ట్రంప్ ఒక తలుపు మూసేస్తే మనం రెండోది తెరిచేద్దాం (శనివారం నవీనమ్)

ట్రంప్ ఒక తలుపు మూసేస్తే
మనం రెండోది తెరిచేద్దాం
(శనివారం నవీనమ్)

అమెరికా నలభై ఐదవ అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్‌ వాణిజ్య, ఆర్థిక విధానాలు
భారతదేశాన్ని కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. వాణిజ్యం, ఆర్థిక, ఉపాధి విషయాల్లో ‘ఫస్ట్ అమెరికా’ విధానానికే ట్రంప్ కట్టుబడి వుండటం – పెద్దనోట్ల రద్దు నుండి ఇప్పుడిప్పుడే బైట పడుతున్న మనకు కొంత ఇబ్బందే .

‘ఫస్ట్ అమెరికా’ అనే ట్రంప్ విధానం కూడా మన దేశానికి ఎంతోకొంత కలసి
రాకతప్పదు. ఈ విధానంతో అమెరికాలో మన వారికి ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోవచ్చు. ఈ కారణంగా అమెరికాకు వలస వెళ్లిపోతున్న మన మేధోసంపత్తికి అడ్డుకట్ట పడుతుంది. అమెరికాకు అంకితమైపోయిన మన మేధావులు స్వదేశానికి తిరిగి వచ్చి ఇక్కడి ఏదైనా చేయటం గురించి ఆలోచిస్తారు. ఇన్నాళ్లూ మన దేశంలో పేరుగాంచిన వైద్య కళాశాలలు, ఐఐటి తదితర ఉన్నత విద్యా సంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులు డాలర్ల వేటలో అమెరికాకు వెళ్లిపోతున్నారు. దీనివల్ల మనదేశానికి ఎంత నష్టం కలుగుతోందనేది ఊహించటం కష్టమే.

మైక్రోసాఫ్ట్,పెప్సికోలా, ఎడోబ్, సిటీ గ్రూప్, క్వుస్ట్ డైగ్నాస్టిక్స్,డిలాట్స్, గూగుల్, ఖోరా లాంటి పెద్దపెద్ద సంస్థలను భారతీయులే నడిపిస్తున్నారు. వీరంతా భారత దేశం నుండి అమెరికాకు వలసపోయిన మేధోసంపత్తికి ప్రతీకలు. వీరంతా మన దేశంలోనే ఉండిపోయి ఉంటే అమెరికా స్థాయిలో కాకున్నా మరో స్థాయిలో మన దేశంలోనే మంచి సంస్థలను ఏర్పాటు చేసి నడిపించే వారు. ఇలా జరిగిఉంటే దేశానికి ఎంత మేలు జరిగేదో ఊహించుకోవచ్చు.

హైదరాబాద్ మనది కాదనుకున్నాకే ఆంధ్రప్రదేశ్ లో వున్న రెండోతరం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఎపిలోని ముఖ్యనగరాలమీద దృష్టి పెడుతున్నారని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి.

ట్రంప్ ప్రకటించిన- ‘ఇస్లామిక్ తీవ్రవాదంపై ఉక్కుపాదం’ విధానం కూడా భారత్‌కు మేలే కలిగించాలి. జమ్ము-కాశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అదుపుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తోంది. మతోన్మాద ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషించినంత కాలం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అదుపుచేయటం దాదాపు అసాధ్యం. సౌదీ అరేబియా లాంటి కొన్ని ఇస్లామిక్ దేశాలు తీవ్రవాదాన్ని తమ ప్రయోజనాల కోసం పెంచి పోషించటంతోపాటు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. తీవ్రవాదాన్ని కొ న్ని దేశాల వారు రాజకీయావసరాలకు ఉసిగొల్పుతున్నారు. తీవ్రవాదం మూలంగా భారతదేశంతోపాటు పలు ఐరోపా దేశాలకు కంటిపై కనుకులేకుండా పోతోంది. చైనా సైతం ఇస్లామిక్ తీవ్రవాదంతో బెంబేలెత్తిపోతోంది. అందుకే పాకిస్తాన్‌తో తమకున్న సరిహద్దులను భద్రం చేసుకునేందుకు చైనా గోడ కడుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అణిచివేస్తానన్న తన మాటను నిలబెట్టుకుంటే మన దేశానికి పెద్ద బెడద తప్పినట్టే.

అమెరికా తదితర అభివృద్ది చెందిన దేశాలు ఇన్నాళ్లూ ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబించేవి. పాకిస్తాన్ తదితర దేశాల పట్ల కఠినంగా వ్యవహరించకుండా తీవ్రవాదాన్ని అణిచివేస్తామనే ప్రకటనలు చేసేవి. అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రాంతాల్లో తీవ్రవాదం పట్ల ఒక రకంగా స్పందిస్తూ, భారత్‌లో జరిగే తీవ్రవాదుల దాడుల పట్ల మరో రకంగా స్పందించేవి. అమెరికా తన దేశంలో ట్విన్ టవర్‌పై జరిగిన దాడికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేయవచ్చు కానీ ముంబయి, భారత పార్లమెంటుపై తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతిగా పాకిస్తాన్‌ను మన దేశం దండించకూడదు.

పాకిస్తాన్‌లో తలదాచుకున్న తాలిబాన్ అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చేందుకు అమెరికా సైనికులు అబొట్టాబాద్‌పై మెరుపుదాడి చేయవచ్చు. కానీ, ముంబయి పేలుళ్ల ఘటనకు సూత్రధారి దావుద్ ఇబ్రహీం, పార్లమెంటుపై దాడి చేసిన లష్కరే తయ్యబా అధినేత అజర్ మసూద్ లాహోర్‌లో స్వేచ్ఛగా తిరుగుతుంటే భారత్ నోరు మూసుకుని కూర్చోవాలి.

అమెరికా,చైనాతోపాటు ప లు అభివృద్ధి చెందిన దేశాలు ఇస్లామిక్ తీవ్రవాదం విషయంలో ద్వంద్వ వైఖరిని పాటిస్తున్నందునే ‘ఐసిస్’ లాంటి భయంకర ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు పురుడు పోసుకున్నాయి. పాకిస్తాన్ తదితర ముస్లిం దేశాలు మతోన్మాద తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తే భారత్‌కే కాదు మొత్తం ప్రపంచానికి ఎంతో మేలు కలుగుతుంది.

తమ ఆయుధాల ఎగుమతి కోసం ఇస్లామిక్ తీవ్రవాదాన్ని వాడుకుంటున్న అభివృద్ధి చెందిన దేశాల ఆలోచనా విధానం మారనంత వరకు ఉగ్రవాదం అదుపులోకి రాదు. ట్రంప్ మాటలు కార్యరూపం దాల్చితే ఇస్లామిక్ తీవ్రవాదం నిజంగానే అంతమొందుతుంది.

అమెరికాలో ఇప్పుడు ‘స్థానిక అమెరికాతత్వం’ బాగా పెరిగిపోతోంది. భారత్ సహా ఇతర దేశాల వారు అమెరికా పౌరసత్వం తీసుకున్నా, వారి పట్ల తెల్లవారికి చిన్నచూపు ఉన్నదనేది అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్పష్టం చేశాయి. ట్రంప్ మంచివాడు కాదు, అధ్యక్షపదవికి సరిపోడని ఎవరు ఎంతగా ప్రచారం చేసినా తెల్ల అమెరికన్లు ఆయనకే ఓటు వేసి గెలిపించటమే ఇందుకు నిదర్శనం. ఎవరి ఇష్టాయిష్టాలు ఎలా వున్నా అయిపోయినదాన్ని ఎవరూమార్చలేరు. ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుకుంటుందన్న సూత్రాన్ని నమ్మాలి మనం కూడా ఇకనైనా భారతీయతకే పెద్దపీట వేయటం మొదలుపెట్టాలి.

పెద్దనోట్ల రద్దు – పాసా ఫెయిలా? 5 రాష్ట్రాల ఎన్నికలు ఏంచెబుతాయి!! (శనివారం నవీనమ్)

పెద్దనోట్ల రద్దు – పాసా ఫెయిలా?
5 రాష్ట్రాల ఎన్నికలు ఏంచెబుతాయి!!
(శనివారం నవీనమ్)

పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో జరుగుతున్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించకపోతే ఆ పార్టీ ప్రతిష్టతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరువుకు భంగం కలుగుతుంది. మిగతా నాలుగు రాష్ట్రాల కన్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మోదీకి, బిజెపికి కఠిన పరీక్షే అవుతుంది.

యుపిలో బిజెపి బలాన్ని కోల్పోతే కి మోదీ పెత్తనాన్ని ప్రశ్నించేందుకు పార్టీలో ఇతరులకు దారిదొరుకుతుంది. మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత శాసనసభలకు ఎన్నికలు జరగటం ఇది మూడోసారి. మొదటి సారి మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించగా బిజెపి విజయం సాధించింది. రెండోసారి డిల్లీ, బిహార్ శాసనసభలకు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది.

‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించడంతో మోదీ ఎంతో సాహసోపేతంగా పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోదీ దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలిస్తానని, విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానని శపథం చేశారు. అవినీతి, బాధ్యతారాహిత్యం, అలసత్వం వంటి అవలక్షణాలను నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. దేశాన్ని సరైన మార్గంలో పెట్టేంత వరకు నిద్రపోనంటూ ఆయన ప్రజలకు ఎన్నో ఆశలు కలిగించారు.

ఆయన మాటలపై ప్రజల్లో నమ్మకం కుదరడంతో 2014 అక్టోబర్‌లో మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాలు ఘన విజయం సాధించాయి. ఇది జరిగిన కొన్నాళ్లకే 2015లో బిహార్, దిల్లీ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి గట్టిదెబ్బతిన్నది.

ఒకప్పుడు బిహార్‌లో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌కుమార్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని విభేదించారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించడాన్ని నిరసిస్తూ 2015 ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆర్‌జెడి తదితర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేయడం ద్వారా బిహార్‌లో మోదీ ప్రభంజనానికి నితీష్ అడ్డుకట్ట వేసి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అలాగే, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనుకున్న బిజెపికి ఘోర పరాజయం ఎదురైంది.

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణను అమలు చేసేందుకు మోదీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టటం వల్లనే డిల్లీ ఎన్నికల్లో రాజధాని ఓటర్లు బిజెపిని ఓడించారు.ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా కార్యాలయాలకు చేరుకోవాలంటూ మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని ఉద్యోగులు గట్టిగా వ్యతిరేంచినందుకే డిల్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో డిల్లీ లోని మొత్తం ఏడు సీట్లనూ బిజెపి గెలుచుకుని ప్రత్యర్థులను మట్టి కరిపించింది. మోదీ పట్ల కలిగిన విశ్వాసం మూలంగానే దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలో బిజెపి అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగుర వేశారు.

అదే ఓటర్లు 2015లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షంగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి బిజెపిని ఓడించారు. బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశ పెట్టినందుకు నిరసనగానే ఉద్యోగవర్గాలు బిజెపి పట్ల ఇలా వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.

ఇక, పెద్దనోట్ల రద్దు మూలంగా అష్టకష్టాలు పడిన ప్రజలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయరనే గ్యారంటీ ఏదీ లేదు. నల్లధనాన్ని అదుపుచేసేందుకు తాను తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని మోదీ చెబుతున్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల ముందు గంటల తరబడి పడిగాపులు పడినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారని, తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదని ఆయన వాదిస్తున్నారు. పేదల సంక్షేమం కోసమే పెద్దనోట్లను రద్దు చేశానని, దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కుదుటపడుతుందని ఆయన అంటున్నారు.

మోదీ చెబుతున్నట్లు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తే గనుక- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించాలి. పెద్దనోట్లను రద్దు చేసే ముందు నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆయన కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అందుకే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయకతప్పలేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఆమూలాగ్రం కదిలించి వేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవితాలు పెద్దఎత్తున ప్రభావితం అయ్యాయి. నగదు కోసం నానాపాట్లు పడిన వీరంతా మద్దతు ఇస్తేనే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ పరువునిలుస్తుంది.

మరోవైపు నోట్లరద్దును అతి పెద్ద కుంభకోణంగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రయత్నించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినపుడు మోదీ సహారా,బిర్లా గ్రూపుల నుండి భారీగా ముడుపులు పుచ్చుకున్నారంటూ మమత తీవ్రస్థాయిలో ఆరోపించారు.

బిఎస్‌పి అధినేత్రి, యుపి మాజీ సిఎం మాయావతితోపాటు వామపక్షాలు కూడా పెద్దనోట్ల రద్దును తప్పుపట్టాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవా తగ్గితే విపక్షాల విమర్శలకు బలం చేకూరినట్టే.

ఆడు మగాడ్రా బుజ్జీ ! (శనివారం నవీనమ్)

వాళ్ళు కేవలం జల్లికట్టు కోసం వెంటనే రోడ్డెక్కారు

మనం ప్రత్యేక హోదా కోసం ఇంట్లోనే కూర్చున్నాం.
వాళ్ళు సెంటిమెంటు దెబ్బతింటే ఒప్పుకోవడం లేదు.
మనం రాష్ట్రం ఏమైపోయినా పట్టించుకునేదే లేదు.
వాళ్ళు మూడురోజుల్లో కేంద్రాన్ని కదిలించారు. మనం మూడేళ్ళయినా అన్నీ మూసుకుని కూర్చున్నాం.
అక్కడ సినిమా – రాజకీయం ఏకమైంది.
ఇక్కడ సినిమా – రాజకీయం రాజీ పడింది.

అరవోడు మగాడు రా బుజ్జీ !
మరి ఆంధ్రోడు…?

తమిళనాడులో పశువులకు – మనుషులకు మధ్య జరిగే ‘జల్లి కట్టు’ పోటీ ఒక సాంప్రదాయం మాత్రమే ! ఒక సెంటిమెంటు మాత్రమే !! జల్లికట్టును నిషేధించడం వల్ల ఆ రాష్ట్రం భౌతికంగా నష్టపోయేదేమీ లేదు.

విభజన సందర్భంగా అన్ని పార్టీల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వగలమని అత్యున్నత చట్టసభలో హామీ ఇచ్చిన బిజెపి – నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వాగ్ధానాన్ని తుంగలో తొక్కేశారు. ఆంధ్రులు చేయగలిగింది ఏదీ లేదని చీదరించుకోవడం కూడా మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా ఏమైందని ఎవరైనా ప్రశ్నిస్తే విసుక్కోవడం కసురుకోవడం కూడా మొదలుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ పట్ల విపరీతమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం 38 మంది ఎంపీలు వున్న ఎఐడిఎంకె – ఎంపిల మద్దతు కోసం ఎంత సిగ్గుమాలిన పనికైనా తెగబడిపోగలదని చట్టబద్ధం కాని జల్లికట్టును ఆమోదించడం ద్వారా నిరూపించుకుంది. మోదీగారు బోధించే విలువలు అవసరానికి మాయమైపోతాయని రుజువు చేసుకుంది.

ప్రత్యేక హోదా విషయంలో ఒక్క పవన్‌ కళ్యాణ్‌ మినహా మరే నటుడూ నోరు విప్పలేదు. జల్లికట్టు విషయంలో తెలుగు నటులందరూ పోటీపడి తమిళనాడు సెంటిమెంటును బాహాటంగా సమర్ధించారు. తమిళ ప్రేక్షకుల మార్కెట్‌ పోతుందన్న భయమే తప్ప వీళ్ళకి జల్లి కట్టు పట్టదు. ప్రత్యేక హోదా పట్టదు.

యధా రాజా తధా ప్రజ అన్నట్టు ఈ విషయంలో రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పు పట్టక తప్పదు. కేంద్రంతో తగాదాపెట్టుకుంటే రాష్ట్ర నిర్మాణానికి నిధుల కొరత, నిబంధనల చట్రం అడ్డుపడిపోతాయన్న చంద్రబాబు భయాన్ని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో సెంటిమెంటుని గెలిపించుకున్న తమిళ ప్రజల విజయాన్ని అభినందించక తప్పదు. ఆ అభినందనలతోపాటే మన వైఫల్యాలు కూడా గుర్తు రాక తప్పదు.

ఆడు మగాడ్రా బుజ్జీ ! అనుకోవడం తప్ప ఇప్పటికైతే మనం చేసేది ఏదీ లేదు !!

అచ్చాదిన్ ఎక్క‌డ‌? అవాస్త‌లే ఇక్క‌డ‌!

అచ్చాదిన్ ఎక్క‌డ‌? అవాస్త‌లే ఇక్క‌డ‌!
(శనివారం నవీనమ్)

నోటుపై వేటుకు నేటితో 50రోజులు అయింది. మ‌రి మోదీ ప్ర‌క‌టించిన మంచి రోజులు ఎక్క‌డా కాన‌రావ‌టం లేదు. మోదీ భ‌జ‌న‌లో బ్ర‌తుకుతున్న పెద్ద‌లు! నోరు విప్పండి. పెద్ద‌నోట్లు ర‌ద్దు ప్ర‌క‌టిస్తూ మోదీ ఉద్వేగ పూరిత ప్ర‌క‌ట‌న‌తో ఉదాత్త ల‌క్ష్యాలుః

1. న‌ల్ల‌ధ‌న నిర్మూల‌న‌
2. న‌కిలీ నోట్ల నివార‌ణ‌
3. అవినీతిపై పోరు
4. ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం
న‌లుపు తెలుపైయిందా?

మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో సుమారు 86శాతంగా 500, 100నోట్లే. వీటి విలువ 15.5లక్ష‌ల కోట్లు ఇందులో 30శాతం అంటే 5ల‌క్ష‌ల కోట్లు న‌ల్ల డ‌బ్బు ఇది వెన‌క్కి రాద‌ని. ఆ డ‌బ్బుతో ప్ర‌భుత్వానికి మిగిలి పోతుంద‌ని దానితో మౌలిక స‌దుపాయాల‌కు నిధులు వెల్లు వెత్తిస్తామ‌ని క‌ల‌లు క‌న్నారు. కానీ జ‌రిగింది. డిశెంబ‌ర్ 10నాటికే 14 లక్ష‌ల కోట్లు బ్యాంకుల‌కొచ్చాయి.

2వేల నోట్లు మార్కెట్‌లోకి వ‌చ్చిన నాలుగురోజుల‌కే అన్ని ఉగ్ర‌వాదుల వ‌ద్ద ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. ఐటి దాదుల్లో దొరికి అవి మ‌రి ఏ నోట్లు?

అవినీతికి కొత్త‌దారులు అవినీతి కొత్త పోత‌లు దొరికింది మండ‌ల స్థాయి అధికారి నుండి చెన్నైయి. కాంట్రాక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి దాకి ఏసీబి, సిబీఐ, ఐటీల‌కు ప‌ట్టుబ‌డిన ప్ర‌తి చోట పెద్ద నోట్లు కొత్త‌వే మరి బ్యాంకింగ్‌లో కొత్త అవినీతి మొద‌లైంది. 2వేల నోట్లు న‌కిలీ నోట్లు అప్పుడు మార్కెట్‌లో అందుబాటులో వున్నాయి. మ‌రి సాధించిన‌ది ఏమిటి?

7 – 8 శాతం ఆర్థికాబివృద్దిలో రేటుతో ప‌రుగులు తీస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ ఈ దెబ్బ‌తో చ‌తిక‌ల ప‌డ్డ‌ది. చిల్ల‌ర వ్యాపారం చిక్కుల్లో ప‌డింది. కూలీ జీవులు కూన‌రిల్లి పోయారు. చిన్నా, చిత‌క రైతులు చిత్తైపోయినారు. ఆహార భ‌ద్ర‌త, గ్రామీన ఉఫాధి ద‌య‌నీయమైంది. బ్యాంకుల వ‌ద్ద‌, ఎటియంల వ‌ద్ద నిల్చున్న వారిలో 100పైనే విగ‌త జీవులైనారు. మ‌రి అచ్చాదిన్ ఎక్క‌డా?

అనుకున్నది ఒకటి…అవుతున్నది ఇంకొకటి

ఆర్ధిక మాంద్యం వైపు దేశం అడుగులు?
నోట్ల రద్దులో అతిపెద్ద సైడ్ ఎఫెక్ట్
(శనివారం నవీనమ్)

ఆర్ధిక రంగంలో అత్యంత సురక్షితమైనదిగా వున్న భారత బ్యాంకింగ్ వ్యవస్ధ పట్ల పెద్దనోట్ల రద్దు , అనంతర పరిణామాల్లో ప్రజల విశ్వాసం దిగజారింది. ఇది విదేశీ పెట్టుబడిదారులను కలవరపరచే విషయం…ప్రధాని మోదీగారి ”మేక్ ఇన్ ఇండియాకు అవరోధం. మరోవైపు ప్రపంచ ఆర్ధిక రంగాన్ని నిర్దేశించే అమెరికా సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది…ఈ పరిణామాలన్నీ కలసి విదేశీపెట్టు బడులను ఉపసంహరించుకునేలా చేస్తున్నాయి…ఇప్పటికే దేశం నుంచి 200 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని స్టాక్ మార్కెట్ల అంచనా!

పెద్దనోట్లు రద్దు చేసిన 50 రోజుల్లో డబ్బు కంట్రోలుపై కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకు 64 సార్లు రూల్స్ మార్చారు. జనాల్ని కష్టపెడుతున్న కేంద్రప్రభుత్వం ముందుచూపులేకుండా అత్యంత మౌలికమైన మార్పునకు తెగబడ్డారని పదేపదే రూల్స్ మారుస్తూండటానికి అర్ధం…జనాలు ఆర్ధిక సమస్యల్లో సతమతమౌతూండగా వారిని గట్టెకించే మార్గాలపై మోదీగారి ఆలోచనలు ఇంకా ప్రయోగాల దశలోనే వున్నాయని దీని అర్ధం.

ఆర్థిక సంక్షోభం పరిష్కారం కాని పక్షంలో 2017లో మనదేశం నుంచి భారీఎత్తున విదేశీ పెట్టుబడులు ఉపసంహరణ జరిగే ప్రమాదం ఉంది. నోట్ల రద్దుతో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం పట్ల, బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గింది. ప్రస్తుతం కొత్త రూ.2000 నోట్లను జారీ చేసినా, ప్రభుత్వం మళ్లీ దీనిని ఉపసంహరించవచ్చుననే భావన ప్రజల్లో తలెత్తింది.

డిమానిటైజేషన్‌తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దేశాన్ని ఆర్థిక మాంద్యం వైపు నెట్టే ప్రమాదం ఉందని ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కరెన్సీ రద్దు తిరోగమచర్య అని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్య సేన్‌ పేర్కొనడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే జీడీపి వృద్ధి రేటు 2 శాతం తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

దేశంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరిన నల్ల డబ్బును నిర్వీర్యం చేసేందుకు, పన్ను ఎగవేత దారులను, దొంగనోట్ల చలా మణి దారులను దెబ్బతీసేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబరు 8 న ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రకటించారు.
అయితే నోట్ల రద్దు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపో యింది. చలామణిలో ఉన్న రూ. 15.87లక్షల కోట్ల నోట్లలో 80 శాతం చెల్ల కుండా పోయాయి. ఆ ప్రకటన తరువాత కొత్త 500, 2000 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకువస్తున్నట్లు ప్రకటన వెలువడింది. పాత నోట్లు డిపాజిట్‌ చేసి, కొత్త నోట్లు తీసుకునేందుకు దేశ ప్రజలకు డిసెంబర్‌ 30 వర కూ గడువు ఇచ్చారు. రద్దయిన నోట్ల స్థానే ప్రజలందరికీ సరిపడా చిల్లర నోట్లు, కొత్త నోట్లు బ్యాంకులకు చేరకపోవడంతో జనం కటకటలాడుతున్నారు.

100 కోట్ల మందికి పైగా జనం కనీస అవసరాలకోసం చేతిలో చిల్లర లేక ఇబ్బంది పడుతున్నారు. కరెన్సీ సంక్షోభం కారణంగా లక్షలాది మంది రోజువారీ కూలీలు, ఉపాధి కూలీలు ఉద్యోగాలు కోల్పోతున్నారు. చిన్న వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్‌ లావాదేవీలు, రియల్‌ ఎస్టేట్‌ నుంచి పలు రంగాలలో కార్యకలాపాలు స్తంభించి పోయాయి. దేశంలో 90 శాతం లావాదేవీలు నగదు రూపంలోనే జరుగుతాయి. ఆ నగదే మాయం కావడంతో వ్యవసాయ మార్కెట్లు, ఫ్యాక్టరీ లలో ఉత్పత్తులు, రవాణా తో సహా పలు రంగాల్లో సంక్షోభం ఏర్పడింది. ఇదంతా ఆర్థిక మాంద్యం సూచనే!

నోట్ల రద్దుతో మెజారిటీ ప్రజలకు ప్రభుత్వం పట్ల, బ్యాంకింగ్‌ వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గింది. ప్రస్తుతం కొత్త రూ.2000 నోట్లను జారీ చేసినా, ప్రభుత్వం మళ్లీ దీనిని ఉపసంహరించవచ్చుననే భావన ప్రజల్లో తలెత్తింది. ఈ సారి 100 నోట్లను రద్దు చేస్తారని, బంగారంపై ఆంక్షలు విధిస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రజల సెంటిమెంటు మార్కెట్లను నడిపిస్తుంది.

ఇదే సమయంలో బినామీ ఆస్తులపై కొరడా ఝళిపిస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించ డం విశేషం. ఆదాయపు పన్ను చట్టం సవరణ, లెక్కల్లో చూపని నల్లధనం పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తామన్న ప్రకటనలు ప్రజల్లో భయాందోళ నలను పెంచుతున్నాయి. ఇంతవరకూ భవిష్యత్‌ అవసరాలకు పొదుపు చేసు కునే లక్ష్యంతోనే సాగుతున్న జన జీవనం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. ప్రస్తుతం తమకు వస్తున్న ఆదాయాన్ని ఎలా కాపాడుకోవాలా అనే స్థితిలో ప్రజ లు ఉన్నారు.

అంతర్జాతీయంగా అత్యధికంగా చమురు వినియోగించే దేశాల్లో భారత దేశం ఒకటి. మన చమురు వినియోగం పూర్తిగా విదేశాల నుంచి దిగుమ తులపైనే ఆధారపడి ఉంది. ఇటీవలి కాలంలో చమురు ధరలను నియంత్రించే ఒపెక్‌ దేశాలు చమురు ధరలను పెంచాయి. దీంతో మనదేశంలోనూ చమురు ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు మరింత పెద్ద మొత్తంలో చెల్లింపులు తప్పక పోవచ్చు. అంటే, విదేశీ మారక ద్రవ్యం మరింత తరలి పోతుంది.

పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ప్రజల చేతుల్లో చిల్లర నోట్లు లేకపోవడం వల్ల కొనుగోలు సామర్థ్యం తగ్గింది. తమ వద్ద గల పెద్దనోట్లను డిపాజిట్‌ చేసిన తరువాత, బ్యాంకులవద్ద క్యూ లైన్లలో నిలిచి తెచ్చుకున్న అతి కొద్ది చిల్లర నోట్లను అత్యవసరాలకే వాడుకుంటున్నారు. విలాస వస్తువులు, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లను జనం వాయిదా వేసుకుంటున్నారు. అటు ప్రజల చేతుల్లో, ఇటు బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో మార్కెట్‌లో డిమాండ్‌ తక్కు వగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం ఆర్థిక మాంద్యం వైపు పోవడం ఖాయమే.

బ్యాంకుల్లో డిపాజిట్‌ అవుతున్న లక్షలకోట్ల డబ్బును ప్రభుత్వ రుణభారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉంది. అది సమంజసమే.

ఈ నేపథ్యంలో మోడీ సర్కార్‌ తక్షణం కళ్లు తెర వాలి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలకు నడుం బిగించాలి. కరెన్సీ సంక్షోభాన్ని వీలైనంత త్వరగా నివారించాలి. పన్ను ఎగవేత దారులను కనిపెట్టి పన్నులు వసూలు చేసేందుకు కఠినమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెండున్నర ఏళ్లుగా మోడీ సర్కార్‌ `మేక్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో విదేశీ పెట్టుబ డులను ఆకర్షించేందుకు యత్నించిందే తప్ప కనీసం పదో వంతు శ్రద్ధ కూడా దేశంలో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చూపలేదు. దేశంలో బిజి నెస్‌ సంస్థలను, వ్యాపార వర్గాలలో విశ్వాసం పాదుకొలిపి ప్రోత్సహించాలి. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపు ప్రభావం మనదేశంపై ఉండకుండా చూడాలి. నోట్ల రద్దు పుణ్యమా అని బ్యాంకుల్లో భారీ ఎత్తున జమ అయిన మొత్తాన్ని మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తే, తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

కానీ, ఇదంతా ఇప్పటికిప్పుడు జరిగేదికాదు… ప్రజలు తేరుకోడానికి నెలలు…ఆర్ధిక రంగం ఉత్తేజితం కావడానికి సంవత్సరాలు పడుతుంది. ద్రవ్య చలామణి నుంచి వైదొలగిన 66 శాతం డబ్బు తిరిగి రొటేషన్ లోకి వచ్చేదాకా ఎకనామిక్ స్టిమ్యులేషన్ వుండదు…ఉపాధి అవకాశాలు పెరగవు…ప్రజల కొనుకోలు శక్తులు పతనమౌతాయి…అయితే పూర్తిగా 66 శాతం డబ్బునీ చెలామణిలోకి తెచ్చేది లేదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతున్నారు.

అన్ ఎకౌంటెడ్ ఎకానమీ ధ్వంసం తారుమారౌతున్న జనజీవనం

అన్ ఎకౌంటెడ్ ఎకానమీ ధ్వంసం
తారుమారౌతున్న జనజీవనం
(శనివారం నవీనమ్)

బ్లాక్ మనీ ని, అవినీతిని పాతరేస్తానన్న ప్రధాని నరేంద్రమోదీ 40 నుంచి 45 శాతం మంది కి జీవనాధారమైన అన్ అకౌండెడ్ ఎకానమీని ధ్వంసం చేసేస్తున్నారు. అన్ అకౌండెడ్ ఎకానమీ నుంచి బ్లాక్ ఎకానమీ, బ్లాక్ ఎకానమీ నుంచి బ్లాక్ మనీ పుట్టుకొస్తాయి.

అవినీతి సంపాదనను మూడు రకాలుగా ఆర్ధిక వేత్తలు వర్గీకరిస్తారు. అన్ అకౌంటెడ్ ఎకానమీ, అన్ అకౌంటెడ్ ఇన్ కమ్, బ్లాక్ మనీ. ఈ మూడింటిని నిర్మూలించేందుకు స్ధిరంగా, దీర్ఘకాలికంగా, వ్యవస్థీకృతమైన చర్యలు చేపట్టగలిగితేనే సమాజం నుండి చట్ట విరుద్ధమైన ఆర్ధిక ప్రక్రియలను తుడిచిపెట్టగలం. ఈ మూడింటిలో శక్తివంతమైనది, అసలైనది అన్ అకౌంటెడ్ ఎకానమీ. బ్లాక్ ఎకానమీ వల్ల బ్లాక్ ఇంకమ్ నిరంతరం పుడుతూ ఉంటుంది. ఈ బ్లాక్ ఎకానమీ లో కొద్దీ భాగం మాత్రమే బ్లాక్ మనీ గా పోగుపడుతుంది. అనేకమంది ఆర్థికవేత్తలు ఇప్పటికే చెప్పినట్లుగా నల్ల డబ్బు ప్రధానంగా రియల్ ఎస్టేట్ లో, షేర్ మార్కెట్ లో, అక్రమ వ్యాపారాల్లో, బంగారం తదితర విలువైన లోహాల్లో, విదేశీ ఖాతాల్లో ఉన్నది. డబ్బు రూపంలో ఉన్నది చాలా తక్కువ. ఆ తక్కువ మొత్తాన్ని వెలికి తీయడంలో కూడా డీమానిటైజేషన్ విఫలం అయింది.

ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రకటించిన ‘పాత అధిక విలువ నోట్ల రద్దు’ వల్ల ఆశించిన ఫలితం అలా ఉంచి కనీస ఫలితం కూడా దక్కే సూచనలు కనిపించడం లేదు. “నల్ల డబ్బుని నిర్మూలించి డబ్బు నిల్వలను శుభ్రం చేసి, టెర్రరిజం ధన వనరులపై దెబ్బ కొట్టి, దొంగ నోట్లకు చోటు లేకుండా చేయడమే నోట్ల రద్దు లక్ష్యం” అని మొదట ప్రధాని ప్రకటించారు. ఆ తర్వాత ఈ లక్ష్యం పైన నిలబడకుండా మాటలు మార్చుతూ పోయినప్పటికీ జనం మాత్రం ఆ లక్ష్యం కోసమే పాత పెద్ద నోట్లు రద్దు చేశారని, భవిష్యత్తులో ఎదో గొప్ప మార్పు జరగనున్నదని ఇప్పటికి నమ్ముతున్నారు.

కానీ ఇప్పటివరకు బ్యాంకుల్లో జమ అయిన పాత నోట్లను బట్టి చూస్తే మోడీ ప్రకటించిన ‘నల్ల డబ్బు నిర్మూలన లక్ష్యం నెరవేరే సూచనలు ఏ మాత్రం కనిపించడం లేదు. బ్లూమ్ బర్గ్ న్యూస్ ప్రకారం డిసెంబర్ 3 తేదీ నాటికి బ్యాంకుల్లో 12.6 లక్షల కోట్లు విలువ గల పాత పెద్ద నోట్లు (రు 1000/- రు 500/- నోట్లు) జమ అయ్యాయి. నోట్ల రద్దు ప్రకటించేనాటికి దేశంలో 15.3 లక్షల కోట్ల విలువ గల పాత నోట్లు చలామణిలో ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. అందులో 5 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉంటుందని భావిస్తున్నామని చెప్పింది. నోట్లు పెద్ద మొత్తంలో జమ అవుతుండడంతో అంచనాను తగ్గించుకుని 3 లక్షల కోట్ల వరకు నల్ల డబ్బు ఉండవచ్చని కొందరు మంత్రులు అంచనా వేశారు.

12.6 లక్షల కోట్లు అంటే చలామణిలో ఉన్న మొత్తంలో 82 శాతానికి సమానం. ఇంకా ప్రకటించకుండా (బ్యాంకుల్లో జమ చేయకుండా) మిగిలి ఉన్న మొత్తం రు 2.7 లక్షల కోట్ల రూపాయలు. పోస్ట్ ఆఫీసుల్లో 35 వేల కోట్లు (0.35 లక్షల కోట్లు) జమ అయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తాన్ని కూడా మినహాయిస్తే ఇక జమ కావలసింది 2.25 లక్షల కోట్లు మాత్రమే. జమ చేసేందుకు డిసెంబర్ 30 వరకు సమయం ఉన్నది. కాబట్టి మిగిలిన మొత్తం కూడా బ్యాంకుల్లో జమ అయిన ఆశ్చర్యం లేదు.

పోనీ ఇప్పటి వరకు జమ అయిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నా, 2.25 లక్షల కోట్లు మాత్రమే జమ కావలసి ఉన్నది. ఇది మొదట ప్రకటించిన 5 లక్షల కోట్ల నల్ల ధనంలో సగం కంటే తక్కువ. సవరించుకున్న 3 లక్షల కోట్ల కన్నా కూడా తక్కువే. జమ అయిన మొత్తం తెల్ల డబ్బు కిందనే లెక్క. కనుక మోడీ ప్రకటించినట్లు గా ‘డబ్బు నిల్వలను శుభ్రం చేసే ప్రక్రియ’ ఘోరంగా విఫలం అయినట్లే.

కానీ పాత నోట్లలో అసలే నల్ల డబ్బు లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్రమ సంపాదన నోట్లలో ఉంటుంది. అందులో అనుమానం లేదు. కానీ ఉన్న డబ్బులో అత్యధిక మొత్తం జమ అయిందంటే ఏమి జరిగినట్లు? ఒకటి: నల్ల ధనం తెల్ల ధనంగా మార్చుకునే అవకాశం డీమానిటైజేషన్ చర్య కల్పించింది. అంటే మరో రూపంలో అవినీతికీ, అక్రమానికీ పాల్పడమే జరిగింది తప్ప అవినీతి నిర్మూలన ఏ మాత్రం జరగలేదు. రెండు: డీమానిటైజేషన్ వల్ల బ్యాంకుల్లో, ఆఫీసుల్లో, వ్యాపారంలో అవినీతి మరియు అక్రమ కార్యకలాపాలు ఏ మాత్రం తగ్గలేదు.

కొత్త నోట్ల కట్టలు కోట్ల కొద్దీ పట్టుబడుతున్న నేపథ్యంలో నల్ల ధనం పోగేసి మార్గాలను ఏ ప్రభుత్వమూ, కనీసం బీజేపీ ఏలుబడిలో రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ముట్టుకోలేదని స్పష్టం అవుతున్నది. పైగా బీజేపీ పార్టీ శాఖలే డీమానిటైజేషన్ రోజున పెద్ద ఎత్తున పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు వెల్లడి అయింది. ఉత్తర ప్రదేశ్ లో అధికార పార్టీ పాత నోట్లలో ఇఛ్చిన చందాలను వెనక్కి తీసుకుని కొత్త నోట్లలో ఇవ్వాలని చందాదారులు ఆదేశించినట్లు తెలుస్తున్నది. బ్యాంకుల అధికారులు ధనికుల ఇళ్లకు వెళ్లి కొత్త నోట్లు ఇఛ్చి పాత నోట్లు మార్చుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ని అక్రమాలు యధేచ్చచగా సాగుతున్నప్పుడు ఇక నల్ల డబ్బు, అవినీతి ఆగిందెక్కడ?

5 లక్షల నల్ల డబ్బు తేలితేనే కేంద్ర ప్రభుత్వానికి 50 వేల కోట్లు డివిడెండ్ వస్తుందని ఆర్ధిక శాఖ కార్యదర్శి కొద్దీ రోజుల క్రితం చెప్పారు. దేశ వార్షిక బడ్జెట్ చూస్తేనేమో 16 లక్షల కోట్లకు పై మాటే. ఇంత బడ్జెట్ లో 50 వేల కోట్లు ఏ మూలకు వస్తుంది? ఈ డివిడెండ్ తో నేనా మోడీ ప్రభుత్వం ప్రజలకు అదనపు సంక్షేమ చర్యలు తీసుకునేది? బడ్జెట్ లోటు పూడ్చుకునేది ఈ 50 వేల కోట్లతోనేనా? ఎంత హాస్యాస్పదం! ఎంత మోసం!!

పెనం నుంచి పొయ్యిలోకి…

పెనం నుంచి పొయ్యిలోకి…
(శనివారం నవీనమ్)

పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ప్రజల్ని ఉద్దరించడానికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్య వల్ల నెలరోజులుగా ప్రజల జీవితం అతలాకుతలమైపోయింది…పెనం మీది నుంచి పొయ్యిలోకి…కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యింది…కొండ నాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడింది…ఈ సామెతలన్నీ నెలరోజులుగా భారతప్రజానీకానికి అనుభవమౌతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకు రూ.11.55 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ చెప్పారు. మరో రూ.3.5 లక్షల కోట్లు డిపాజిట్టయితే, చలామణిలో ఉన్న పాత నోట్లన్నీ బ్యాంకులకు చేరినట్లే! డిపాజిట్లకు ఇంకా 20 రోజుల గడువు ఉండటంతో ఆ మొత్తం కూడా దాదాపుగా బ్యాంకులకు చేరే అవకాశమే ఉంది. అదే జరిగతే నల్లధనంపై యుద్ధమన్న ప్రధాని ప్రకటన నిజం కాదని తేలిపోయినట్టే! డిపాజిట్‌ అయిన నోట్ల స్థానంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లనే ఆర్‌బిఐ ముద్రించింది. రద్దయిన నోట్ల పూర్తి మొత్తానికి కొత్తనోట్లు ముద్రించేది లేదని ఆర్ధిక మంత్రి స్పష్టం చేసేశారు. దీని అర్థం రానున్న రోజుల్లోనూ నోట్ల కష్టాలు తప్పవనే! దీనిని దృష్టిలో ఉంచుకునే డిపాజిట్లపై పరిమితులను తొలగించడానికి ఆర్‌బిఐ సిద్ధ పడలేదు. కొత్త నోట్లనూ దాచుకోవద్దని ఆర్‌బిఐ గవర్నర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో వ్యవస్థలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు ఈ పిలుపునకు సానుకూలంగా స్పందించే పరిస్ధితి లేదు!

రానున్న రోజులు మరింత గడ్డుగా మారనున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకనున్నాయని, నిరుద్యోగం పెరగనుందని, అన్ని రంగాల్లోనూ దేశం వెనకబాటు తప్పదన్న సూచనలు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షా సమావేశం సూచించింది. పరపతి విధాన సమీక్ష కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ నిర్వహించిన అయిదో సమావేశం ఇది. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన మొదటి సమావేశం ఇది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 7.6 నుండి 7.1 శాతానికి వృద్ధి రేటు తగ్గనుందని ఆర్‌బిఐ పేర్కొంది. అయితే, ఈ అంచనా కూడా వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక రంగ నిపుణుల అంచనాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. వారు చెబుతున్న సమాచారం ప్రకారం 6.5 శాతానికి వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడం ఖాయం.

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి గణనీయంగా పెరిగి, రుణాలు ఇవ్వడానికి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి వస్తాయని, వడ్డీ రేట్లు తగ్గుతాయని, ఫలితంగా వృద్ధి రేటు పరుగులు తీస్తుందని పార్లమెంటు బయట ప్రధాని పదే పదే ఊదరగొట్టారు. ఆయన మాటలతో కనీసం 25 బేసిక్‌ పాయింట్ల మేర వడ్డీ పాయింట్లు తగ్గుతాయని పలు కార్పొరేట్‌ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆర్‌బిఐ దానికి భిన్నంగా స్పందించడం నోట్ల రద్దు వ్యవహారంలోని సంక్లిష్టతకు అద్దం పడుతోంది. ఒక్క బేసిక్‌ పాయింట్‌ కూడా తగ్గించడానికి ఆర్‌బిఐ సిద్ధ పడలేదు.

ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. సెన్సెక్స్‌ నష్టాల బాట పట్టింది. నగదు కొరత వెంటాడుతుండటం, విత్‌ డ్రాయిల్స్‌పై పరిమితిని ఎత్తివేయక పోవడం వంటి చర్యలు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.నోట్ల రద్దు తరువాత నగదు నిల్వల నిష్పత్తిని నూరు శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకున్నప్పటికీ, దాని వల్ల ఫలితం అంతంత మాత్రమే! నిత్యావసర ధరల అదుపు దిశలో ఎటువంటి చర్యలూ ప్రకటించక పోవడం సామాన్యునికి శరాఘాతమే!

నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశ వ్యాప్తంగా పప్పుల ధరలో పెరుగుదల కనిపించింది. కూరగాయల ధరల్లో కొద్ది మాత్రం తగ్గుదల కనిపించింది. తగ్గిన కూరగాయల ధరలనే పరిగణలోకి తీసుకున్న రిజర్వు బ్యాంకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని అంచనా వేయడం గ్రౌండ్ రియాలిటీస్ ని పక్కనపెట్టేయడమే!

ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురుధరలు పెరుగుతుండటంతో రానున్న కొద్ది మాసాల్లో పెట్రోలు ధరలు 8 నుండి 10 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుని నడ్డి విరుగుతుంది.

ఎక్కడికి చేరుతామో తెలియని ప్రయాణం!

ఎక్కడికి చేరుతామో తెలియని ప్రయాణం!
(శనివారం నవీనమ్)

అందరినీ ఆకస్మికంగా బస్సులో కుక్కేశారు. ఎక్కడికి వెళుతున్నామో లోపలున్నవారికి తెలియదు. ఒక పక్క లోతైన అగాధం మరోపక్క ఎక్కలేమేమోనన్నంత కొండ!
అతి ఇరుకైన ప్రమాదకరమైన రోడ్డు ప్రయాణం.
డ్రయివర్ ఎక్కడికి తీసుకుపోతున్నాడో డ్రయివర్ కి తప్ప ఎవరికీ తెలియదు.

పెద్దనోట్లు రద్దయినప్పటి నుంచీ భారతదేశం స్ధితీగతీ ఇలాగే వుందని చెప్పవచ్చు. దారితెలియకపోయినా నరేంద్రమోదీ గారు బస్సు నడిపేస్తున్నారన్న అనుమానం ప్రయాణీకుల రక్తపోటుని పెంచేస్తోందని కూడా పోల్చవచ్చు!

దేశంలో నల్లధనాన్ని లేకుండా చేయడానికే ప్రధాని నరేంద్రమోదీ పూనుకున్నారా లేక మోదీ అదే పనిలో వున్నారని దేశంలో ప్రతీ ఒక్కరూ అనుకోవాలనే ఇంతటి ఆర్ధిక బీభత్సాన్ని సృష్టించారా?

ప్రత్యామ్నామాలు లేకుండా 86% చలామణిలో వున్న కరెన్సీకి రద్దు చేయడం వల్ల ప్రజలు డబ్బుకోసం బ్యాంకులు, ఎటిఎంల ముందూ 18 రోజులుగా క్యూలో పడిగాపులు పడుతూనే వున్నారు. ఇదంతా తాత్కాలిక కష్టమేనని సరిపెట్టుకున్నా, డబ్బు చలామణి స్ధంభించి వేలవేల వ్యాపారాల్లో లావాదేవీలు నిలచిపోయాయి. ఫలితంగా కోట్లమందికి పని లేకుండాపోతోంది. ఇదే పరిస్ధితి నెలల తరబడి కొనసాగితే క్రమంగా చిన్న వ్యాపారాలు అంతరించిపోతాయి. ఉపాధి అవకాశాలు మందగిస్తాయి. కొనుగోలు శక్తులు తగ్గిపోతాయి. దేశ ప్రగతే మందగిస్తుంది.

దేశంలో నాలుగు లక్షల కోట్ల వరకు నల్లధనం కరెన్సీ రూపంలో ఉన్నదని ఆర్థిక నిపుణుల అంచనా. అందులో స్వచ్ఛంద ఆదాయ ప్రకటన పథకం అమలు ద్వారా 65 వేల కోట్లు బయటికి వచ్చింది. ఇంక మిగిలింది దాదాపు మూడున్నర లక్షలు. డిసెంబరు 30 వరకు ఇచ్చిన గడువును ఉపయోగించుకొని వివిధ అక్రమ లేదా సక్రమ మార్గాలలో నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చుకొనే పనిలో నల్లధనాన్ని పోగేసుకొన్న వారు వున్నారు.

ఇంకా మిగిలిన నల్లధనాన్ని ఈ ఆర్థిక సం.లో సముపార్జించుకొన్న‌ ఆదాయం క్రింద రిజర్వ్ బ్యాంకు వద్ద‌ అఫిడవిట్ దాఖలు చేసుకొని ఆదాయపు పన్ను చెల్లించడం ద్వారా బయటపడటానికి 2017 మార్చి 31 వరకు అవకాశం వుంది. వీటన్నిటి వల్లా నల్లధన కుబేరులు పాత పెద్ద నోట్ల రద్దు మూలంగా పెద్దగా నష్టపోయే స్ధితి లేదు.

పెద్ద నోట్ల రద్దు ప్రభావం గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధమీద తీవ్రంగా వుంది. నగదు లావాదేవీలపైనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా ఆధారపడి ఉన్నది. పెద్ద నోట్లు రద్దు చేయబడి 18 రోజులు అయ్యింది. కూలీలకు వేతనాలు చెల్లించ‌డానికి గానీ, ఎరువులు, క్రిమిసంహారక మందులు కొనుక్కోవడానికి గానీ రైతుల చేతుల్లో వంద రూపాయల లోపు కరెన్సీ నోట్లులేవు.

జిల్లా కేంద్ర‌ సహకార బ్యాంకులు, సొసైటీలకు నగదు లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా రిజర్వ్ బ్యాంకు నిషేధాన్ని విధించింది. ఫలితంగా, రైతాంగంలో కొందరు వ్యవసాయంలో ఆర్జించుకొన్నఆదాయం పెద్ద నోట్ల రూపంలో దాచుకొన్న వారు సహకార సంస్థల నుండి తీసుకొన్నరుణాలను తిరిగి చెల్లించి విముక్తులవుదామన్నా వీల్లేని పరిస్థితి. దాని మూలంగా భవిష్యత్తులో కొత్త పంట రుణాలు తీసుకోవడానికి అర్హతను కోల్పాతారు. కోడి గుడ్లు, కూరగాయలు, పండ్లు తదితర వ్యసాయోత్పత్తులను డబ్బు కొరత ముసుగులో తక్కువ ధరలకు దళారులు కొంటూ రైతాంగాన్ని మరింత దోపిడీ చేస్తున్నారు.

ఏం ఫరవాలేదు… అన్నీ సర్ధుకుంటాయి అని చెప్పేవారే తప్ప ఆర్ధిక వ్యవస్ధ ఎప్పటికి ఎలా కుదుటబడుతుందో చెప్పగల నిపుణులు కనబడటం లేదు. కుదుటబడటంలో ఆలస్యమయ్యే కొద్దీ వ్యవస్ధ కూలిపోవడం చిన్న వ్యాపారాలతో మొదలౌతుంది. అదెలా వుంటుందో ఈ ఉదాహరణే చెబుతుంది…

ఒక చిన్న కారులో ఇంటీరియర్స్ కోసం 15 నుంచి 25 వేల రూపాయలు ఖర్చవుతుంది. ఇందులో ఆయా వస్తువుల ధర 60 శాతం వుంటుంది.

25 శాతం పనివారి జీతాలు లేదా పీస్ రేట్ చెల్లింపులకు ఖర్చవుతుంది. వ్యాపారి కి 15 శాతం రాబడి వుంటుంది. షాపు అద్దె, నిర్వహణ, కుటుంబ ఖర్చులు, లాభం ఈ 15 శాతం నుంచే సర్దుకోవాలి.

ఈ 60 ధరలోకూడా ముడిసరుకు, కాఖ్ఖానా నిర్వహణ, స్కిల్డ్, సెమి స్కిల్డ్ పనివారికి చెల్లింపులు, పారిశ్రామిక వేత్త ఆదాయాల కింద విడిపోతుంది.

రాజమహేంద్రవరంలోని ఒక కార్ డెకార్స్ 9 మందికి ఉపాధి కల్పించేది. పెద్దనోట్ల రద్దు వల్ల ఏర్పడిన మాంద్యం కారణంగా ఇపుడు ఆపని 5 గురికే పరిమితమైంది.

ముఖ్యంగా చిన్న కారు ఓనర్లందరికీ బ్లాక్ మనీ లేదు. వీరిలో హెచ్చుమంది అవసరం కోసమో, కంఫర్ట్ కోసమో బ్యాంక్ లోన్ తో కారు కొనుక్కున్నవారే!

ఒక వేళ కారు ఓనర్లందరూ బ్లాక్ మనీ వున్నవారే అనుకున్నా కూడా వారి కార్ల మీద ఆధారపడి సర్వీసు రంగంలో జీవిస్తున్న ఏ ఒక్కరికీ బ్లాక్ మనీలు లేవు.

” కారు ఇంటీరియర్ అత్యవసరాలు కాదు. కంఫర్ట్ గా వున్నపుడే ఖర్చుపెట్టే ఐటమ్ ఇది. పన్నెండేళ్ళనుంచీ ఈ బిజినెస్ చేస్తున్నాను. తొమ్మిదిమంది కుర్రవాళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళ జీతాలు షాపు అద్దె కరెంటుబిల్లు నెలకి లక్షరూపాయలు అవుతుంది. బిజినెస్ ఎప్పటికి కుదుటబడుతుందో తెలియదు. ఇప్పటి వరకూ కూడబెట్టుకున్నది కరిగించుకుని నాలుగైదు నెలలు బిజినెస్ లేకపోయినా స్టాఫ్ ని పోషించగలను…ఆతర్వాతైనా బిజినెస్ కుదుటపడకపోతే నా పరిస్ధితి ఏంటి ఫామిలీ ఏమైపోవాలి? పనిలేదు కదా అని స్టాఫ్ ని తీసేస్తే తిరిగి బిజినస్ పుంజుకున్నాక వీళ్ళు దొరుకుతారా…సంవత్సరాల తరబడి తయారుచేసుకున్న వర్కర్ల ప్లేసులో కొత్తవారిని తయారు చేయడానికి ఇంకెంతకాలం పడుతుంది? ఏంచేయాలో తెలియడం లేదు…నిద్రపట్టడం లేదు” అని నా ఫ్రెండ్ అయిన ఒక కార్ డెకార్స్ వ్యాపారి బాధపడుతున్నాడు!

ఇన్ ఫార్మల్ సెక్టార్లలో జీవిస్తున్న వారికి ఆదాయాలు వ్యయాల సర్దుబాటు డిసెంబరునెలలో చాలా చాలా చాలా చాలా కష్టం…జనవరిలో చాలా చాలా చాలా కష్టం…ఫిబ్రవరిలో చాలా చాలా కష్టం…మార్చిలో చాలా కష్టం…ఆ తరువాత కష్టాలు అలవాటైపోతాయి.

అంతకుమించి ఈ రంగంలో చాలా కుటుంబాల జీవన గమనాలు మారిపోతాయి. జీవితాలు కష్టాలపాలైపోతాయి….

నరేంద్రమోదీగారు లాగేసుకుంటున్న జీవితాల లెక్కలు కొన్నేళ్ళ వరకూ మందలు మందలుగా బయటకు వస్తూనే వుంటాయి.

 

ఇది ”చిల్లర” సమస్య కాదు

ఇది ”చిల్లర” సమస్య కాదు
పెద్ద చేపలు చిన్నవాటిని మింగేసే ప్రమాదం
(శనివారం నవీనమ్)

రోజూ కారు తుడిచి, ఐదురోజులకోసారి కడిగి పాలిష్ పెట్టి, పదిరోజులకోసారి వాక్యూమ్ క్లీనర్ తో లోపల తుడిచే మాధవ్ తో డిసెంబర్ ఒకటి నుంచి నీ సర్వీసు అవసరం లేదని చెప్పాను. అప్పటికే అతను డల్ గా వున్నాడు. మరికొందరు కూడా అతని పని అవసరం లేదని చెప్పి వుంటారని అతన్ని చూడగానే అర్ధమైపోయింది.

మాధవ్ ఔత్సాహిక యువకుడు. ప్రొఫెషనల్ కారు డ్రైవర్. 40 కి పైగా చిన్నకార్లున్న మా అపార్టు మెంటులోకి వచ్చి క్లీనింగ్ క్లాత్, షాంపూ, లిక్విడ్ డెటర్జంట్లు నావే! నెలకు 500 ఇవ్వండి కారు క్లీన్ గా వుంచుతాను అన్నాడు. అతని చొరవ, ఉత్సాహాలే అతనికి 15 వరకూ కార్ల క్లీనింగ్ అవకాశాన్ని ఇచ్చింది.

సర్వీసు సెక్టార్ లో ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయో? ఎలా పెంచుకోవచ్చో తరచు చెప్పే చంద్రబాబు నాయుడు మాటలకు మాధవ్ ఒక ఉదాహరణై నిలుస్తాడు.

నేను కూడా సర్వీసు సెక్టార్ లో జీవిస్తున్న వాడినే! జనవరి నుంచి డ్రైవర్ ని పెట్టుకుంటే నా ఏజ్ దృష్ట్యా కంఫర్ట్ బుల్ గా వుంటుందని ఆలోచిస్తున్నాను. పెద్దనోట్ల రద్దు తరువాత మారుతున్న పరిస్ధితులను గమనిస్తున్నాను. నా అంచనా ప్రకారమే ఈ రోజు ఉదయమే ఒక అడ్వటైజర్ నాకు ఫోన్ చేశారు. ”మన యాడ్ ప్లాన్, షెడ్యూల్స్ కాన్సిల్. న్యూ, చీపర్ మెథడ్స్, టెక్నాలజీస్ ఆలోచించండి.” అన్నారు!

ఆయన నిర్ణయం వల్ల వచ్చే నాలుగు నెలల్లో నా ఆదాయాల్లో 30/40 వేలరూపాయలు తగ్గిపోతుంది. దీంతో డ్రైవర్ ను పెట్టుకునే ఆలోచనను డిలిట్ చేసేశాను.

నా ఆదాయాలన్నీ చెక్కులద్వారా వచ్చేవే! నాదగ్గర అన్ అకౌంటెడ్ డబ్బు లేదు. సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల వచ్చిన అవకాశాలను అందుకుని జీవనప్రమాణాలను పెంచుకుంటున్న అనేకమందిలో నేను ఒకడిని!

బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్యల వల్ల చిల్లరదొరక్క ప్రజలు ఎదుర్కొంటున్న తాత్కాలిక కష్టాలను పక్కనపెడితే అనేకరంగాలు కోలుకోడానికి ఆరునెలల నుంచి మూడేళ్ళు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజల నిత్యావసరాలలో ఒకటైన వస్త్రాల వ్యాపారం నిలదొక్కుకోడానికే ఆరునెలలు పడుతుంది. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగాలు ఎప్పటికి కోలుకుంటాయో తెలియదు.

1978 జనవరి 15 న అప్పటి ప్రభుత్వం 1000, 5000,10000 రూపాయల నోట్లను రద్దు చేసింది. అపుడు నేను సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ఆవార్త దినపత్రికల్లో చూసినపుడు ఇన్నేసి రూపాయల నోట్లు కూడా వుంటాయా అని ఆశ్చర్యం కలిగింది. అపుడు వందరూపాయల నోటునాకు తెలుసు. అపుడు నేను నా చేతుల మీదుగా ఖర్చుపెట్టినవి హెచ్చుగా రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లే! ఇపుడు నా కొడుకులు ఖర్చు పెడుతున్న నోట్లలో చిన్నవి వంద రూపాయల నోట్లు! ఇంతగా పెరిగిపోయిన క్యాష్ వాల్యూమ్ వెనుక ప్రపంచవ్యాప్తమైన ఆర్ధిక ధోరణులు వున్నాయి.

ప్రయివేటీకరణ విధానాలను ఆసరాగా చేసుకుని
అధికారంలో వున్న రాజకీయవేత్తలు, అధికారుల పాల్పడిన అవినీతి కూడబెట్టే ధనాన్ని ”క్రోనీ కేపిటలిజం” అంటారు. ఇది ప్రపంచమంతటా వున్నదే! ఇండియాకు సంబంధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఆకస్మిక క్రోనీ కుబేరులైపోయిన వారి సంఖ్య 2 వేలకు చేరింది. లంచాల డబ్బుని వారు ఆస్ధులుగా మార్చేయడం, ఆ ఆస్ధులు ఆదాయ వనరులుగా మారడం జరిగింది. ఈ క్రమంలోనే సర్వీసు రంగం కూడా విస్తరించింది. అవినీతితో సంబంధం లేకపోయినా కూడా సర్వీసు సెక్టారు పటిష్టంగా విస్తరిస్తోంది.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో విదేశీ బ్యాంకుల నుంచి 75 లక్షలకోట్ల రూపాయల నల్లధనాన్ని తీసుకువస్తామని ఉత్త మాటలు చెప్పిన నరేంద్రమోదీ ఆపని వదిలేసి దేశమంతటినీ బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టేశారు. వంద, యాభైనోట్లు లేకుండా చేసేసి ప్రజలకు నరకం చూపిస్తున్నారు.

ప్రభుత్వం చెబుతున్నట్టు ఎటిఎంలలో డబ్బు లేకపోవడం, చిల్లర దొరక్కపోవడం తాత్కాలిక ఇబ్బందే కావచ్చు. ఇపుడు కష్టపడుతున్నా ఇది మంచిపనే అని మధ్యతరగతి ప్రజలు టివిల ముందు చెప్పడం ఆశ్చర్యంగా వుంది.

ఇది మహా అయితే నెలరోజులు వుండే అసౌకర్యమే కావచ్చు. డబ్బు చెలామణి లేక ఏర్పడే ఆర్ధిక మాంద్యం వల్ల అనేకరంగాలు చతికిలబడిపోయి ఏర్పడే నిరుద్యోగ సమస్యలకు, మూసుకుపోయే ఉపాధి అవకాశాలకు పరిష్కారాలు ఏమిటో చెప్పేవారు.

ఈ రంగాల్లో యజమానులుగా వున్నవారు తెరమరుగైపోతారు. జీవించడానికి ఎక్కడెక్కడో ఉద్యోగులైపోతారు. వైట్ మనీ వున్న పెద్దపెద్ద కంపెనీలు ఆయా రంగాల్ని ఆక్రమించుకుంటాయి. ఇప్పటికే పరచివున్న రెడ్ కార్పెట్ మీదుగా విదేశీ పెట్టుబడులు చతికిలబడిన దేశీయ రంగాల్లో దర్జాగా ప్రవేశిస్తాయి.

బ్లాక్ మనీని ఆపెయ్యడానికి మోదీగారు తీసుకున్న చర్యలు స్వదేశీ రంగాలను చావగొట్టి చెవులు మూస్తుండగా ఆస్ధానాల్లోకి ”స్వదేశీ, విదేశీ పెద్దచేపలు” చొరబడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దుపై ఆర్ధిక నిపుణులు ఇంకా లోతైన విశ్లేషణలు ప్రారంభించలేదు. మరి ”చిన్న ఇబ్బందులను ఓర్చకుందాం”…అని బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న వాళ్ళు ఎందుకు ఎలా అంటున్నారో నాకు అర్ధం కావటంలేదు.

ఫేజ్ మారుతున్న దశలో దేశీయంగా ఎకనామిక్ స్టిమ్యులేషన్ ఆగిపోతే మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన, ఉపాధి అవకాశాల పెంపుదల ఎలా సాధ్యమో నాకు బోధపడటం లేదు

అందుకే నేను చాలామంది మాదిరిగా మోదీగారికి చప్పట్లు కొట్టలేకపోతున్నాను. – పెద్దాడ నవీన్

బెస్ట్ ప్రాక్టీసెస్ పై గన్నీస్ అవార్డులు

(శనివారం నవీనమ్)

దేశ, విదేశాల్లో పేరుప్రఖ్యాతులు వున్న కార్డియోథరాసిక్ సర్జన్ పద్మశ్రీ, డాక్టర్ యాళ్ళ గోపాల కృష్ణ – గన్ని సత్యనారాయణమూర్తి స్మారకోపన్యాసం ఇచ్చి అవార్డుని అందుకున్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని దిగువమధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి తెచ్చిన మరొక కార్డియాలజిస్టు డాక్టర్ పి రమేష్ -గన్ని సుబ్బలక్ష్మి స్మారకోపన్యాసం ఇచ్చి అవార్డుని అందుకున్నారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం గన్ని కృష్ణ, డాక్టర్ గన్ని భాస్కరరావు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ వైద్యరంగంలోని నిష్ణాతులతో ఏడాదికోసారి స్మారకోపన్యాసాలను ఇప్పించి, సైటేషన్ తో, గోల్డ్ మెడల్ తో, నగదుతో సత్కరిస్తారు. ఇలా మొదటిసారి 2016 సంవత్సరానికి స్మారకోపన్యాసం చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే 92.8 శాతం సక్సెస్ రేటుతో పదివేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో పనిచేసే గోఖలే తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో నెలకోసారి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు.

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా అవిభక్త ఆంద్రప్రదేశ్ లో మొట్టమొదటి బెలూన్ వేసన రమేష్ తనపేరుమీదే రమేష్ హాస్పిటల్ స్ధాపించి గుండెస్ధితిగతుల పై మండల కేంద్రాల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఇద్దరూ ఇచ్చిన స్మారకోపన్యాసాలలో హృద్రోగ నిర్ధారణ, నివారణల్లో వచ్చిన మార్పులను తమ తమ అనుభవాలను వివరించారు. కొన్ని ముందుజాగ్రత్తలు, నివారణా చర్యల వల్ల గుండెజబ్బుల వల్ల మరణాల్లో 50 శాతం వరకూ అరికట్ట వచ్చని వివరించారు.

సాయంత్రం జరిగిన కాలేజి డే వేడుకల్లో డాక్డర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవిభజన తరువాత వైద్యవసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో మనం వున్నామన్న వాదన సరికాదని జిఎస్ఎల్ మెడికల్ కాలేజి, జనరల్ హాస్పిటల్ ను చూస్తే స్పష్టమౌతుందని అన్నారు.

డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే మాట్లాడుతూ ”మేముసీనియర్లు చేస్తున్న సర్జరీలను చూసి ఆపరేషన్లు నేర్చుకున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా మనకు కూడా సిములేటర్ లాబ్స్ వుంటే బాగుండునని అనుకునే వాడిని…సౌత్ ఆసియాలోనే మొదటి సిములేటర్ లాబ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో వుందని విని ఆశ్చర్యం కలిగింది. ఇ లాబ్ లో కొన్ని మాడ్యూల్స్ లో ట్రెయినింగ్ తీసుకోడానికి మరో సారి వస్తాను. కేవలం పదమూడేళ్ళలలోనే ఇంత వృద్ధి అనూహ్యంగా వుంది” అన్నారు.

ఈ ఇద్దరినీ గన్ని సోదరులు సన్మానించారు. ప్రిసిపాల్ డాక్టర్ వైఎన్ శర్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి సందేశాలు ఇచ్చారు.

విలువలకు నిలువుటద్దం! – కీర్తిశేషులు గన్ని సత్యనారాయణ మూర్తి (1928 -2007)

స్వయం కృషే సాధనంగా ఆత్మవిశ్వాసం, నిబద్ధతలే మూలధనంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే కొద్దిమందిలో గన్ని సత్యనారాయణ మూర్తి ముందు వరుసలో నిలుస్తారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి స్వతంత్ర ప్రవృత్తి వల్ల పెత్తందార్లను కాదని, కక్షసాధింపుల ధిక్కరించి, వ్యాపారాన్ని ప్రారంభించి, ఆటుపోట్లను ఢీకొని, వాణిజ్య కార్యకలాపాలను హెచ్చుమందికి ఉపాధి, అవకాశాలు ఇచ్చే శాఖోపశాఖలు గా విస్తరించిన విలువైన మనిషి. స్వేచ్ఛా స్వాతంత్రాలే ఊపిరిగా, నిబద్ధతే వెన్నెముకగా ఆదర్శవంతమైన జీవనం నెరపిన అచ్చమైన రైతు గన్ని సత్యనారాయణమూర్తిగారు!
అతిథి దేవో భవ! – కీర్తిశేషులు శ్రీమతి గన్ని సుబ్బలక్ష్మి (1935 – 1996)

నిరంతరాయంగా వచ్చిపోయే బంధుమిత్రులు, ఆశ్రితులు, పనివారి కోసం అఖండ జ్యోతి మాదిరిగా అక్షయపాత్రను పోలిన వంటశాల యజమానురాలు గన్ని వారి గృహలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి సహధర్మచారిణి శ్రీమతి సుబ్బలక్ష్మి దక్షత ఓర్పు, సహనం ఆ కుటుంబానికి స్ఫూర్తి వంతమైన జ్ఞాపకమైంది. చదువుకునేవాళ్ళకీ, చదువు చెప్పే వాళ్ళకీ వారి నివాసమే ఆశ్రయాన్ని ఇచ్చింది.

ఎవరెవరికో ఎందరెందరికో నీడ ఇచ్చిన చెట్టులాంటి ఆమె గారి జ్ఞాపకాలన్నీ జిఎస్ఎల్ (గన్ని సుబ్బలక్ష్మి) మెడికల్ కాలేజీగా రూపు దిద్దుకున్నాయి.

ఇది స్ఫూర్తివంతమైన విలువలను గౌరవించే ప్రయత్నం

ప్రత్యక్షంగా, పరోక్షంగా మా తల్లిదండ్రులు సమాజం పట్ల నిర్వర్తించిన బాధ్యతలను చిరకాలం నిలిపి వుంచాలన్న ఆలోచనతో వారి పేరిట వైద్యరంగంలో అత్యుత్తమమైన సేవలు చేస్తున్నవారికి అవార్డులను ఇవ్వాలని పెద్దల ప్రోత్సాహంతో నిర్ణయించామని గన్ని సోదరులు స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని వివరించారు.