సామాజిక సాహిత్యం – సినారె జ్ఞాపకం (శనివారం నవీనమ్)

సాహిత్యమంటే బోర్ అనో, అది ఎవరికీ అవసరం లేని ఒక లైక్ మైండెడ్ గ్రూపో  (కొందరు ఉబలాటపరుల గుంపు) అనో ముఖ్యంగా యువతరం భావించకుంటున్న సమయంలో “సినారె” మరణం – సమాజానికి సాహిత్యానికి మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తున్న పెద్ద జ్ఞాపకం.

మధ్యతరగతి కుటుంబీకుడైన సింగిరెడ్డి నారాయణరెడ్డి (సినారె) మట్టి మనిషికి పట్టం కట్టిన అక్షరయోధుడు.

1988లో ఆయనకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని సాధించిపెట్టిన ‘విశ్వంభర’ కావ్యం మట్టికి, మనిషికి సంబంధాన్ని విశ్లేషించింది. నిర్వచించింది. విశ్వంభర అంటే మట్టి అని అర్థం. సామాజిక చైతన్యమే కవిత్వ ప్రధాన లక్ష్యం కావాలన్న ఆయన ఆశయం విశ్వంభరలో కనిపిస్తుంది. మానవ పరిణామ క్రమం, సృష్టి మార్మికత, అల్పత్వం, జ్ఞానం, లొంగుబాటు, ఎదురీత వంటి తాత్వికతల గురించి ఇందులో చర్చించారు.

సినారె నిత్య చైతన్యశీలి. అంతకుమించిన గొప్ప మానవతావాది. సామ్యవాదం, ప్రగతిశీల మానవతావాదమే తన మార్గమని స్పష్టంగా నిర్ద్వంద్వంగా ప్రకటించిన ధీశాలి. సోవియట్‌ యూనియన్‌ పతనమైనప్పుడు కమ్యూనిజానికి కాలం చెల్లిందని పెట్టుబడిదారులు సంబరపడుతున్న వేళ ‘ఎవడురా అన్నది కమ్యూనిజం చచ్చిపోయిందని…ఎవడురా కూసింది ఎర్ర జెండా నేలకొరిగిందని’ అంటూ గర్జించాడు. సామ్యవాదం పట్ల ఆయనకున్న తిరుగులేని విశ్వాసమే ఆయనతో అలా పలికించింది. హిందూత్వ మూకలు చెలరేగి బాబ్రీ మసీదును కూల్చివేసినప్పుడు ఖండించిన కవి సినారె.

అధ్యాపకుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, సాంస్కృతిక మండలి చైర్మన్‌గా, అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ఉప కులపతిగా, రాజ్యసభ సభ్యునిగా ఆయన వివిధ పదవులు చేపట్టి, వాటికి వన్నె తెచ్చారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ‘రాస్తూ రాస్తూ పోతాను సిరా ఇంకేవరకు… పోతూ పోతూ రాస్తాను’ అని కవితాత్మకంగా చెప్పిన సినారె చివరి దాకా అదే స్ఫూర్తితో అక్షర యాత్ర సాగించారు. రెండు వేలకు పైగా సాహితీ సదస్సులు, సభల్లో పాల్గొని విలువైన సందేశాలను ఇచ్చారు.

తెలుగు సాహిత్యాన్ని జ్ఞానపీఠ్‌తో సత్కరించిన సి నారాయణరెడ్డి నిరంతర ప్రయోగశీలి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధునిక సాహిత్య చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పద్యాలు, కవితలు, సినిమా పాటలు, గజళ్లు కథలు ఇలా ప్రతి ప్రక్రియలోనూ ఆయనది అందెవేసిన చెయ్యి. ఆయనకు జ్ఞానపీఠ్‌ అవార్డు తెచ్చి పెట్టిన ‘విశ్వంభర’ కావ్యం ఒక ఎత్తు అయితే, కర్పూర రంగరాయలు, నాగార్జున సాగరం, విశ్వనాథ నాయకుడు, రుతు చక్రం మరో ఎత్తు.

1931లో కరీం నగర్‌ జిల్లా వేములవాడకు సమీపంలోని హన్మాజీపేట అనే ఓ గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో నారాయణరెడ్డి పుట్టారు. డిగ్రీవరకు ఉర్దూ మీడియంలో చదివినా, తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించారు. పదమూడవ ఏటనే పద్యాలు రాయడం మొదలెట్టారు. కాలేజీ రోజుల్లోనే ‘శోభ’ అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ,. తెలుగు చదువుతుండగా గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, జాషువా, విశ్వనాథ, కృష్ణశాస్త్రి రచనలతో పరిచయమేర్పడింది. అభ్యుదయ, విప్లవ కవిత్వానికి శ్రీశ్రీ, భావ కవిత్వానికి రాయప్రోలు, సంప్రదాయ కవిత్వానికి విశ్వనాథ సత్యనారాయణ లబ్ధ ప్రతిష్టులుగా వున్నారు. వారు నడచిన బాటనే వెళితే తన ప్రత్యేకత ఏముంటుందని భావించిన సినారె కొత్త ప్రయోగాలకు పూనుకున్నాడు.

1953లో ‘నవ్వని పువ్వు’ తో మొదలైన ఆయన సాహితీ ప్రస్థానం. ఆయన కలం తొంబైకి పైగా పుస్తకాలు, మూడు వేలకుపైగా సినిమా పాటలు ఇంకా ఎన్నో గజల్స్‌, కథల రచనగా సాగిపోయింది. తెలుగు సాహిత్యంలో గజల్స్‌ను మొట్టమొదట ప్రవేశపెటిన ఘనత ఆయనదే. ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక కొత్త ప్రయోగాలకు ఆద్యుడిగా నిలిచిన సినారె సహజంగానే అభ్యుదయవాది. ఆయన రచనలు అనేకం కన్నడం, మలయాళం, హిందీ వంటి దేశీయ భాషల్లోనే గాక రష్యన్‌, ఇంగ్లీష్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌, ఇటాలియన్‌, అరబిక్‌ తదితర విదేశీ భాషల్లోకి కూడా తర్జుమా అయ్యాయి.

ఎన్టీయార్‌ చొరవపై 1962లో సినిమా రంగంలో ప్రవేశించిన సినారె అక్కడ కూడా విశేషంగా రాణించారు. సన్నివేశానికి, సందర్భానికి అనుగుణంగా అద్భుతమైన పాటలు రాశారు. ‘గులే బకావళి కథ’ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ పాటతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం అయిదు దశాబ్దాలకు పైగా సాగింది. ఆణిముత్యాల్లాంటి 3500 పాటలు తెలుగు సినీరంగానికి ఇచ్చారు.

యువ కవులను నిరంతరం ప్రోత్సహించేవారు. ప్రతి జన్మదినం రోజున ఒక కవితా సంపుటి తేవడం గత కొన్నేళ్లుగా ఒక ఆనవాయితీ. కవిత్వమే శ్వాసగా, ప్రగతిశీల మానవతావాదమే లక్ష్యంగా ఎనిమిది పదుల నిండు జీవన ప్రస్థానం సాగించిన సినారె ధన్యజీవి.

 

 

సత్యనిష్టపై దమననీతి – (శనివారం నవీనమ్)

సత్యనిష్టపై దమననీతి – ఎన్ డి టి వి పై సిబిఐ దాడి
(శనివారం నవీనమ్)

అధికారంలో వున్న రాజకీయపార్టీలు తమను విమర్శించేవారిని భయపెట్టి నోరుమూయించే ప్రయత్నాలు, నిర్బంధాలు, వేధింపులు భారతీయ వార్త సంస్థలకు, పాత్రికేయులకు కొత్తవేమీ కావు.

తాజాగా ఎన్‌డిటివి న్యూస్‌ ఛానల్‌ పై బిజెపి నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్త్ను ధోరణి ప్రజాస్వామ్యాన్ని పాతరేసే విధంగా ఉంది.

ఎప్పుడో ముగిసి పోయిన కేసును సాకుగా చూపుతూ సిబిఐ అధికారులు ఎన్‌డిటివి కార్యాలయంలోకి ప్రవేశించి సోదాలు నిర్వహించడం వెనుక, సిబిఐ చెప్పిన కారణాల కన్నా రాజకీయ కారణాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఛానల్‌ కార్యాలయంతో పాటు, దాని వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ నివాసాలపై కూడా దాడులు చేయడం ఉద్దేశ్య పూర్వకంగా వేధింపే

వార్తా సంస్థల కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించడమన్నది తీవ్రమైన చర్య!

మొదటి నుండీ ప్రజాతంత్ర పోరాటాలకు, అభ్యుదయ శక్తులకు వామపక్షాల కార్యక్రమాలకు ఆ ఛానల్‌ ఊతంగా నిలిచింది . ఇటీవల కాలంలో దేశభక్తి పేరుతో ప్రజలపై రుద్దుతున్న మతోన్మాదాన్ని, కాషాయ కట్టుకథలలోని వాస్తవాలను ఆ ఛానల్‌ ప్రజల ముందుంచడాన్ని జీర్ణించుకోలేకే కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్న అభిప్రాయం ఈదాడి తరువాత దేశవ్యాప్తంగా ప్రెస్ క్లబ్బుల్లో పలు చర్చా వేదికల్లో వ్యక్తమవుతోంది. ఎన్‌డిటివి యాజమాన్యం కూడా ఇదే విధమైన ప్రకటనను విడుదల చేసింది.

గత ఏడాది పఠాన్‌కోట ఉదంతం సందర్భంగా అభ్యంతరకర దృశ్యాలను ప్రసారం చేశారంటూ ఎన్‌డిటివి హిందీ ఛానల్‌ ప్రసారాలను ఒక రోజుపాటు నిలిపివేయాలని కేంద్ర సమాచార శాఖ ఆదేశించడం కూడా ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. దీనిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం కావడం, అప్పటికే కేంద్ర మంత్రులు, సైనికాధికారులు చెప్పిన విషయాలనే ఆ ఛానల్‌ ప్రసారం చేసిందని సాక్ష్యాధారాలతో కూడా నిరూపితం కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రసారాల నిలిపివేత ఆదేశాలపై వెనక్కి తగ్గింది. అయితే, జరిమానా విధించింది.

తాజా ఉదంతంలో రుణాన్ని తీర్చకుండా ఆర్థిక నేరానికి పాల్పడి ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారన్నది ఎన్‌డిటివి యాజమాన్యంపై ఆరోపణ. ఈ మేరకు మాజీ కన్సల్టెంట్‌ ఒకరు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఆరోపణల్లోని వాస్తవాలను ఏమాత్రమూ నిర్ధరించుకోకుండానే దర్యాప్తు సంస్థ కొన్ని వ్యాఖ్యలను చేయడం, ఏకంగా దాడులకు దిగడం విస్మయాన్ని కలిగిస్తుంది.

ఐసిఐసిఐ బ్యాంకు సిబిఐకి గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ఎటువంటి ఫిర్యాదూ చేయకపోవడం గమనార్హం. ఐసిఐసిఐ బ్యాంకుకు పూర్తి మొత్తం చెల్లించేశామని, తమకు ఎటువంటి బకాయిలూ లేవని కొన్ని సంవత్సరాలుగా ఎన్‌డిటివి యాజమాన్యం ఆధారాలతో సహా చెబుతూనే ఉంది.

ఇప్పుడు సిబిఐకి ఫిర్యాదు చేసిన వ్యక్తే ఇదే అంశంపై 2013 ఏప్రిల్‌లో ఆర్‌బిఐకి లేఖ రాశాడు. 2016లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. దీనిపై హైకోర్టు ఇప్పటికే ఆయనకు చివాట్లు కూడా పెట్టింది. ఆ కేసు విచారణ ఇంకా సాగుతుండగానే ఆయన సిబిఐని ఆశ్రయించడం, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మినహా మరే ఆధారాలు లేకుండా సిబిఐ దాడులకు దిగడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

దర్యాప్తు సంస్థలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కాంగ్రెస్‌ సర్కారు కూడా ఇదే పనిచేసి అభాసుపాలైంది. ఇప్పుడు బిజెపి ప్రభుత్వమూ అదే బాటలో నడుస్తోంది.

అధికార దుర్వినియోగం కాంగ్రెస్ హయంలో వ్యక్తుల పరంగా జరిగేది. బిజెపి హయంలో వ్యవస్ధాగతమైపోతున్నట్టు వుంది. ఈ పరిస్ధితి సత్యనిష్టకు కట్టుబడిన భారతీయ పాత్రికేయానికి పెను సవాలుగా మారుతున్నది.

పత్రికా స్వేఛ్చపై ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ 190 దేశాల్లో సర్వే చేయగా భారత్‌కు 136వ స్థానం దక్కింది. నిత్య సంక్షోభంలో చిక్కుకుని, యుద్ధ రంగాన్ని తలపించే పాలస్తీనా ఈ సర్వేలో మనకన్నా ఒక ర్యాంకు ముందుంది. ఆఫ్ఘనిస్తాన్‌ 120వ స్థానంలో ఉంది. ఒమన్‌, ఖతార్‌లతో పాటు గల్ఫ్‌ దేశాలవీ మెరుగైన స్థానాలే. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమంటూ, భావ ప్రకటనా స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామంటూ పాలకులు పదేపదే చేసిన ప్రకటనల్లోని డొల్లతనాన్ని ఈ నివేదిక బట్టబయలు చేస్తోంది.

 

రూల్ తప్పొద్దు …అదేపనిగా తిప్పొద్దు (శనివారం నవీనమ్)

రూల్ తప్పొద్దు …అదేపనిగా తిప్పొద్దు
(శనివారం నవీనమ్)

దారీతెన్నూ లేని గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ” గుడ” ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ది చేయడంలో చైర్మన్ గన్ని కృష్ణ ముందు అనేక సవాళ్ళు వున్నాయి. అలాగే కొన్ని సానుకూలతలూ వున్నాయి.

ప్రణాళికా బద్ధమైన నిర్మాణం – రియల్ ఎస్టేట్ రంగాన్ని వెంటనే ప్రభావితం చేస్తుంది…పౌరసమాజానికి మేలు చేస్తుంది. భూమి విలువ ఎక్కడాలేనంత హెచ్చుగా ఈ ప్రాంతంలోనే వుండటంతో ఖర్చులు తగ్గించుకుని తొందర తొందరగా వెంచర్లు పూర్తి చేసే క్రమంలో నియమ నిబంధనలు పక్కన పెట్టడం దేశమంతా జరుగుతున్నదే…మౌలికవసతుల నిర్మాణంలో వేలాదిమంది అన్ స్కిల్డ్  సెమీ స్కిల్డ్, స్కిల్డ్ పనివారికి ఉపాధి ఇచ్చే కన్ స్ట్రక్షన్ రంగం ఆర్ధిక చైర్మన్ గన్ని కృష్ణ ఈ శక్తీ, పలుకుబడీ, ప్రాధాన్యతా, తక్కువేమీ కాదు. ముఖ్యమంత్రులనే నేరుగా కలవగలిగిన ఆ వర్గాల వత్తిళ్ళు అంతా ఇంతా కాదు. వీటన్నిటినీ గన్ని ఎదుర్కొనక తప్పదు. ఏ మాత్రం చూసీ చూడనట్టు పోయినా తరువాత సంవత్సరాల వారు, తరాల వారు ” మొదటే మంచి రోడ్ ఫార్మేషన్ జదగలేదు” అని నెపమంతా తొలి పాలకవర్గం మీదకే నెట్టేస్తారు.

ఈ పరిస్ధితుల్నే తనకు అనుకూలంగా మార్చుకోగల సానుకూలతకూడా గన్ని కృష్ణకే వుంది. ఆయన విద్య, జ్ఞాన సంస్కారాలు, ముక్కుసూటితనం, దృఢమైన వ్యక్తిత్వం అందుకు దోహదపడతాయి.

ప్లాన్ ప్రకారం పార్కులు, రోడ్లు, డ్రెయిన్లు , కమ్యూనిటీ హాళ్ళు నిర్మించాకే లేఅవుట్లు అప్రూవ్ చేసే పాలసీ అమలు చేస్తే అక్కడ నివశించేవారికి ధారాళమైన గాలీ వెలుతురూ పరిశుభ్రతా శాశ్వతంగా ఇచ్చినవారౌతారు.

నియమనిబంధనలు మార్పుచేయకుండా అమలు చేయించగలగాలి..అదే సమయంలో దరఖాస్తుదారులు పదేపదే ఆఫీసుల చుట్టూ తిరగవలసిన రెడ్ టేపిజాన్ని, అవినీతినీ అరికట్టగలగాలి.

ఈ రెండు పనులూ చేయడంద్వారా ప్రజలకు మేలు, పార్టీకి,ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాగలుగుతారు.

నేరుగా ప్రజలు ఎన్నుకున్న పదవిద్వారా గన్ని గుడ చైర్మన్ కాలేదు. ముఖ్యమంత్రి విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన ఈ పదవిలోకి వచ్చారు. వత్తిళ్ళను పక్కన పెట్టడానికి ఇది గన్నికి పెద్ద సానుకూలత. స్వాభిమానం దెబ్బతింటే ఎంతటివారినైనా నిలదీయగల, ఎదిరించగల ఆయన వ్యక్తిత్వం వల్ల పెద్దపెద్ద వత్తిళ్ళు తీసుకు రావడానికి కూడా దాదాపు ఎవరూ సాహసించరు. ఇది కూడా క్రమబద్ధమైన ప్రణాలికాభి వృద్ధికి ఒక సానుకూలతే!!

తనకు వచ్చిన అవకాశం ద్వారా దేశంలోనే ఉన్నత స్ధాయి ప్రయాణాలున్న అభివృద్ధి సంస్ధగా ”గుడ”ను గన్ని కృష్ణ రూపొందించగలరని ఆశిద్దాం!!

ఇది ఖాయంగా అవకాశవాదమే!

ఇది ఖాయంగా అవకాశవాదమే!
(శనివారం నవీనమ్)

ఏ రాజకీయ పార్టీ అయినా మరో రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వడమో, ఉపసంహరించుకోవడమో తప్పుకాదు. అయితే దేనికైనా ఒక ప్రాతిపదిక లేదా సూత్రబద్ధత వుండాలి…విస్తృత ప్రజానీకానికి ప్రయోజనకారిగా వుండాలి…ప్రజలకు జవాబుదారీతనం వుండాలి.

ప్రధాని మోడీ, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి మధ్య బుధవారం కుదిరిన అవగాహనలో ఉభయతారకమైన రాజకీయ ప్రయోజనాలే తప్ప ఇవేమీ లేవు.జగన్‌ మాటలు, ఆంధ్రప్రదేశ్  బిజెపి నాయకుల స్పందనల్లో రాజకీయ ప్రయోజనాలు మాత్రమే కనిపిస్తున్నాయి.

ఏపీలో తెలుగుదేశం తమ ఎమ్మెల్యేలను అక్రమంగా తరలించుకుపోయి కొందరికి మంత్రి పదవులు  కూడా ఇవ్వడంపై జగన్‌ ఢిల్లీ యాత్ర చేసి రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసిన సందర్భంలో ప్రధాని అప్పాయింట్‌మెంటే దొరకలేదు.

ఇప్పుడు అకస్మాత్తుగా జగన్‌కు మోడీ అప్పాయింట్‌మెంట్‌ ఇచ్చి తన వద్దకు పిలిపించుకోవడం ఎందుకో రోజూ పేపర్ చదివే ఎవరికైనా  అర్థమైపోతుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి గెలుపు అంత సుళువు కాదు. ఎన్డీయే బయటి పార్టీల మద్దతు తప్పనిసరి. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలోనే మద్దతు కూడగట్టేందుకు జగన్‌తో ప్రధాని చర్చలు జరిపారనేది స్పష్టం.

ప్రధానితో ప్రత్యేక హోదా, భూసేకరణ, టిడిపి ప్రభుత్వ అవినీతి, రైతులకు గిట్టుబాటు ధర తదితర సమస్యలపై చర్చించినట్లు జగన్‌ చెప్పినప్పటికీ అసలు విషయం రాష్ట్రపతి ఎన్నికలన్నది బహిరంగ రహస్యమే!

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తామని జగన్‌ ప్రకటించారంటే బిజెపి నాయకత్వం ప్రయత్నాలు ఫలించాయనే. కేంద్రంలో మోడీ పాలనపై అబ్బురపడి స్వచ్ఛందంగా ముందుకొచ్చామన్న జగన్ మాటలు నమ్మలేము.

బిజెపి అడక్కపోయినా మద్దతిస్తున్నారంటే మోడీ సర్కారుపై ఇప్పటికిప్పుడు ఎందుకంత ప్రేమ పుట్టుకొచ్చిందో, ఏ ఏ అంశాలను మెచ్చారో ఏపీ ప్రజలకు, అందులోనూ టిడిపి-బిజెపి కూటమిని కాదని తనకు ఓటేసిన వర్గాలకు తప్పకుండా చెప్పాలి. అది కనీస బాధ్యత.

గత ఎన్నికల్లో టిడిపి-బిజెపి కూటమికి వ్యతిరేకంగా ఏపీ ప్రజలు జగన్‌కు ఓట్లేశారు. ఇరుపక్షాలకు మధ్య ఓట్ల వ్యత్యాసం ఒక శాతం లోపు. టిడిపి నుంచి మైనార్టీలు, ఎస్టీలు ఒక్కరైనా గెలవకపోవడానికి కారణం ఆ పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకోవడమే.

ఎస్సీ నియోజకవర్గాల్లోనూ అత్యధిక సీట్లు జగన్‌పార్టీయే గెలుచుకుంది. ఎన్నికల్లో బిజెపి-టిడిపితో జగన్‌ తలపడినందునే మైనార్టీలు, దళితులు, గిరిజనలు, క్రైస్తవులు, ఇతర పేద, అట్టడుగు వర్గాలు, లౌకిక వాదులు జగన్‌కు బాసటగా నిలిచారు. తన పునాదుల ఆకాంక్షలు, మనోభీష్టాలను కాలదన్ని రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి భేషరతుగా మద్దతు పలకడం ప్రజా వంచనే.

మూడేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేకపోగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోతొక్కి రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, తదితర విభజన హామీలకు ఎగనామం పెట్టింది.

ఈ సమస్యలపై బిజెపి ని నిలదీయలేకపోతున్న తెలుగుదేశం మీద మాత్రమే శత్రుత్వాన్ని ప్రదర్శిస్తూ తాను కేవలం టిడిపికే వ్యతిరేకం, బిజెపికి అనుకూలమని చెప్పడం జగన్ అవకాశవాదం. జగన్  ఇరుక్కుపోయివున్న ఆర్ధిక నేరాల కేసులే ఆయనతో ఇలా మాట్లాడేలా చేయిస్తున్నాయని అర్ధం చేసుకోవచ్చు

అయితే, రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టడమే తప్పన్నట్లు జగన్‌ మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం కావించడమే. ఎన్‌డిఏకు మెజార్టీ వుంటే వుండి వుండవచ్చు. గతంలో యుపిఏకి మెజార్టీ ఉన్నా ఎన్‌డిఎ పిఎ సంగ్మాను నిలబెట్టింది. ఇప్పుడు ప్రతిపక్షాలది తప్పయితే అప్పుడు బిజెపిది కూడా తప్పే. వాజపేయి ప్రధానిగా ఉండగా ఎన్‌డిఎ అభ్యర్థిగా అబ్దుల్‌ కలాం రంగంలో దిగినప్పుడు వామపక్షాలు లక్ష్మీ సెహగల్‌ను పోటీలో నిలపడం కలాంపై వ్యక్తిగత ద్వేషంతో కాదు. ఆయనకు మద్ధతు ఇచ్చిన బిజెపిని చూసే. పార్టీలు సిద్ధాంతాలపై ఆధారపడాలే తప్ప అవకాశవాదంపై కాదు.

ప్రత్యేక హోదా, భూసేకరణ బిల్లు తప్ప తమకు, బిజెపికి మధ్య వ్యతిరేకాంశాల్లేవంటున్న జగన్ . 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో బిల్లుకు సవరణలను ప్రోత్సహిస్తున్న బిజెపికి ఆయన ఎలా వత్తాసు పలుకుతారు?

ప్రతిపక్ష “కూటమికి” సోనియా సన్నాహం! (శనివారం నవీనమ్)

ప్రతిపక్ష “కూటమికి” సోనియా సన్నాహం!
(శనివారం నవీనమ్)

నరేంద్రమోదీ నాయకత్వంలో అపూర్వమైన సామర్ధ్యంతో బిజెపి విస్తరిస్తూండగా ప్రాంతీయ పార్టీల స్ధాయికి కుంచించుకు పోతున్న పెద్దపార్టీ కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్ధకమైంది. 2019 ఎన్నికల్లో బిజెపి ని ఓడించడం మాట అటుంచి ఉనికి అయినా మిగులుతుందా అనే దయనీయ పరిస్ధితి కాంగ్రెస్ ముందు వుంది.

ఈ చావుబతుగకుల అవస్ధ నుంచి పార్టీని బయట పడెయ్యడానికి, అనారోగ్యంతో వుండి కూడా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇతర ప్రతి పక్షాలను కూడగట్టే సంప్రదింపులు స్వయంగా మొదలు పెట్టారు.

మోదీ సామర్ధ్యం, కాంగ్రెస్ అసమర్ధ నాయకత్వం బిజెపి విస్తరణకు సమాన కారణాలే!

ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రంలో అధికారం బిజెపి కైవసమౌతుండటం వల్ల ప్రతిపక్షాల ఉనికి ప్రశ్నార్ధకమౌతున్నది. తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ ప్రతిపక్షాల ఉనికిని కాపాడేందుకు పెద్ద ఎత్తున కృషి ప్రారంభించారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా గాంధీ ఢిల్లీ కేంద్రంగా తమ ప్రయత్నాలు చేస్తుంటే మమతా బెనర్జీ క్షేత్ర స్థాయిలో ప్రతిపక్షాలను కూడగట్టేందుకు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. సోనియా గాంధీ ఢిల్లీలో జె.డి యు, సి.పి.ఎం, సి.పి.ఐ, ఎన్.సి.పి తదితర పార్టీల నాయకులతో ముఖాముఖి చర్చలు జరపటం ద్వారా ప్రతిపక్షాల అస్తిత్వాన్ని కాపాడేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ప్రయత్నాలు విఫలం కావటంతో సోనియా గాంధీ తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షాలను సమైక్య పరిచేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభించారు.

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బి.జె.పి సాధించిన ఘన విజయం ప్రతిపక్షాల పునాదులను కదిపివేసింది. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బి.జె.పికి పూర్తి మెజారిటీ లభించినా గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అసమర్థ రాజకీయాల మూలంగా బి.జె.పి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ చొరవ చూపించి ఉంటే గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్ సునాయాసంగా అధికారంలోకి వచ్చేది. దీనితో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో బి.జె.పి గెలిస్తే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే సందేశం ప్రజల్లోకి వెళ్లేది. అయితే రాహుల్ గాంధీ చొరవ లేని రాజకీయం మూలంగా నాలుగు రాష్ట్రాల్లో బి.జె.పి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి పడిపోయింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ తెరమరుగవుతోందనే భయం నెలకొన్నది. సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా పార్టీ రాజకీయాలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర స్థాయిలో బి.జె.పి మినహా మరో జాతీయ పార్టీ అనేదే లేకుండా పోయే పరిస్ధితి నెలకొన్నది. కాంగ్రెస్ విముక్త దేశం అనే నినాదంతో ముందుకు సాగుతున్న బి.జె.పి ప్రాంతీయ పార్టీలను సైతం కబళించే వ్యూహంతో ముందుకు సాగటంతో ప్రతిపక్షాలతో పాటు ఎన్.డి.ఏ మిత్ర పక్షాలు సైతం భయపడుతున్నాయి ఇందుకు శివసేన ఒక ఉదాహరణ. మహారాష్టల్రో ఒకప్పుడు శివసేన ప్రధాన పార్టీ, బి.జె.పి దానికి అనుబంధంగా ఉండేది. ఇప్పుడు పరిస్థితి తారుమారై బి.జె.పి ప్రధాన పార్టీగా అవతరిస్తే శివసేన దానికి అనుబంధ పార్టీగా తయారైంది.

ఒడిశాలో బి.జె.డి కూడా బి.జె.పితో భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు కలిసి రాజకీయం చేసిన బి.జె.పి, బి.జె.డి లు ఇప్పుడు విడి,విడిగా పోటీ చేస్తున్నాయి. ఒడిశా శాసన సభకు 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఒంటరిగా పోటీ చేయనున్నది. 2017 ఆఖరున జరిగే గుజరాత్, ఆ తరువాత జరిగే కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఘన విజయం సాధించే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు.

నరేంద్ర మోదీ పటిష్టమైన నాయకత్వం మూలంగా బి.జె.పి ఉత్తరాదితోపాటు దక్షిణాదిలో కూడా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతోంది. మొదట కేరళ, తెలంగాణా, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తామని బి.జె.పి నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ ముక్త భారత్‌ను బి.జె.పి యుక్త భారత్‌గా మార్చాలన్నది బి.జె.పి, ఆర్.ఎస్,ఎస్ అధినాయకుల కల. ఈ లక్ష్య సాధన కోసం బి.జె.పి అధినాయకత్వం ప్రతిపక్షాలతోపాటు మిత్రపక్షాలను సైతం కబళించేందుకు వెనుకాడటం లేదు. గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం త్రిపుర తదితర మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 2019లో లోకసభ ఎన్నికలు జరుగుతాయి.

దేశంలో ఇప్పుడు నెలకొన్న రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రానున్న అన్ని అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2019లో జరిగే లోకసభ, ఏ.పి, తెలంగాణా తదితర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి, రెండు మినహా మిగతా అన్నింటిని బి.జె.పి, దాని మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నరేంద్రమోదీ ప్రభంజనం మొత్తం దేశాన్ని కుదిపివేస్తోంది. ఒడిశాలో బి.జె.పి గెలిస్తే దాని ప్రభావం పక్కన ఉన్న పశ్చిమ బెంగాల్‌పై పడుతుంది. పశ్చిమ బెంగాల్‌కు పైన ఉన్న అసోంలో బి.జె.పి ఇప్పటికే అధికారంలోకి వచ్చింది. బి.జె.పి విజయ పరంపర ఇలాగే కొనసాగితే 2019 లోకసభ ఎన్నికల నాటికి బి.జె.పి రాజకీయంగా అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంటుంది.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు సతమతమవుతూ సమాయత్తమవుతున్నాయి.

అయితే ప్రతిపక్షాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు సమాయత్తం కాగలుగుతాయా? అనేది అసలు ప్రశ్న. ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెచ్చేందుకు అవసరమైన ప్రస్తుతం సోనియా గాంధీ మినహా ప్రతిపక్షానికి మరో జాతీయ స్థాయి నాయకుడు లేడు. టి.ఎం.సి ఎం.పిలు, నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న మమతా బెనర్జీ జాతీయ స్థాయి నాయకురాలి స్థాయికి ఎదగలేకపోయింది. సీతారాం ఏచూరి తదితర వామపక్షాల నాయకులకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నా అది మేధావి వర్గానికి పరిమితమైంది తప్ప జన సామాన్యలో వారికి గుర్తింపు లేదు. నితీష్‌కుమార్ బిహార్‌కు పరిమితమైపోయిన నాయకుడు. శరద్ యాదవ్, శరద్ పవార్ కూడా ప్రాంతీయ స్థాయిని వదిలించుకోలేకపోయారు. ఆర్.జె.డి అధినాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణల మూలంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. నరేంద్ర మోదీతో సరితూగగల నాయకుడు లేకపోవటం ప్రతిపక్షానికి పెద్ద దెబ్బ. మోదీ దృక్పథం, విధానంతో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయన తప్పులను ఎత్తిచూపిస్తూ దేశ ప్రయోజనం కోసం పనిచేస్తున్నామనే విశ్వాసాన్ని ప్రజలకు కలిగించగలిగే నాయకత్వం ప్రతిపక్షంలో కనబడడం లేదు.

 

జీవితం ఎండాకాలమైపోయింది! (శనివారం నవీనమ్)

జీవితం ఎండాకాలమైపోయింది!
(శనివారం నవీనమ్)

జీవితం ఎండాకాలమైపోయింది! కరెంటుతో కొన్న గాలి, చల్లదనాలకు – ఉష్ణం తగ్గవచ్చు. ఉగ్రత తగ్గదు. మండే కాలంలో బతుకు ఎప్పుడూ చల్లగావుండదు. సత్తువ, సత్తా, అపహరించబడిన మనిషి నిస్సహాయతలా, అశక్తతలా వుంటుంది.

వేసవిలో ఎండలు రాకుండా ఎలా ఉంటాయి అనుకుని సర్దుకు పోడానికి లేకుండా ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి.

గడచిన 137 ఏళ్లలో భూమి మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల జాబితాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఉష్ణోగ్రతలు రెండో స్థానంలో నిలవడం విశేషం. 20వ శతాబ్దంలో నమోదైన సరాసరి ఉష్ణోగ్రత 12.1 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఉష్ణోగ్రతలు 0.98 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలు తేల్చాయి.

ఈ సంవత్సరం 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివిధ అంచనాలను బట్టి తెలుస్తోంది

ఫిబ్రవరి నెల పూర్తి కాకుండానే విజంభించడం మొదలెట్టిన ఉష్ణతాపం మార్చిలో మరింత చెలరేగి, ఏప్రిల్‌ రెండో వారంలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మే నెల రాకముందే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 వరకు చేరాయి. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఉష్ణతాపం 40 డిగ్రీల వరకు చేరి సెగలు పుట్టిస్తున్నాయి. భద్రాచలం, తిరుపతి వంటి పర్యాటక ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఎండ వేడిమి ఉంటోంది. బ్లేజ్‌సిటీగా మారుపేరున్న విజయవాడలో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల వరకు నమోదై హడలెత్తిస్తున్నాయి. చల్లగా ఉండే ఉమ్మడి రాజధాని నగరం హైదరాబాద్‌ హాట్‌హాట్‌గా 40పైనే సలసలా కాగిపోతోంది.

ఇలా ఎండలు మండిపోవడానికి కార్బన్‌ ఉద్గారాల వల్ల భూగోళం వేడెక్కడమే కారణమని, ప్రపంచ దేశాలన్నీ కూర్చుని ఈ సమస్యకు పరిష్కారం చూడకపోతే రానున్న కాలంలో ఉత్పాతాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఎంత చెప్పినా పట్టించకునేవారు లేరు.

ఏ యేటికాయేడు పెరిగిపోతున్న భూగోళ తాపం వల్ల ఎండలు మండిపోవడమే కాదు ధృవాల వద్ద మంచు కరిగి సముద్ర నీటి మట్టం పెరగుతోందనీ దీని వల్ల తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల ముఖ్యంగా బడుగుజీవుల జీవనం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1981-2010 నాటికన్నా ఈ ఏడాది ఆర్కిటిక్‌ సముద్రపు మంచు గుట్టల పరిమాణం వేగంగా…ప్రతి పదేళ్లకు దాదాపు 3 శాతం చొప్పున తరిగిపోతోందని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి.

ఏటేటా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం సమాజంలో బడుగు జీవులపైనే ఎక్కువ ఉంటుంది. రెక్కాడితేనే కాని డొక్కాడని ప్రజలు ఎంలొచ్చినా, వానలొచ్చినా పనిచేయక తప్పదు. అసలే కరువుతో అల్లాడుతున్న ప్రజలకు వేసవిలో నీళ్ల కరువు, పశువుల దాణా కరువు కృంగదీస్తుంది.

ఈ ఏడాది ఎండ వేడితోపాటు వేసవి రాకముందునుండే మంచినీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. వివిధ నివేదికల ప్రకారం దక్షిణాది రాష్ట్రాలలోని జలాశయాలలో నీటి నిల్వలు మార్చి 25 నాటికే 16 శాతానికి పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్నాటక, తమిళనాడులలో ఉన్న 31 ప్రధాన జలాశయాల పూర్తి సామర్థ్యం 51.59 శతకోటి ఘనపుటడుగులుండగా ఆ నీటి నిల్వ ప్రస్తుతం 8 శతకోటి ఘనపుటడుగులకు పడిపోయాయి. దీంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మంచినీరు లేక ప్రజలు అల్లాడుతున్నారు. దేశంలో చాలాచోట్ల ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులే ఉన్నాయి. మంచినీటి సమస్య రానున్న కాలంలో మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

కానీ పరిస్థితి తీవ్రతను ప్రభుత్వాలు గుర్తించినట్లు కనిపించడం లేదు. వేసవి ముదిరి, మంచినీటి సమస్య తీవ్రమయ్యాక ఇంకుడు గుంటలగురించీ, జల సంరక్షణ పథకాల గురించి ప్రచారం చేయడమంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే.

వర్షాల ఓదార్పు లభించకపోతే రానున్న రోజుల్లో భానుడి ప్రతాపం ప్రజలపై మరింత తీవ్రమయ్యే అవకాశముంది. ప్రభుత్వాలు మేలుకుని ఇప్పటినుండే ఉపశమన చర్యలు తీసుకోవాలి.

గాలిలో దీపం – జనం నిరాసక్తం (శనివారం నవీనమ్)

గాలిలో దీపం – జనం నిరాసక్తం
(శనివారం నవీనమ్)

”బడ్జెట్ నిరుత్సాహంగా వుంది” అన్నది పాతమాట! బడ్జెట్ నిరాసక్తంగా వుంది  అన్నది ఐదారేళ్ళుగా ప్రజల్లో పెరుగుతున్న భావన!! ఒక రూపాయి ఎలా వస్తుంది ఎలా ఖర్చవుతుంది అనే ఫార్మేట్ లో గత బడ్జెట్టులు వుండేవి. ఇపుడు ఆఫార్మేటే మారిపోయింది. వచ్చే ఏడాది రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి ఎలా వుండబోతోందో సామాన్యులకు అర్దం కాని పదజాలాలు, ఊహలకు అందని అంకెలు బడ్జెట్టులోకి వచ్చేశాయి. ఆ వివరాలనే ముందు వుంచకుని విశ్లేషించకుంటే మొత్తం ఖర్చులో సగం మాత్రమే సొంత ఆదాయాల ద్వారా వచ్చేదని మిగిలిందంతా అప్పుల ద్వారా, కేంద్రనుంచి వచ్చే గ్రాంటుల ద్వారా రావలసి వుంటుందని అర్ధమౌతుంది.

అంటే బడ్జెట్ లో సగం గాలిలో దీపమేనన్నమాట! అంటే బడ్జెట్ లో సగం కేంద్ర ప్రభుత్వ దయాధర్మాల మీదే ఆధారపడి వుందన్న మాట

ఆంధ్రప్రదేశ్ కి ఈ సారి కూడా యధాప్రకారం భారీ బడ్జెట్‌ భారీ కేటాయింపులు చూపించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదాయానికి మాత్రం అప్పుల మీద, కేంద్ర గ్రాంటుల మీదా ఆధారపడ్డారు. సుమారు 1.57 లక్షల కోట్ల రూపాయల జంబో బడ్జెట్‌లో వాస్తవ ఆదాయం సగమే. మిగిలినదంతా అప్పులు గ్రాంటుల ద్వారా రావాలన్నారు.

ఇప్పటికే రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగి ఉంది. గతేడాది సుమారు ఒకటిన్నర లక్షల కోట్ల రాష్ట్ర అప్పు నేడు రూ. 2.16 లక్షల కోట్లకు పెరిగింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సుమారు రూ. 30 వేల కోట్లు అప్పులు తెచ్చి నెట్టుకొస్తామంటున్నారు. ప్రపంచ బ్యాంకు, జైకా, హడ్కో, నాబార్డు వంటి సంస్థల నుండి అప్పులు తెచ్చి వివిధ కార్యక్రమాలు చేపడతామని మంత్రి బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనడం చూస్తే  ప్రభుత్వం పూర్తిగా అప్పుల మీదే ఆధారపడి వుందని బోధపడుతోంది.

రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం చెల్లించాల్సిన నిధుల ప్రస్తావన లేదు. పైగా  రాజధానిని అప్పులతో నిర్మిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన హామీలను ప్రస్తావించలేదు. ఆ ప్రాంతాల్లో  ప్రయివేటు రంగంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ వంటి పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తామంటున్నారు. కేంద్రం బాధ్యతలను హామీలను ప్రస్తావించకపోవడాన్ని బట్టి. బిజెపి ప్రభుత్వాన్ని నిధుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏడాది కూడా వత్తిడి చేయబోవడం లేదన్న సంకేతం వెలువడుతోంది. రాజకీయంగా ఇది తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత మైనస్ కాగల సూచనలే వున్నాయి.

ప్రజల అభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు పెంచలేదు. ఈ రంగాలకు గత బడ్జెట్‌లో రూ.9,312 కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.9,244 కోట్లు కేటాయించారు. ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే వాస్తవ కేటాయింపులు బాగా తగ్గినట్లే. వ్యవసాయానికి గత ఏడాది సవరించిన బడ్జెట్‌లో 6.4 శాతం నిధులు కేటాయించగా ఇప్పుడు 5.79 శాతానికి తగ్గించేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేసి మూడు సంవత్సరాలుగా ఊరిస్తూ వచ్చిన నిరుద్యోగ భృతిని ఈ బడ్జెట్‌లో ప్రకటిస్తుందని ఊరించారు.గత మూడేళ్లుగా పేదల ఇళ్ల నిర్మాణానికి ఏమాత్రమూ ఖర్చు చేయని ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో మాత్రం ఏకంగా రూ.1,456 కోట్లు కేటాయించింది.

వస్తాయో రావో తెలియని ఆదాయాలను చూపించి ఆదాయం పద్దు పెంచేశారు. రూ. 30 వేల కోట్ల వరకు అప్పులు, రూ. 37 వేల కోట్ల కేంద్ర గ్రాంట్లు వస్తాయో రావో నమ్మకం లేదు. ఉదాహరణకు గత ఏడాది కేంద్ర గ్రాంట్లు సుమారు రూ.27 వేల కోట్లయితే ఇప్పుడు ఒక్కసారిగా పదివేల కోట్లు పెంచి చూపించారు. వివిధ పద్దుల కింద ఆదాయాలను కూడా పెంచి చూపించారు. బడ్జెట్‌లో చూపిన ఆదాయాలు సాధించడం వల్ల కాదని ఇప్పటికే అధికారులు చెప్పుకొస్తున్నారు.

యుపిలో గోవు ఘన విజయం (శనివారం నవీనమ్)

యుపిలో గోవు ఘన విజయం
(శనివారం నవీనమ్)

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్ కు అనుకూలతనో, వ్యతిరేకతనో ప్రతిఫలించలేదు. అదే జరిగి వుంటే అన్ని రాష్ట్రాల ఫలితాలూ ఒకేలా వుండేవి. యూపిలో బిజెపి స్వీప్, గోవా పంజాబ్ లలో కాంగ్రెస్ కు వాలు వుండేవి కాదు.

బిజెపి ”మత ప్రయోగం” మినీ ఇండియాగా పరిగణన వున్న ఉత్తరప్రదేశ్ లో ఫలించడం ఇదే మొదలుకాదు. గతంలోనే అక్కడ ‘అయోధ్య’ బిజెపికి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ సారి ”గోవు” తిరుగులేని ఆధిక్యతను ఇచ్చింది. దీనికితోడు అవినీతి రహిత నరేంద్రమోదీ వ్యక్తిత్వం, సంకల్పం-కృషి, చిత్తశుద్ధి, పట్టుదల బిజిపి గెలుపుని ఈ సారి మహా ఘన విజయంగా మార్చేసింది.

మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం ఇంకా తొలగలేదు. ఆ నిర్ణయం దెబ్బకు దొరకని మనుషులు లేరు…ఇది ఆయనకు రాజకీయంగా భారీ నష్టం కలిగిస్తుందని భావించారు. అయితే బీజేపీకి బలమైన హిందుత్వ అజెండా మళ్ళీ గెలిచింది.

సమాజ్ వాది పార్టీలో కుమ్ములాటల కారణంగా ఆ పార్టీ దెబ్బతింటుందని అంతా చెప్పారు.. అది నిజమే అయింది. అఖిలేశ్ కు ఆదరణ ఉన్నా ఎస్పీపై వ్యతిరేకత రావడం వల్ల ఆ పార్టీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఇది కూడా బీజేపీకి లాభించింది. అంతు మించి గత కొద్దికాలంగా బీజేపీ గోసంరక్షణ విషయంలో దూకుడుగా వెళ్తోంది. అంతర్లీనంగా హిందూత్వ అంశాలతో ముడిపడిన గోసంబంధిత అంశాలు ఎన్నో వివాదాలకు కారణమవుతున్నాయి.

గోవులను వధించేవారిపై దాడులు వంటి మీడియాలో హక్కుల ఉద్యమకారుల్లో వ్యతిరేకత తెచ్చినా సామాన్య హిందూ ప్రజల్లో మాత్రం మోడీపై ఉన్న క్రేజ్ మరింత పెరిగేలా చేశాయి. ఈ దూకుడు వల్ల బీజేపీ – మోడీపై ముస్లింలు వ్యతిరేకత పెంచుకుంటున్నారని.. ఆ ఓట్లన్నీ దూరమవుతాయన్న లెక్కలు వచ్చాయి. కానీ.. అలా దూరమైన ఓట్ల కంటే బీజేపీ గోసంరక్షణ – హిందూత్వ విధానాలకు ముచ్చటపడి ఆ పార్టీకి వచ్చిన హిందూ ఓట్లే ఎక్కువని తేలుతోంది.

ముస్లిం ఓటు బ్యాంకు పొందడానికైనా పోవడానికైనా పరిమిత కారణాలే ఉంటాయి. కానీ.. హిందువుల ఓట్లకు కులాలు.. వర్గాలు.. ముఠాలు.. పార్టీలు.. ఇలా ఎన్నీ ఈక్వేషన్లు. కానీ.. బీజేపీ ప్రో హిందూ అజెండా యూపీలో హిందూ ఓట్లను ఏకం చేసింది. అది ఆ పార్టీకి లాభించింది.

సమాజ్ వాది పార్టీ కానీ కాంగ్రెస్ కానీ తమ సిద్ధాంతాలపై ఎన్నడూ కట్టుబడి లేవు. ఒక్కో ఎన్నికలో ఒక్కోలా ప్రవర్తిస్తాయి. అటు మాయావతికి చెందిన బీఎస్పీ కూడా బహుజనుల పేరుతో మొదలైనా తొలుత దళితులు.. ఆ తరువాత వారితో పాటు బీసీలు.. ఆ తరువాత అగ్రవర్ణాలను కూడా కలుపుకొని ఈసారి వారందరినీ పక్కనపెట్టి ముస్లిం ఓటర్ల కోసం పూర్తిగా వారి పక్షం వహించింది. బీజేపీపై వ్యతిరేకతతో ముస్లింలు తమకు ఓట్లేస్తారన్న అత్యాశతో పూర్తిగా వారిపైనే కాన్సట్రేట్ చేసింది. దీంతో అంతవరకు బీఎస్పీకి అండగా ఉన్న మిగతావర్గాలు బీజేపీ వైపు మళ్లాయి. దీంతో బీఎస్పీకి వచ్చిన ముస్లిం ఓట్ల కంటే పోయిన హిందూ ఓట్లు ఎక్కవయ్యాయి. కానీ… బీజేపీ మాత్రం రాజకీయంగా ఇప్పటికీ జాతీయత హిందూ దేశం.. గోసంరక్షణ వంటి విషయాల్లో ఎవరు దూరమైనా భయం లేదంటూ తమ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. అదే యూపీ ప్రజలకు నచ్చింది.

ప్రజల నెత్తిన బండ (శనివారం నవీనమ్)

ప్రజల నెత్తిన బండ
(శనివారం నవీనమ్)

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపకుండా వంట గ్యాస్‌ ధరలను అమాంతం భారీగా పెంచేసి పేద,సాద జనం వంట ఇళ్లల్లో మంటలు మండిస్తున్నారు.

గృహావసరాలకు వాడే రాయితీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.90, వాణిజ్య సిలిండర్‌పై రూ.148 పెంచుతున్నట్లు చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. ఈ హెచ్చింపులు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తున్నాయి. గత నెలలో 14.2 కిలోల రాయితీ సిలిండర్‌ ధర రూ.738 కాగా ఇప్పుడది రూ.835 అవుతుంది. ఆయిల్‌ కంపెనీలు తాము రూ.90, రూ.148 పెంచుతున్నట్లు వల్లెవేస్తున్నా రాష్ట్రాలు వడ్డించే వ్యాట్‌, రవాణా ఛార్జీలు అమాంబాపతులన్నీ లెక్కేసుకుంటే ఇంకో ఏడెనిమిది రూపాయలు కలుస్తుంది. యుపిఎ ప్రభుత్వం సిలిండర్‌పై ఐదో పదో పెంచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నానా యాగీ చేసేది. ప్రజలపై కాంగ్రెస్‌ ఎనలేని భారాలూ మోపుతోందని విరుచుకుపడేది. అలాంటిది ఉన్నపళంగా వంద రూపాయలు పెంచడం ఏవిధంగా సమంజసమో  ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బిజెపి పెద్దలపై ఉంది.

ఇదేనా కాంగ్రెస్‌ కంటే బిజెపి విభిన్నత? రాయితీ సిలిండర్ల ధరల పెంపును మాత్రమే ప్రజలు మోస్తారని, కమర్షియల్‌ సిలిండర్ల ధరలను వ్యాపారస్తులు భరిస్తారని ఎన్‌డిఎ సర్కారు చేసే వాదనలో అర్థం పర్థం లేదు. పైగా ప్రజలను మోసగించడానికే ఈ టక్కు టమార గారడీ మాటలు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరిగితే వ్యాపారులు వారు ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు పెంచేస్తారు. అంతిమంగా పెంపు భారం మోయాల్సింది ప్రజలే.

ప్రతి పెట్రోలు బంకు దగ్గరా ఇంత మంది ధనికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నారని తాటికాయంత అక్షరాలతో మోడీ ముఖారవిందంతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. నిజంగానే అంత పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఆదా అయితే బీద, బిక్కిపై ఎందుకు అదనపు భారం వేయాల్సి వస్తోంది? ఈ ప్రచారం ప్రజలను క్రమంగా సబ్సిడీలకు దూరం చేయడానికేనని ధరల పెంపు మూలంగా బోధ పడుతోంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎక్కువ రోజులు తగ్గడమో, స్థిర పడటమో జరగ్గా,  పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరలను మోడీ సర్కారు ఎందుకు పెంచుతోందో పెద్ద ప్రశ్న.

గతంలో బ్యారెల్‌ 160 డాలర్లున్నప్పుడు కూడా ఇంతగా పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగలేదు. అలాంటిది రెండేళ్లుగా బ్యారెల్‌ 40-60 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్నా ఎందుకు లెక్కకుమించినన్ని సార్లు ఛార్జీలు పెరుగు తున్నాయో, మతలబు ఏమిటో అంతుబట్టట్లేదు. పైపెచ్చు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ దామాషాలో ప్రజలకు ధరలు తగ్గించట్లేదు సరికదా ఆదాయ లోటు పూడ్చుకునేందుకు వివిధ రకాల సుంకాలను బాదుతోంది. ముడిచమరు ధరలు తగ్గడం వలన ఆయిల్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి ఏడాదికి వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. అయినాసరే, మోడీ ప్రభుత్వం వచ్చాక ఎన్నిసార్లు పెట్రోలు, డీజిల్‌ ఛార్జీలు పెరిగాయో లెక్కే లేదు. చివరికి నిరుపేదలు వినియోగించే సబ్సిడీ కిరసనాయిల్‌ రేట్లు సైతం పెంచిందంటే సర్కారు నైజం ఏమిటో తెలుస్తూనే ఉంది. దేశంలోని సహజ వనరులు, చమురు నిక్షేపాలను రిలయన్స్‌ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేసి, అవి శాసిస్తున్నట్లు ప్రజలపై భారాలు మోపడం అన్యాయం. కాంగ్రెస్‌ హయాంలో కార్పొరేట్ల దోపిడీ తారా స్థాయికి చేరగా, బిజెపి ప్రభుత్వంలో వాటి లూటీ పరాకాష్టకు చేరింది.

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగినప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ ఎన్ని వినూత్న తరహా నిరసన ప్రదర్శనలు చేసిందో తెలుగు ప్రజానీకానికి గుర్తుంది. కాగా ప్రస్తుతం రెండు చోట్లా అధికారంలో ఉన్న టిడిపికి ధరల పెరుగుదల అస్సలుకే కనబడట్లేదు. కనీసం ధరలు తగ్గించాలని కేంద్రాన్ని నామమాత్రం కూడా అడగట్లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు సర్‌ఛార్జీలను వేసి మరీ ఆదాయం పిండుకున్న దుర్మార్గం చంద్రబాబు సర్కారు స్వంతం. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మహిళా సాధికారత అనే అంశం కింద ఎన్నో హామీలు గుప్పించారు. ప్రతి పేద కుటుంబానికీ దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని, ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా ఏడాదికి 12 సిలిండర్లను రూ.వంద సబ్సిడీపై అందజేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదు.

కేంద్రం ఛార్జీలు పెంచిన మీదట రాష్ట్రం సిలిండర్‌పై రూ.వంద సబ్సిడీ ఇస్తే ప్రజలపై కొంతైనా అదనపు భారం తగ్గుతుంది. కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలి. అందుకు రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి చేయాలి.

అంత మాట అనతగునా? (శనివారం నవీనమ్)

అంత మాట అనతగునా?
(శనివారం నవీనమ్)

”రెయిన్ కోటు వేసుకుని బాత్రూమ్ లో స్నానం చేయడం మీకే సాధ్యం” అని భారత ప్రధాని నరేంద్రమోది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ను విమర్శించారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ పై ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలు ధుమారాన్ని రేపాయి.

2G తో మొదలు గనుల దాకా ఒకటేమిటి అన్నిటిని అవినీతి నాయకులు దోచుకున్నారు. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. క్విడ్ ప్రో కో లంచాలు పెరిగిపోయాయి. ఈ పదేళ్ళలో ఆర్ధిక ప్రగతి జరగలేదా అంటే జరిగింది, కానీ జరగాల్సిన దానిలో 10వ వంతు మాత్రమే జరిగింది. “అవినీతి చేసి దోచుకోవడం, సంక్షేమ పథకాల పేరుతో కాస్త ప్రజలకి పంచిపెట్టడం” అనేదే గొప్ప పాలనా విధానంగా మారిపోయింది. ఈ దేశం ఎదగడానికి అనువైన పదేళ్ళ కాలం, మన్మోహన్ అవినీతి పాలన కారణంగా వృధా అయిపోయింది. అక్రమ మార్గాలలో కోట్లు సంపాదించిన నాయకులని వ్యాపారులని చూసిన యువతరం, కష్టపడటం కన్నా అక్రమమార్గాలలో, షార్ట్ కట్ లలో డబ్బు సంపాదించడం బెటర్ అనే భావనలో కూరుకుపోయింది.

ఈజీ మనీ కోసం వెంపర్లాట మన్ మోహన్ సింగ్ హయాంలోనే మొదలైంది. అది ప్రపంచీకరణ వేగం పుంజుకున్న కాలం. దేశవ్యాప్తంగా భారీగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలు మొదలయ్యాయి. ఇందుకు అంతర్జాతీయ ద్రవ్య సంస్ధల నుంచి డబ్బు వెల్లువెత్తడంతో రాజకీయవాదులే దళారులుగా మారిపోయారు. అధికారంలో వున్నవారే అవినీతిపరులైపోవడం ఒక ట్రెండ్ అయిపోయింది.
పనులు ప్రాజెక్టులు చేసేవారుకాక, ఆపని కేటాయింపజేసిన వారు భారీ ముడుపులు అందుకుని రాత్రికి రాత్రే అపరకుబేరులైపోయిన ”క్రోనీ కేపటలిజమ్” దేశమంతా విస్తరించింది. ఆ సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ని ఆశ్రయించివున్న వారిలో కనీసం 15 వందల మంది ఆకస్మిక సంపన్నులైపోయారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ కేసులలోనే కొట్టుమిట్టాడుతన్నారు.

అంతకుముందు రాజీవ్ గాంధీ కూడా బోఫోర్స్ లంచంకేసులో ఇరుక్కుని వున్నవారే! ఆర్ధిక సంస్కరణల విషఫలితంగా అవినీతి ఒక ధోరణై దేశాన్ని ముంచెత్తిన సమయంలో కూడా మన్మోహన్ సింగ్ ఆ మురికికి దూరంగా వున్నారంటే చిన్నవిషయం కాదు. అది ప్రధాని మోదీకి కూడా బాగా తెలుసు.

బరువు, నింద మోయడానికి ఎవరో ఒకరు వుండాలనుకున్నప్పుడు ఆ పాపం మోయవలసిన బాధ్యత కూడా ఆనాటి ప్రధానిదే!

ఇది తెలిసికూడా మోదీ ఇంగితాన్ని పక్కన పెట్టేసి పాత ప్రధానికి కటువుగానే విమర్శించారు. ఒక ప్రధాని మాట్లాడవలసిన స్ధాయిని దిగజార్చి వ్యాఖ్యానించారు.