హైదరాబాద్ లో ఎపి భవన్!

 

 

హైదరాబాద్ లో ఎపి భవన్!

(శనివారం నవీనమ్)

ఢిల్లీలో ఆంధ్రాభవన్ మాదిరిగానే హైదరాబాద్ లో కూడా సొంత భవనం వుండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తెలంగాణా ప్రభుత్వం కూడా సానుకూలంగానే వుంది. ఉమ్మడి గవర్నర్ నరశింహన్ మధ్యవర్తిత్వమే ఆలస్యం…ఈ పని అయిపోయేలా వుంది.

ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతికి తరలి రావడంతో హైదరాబాద్ సెక్రెటేరియట్ లో ఎపి భవనాలు ఖాళీ అయ్యాయి. అదే సమయంలో తెలంగాణా సెక్రటేరియట్ ను పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఎపి ప్రభుత్వం ఖాళీ చేసిన భవనాలను తనకు అప్పగించేస్తే వాటిని కూడా కలుపుకుని పునర్నిర్మాణ ప్లాన్లు రూపొందించుకోవచ్చని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది.

రెండు ప్రభుత్వాల ఆకాంక్షలు ఉన్నతాధికారుల మధ్య సమాచార మార్పిడిద్వారా ఇద్దరు ముఖ్యమంత్రులకూ అనధికారికంగా తెలిసిపోయాయి. తనకు అవసరంలేని సెక్రటేరియట్ భవనాలకు బదులుగా హైదరాబాద్ లో ఒక ఎపి భవన్ వుండాలన్న ఆలోచనను చంద్రబాబు ఉన్నతాధికారుల ద్వారా ”లీక్” చేశారు.ఆవేరకు లక్ష అడుగుల మేరకు ఎపికి అవసరం కావచ్చని తెలంగాణా అధికారులు కెసిఆర్ చెవినవేశారు. ఆయన ఎస్ అన్నాక హైదరాబాద్ లో శాసనసభకు ఎదురుగా ఆకాశవాణి కేంద్రం పక్కనున్న హెరిటేజ్ భవనాన్ని ఎపికి కేటాయించవచ్చని తెలంగాణా రోడ్లు భవనాల శాఖ ఒక నోట్ తయారు చేసింది.

సెక్రటేరియట్ భవనాలు తెలంగాణా ప్రభుత్వానికి అప్పగించడానికి ఎపి సిద్ధంగా వుంది.అలాగే హైదరాబాద్ లో ఎపి భవన్ ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఈ పరిస్ధితిని కెసిఆర్ గవర్నర్ ను కలిసి వివరించారు. ఖాళీ అయిన ఎపి సెక్రటేరియట్ భవనాలను త్వరగా తమకు అప్పగించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు!

”రోగీ పాలే కోరెను, వైద్యుడూ పాలే తాగమనెను” అన్నట్టగా వున్న సిట్యూయేషన్ ని బట్టి రెండు రాష్ట్రాలూ కేబినేట్ మీటింగ్ లలో తీర్మానాలు ఆమోదించడమే ఆలస్యం! బదలాయింపులు జరిగిపోయేలా వున్నాయి.

”లీకు” లద్వారా రెండు ప్రభుత్వాల డిమాండ్లు కెసిఆర్, చంద్రబాబు పరస్పరం అర్ధమయ్యాయి. డిమాండ్లపై ఇద్దరికీ స్ధూలమైన ఆమోదం వుంది. దీన్ని అధికారం చేసే బాద్యత ను గవర్నర్ స్వీకరించారు.

కాంగ్రెస్ మెడలో చౌబే గంట

కాంగ్రెస్ మెడలో చౌబే గంట
(శనివారం నవీనమ్)

దేవతా వస్త్రాలు ధరించి ఊరేగుతున్నానంటున్న రాజుగారు – అసలు బట్టలే వేసుకోలేదన్న విషయాన్ని చూస్తున్నవారు కూడా పిల్లి మెడలో గంటకట్టడానికి భయపడే ఎలుకల మాదిరిగా మౌనాన్ని పాటిస్తున్నారు. కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా రాహుల్ గాంధీ విషయంలో ఇలాంటి మౌనాన్నే పాటిస్తున్నారు.

అయితే, కాంగ్రెస్ లో రాహుల్ సమర్ధించేవారు, వారి సంఖ్య తక్కువేమీ కాదు. వారు రాహుల్‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వాలని! ఈ త‌రుణంలో పార్టీ బాధ్య‌త‌లు రాహుల్‌కి అప్ప‌గిస్తే ఎన్నిక‌ల వ‌చ్చే నాటికి ఆయ‌న అన్నీ అర్థం చేసుకుంటారనీ వారు నమ్ముతున్నారు. రాహుల్ గాంధీకి ప‌ట్టాభిషేకం ఎప్పుడ‌ని ఇలా కొంత‌మంది నాయ‌కులు ఎదురుచూస్తుంటే..

రాహుల్ రాజ‌కీయాల‌కు ప‌నికొస్తారా లేదా అనే అంశంపై మరికొందరు కాంగ్రెస్ నాయకులు చర్చ లేవనెత్తుతున్నారు. ఆయన సారధ్యంలో పార్టీ వరుస పరాజయాలు, నిత్య వైఫల్యాలతో తమరాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్ధక మవ్వడంతో కూడబలుక్కునో ఏమో రాహుల్ తో పాటు ప్రియాంక సారధ్యం కూడా పార్టీకి అవసరమే అనే విన్నపాలు మొదలు పెట్టారు. ఇందులో అంతరార్ధం రాహుల్ విఫలమయ్యారని ఆయన తల్లిగారైన అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలియజేయడమే!

అంతేకాదు, రాహుల్ నాయ‌క‌త్వ ప‌టిమ గురించి అధినేత్రి సోనియా గాంధీకి కూడా కొన్ని సందేశాలు చేరుతున్నాయ‌ని స‌మాచారం. అలాంటి ఒక సందేశ‌మే ఇప్పుడు వార్త‌ల్లోకి వ‌చ్చింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన కాంగ్రెస్ నాయ‌కుడు శైలేష్ చౌబే ఓ వీడియో మెసేజ్‌ను సోనియా గాంధీకి పంపారు. రాహుల్ రాజ‌కీయాల‌కు ప‌నికిరాక‌పోవ‌చ్చ‌నీ, కాబ‌ట్టి ఆయ‌న‌కి ఆస‌క్తిగ‌ల ఇత‌ర రంగాల్లో ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంద‌నీ, ఆ రంగ‌మేదో త్వ‌ర‌గా తెలుసుకుంటే మంచిది అని సోనియాకు స‌ల‌హా ఇచ్చారు!

స‌ర్జిక‌ల్ దాడుల నేప‌థ్యంలో ‘సైనికుల ర‌క్తంతో ప్ర‌ధాని మోడీ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ’ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఏవిధంగా ఆలోచించినా రాహుల్ గాంధీవ‌ల్ల పార్టీకి ఉప‌యోగం ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని అనేశారు. నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు లేనివాళ్లూ, పార్టీకి ప‌నికిరానివాళ్లు కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవ‌సరం లేద‌ని వ్యాఖ్యానించారు. ఎలా చూసుకున్నా ఆయ‌న‌కి రాజ‌కీయాలు స‌రిపోవ‌డం లేద‌నీ, కాబ‌ట్టి ఆయ‌న‌తో ఏదైనా బిజినెస్ చేయించుకుంటే మంచిదేమో అంటూ నేరుగా సోనియా గాంధీకే మెసేజ్ పెట్టారు. ఇప్పుడీ మెసేస్ కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది.

ఏమైతే నేమి శైలేష్ చౌబే ” రాజుగారు బట్టలు వేసుకోలేదని అరిచేశారు! కాంగ్రెస్ మెడలో గంట కట్టేశారు!!

ఎంబిబిఎస్‌లో యోగా  

జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి చొరవ

(శనివారం నవీనమ్‌)

జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి తన విద్యార్ధుల కోసం యోగా తరగతులను కూడా ప్రారంభిస్తోంది. అకడమిక్‌ ప్రోగ్రాంతో పాటు వైద్య విద్యార్ధుల భౌతిక బౌద్ధిక వికాసాల కోసం ఎక్ట్రాకరికులర్‌, కో కరికులర్‌ ఏక్టివిటీస్‌లో భాగంగా ఈ ఏడాది నుంచి యోగా శిక్షణ ప్రారంభిస్తున్నారు. శనివారం ఎంబిబిఎస్‌ 14వ బ్యాచ్‌ ఫ్రెషర్స్‌ డే సభలో కాలేజి చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు ఈ విషయాన్ని వెల్లడించారు.

రాజానగరం వద్ద గల జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి ప్రవేశపెట్టిన కొత్త ఒరవడులను అనేక ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు అనుసరిస్తున్నాయి. ప్రతి మెడికో రోజు తప్పనిసరిగా గంటసేపు లైబ్రరీ వుండే విధానాన్ని ఈ కాలేజిలోనే ముందుగా ప్రవేశపెట్టారు. ఎప్పటికప్పుడు సబ్జెక్టుని అవగాహన చేసుకోడానికి క్రమం తప్పని సాధనకు లైబ్రరీ ఒక సాధనమౌతుంది. క్రమంగా అని కాలేజీలూ లైబ్రరీని తప్పనిసరి చేశాయి. మెరిట్‌ కోటా స్టూడెంట్స్‌, రిజర్వేషన్‌ కేటగిరీ స్టూడెంట్స్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ స్టూడెంట్స్‌ మధ్య భావనాపరమైన తేడాలు లేకుండా చూడటానికి ఈ కాలేజిలో యూనిఫారాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాదాపు అన్ని మెడికల్‌ కాలేజీలూ యూనిఫారాన్ని కంపల్సరీ చేశాయి. దేశంలోనే మొదటిసారి జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి ప్రవేశపెట్టిన డిజిటల్‌ ఎనాటమీ డిసెక్షన్‌ పరికరాన్ని చూడటానికే ఇతర రాష్ట్రాల మెడికల్‌ కాలేజీల ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఈ ధోరణులను బట్టి ఇతర మెడికల్‌ కాలేజీలు కూడా భవిష్యత్తులో జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి మాదిరిగానే యోగా కోర్సులు ప్రవేశపెట్టే అవకాశాలు వున్నాయి.  45 నిమిషాల వ్యవధితో మొత్తం 18 యోగా తరగతులను  నిర్వహిస్తామని ఈ ప్రోగ్రాం ఇన్‌ఛార్జి  అయిన ప్రొఫెసర్‌, న్యూరో సర్జన్‌ డాక్టర్‌ ఫణికుమార్‌ వివరించారు. ఉత్తమ వైద్యులుగా రూపొందడానికి సుదీర్ఘకాలం శ్రమించవలసి వున్నందున ఏకాగ్రత సాధించడానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుందో పవర్‌ పాయింట్‌ ద్వారా ఆయన వివరించారు. దేశంలోనే  ఎంబిబిఎస్‌లో యోగాను ఒక (ఐచ్చిక) కోర్సుగా ప్రవేశపెడుతున్న ఏకైక మెడికల్‌ కాలేజి ఇదేనన్నారు.

ముఖ్యఅతిధి, 84 ఏళ్ళ వయోవృద్ధుడు, మోటివేటర్‌ అయిన వినయభూషణరావు మాట్లాడుతూ  అంతర్గత  శక్తులను ఎంతగా వెలికితీసి  వినియోగించుకుంటే అంతగా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చని, యోగా ద్వారానే ఇది సాధ్యమని, వైద్య విద్యార్ధులు యోగా చేసే కొద్దీ  వారి వర్తమాన భవిష్యత్తు జీవితాల్లో ఉన్నతంగా ఎదిగి సమాజానికి ఉపయోగపడగలరనీ వివరించారు.

వైద్య విద్యలో సంక్లిష్టతలను ఎదుర్కోగల సూక్ష్మ మార్గాలను 55 ఏళ్ళు ప్రొఫెసర్‌గా, సర్జన్‌గా పనిచేసిన అనుభవశాలి డాక్టర్‌ ఎన్‌.వెంకటరావు వివరించారు. దేశంలో మరే మెడికల్‌ కాలేజీలో లేని సిమ్యులేటర్‌ లాబ్‌ జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజిలో వుండటం ఈ బ్యాచ్‌ నుంచి మెడికోలకు వచ్చిన అదనపు అవకాశమని ప్రిన్సిపాల్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ వై.ఎన్‌.శర్మ అన్నారు.

అకడమిక్స్‌తోపాటు సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన గేమ్స్‌, స్పోర్ట్స్‌, కంపల్సరీ లైబ్రరీ, వంటి కో కరికులర్‌, ఎక్ట్రాకరికులర్‌ ఏక్టివిటీస్‌ వున్న అత్యంత అరుదైన జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజి ఎంచుకున్న విద్యార్ధులు ఇతరుల కంటే అదనపు అవకాశం అందుకున్న వారని మెడికల్‌ సూపరింటెండెంట్‌ బ్రిగేడియర్‌ డాక్టర్‌ మూర్తి, టి.వి.ఎస్‌.పి.మూర్తి అభినందించారు.

గ్రామీణ ప్రాంతాల వారికి ప్రపంచస్థాయి వైద్య విద్యల్నీ, వైద్య సదుపాయాల్నీ అందజేయడమే తమ ధ్యేయమని చైర్మన్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు వివరించారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి వచ్చిన వైద్య బృందం ”మెట్రో నగరాల్లో వుండవలసిన సిమ్యులేటర్‌ రాజానగరంలో అవసరమా అని ప్రశ్నించగా ”నేను దీన్నే మెట్రో చేయదలిచాను” అని తాను సమాధానం ఇచ్చిన విషయాన్ని  ప్రస్తావిస్తూ ఎక్కడా లేని అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని డాక్టర్‌ గన్ని భాస్కరరావు ప్రెష్‌ బ్యాచ్‌ మెడికోలకు సూచించారు.

పొలిమేరలో యుద్ధ వాతావరణం 

 సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఆక్రమిత కశ్మీరులోని మూడు సెక్టార్లలో  ఉన్న ఏడు ఉగ్రవాదుల శిబిరాలపై  భారత్‌ సైనిక కమాండోలు బుధవారం రాత్రి మెరుపుదాడులు ( సర్జికల్‌ స్ట్త్రెక్స్‌) చేసి వాటిని నేలమట్టం చేసి దాదాపు 30 మంది తీవ్రవాదులను హతమార్చాక సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాలో ్ల 1000 గ్రామాల ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. దేశంలో అన్ని మెట్రో నగరాలో ్ల నెల రోజుల పాటు హైఅలర్ట్‌ ప్రకటించింది. మరో వైపు తమ దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పాకిస్తాన్‌ పేర్కొంది. భారత ఆర్మీ సర్జికల్‌ దాడుల నేపధ్యంలో కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతనన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  ¬ం శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద శిబిరాలపై దాడులు, తాజా పరిస్థితులపై రాజ్‌నాథ్‌ అధికారులతో చర్చించారు. దేశంలోని అన్ని మెట్రో నగరాలు 30 రోజుల పాటు హై అలర్ట్‌గా ఉండాలని కేంద్ర ¬ం శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాక్‌ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్ర స్థావరాలపై బుధవారం అర్ధరాత్రి సమయంలో భారత్‌ చేపట్టిన దాడులకు పాక్‌ కూడా ప్రతీకార చర్యలకు దిగిందని డాన్‌ పత్రిక పేర్కొంది. పాక్‌ జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది భారత్‌ సైనికులు చనిపోగా… ఓ జవాన్‌ను పాక్‌ ఆర్మీ బంధించిందని పాకిస్తాన్‌ మీడియా వెల్లడించింది. పాక్‌ దాడుల్లో 8 మంది భారత జవాన్లు మృతి చెందారని పాక్‌ మీడియాలో వస్తున్న వార్తలన్నీ పూర్తిగా నిరాధారమైనవని భారత ఆర్మీ పేర్కొంది. సర్జికల్‌ స్ట్రయిక్‌లో పాల్గొన్న సైనికులంతా క్షేమంగా తిరిగొచ్చారని తెలిపాయి. గురువారం అనుకోకుండా నియంత్రణ రేఖ దాటి పాక్‌ భూభాగంలో అడుగుపెట్టిన 22 ఏళ్ళ చందు బాబులాల్‌ చౌహాన్‌కు సర్జికల్‌ దాడులతో సంబంధం లేదని ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. సర్జికల్‌ దాడులు జరిగిన చాలా సేపటి తర్వాత చందును పాక్‌ ఆర్మీ అధికారులు బంధించారని పేర్కొన్నాయి. పొరపాటున సరిహద్దు దాటడం, తనిఖీల తర్వాత తిరిగి రావడం సరిహద్దుల్లో సాధారణంగా జరిగేదేనని ఆర్మీ పేర్కొంది.  పాకిస్థాన్‌ చెరలో ఉన్న జవాన్‌ను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడించారు. పాక్‌ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేపట్టిన లక్షిత దాడులను ఆప్గానిస్థాన్‌ సమర్ధించింది. ఆత్మరక్షణలో భాగంగానే భారత్‌ సైనిక చర్యకు దిగిందని పేర్కొంది. మరో వైపు పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌షరీఫ్‌ అధ్యక్షతన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆక్రమిత కశ్మీర్‌ భారత ఆర్మీ దళాలు ఎ లాంటి సర్జికల్‌ దాడులు నిర్వహించలేదని పాక్‌ పే ర్కొంది. నియంత్రణ రేఖ వద్ద ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పులో ్ల ఇందులో పాకిస్థాన్‌ జవాన్లు మృతి చెందారని చెప్పుకుంది. కశ్మీరుపై తాము వెనక్కి తగ్గేది లేదని పాక్‌ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్‌ వెల్లడించారు. కశ్మీరు ప్రజల సమస్యల అంశం తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికి తమ సైనిక బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు.

సామాజిక చైతన్య సంభాషణ

సామాజిక చైతన్య సంభాషణ
(శనివారం నవీనమ్)

గోదావరి సాక్షి, సమాచార సాంకేతిక పరిజ్ఞానంతో తనను తాను ఆధునీకరించుకున్నది. ఒక వెబ్ సైటు ప్రారంభించి రెండేళ్ళలోనే ఇంటరాక్టివ్ పోర్టలంత పెరిగి డిజిటల్ ఎడిషన్ కూడా అప్ డేట్ అయ్యింది. ఇదంతా ఎందుకంటే సమాజంతో మరింత చైతన్యవంతంగా సంభాషించడానికే!

రాజమహేంద్రవరంలో 21 ఏళ్ళ క్రితం ప్రారంభమైన సాయంకాలం దినపత్రిక గోదావరి సాక్షి నిరంతరాయంగా వెలువడుతున్నది. ”సాక్షి” పేరే పాపులర్ అయ్యింది. జగన్ గారి సాక్షి ప్రారంభమయ్యాక ”చిన్న సాక్షి” గా ప్రాచుర్యం వచ్చింది. ఆసమయంలోనే sakshirjy.com పేరుతో వెబ్ ఎడిషన్ ప్రారంభించుకుంది. అయితే, లోపలి విషయాన్ని చదవకుండానే ఈ పేరుని బట్టి జగన్ గారి అభిమానులు ఆదరించడమో, వ్యతిరేకులు ద్వేషించడమో జరిగేది!
అయితే, వాస్తవాలు అచ్చుపత్రిక చూసిన ప్రతి ఒక్కరికీ తెలుసు.

పూర్తిస్ధాయి డిజిటలీకరణ సందర్భంలో వరల్డ్ వైడ్ వెబ్ (www) sakshirjy.com చిరునామాని godavarisakshi.com గా మార్చుకోవడమైనది. జగన్ గారి సాక్షి వేరు గోదావరి సాక్షి వేరు అని వెబ్ పాఠకులకు స్పష్టం చేయడం కోసమే గోదావరి సాక్షిని డిజిటల్ ఎడిషన్ గా మార్చలేదు. మార్పు సందర్భంగా ఈ స్పష్టీకరణ కూడా చేస్తున్నాము.

ప్రజల జీవనశైలిలో అభిరుచుల్లో గత పదేళ్ళలోనే పెను మార్పులు వచ్చాయి. పత్రికారంగానికి సంబందించినంత వరకూ దినపత్రికల పంపిణికి మనుషులు దొరకడంలేదు. ఎవరైనా ముందుకి వచ్చినా వారికి చెల్లించవలసిన మొత్తం పేపర్ ధరకంటే ఎక్కువే అవుతూంది. మరోవైపు ఇంటర్ నెట్ విస్తృతి, డేటా ధరలు అందుబాటులోకి రావడం, జేబులోనో, చేతిలోనో తీసుకుపోగల టాబ్లెట్ పిసిలు, స్మార్ట్ ఫోన్ల వంటి మొబైల్ గాడ్జెట్లు విద్యావంతులైన దిగువమధ్య తరగతి ఆదాయవర్గాల వినియోగంలోకి రావడం వంటి మార్పులవల్ల కోరుకున్న సమాచారాన్ని ఎప్పుడైనా (కనెక్టివిటీ వున్న చోటు) ఎక్కడైనా చూసుకోగల వీలు ఏర్పడింది.

ఈ సదుపాయాలకు అనుగుణంగా 24/7 ప్రజలకు అందుబాటులో వుండటానికే గోదావరి సాక్షి కొత్తరూపాన్ని సంతరించుకున్నది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో సౌకర్యవంతంగా చదువుకోడానికి వీలుగా ఒక యాప్ అయిపోయింది కూడా!
ఫోన్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో godavarisakshi యాప్ ను ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయినా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు గోదావరి సాక్షి పేపర్ చదువవచ్చు.

మొత్తం పేపర్ ని లేదా నచ్చిన వార్తల్ని, వార్తా కథనాల్ని, ఇతర విశేషాలను ఫేస్ బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, వాట్సప్ మొదలైన మీడియాల్లో, విడివిడిగా కాని, గ్రూపులకు కాని షేర్ చేయడానికి గోదావరి సాక్షి పోర్టల్ లో సదుపాయం ఏర్పాటయింది. అలాగే ప్రతిస్పందనలు రాయడానికి కామెంట్ కాలం కూడా ఇవ్వడం జరిగింది.

వీటన్నిటి ఫలితంగా ”గోదావరి సాక్షి డిజిటల్ ఎడిషన్” ఒక సామాజిక సంభాషణకు వేదికగా రూపుదిద్దుకుంటున్నది. ఈ ఎడిషన్ పాఠకులకు వాట్సప్ ద్వారా ఎస్ఎంఎస్ లద్వారా వార్తాంశాలను అందజేయడానికి వున్న సాధ్యాసాధ్యాలను గోదావరి సాక్షి యాజమాన్యం అధ్యయనం చేస్తున్నది.

గోదావరి సాక్షిలో మార్పు కేవలం మార్పుకోసమే కాదు! అందులో ప్రజాస్వామిక దృక్పధం వుంటుంది…కోనసాగుతుంది! మార్పుని సాధించే మార్గాన్వేషణవైపో, మార్గదర్శనం వైపో పాఠకుల ఆలోచనలను రేకెత్తించే ప్రయత్నం వుంటుంది…కొనసాగుతుంది!

ఇన్ని మాటలెందుకు! గోదావరి సాక్షి డిజిటల్ ఎడిషన్ కూడా…
సామాజిక చైతన్య సంభాషణ అవుతుంది…వికసిస్తుంది…విస్తరిస్తుంది!!!

ఇంటర్నెట్ లో మాతృభాషల విస్తరణ (శనివారం నవీనమ్)

దేశవ్యాప్తంగా ఇంటర్ నెట్ లో సొంత భాషల వినియోగం పెరుగుతోంది. మరోవిధంగా చెప్పాలంటే ఇంగ్లీషు రానివారు కూడా ఇంటర్ నెట్ ను వినియోగించుకోవడం పెరిగింది. భారత్‌లో 22 అధికార భాషలుండగా వాటిలో 11 భాషలను గూగుల్ సపోర్ట్ చేస్తోంది. గూగుల్ సపోర్ట్ చేస్తున్న భాషల్లో హిందీ, బెంగాలీ తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం లాంటి ప్రధాన భాషలున్నాయి.

2020 నాటికి నెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య ఇప్పుడున్న 43 శాతంనుంచి 62 శాతానికి చేరుకుంటుందని ఒక ఈమెయిల్ ఇంటర్వ్యూలో గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ భాషల విభాగం చీఫ్ రిచాసింగ్ చిత్రాంశి రిప్లయ్ మెయిల్ ఇచ్చారు.

అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతుండడం, దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తూ ఉండడంతో భారత్ ఆన్‌లైన్ వినియోగదారుల సంఖ్య 2020 నాటికి 50 కోట్లకు చేరుకోనుందని ఆమె విశ్లేషించారు.

ఇంటర్నెట్ గతం, ప్రస్తుత స్థితి గురించి వివరిస్తూ , తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు, డేటా ప్యాకేజిలు లభించడం కోట్లాది మంది భారతీయులు ఆన్‌లైన్‌కు అలవాటు పడడానికి ప్రధాన కారణమని చిత్రాంశి చెప్పారు. ఇప్పుడు భారత్‌లో 65 శాతం మంది తమ స్మార్ట్ ఫోన్లద్వారానే ఇంటర్నెట్‌ను వెతుకుతున్నారు. కొత్తగా ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారిలో ఎక్కువ మంది ఫోన్లద్వారానే ఇంటర్నెట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.

ఆసక్తికకరమైన విషయమేమిటంటే వాళ్లంతా ఇంగ్లీషును ఉపయోగించే వారు కాదని ఆమె చెప్పారు. ఇంటర్నెట్‌ను ఉపయోగించే 35 కోట్ల మందిలో 15 కోట్ల మంది స్థానిక భాష తెలిసిన వారేనని, దేశంలో ఇంటర్నెట్‌ను ఉపయోగించే వారిలో మెజారిటీ సంఖ్య వారిదేనని ఆమె చెప్పారు.

గత ఏడాదిన్నర కాలంలో స్థానిక భాషలో ప్రశ్నలు 10 రెట్లు పెరిగినట్లు గూగుల్ గుర్తించిందని కూడా ఆమె చెప్పారు. అందులో ముఖ్యంగా హిందీలో సమాచారాన్ని తీసుకునే వారు అయిదు రెట్లు పెరుగుతున్నారని ఆమె చెప్పారు. సమాచారం, వేగం, ప్రాడక్ట్‌లే తమ కంపెనీ ప్రాధాన్యతలని కూడా ఆమె చెప్పారు. ఆండ్రాయిడ్‌పై పని చేసే గూగుల్‌కు చెందిన ఇండిక్ కీ బోర్డును కోటి సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆమె తెలిపారు. 2020 నాటికి భారత దేశ ఆన్‌లైన్ జనాభా 50 కోట్లకు చేరుకుంటుందని, వారిలో చాలామంది స్థానిక భాషను ఉపయోగించే వారు 30 శాతం మంది ఉంటారని అంచనా వేశారు.