అన్నాడు. వెంకటేశం తలూపి బయటికి నడిచాడు.
———
విజయదశమినాడు గంగలకుర్రులో బ్రహ్మాండమయిన కార్యక్రమం ఒకటి ఏర్పాటయింది. మామూలుగా అయితే ఆ కార్యక్రమానికి అంత ప్రాధాన్యత లేకపోవును. అయితే ఆ కార్యక్రమంలో చిన్న వెరయిటీ ఉంది. అది… ఊళ్ళో ఉన్న మైదానానికి రావణ లీలా మైదానం అని పేరు పెట్టేసి అక్కడ రావణాసురు డికి పూజలూ, యజ్ఞాలవీ జరిపించడం. అంతేనా… యింకా రావణా సురిడికి పాలాభిషేకం, సహస్ర దీపా లంకరణ చేయడం లాంటివి చేస్తు న్నారు. దాంతో సంచలనం మొదల యింది. అదీ కాక ఈ కార్య క్రమానికి సంబంధించిన వార్తేదో వాట్సాప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా దేశమంతా తెలిసిపోయింది. దాంతో కార్యక్రమం రోజు ఆసక్తి కొద్దీ వేలాదిగా జనాలు తరలివచ్చారు. యిక మీడియా సంగతి సరేసరి. ఓ పక్కన రావణుడిని దేవుడిలా భావిస్తూ పూజలవీ జరుగు తుంటే యింకో పక్క విలేఖర్లంతా వెంకటేశం చుట్టూ చేరి పోయారు.”అసలు మీరు యిలాంటి వినూత్న కార్య క్రమం తలపెట్టడానికి కారణం?” అంటూ ఎవరో అడిగారు. దానికి వెంకటేశం ”వేలాది సంవత్స రాలుగా నిమ్న జాతులకి జరుగుతున్న అన్యాయం గురించి బాధపడే యిదంతా  చేస్తున్నా.  ఈ అగ్రకులాల వాళ్ళ ఆధిపత్యం మొదట్నుంచీ యిలాగే ఉంది. వాళ్ళ దాష్టీకానికి ఈ నిమ్నజాతివాళ్ళు బలయిపోతూనే ఉన్నారు. అందుకు ఎంతో గొప్ప వాడయిన రావణాసురుడే సాక్ష్యం. కేవలం నిమ్నజాతి వాడవడం వలనే రావణుడిని అంత నీచంగా చిత్రించి తొక్కేశారు. అలాంటి మహాత్ముడికి న్యాయం జరగాలనే  యిదంతా” అన్నాడు. వెంకటేశం చెప్పిందాంతో అంతా మెస్మరైజ్‌ అయిపోయి రాసుకోసాగారు. సరిగ్గా అప్పుడు జరిగిందది. ఆ రిపోర్టర్లలో కొంచెం హుషారుగా ఉండే క్రాంతి లేచి నిలబడ్డాడు. ఎకాఎకిన వెంకటేశాన్ని తగులుకున్నాడు. ”మీరంటున్నట్టు రావణుడు నిమ్నజాతివాడు కాదు. అగ్రకులానికి చెందిన బ్రాహ్మణ కులస్థుడు. నిజానికి రాముడే అతని కన్నా కాస్త తక్కువ కులానికి చెందిన క్షత్రియుడు. పోనీ శాస్త్రాల్లో చెప్పబడినట్టు పుట్టుకని బట్టి కాకుండా గుణగణాలని బట్టి కులం నిర్ణయించబడు తుందనుకున్నా రావణుడు అధముడి కిందే లెక్క. మరి అలాంటివాడికి ఈ పూజలవీ చేయడంలో అర్థమే లేదు” అన్నాడు. క్రాంతి చెప్పిందాంతో అక్కడ పెద్ద సంచలనమే రేగింది. వెంకటేశం అయితే కిక్కురుమంటే ఒట్టు. ఈలోగా విషయమంతా బుర్రలోకెక్కిన జనాలంతా పోయి రావణుడి విగ్రహం అంటించేశారు. యింకా యజ్ఞమదీ నాశనం చేసేశారు. యిక మర్నాడు ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. గంగలకుర్రులో రావణాసురుడి మీద బ్రహ్మాండంగా మొద లెట్టిన కార్యక్రమం రసాభాసగా ముగిసిందన్నది ఆ వార్త. జరిగిం దాంతో ఊరి పరువుపోయిందని అంతా తలలు పట్టుకున్నారు.
———
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. గిరీశం తలూపి ఊహ బాగానే ఉంది గానీ అదేదో కొంచెం వర్తమానంలో జరిగే వాటితో అన్వయించి చెపితే బాగుంటుంది” అన్నాడు. దాంతో వెంకటేశం ”అలా అయితే ముందుగా చెప్పుకోవలసింది కేజ్రీవాల్‌, రాహుల్‌ల వ్యవహారం. సర్జికల్‌ దాడుల తర్వాత ఆ యిద్దరూ మోడీని మెచ్చుకోవడంతో వాళ్ళు మారారనీ, కీలక సమయంలో అధికార పక్షానికి బాసటగా నిలిచారనీ అంతా సంబరపడ్డారు. అయితే కుక్క తోక వంకర అన్నట్టుగా అనవసర రాద్ధాంతం చేసి మళ్ళీ తమ నైజం బయటపెట్టుకున్నారు. ‘అసలు ఆరోజు సర్జికల్‌ దాడి జరిగిందా.. జరిగితే ఆధారాలు చూపించండి’ అన్నది ఆ వాదన. వీళ్ళ స్టేట్‌మెంట్లు చావుదెబ్బ తిన్న పాకిస్థాన్‌కి ప్రాణం పోసినట్టయింది. ‘అసలు సర్జికల్‌ దాడి జరిగినట్టుగా ఆ దేశంలో ప్రతిపక్షాలే నమ్మడం లేదు. అసలు అదంతా అబద్ధమే’ అని చెప్పడం మొదలెట్టింది. అయినా కొన్ని విషయాలు దేశ భద్రత దృష్ట్యా బయటపెట్టడం కుద రదు. యిదేదో కొంచెం మోటుగా చెప్పాలంటే… పెళ్ళి జరిగిందానికి  ఆధారాలు ఏవో అంటే ఫొటోలూ, వీడియోలూ చూపించొచ్చు. అలాగే శోభనం జరిగిందానికి సాక్ష్యాలు చూపించమంటే ఎంత దరి ద్రంగా ఉంటుందని… యిదీ అంతే. ఏతావాతా చెప్పేదేంటంటే… ఒనిడా ప్రకటనలోలా నెగెటివ్‌ దారిలో రాజకీయాల్లో మైలేజ్‌ పెంచు కోవచ్చు. అయితే ఆ ఎంచుకున్న అంశాలేవో కొన్ని పరిమితులకి కట్టుబడి ఉండాలి. లేకపోతే అసలుకే  ఎసరొచ్చి రాహుల్‌ గాంధీ, కేజ్రీవాల్‌ల్లాగ విమర్శల పాలవడం ఖాయం” అంటూ ఆపాడు. అయితే గిరీశం ఏం మాట్లాడకుండా మౌనం వహించాడు. ‘మౌనం అర్థాంగీకారం కదా. అదే మా గురువుగారి మౌనం పూర్తి అంగీ కారమే. ఆ లెక్కన నేనీ వారం గట్టెక్కేసినట్టే’ అనుకుంటూ వెంకటేశం బయటికి నడిచాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

జిహ్వాస్టిక్స్‌

వెంకటేశం వెళ్ళేసరికి గిరీశం వాకిట్లో ఊయల ఊగుతున్నాడు. నోట్లో చుట్ట మాత్రం గుప్పు గుప్పుమంటోంది. వెంకటేశాన్ని చూడగానే ”రావోయ్‌ మైడియర్‌ వెంకటేశం… ఈరోజు తొందరగా వచ్చినట్టున్నావ్‌… ఏవయినా నీకు కంగారు కుసింత ఎక్కువే సుమీ” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని ”మరేం చెయ్య మంటారు? కండిషన్స్‌ అలా పెట్టారుగా” అన్నాడు. గిరీశం తలూపి ”మొత్తానికి ఏదోలా గట్టెక్కి పోతున్నావు కదోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం మళ్ళీ గుర్రుమని ”ఏదోలా గట్టెక్కడ మేంటి గురూగారూ… బ్రహ్మాండంగా దున్నే స్తుంటే” అన్నాడు. గిరీశం నవ్వేసి ”ఆ… ఎనా లసిస్‌లు దున్నేస్తున్నావులే. అది సరిపోదు. ప్రాక్టికల్స్‌లో కూడా గట్టెక్కాలి కదా” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఆ… మీ తాత గిరీశం గారు అవేవో బాగా వెలగబెట్టినట్టున్నారు” అన్నాడు. దాంతో గిరీశం గతుక్కుమని ”అవుననుకో. అయినా యిపుడా చరిత్రదీ తవ్వక. ముందు నీ సంగతి చూడు. నువ్వ ర్జంటుగా మంచి సర్జన్‌ దగ్గరకిపోయి నీ నాలుకకి నిలువుగా రెండుగా చీల్పించుకునిరా” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరి పోయి ”మీరేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు” అన్నాడు. గిరీశం తల అడ్డంగా ఊపి ”మరేం లేదోయ్‌… అసలు సిసలు పొలిటీషియన్‌ అంటే రెండు నాలుకలు ఉంటాయి కదా. కొంచెం అదేదో వివరంగా చెబుతావని” అన్నాడు. దాంతో వెంక టేశం చిన్న ఊహలాంటిది చెప్పడం మొదలెట్టాడు…

—-

వెంకటేశం యింకోసారి తలమీద తడుముకుంటూ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. అలా తలమీద తడుముకునేసరికి రెండు బొడిపె ల్లాంటివి తగిలాయి. దాంతో కంగారుపడి నెత్తిమీద బొచ్చుతో వాటిని కవర్‌ చేసుకుని మరీ లోపలకెళ్ళాడు. వెంకటేశం రావడం చూసి రిసెప్షనిస్ట్‌ తలెత్తి చూసింది. ఆ బొడిపెలేవో ఆవిడ దృష్టిలో పడ్డట్టు న్నాయి. వస్తున్న నవ్వుని ఆపుకుంటున్నట్టుగా కనిపించింది. యిదేదో వెంకటేశానికి బొత్తిగా తలతీసేసినట్టుగా అనిపించింది. దాంతో గబగబా తన చాంబర్‌ వైపు నడిచాడు. ఈలోగా తలుపులు ఎదుర య్యాడు. వెంకటేశాన్ని చూడగానే తలుపులు మొహంలో అయితే బోల్డంత ఆశ్చర్యం లాంటిది కనిపించింది. ”ఏంట్సార్‌… గుళ్ళోకి వెళ్ళొస్తున్నట్టున్నారు.. అక్కడ గుమ్మం ఏదో తలకి తగిలి నట్టుంది” అన్నాడు. దాంతో వెంకటేశానికి మంచి దారి దొరికేసినట్ట యింది. ”అబ్బబ్బ…నిన్ను చూస్తుంటే ఆ బ్రహ్మంగారు గుర్తొస్తున్నా రనుకో. ఆయన జరగబోయేది చెప్పేవారు. నువ్వు జరిగింది చూసినట్టు చెప్పేస్తున్నావు” అన్నాడు. దాంతో తలుపులు నవ్వేసి ”ఊరుకోండి సార్‌… నేనేదో సరదాగా అంటే అదే నిజమంటారేంటీ ! అయినా నిన్న గ్రహణం కదా. పొద్దున్నే గుళ్ళెలా తీస్తారంట? అసలీ బొడిపె లవీ చూస్తుంటే మీ ఆవిడగారు అప్పడాలకర్ర తిరగేసినట్టున్నారు…” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఛ… ఛ.. లోకమంతా యిలాగే తగలడి నట్టుంది…”అని తిట్టుకుని ”అంటే… మా ఆవిడ నన్ను అప్ప డాలకర్రతో కొట్టడం కాదన్నమాట. నా తల వెళ్ళి అప్పడాలకర్రకి తగిలిందన్నమాట. ఆ టైంలో ఆ అప్పడాలకర్ర మా ఆవిడ చేతిలో ఉందన్నమాట. యిదంతా ఎక్కడా చెప్పక” అన్నాడు. తలుపులు తలూపి ”మీ ఆవిడగారు మిమ్మల్ని అప్పడాలకర్రతో కొట్టలేదనే అందరికీ చెబుతా” అన్నాడు.

——-

అంతా విన్న గిరీశం పగలబడి నవ్వాడు. యింతలో వెంకటేశం ”అందుకే పెళ్ళి జోలికి పోవడం లేదు గురూగారూ…” అన్నాడు. దాంతో గిరీశం ‘ఆ…ఏం సంబంధాలు వచ్చి చచ్చాయని…’ అని గొణుక్కుని ”ఆ…బాగా చెప్పావోయ్‌… సరే… యిదేదో డైరెక్ట్‌గా రాజ కీయాల్లో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం వివరంగా చెప్పడం మొద లెట్టాడు… పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కక్కలేనీ మింగలేనీ పరిస్థితిలో పడ్డాడు. ఆ మధ్య మోడీగారి పుణ్యమా అని యిండియా పాకిస్థాన్‌ల మధ్య స్నేహ సంబంధాలు పెరిగినప్పుడు పరిస్థితి బాగానే ఉండేది. అయితే కుక్క తోక వంకర అన్నట్టుగా పాకిస్థాన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించి దొంగదారిన కాల్పులకి తెగబడింది. దాంతో 18 మంది దాకా మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ కాల్పులు తాము జరపలేదని పాకిస్థాన్‌ బుకా యించినప్పటికీ ఆ మొత్తం వ్యవహారం నడిపింది పాకిస్థానే అని ఆధారాలతో బయటపడింది. దాంతో భారతావని మొత్తం రగిలిపోయింది. యిక అప్పుడు మోడీ తన విశ్వరూపం ఏంటనేది ఈ ప్రపంచానికి చూపించాడు.  ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న వందమందికి పైగా ఉగ్ర వాదులనబడే పాకిస్థాన్‌ తొత్తుల్ని ఏరిపారెయ్యడం జరిగింది. యిది భారతావనికి గొప్ప సంతృప్తినిచ్చిన, మోడీ ప్రతిష్టని ఆకాశానికి ఎత్తేసిన చర్య. ఈ చర్యకి ప్రపంచం అంతా వత్తాసు పలికింది. దాంతో పాక్‌ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. కక్కలేనీ, మింగలేనీ పరిస్థితి వచ్చింది. దాంతో నవాజ్‌ షరీఫ్‌ అర్జంటుగా ‘ఆస్ట్రిబ్‌ మెకానిజమ్‌’ అనబడే ఉష్ట్రపక్షి వ్యవహారం మొదలెట్టాడు. ”అబ్బే… ఎవరూ చనిపోలేదు. ఏదో రొటీన్‌గా భారతీయ సైనికులు సరిహద్దు అవతల జరిపిన కాల్పులంతే’ అని కొట్టిపారేశాడు. అయితే తమ సైనికులు చనిపోయి చావు దెబ్బతినడం గుర్తొచ్చే కొద్దీ నవాజ్‌ షరీఫ్‌లో ఉక్రోషం పెరిగి పోతూనే ఉంది. దాంతో యిప్పుడు ‘ఆ… ఆమాత్రం మెరుపుదాడుల్ని మేం చేయలేమా? అయినా ఆ సర్జికల్‌ స్ట్రెక్స్‌ ఏవో భారతీయ సైనికులు కాబట్టి అలా చేశారు. అదే మా సైనికులయితేనా… యింకా బాగా చేద్దురు’ అని శెలవిచ్చాడు. మరి ముందలా వాగిన నాలుక యిప్పుడిలా మాట మార్చడం ఎంతవరకు సబబని?” అంటూ ఆపాడు. అంతా విన్న గిరీశం ”ఆ…బాగా చెప్పావోయ్‌… అయినా ఈ రెండు నాలుకల తీరు అక్కడెక్కడో పాకిస్థాన్‌లో అనే వుందిలే. యిక్కడా ఉందిగా. అదేనోయ్‌… ప్రత్యేక ¬దా విషయంలో నేతలు ఏం స్టేట్‌మెంట్లు యిస్తున్నారని…! ప్రత్యేక ¬దా వచ్చే వరకూ కేంద్రంతో ఎంతకయినా పోరాడతామని ఓసారి… అయినా ఆ ప్రత్యేక హోదా అనేది ఏవయినా అక్షయ పాత్రా… ఎందుకంట? అని యింకోసారి, ‘అయినా ప్రత్యేక హోదాని మించిన ప్రత్యేక ప్యాకేజీ ఏదో యిస్తున్నప్పుడు యింకా ఆ ప్రత్యేక హోదా ఎందుకంట?’ అని యింకో సారి దబాయిస్తున్నారు. సరే… అదలా ఉంచు. పాకిస్థాన్‌ ముష్కరుల మీద సరయిన టైంలో ఎటాక్‌ చేయించి మోడీగారు హీరో అయి పోయారు. ఆ విశ్లేషణేదో బ్రహ్మాండంగా చేసి నువ్వూ హీరో అయిపో వావు… అదే… ఈ వారం టెస్ట్‌లో పాసయిపోయావు” అన్నాడు. అయినా గురూగారూ… నన్ను పాస్‌ చేయడంలో మీరు మాట నిలబెట్టుకుంటారా అని” అన్నాడు. దాంతో గిరీశం కయ్యి మని” రెండు నాలుకలుండటానికి నేనేవయినా పొలిటీషియన్‌నను కుంటున్నావా… నేను కింగ్‌ని కాదు. కింగ్‌ మేకర్‌ని” అంటూ యింకో చుట్ట అంటించుకున్నాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి

రావణ పథం

మనస్సాక్షి -1005
రావణ పథం
కర్రి రామారెడ్డి గారు
 
  ” అబ్బెబ్బే… ఈ వ్యవస్థని బాగు చెయ్యడం నా వల్ల కాదు” అన్నాడు గిరీశం చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ… దాంతో పక్కనున్న వెంకటేశం గిరీశం నోట్లో చుట్టవంక కోరగా చూస్తూ ” ఆ… తెలుస్తుంది లెండి” అన్నాడు. దాంతో గిరీశం గతుక్కుమని ” యిదిగో….నేనంటుంది దీని గురించి కాదోయ్‌… హైదరాబాద్‌లో వర్షం బాధల గురించిలే. అసలీ పరిస్థితికి కారణం ఏంటో తెలుసా? అదేదో ప్రకృతి వైపరీత్యమో, యింకో దేవుడి శాపమో కాదు. కేవలం మన స్వయంకృతాపరాధం.” అన్నాడు. వెంకటేశం అర్ధం కానట్టు చూశాడు. దాంతో గిరీశం ” అవునోయ్‌… ఎంత వర్షం వస్తేనేం… ఆ నాలాలన్నీ సరిగ్గా ఉంటే నీరంతా క్షణాల్లో లాగేస్తుంది. మొత్తం ఆ వ్యవస్ధని నాశనం చేసి పారేస్తే ఏం జరుగుతుందని…కాసులికి కక్కుర్తి పడి ఆ నాలాల మీద అక్రమ కట్టడాలకి అనుమతులిచ్చిన అధికార్లూ, నాయకులూ, వాటిని కట్టిన వాళ్ళూ…అంతా దీనికి బాధ్యులే. చెప్పెదేంటంటే మూలాలు బాగున్నప్పుడే ఏ వ్యవస్థన్నా బాగా నడిచేది” అన్నాడు. వెంకటేశం తలూపి ”అద్సరే గురూ గారూ… మరి నా సంగతి తేల్చండి” అన్నాడు. దాంతో  గిరీశం ఏవుందోయ్‌….ఈ మూలాల మీదే ప్రశ్నలాగించేద్దాం. రాజకీయాల్లో పైకి రావాలంటే కొన్ని పద్ధతులున్నాయి. ముందుగా ఎలాంటి స్వార్ధం లేకుండా ప్రజాసేవ చేపట్టాలి. అప్పుడు ప్రజల్లో మంచి పేరొస్తుంది. అలా ప్రజల్లో మంచి పేరొచ్చాక అప్పుడో మంచి పార్టీలోకి వెళ్ళాలి. యిదంతా మూలాలు అనబడే పునాదులు బలంగా వేసుకునే ప్రయత్నం. అలా అయితేనే భవిష్యత్తు బాగుండేది. యిదంతా సాంప్రదాయ వ్యవహారం అనుకో. అలాక్కాకుండా రాజకీయాల్లో పైకి రావడానికి షార్ట్‌కట్‌లు అనబడే అడ్డదారులేవయినా ఉన్నాయా? ” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం ఆటోచనలో పడ్డాడు. అలా ఆలోచిస్తున్నవాడల్లా హఠాత్తుగా ఏదో తట్టినట్టు ” అయితే ముందుగా మీకో ఊహలాంటిది  చెబుతా. సమాధానం అందులోనే ఉంటుంది” అన్నాడు. గిరీశం తలూపి ‘యింకెందుకాలస్యం? కానియ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం గిరీశం గారు వదులుతున్న చుట్ట పొగ వంక చూస్తూ అలా అలా ఊహలోకి తీసుకెళ్ళిపోయాడు.
 
   ఆ రోజక్కడో ప్రెస్‌  మీట్‌ జరుగుతోంది. దానిని ఏర్పాటు చేసింది వెంకటేశం. అందరూ వచ్చాక వెంకటేశం మాట్లాడడం మొదలెట్టాడు. ” నేనేదో నాకొచ్చిన గొస్ప గొప్ప ఆలోచనలన్నీ పత్రికలకి పంపితే వేస్తారా! అలాగే రైట్‌ టూ యిన్ఫర్మేషన్‌ యాక్ట్‌ కింద సంపాదించిన సమాచారం యిచ్చినా వేయరే….. మీకుండే యిబ్బందులు మీకుంటాయి కదా. అయినా మీరంటే నాకు గౌరవం. యిప్పుడు నా మనసులో భావాన్ని చెప్పడానికి దారి కూడా మీరే. అందుకే ఈ ప్రెస్‌మీట్‌” అంటూ ఆపాడు. వెంకటేశం ఏం చెపుతాడా అని అంతా ఆసక్తిగా చూడసాగేరు. యింతలో వెంకటేశం మాట్లాడుతూ  ” యూరీలో జరిగిన సంఘటన విషయంలో కొన్ని వాస్తవాలు పక్కదారి పట్టినట్టుగా ఉంది. అది తట్టుకోలేకే ఈ ప్రెస్‌మీట్‌. అక్కడేదో  మన జవాన్లు చనిపోయారని తెగ బాధపడిపోయి  నివాళులు అర్పించేస్తున్నారు. అయినా వాళ్ళు చేసిందేవుందని….తమ డ్యూటీలో ఉన్నప్పుడు పోయారంతేగా. పైగా వాళ్ళ టెన్త్‌ పాసయ్యో…ఫెయిలయ్యో వేరే దారి లేక, ఈ రిస్కు ఉద్యోగానికొచ్చారు. యిక మన జవాన్ల మీద దాడి  చేసింది పాకిస్ధాన్‌ దుండుగులే అని అంటున్నారు. అదెంతవరకు నిజం? వాళ్ళే అని ఎందుకనుకోవాలి? కాశ్మీర్లో ఉండే అమాయక జనాలనెవర్నో ఎన్‌కౌంటర్‌ చేసేసి అక్కడ పారేసి వాళ్ళపక్కన పాకిస్ధాన్‌ ఆయుధాలు ఉంచొచ్చు కదా. ఆ ఆయుధాలు ఎక్కడొచ్చాయీ అంటే గతంలో పాకిస్ధాన్‌  సైనికుడు పట్టుబడినప్పుడు వాళ్ళ దగ్గర్నుంచి స్వాధీనం చేసుకున్నవి కావచ్చు. యిలా పాకిస్ధాన్‌ని యిబ్బంది పెట్టడం వలన ఏం జరుగుతుంది? యిక భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య సయోధ్య ఎలా కుదురుతుందని? అన్నాడు. వెంకటేశం చెప్పిందాంతో అక్కడ పెద్ద కలకలం రేగింది. అక్కడికీ విలేకర్లలో ఒకరు ” తమ ప్రాణాలు త్యాగం చేసిన భారతీయ సైనికుల గురించి యిలా మాట్లాడటం, పాకిస్ధాన్‌ని వెనకేసుకురావడం విచిత్రంగా ఉంది” అన్నాడు.దాంతో వెంకటేశం ” యిందులో విచిత్రం ఏముంది! మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఏం…పాకిస్ధాన్‌ వాళ్ళంటే అంత లోకువా? వాళ్ళూ మనలాంటి మనుషులే కదా. అవకాశం దొరికింది కదాని వాళ్ళ మీద నిందలేయడం ఎంతవరకు సబబని ? అన్నాడు. వెంకటేశం ఎంతో ఉద్వేగంగా… వితండంగా చెప్పేదాన్ని అందరూ శ్రద్ధగా రాసుకున్నారు.
  అంతే కాదు… మర్నాడు యిదంతా అన్ని ఛానల్స్‌లో, పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. మీడియాలో యిదంతా ప్రముఖంగా వచ్చిన తర్వాత ఓ విశేషం జరిగింది. వెంకటేశానికి రెండు ఫోన్లోచ్చాయ్‌. మొదటిది ఎప్పుడూ ఎవరో ఒకర్ని ఏకిపారేసే ఆర్ణన్‌ గోస్వామి నుంచి. ఛానల్‌కి డిస్కషన్‌కి రమ్మన్నాడు. వెంకటేశాన్ని తెగ అభినందేంచేశాడు. యిక రెండో ఫోన్‌ పాకిస్ధాన్‌ ప్రధాన నవాజ్‌ షరీఫ్‌ నుంచి. నిన్ను చూసి మా దేశం గర్విస్తోంది. నువ్వెప్పుడొచ్చినా మా దేశంలో నీకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం లభిస్తుంది” అన్నది ఆ ఫోన్‌ సారాంశం. యింకో పక్క విమర్శలూ, తిట్లూ వెంకటేశానికి గట్టిగానే వచ్చాయి. అయితేనేం….రాత్రికి రాత్రి, వెంకటేశం జాతీయంగా పాపులరయిపోయాడు. ” అది గురూ గారూ….చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. అంతా విన్న గిరీశం ” శభాష్‌…బాగా చెప్పావోయ్‌…చరిత్రలో మహాత్ముడనిపించుకున్న గాంధీజీకి ఎంత గుర్తింపు ఉందో ఆ గాంధీని చంపిన గాడ్సేకీ అంతే గుర్తింపొచ్చేసింది. అదేదో చెడుగా కావచ్చు గాక. యిక మన రాజకీయాల్ని తీసుకుంటే…. ఎన్నో కష్టనష్టాలకోర్చి  అంచెలంచెలుగా ఎదిగితే ఎప్పటికో గుర్తింపు రావచ్చు. అదే… అడ్డదారిలో ఓ విధ్వంసకర పనో లేకపోతే కొక్కిరాయ్‌ పనో చేస్తే రాత్రికి రాత్రే ఆ గుర్తింపేదో తెచ్చేసుకోవచ్చు. ఓ ఒరిస్సా నాయకుడిని తీసుకుంటే…మూములుగా అయితే ఏ ప్రాధాన్యతా లేకుండా  ఉండిపోవును. అయితే  ఓ సభలో ప్రధానమంత్రి మీద చెప్పు విసరడంతో రాత్రికి  రాత్రే దేశవ్యాప్తంగా పాపులరై పోవడం  జరిగింది. అలాగే అప్పట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పబ్లిక్‌లో  విరుచుకుపడిన ఆవిడ తర్వాత అదే పార్టీలో తొందర తొందరగా మంచి స్ధానానికి ఎదిగిపోయింది. ఏతావాతా రాజకీయాలకీ సంబంధించి ” రాముడు మంచి బాలుడు” టైపులో  ఎదగడం కాకుండా యిలా కొక్కొరాయి దారుల్లో ఎదగడమే   సులువు అంటావ్‌” అన్నాడు.
  వెంకటేశం తలూపి ” అవును గురూ గారూ…. ఆ లెక్కన ఈ మధ్య యూరీ దాడి విషయంలో  పాకిస్ధాన్‌ని తెగ ప్రేమించేస్తూ, వాళ్ళ మీద సింపతీ ఒలకబోస్తున్న  మన నాయకుల్ని  ఈ కేటగిరిలో పారేయొచ్చనిపిస్తుంది” అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌….వాళ్ళని అందులో పారేయొచ్చు. నిన్ను ఈ వారం పాస్‌ కేటగిరీలోనూ పారయొచ్చు” అంటూ పైకి లేచాడు.
– డాక్టర్ కర్రి రామారెడ్డి