ప్రచారం ఘనం – ఫలితం పూజ్యం (శనివారం నవీనమ్)

ప్రచారం ఘనం – ఫలితం పూజ్యం
(శనివారం నవీనమ్)

ప్రధానమంత్రి విదేశీ పర్యటనకు వెళుతున్నారంటే ఆదేశానికి, మన దేశానికీ మధ్య సంబంధాలు, ప్రయోజనాలు, ఒప్పందాలు, యదార్ధ స్ధితులపై విదేశాంగ శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం ఎంత కసరత్తు చేసేదో, జర్నలిస్టుల మధ్య అంతే స్ధాయిలో చర్చలు జరిగేవి. ఈ చర్చలకు హిందూ దినపత్రిక అప్పట్లో జర్నలిస్టులకు పెద్ద రిసోర్సు గా వుండేది.

ఇపుడు సమాచార సాధనాలకు అంతే లేకుండా పోయింది. సోంత అభిప్రాయాలే సమాచారం గా చెలామణి అవుతున్నాయి. అవే వార్తలైపోతున్నాయి.లోతులు చూసి  విశ్లేషణలు చేయగల జర్నలిస్టులు అంతరించిపోతున్నారు.

ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన పై సాగుతున్న ప్రచారానికి వాస్తవానికీ మధ్య పొంతన లేకపోడానికి మూలం ఈ డొల్లతనమే!

మోడీ అమెరికా పర్యటన వల్ల  ప్రజలకు ఒనగూడింది శూన్యం. ఇద్దరు నాయకులూ ఒకరినొకరు పొగుడుకోవడం, ఉగ్రవాదంపై దండెత్తుతామని పాత ప్రకటనల పునరుద్ఘాటన తప్ప భారతదేశానికి లభించిన ప్రయోజనమేమీ కనిపించడం లేదు.

ట్రంప్‌ అనుసరిస్తున్న భారత వ్యతిరేక వైఖరిని నరేంద్రమోడీ తన పర్యటనలో ఏమైనా మార్చ గలిగారా? హెచ్‌1 బి వీసాల విషయంలో భారతీయ విద్యార్థులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న కఠిన వైఖరిని ఏమైనా సడలింప చేయగలిగారా? వాతావరణ మార్పులకు సంబంధించి ప్రపంచంతో కలిసి నడవాల్సిన ఆవశ్యకతను ట్రంప్‌కు మోడీ వివరించ గలిగారా? భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి నిర్దిష్టమైన హామీ ఏమైనా పొందారా? అని ప్రశ్నిస్తే సమాధానాలు లేవు.

ట్రంప్‌, మోడీల భేటీ, చర్చల గురించి మదింపు చేయడానికి వారిద్దరు కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశం, జారీ చేసిన ఉమ్మడి ప్రకటనే ఆధారం. పాత్రికేయులకు ప్రశ్నలు వేసే అవకాశాన్ని తీసేశారు.

ఉమ్మడి ప్రకటనలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న హెచ్‌1బి వీసాల ప్రస్తావన కూడా లేదు. ఇది నిరాశ కలిగించే అంశం.

ప్రకటనలో పాకిస్తాన్‌, చైనాలపై ప్రత్యక్ష, పరోక్ష దాడి ప్రస్తావనే ప్రముఖంగా వుంది. పాకిస్తాన్‌ భూ భాగం నుండి ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహించడం మానుకోవాలని ఈ ప్రకటన పేర్కొంది. చైనా పేరు ప్రస్తావించకుండా, చైనా తలపెట్టిన ఒన్‌రోడ్‌, ఒన్‌బెల్ట్‌ ప్రాజెక్టు గురించి వ్యాఖ్యలు ఈ ప్రకటనలో వున్నాయి.

ట్రంప్‌తో భేటీకి ముందు హిజ్బుల్‌ ముజాహిద్దున్‌ నేత సయ్యద్‌ సలాముద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అమెరికా గుర్తించింది. వాస్తవానికి 71 సంవత్సరాల సలాముద్దీన్‌ ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలంగా లేరని వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలను ప్రకటనలో చేర్చడమే తమ ఘన విజయంగా బిజెపి చెప్పుకుంటోంది.

అయితే ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి అమెరికా చేస్తున్న సాయంపై నామమాత్రంగానైనా ఆందోళన వ్యక్తం చేయాలన్న తపన ప్రధానిలో కనపడలేదు. ఇరుగు పొరుగు దేశాలను అమెరికా వేదికగా వేలెత్తి చూపడం ద్వారా ఆ దేశాలతో స్నేహ సంబంధాలపై పడే ప్రభావాన్ని అంచనా వేసినట్లు కనిపించలేదు.

ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అంశాలలోకి మూడో దేశాన్ని ఆహ్వానించడం ఏ రాజనీతి కిందకు వస్తుందో ఏలిన వారే చెప్పాలి!  ఆర్థికాంశాలకు సంబంధించి ఉమ్మడి ప్రకటనలో చోటు చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ప్రస్తావన అమెరికాకు ఉపయోగపడేదే! గత ప్రకటనల్లో కనిపించే ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న ఆకాంక్షకు ఇది భిన్నం. అమెరికాకు చెందిన సరుకులు భారతదేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశించడంపై అనేక ఆంక్షలు ఇప్పటి వరకు ఉన్నాయి. ఆ అంక్షలు ఎత్తి వేయాలని కొన్ని సంవత్సరాలుగా అమెరికన్‌ కార్పొరేట్‌ లాబీ ఒత్తిడి చేస్తోంది. అది ఇపుడు నెరవేరింది.

వాతావరణ మార్పులు, సౌరశక్తి వినియోగం వంటి అంశాలు ఉమ్మడి ప్రకటనలో చోటు చేసుకునేవి. ఈ సారి వాటి ఊసే లేకపోగా దివాళా తీసి, వివాదాస్పదంగా మారిన వెస్టింగ్‌హౌస్‌ నుండి ఆరు రియాక్టర్ల కొనుగోలు వంటి అంశాలు అమెరికాకు ఉపయోగపడటంతో పాటు, భారత దృష్టితో చూస్తే తిరోగమనమే!

అమెరికా ప్రయోజనాల కోసం ఆర్థిక వ్యవస్థ తలుపులను మరింత బార్లా తెరవడం, డ్రోన్లతో సహా ఆ దేశ రక్షణ ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేయడం అనే అంశాలకే ఉమ్మడి ప్రకటనలోని ఈ భాగం పరిమితమైంది. భారత్‌కు ఒరిగిందేమిటో ప్రధానే వివరించాలి.

ఉత్తరకొరియాను విమర్శించడంలోనూ, దక్షిణ చైనా సముద్ర విషయంలోనూ అమెరికా గొంతునే భారత్‌ మొట్ట మొదటిసారిగా వినిపించింది. వీటన్నింటికన్నా ఆందోళన కలిగిందే అంశమేమిటంటే ఉగ్రవాదాన్ని ఒక మతానికి ముడిపెడుతూ అమెరికా వ్యవహరిస్తున్న ధోరణికి ప్రధాని తానా తందానా అనడం! ఇది ఇప్పటి వరకు ఉగ్రవాదానికి-మతానికి సంబంధం లేదంటూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి విరుద్దం.