ఇలాగైతే మరో ముఫ్పై ఏళ్ళు ప్రతిపక్షంలోనే.. 

జీ కె వార్తా వ్యాఖ్య
‘పరనింద..ఆత్మస్తుతి’ .. ఇదీ ! రెండు రోజుల పాటు సాగిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తీరు. అధికారంలోకి రావాలని ప్రతి రాజకీయ పార్టీ కోరుకోవడంలో తప్పు లేదు. అయితే అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోయడమే ఎజెండాగా…అధికారమే పరమావధిగా అలవి కాని వాగ్ధానాలు గుప్పిస్తూ కనీసం వయస్సు, అనుభవం చూసైనా గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా, ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహా, సూచనలు ఇవ్వకుండా సీఎం చంద్రబాబునాయుడుపై నోటికొచ్చినట్లు మాట్లాడడానికే ప్లీనరీ అన్నట్లు  ప్రతిపక్షనేత జగన్‌తో సహ ఆ పార్టీ నేతలు వ్యవహరించిన  తీరు చూస్తే వారి దిగజారుడు రాజకీయానికి అద్దం పడుతున్నాయి.  అధికారం కోసం అలమటిస్తున్న ప్రతిపక్షనేత జగన్‌ వైఖరి చూస్తుంటే ”కలల్ని సాకారం చేసుకోవాలని..లక్ష్యాన్ని సాధించాలని కోరుకోవడంలో తప్పు లేదు అయితే వాటి సాధనకు సరైన దిశలో పయనించి శ్రమించు” అని భారత మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజె అబ్దుల్‌ కలాం బోధించిన మాట ఒకటి ఈ సందర్భంగా నాకు స్ఫురణకు వస్తోంది… అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీ రథసారథి జగన్‌ అధికారం కోసం కలలు కనడమే గాని వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం  చేస్తున్నట్లుగా కనిపించలేదు. ప్లీనరీలో తొలిరోజు చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టడానికి కేటాయించగా రెండోరోజును అధికారంలో వచ్చేందుకు ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు చేయడానికి ప్రత్యేకించారు. ప్లీనరీలో ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతుంటే చంద్రబాబును తిట్టమని చెప్పడం మైక్‌లో యావత్‌ సభికులకు వినిపించింది. తెలుగుదేశం పార్టీ నీడలో ఎదిగి ఆ తర్వాత పార్టీ ఫిరాయించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అయితే సభ్య సమాజం తలదించుకునేలా..నివ్వెరపోయేలా ‘చంద్రబాబు చావు కోసం’ ఎదురుచూస్తున్నామనడం… అటువంటి వ్యాఖ్యల్ని ఖండించవలసిన జగన్‌ ఆ మాట విని ముసిముసినవ్వులు నవ్వడం చూస్తుంటే  అధికారం కోసం వారు ఎంతగా దిగజారిపోయారో అర్ధమవుతోంది. పైగా తమ పార్టీ ప్లీనరీ పండుగలా జరిగిందని… తెదేపా మహానాడు తద్దినంలా సాగిందని వైఎస్‌ రాజశేఖరరెడ్డి జమానాలో వసూలు చక్రవర్తిగా పేరొంది ఆ తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుందన్నట్లు ఆ తర్వాత జగన్‌ పక్కకు చేరిపోయిన  బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అధికారం కోసం జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు ఎంతగా అర్రులు చాస్తున్నారో.. అలమటిస్తున్నారో అర్ధమవుతోంది. బొత్స వ్యాఖ్యలు ‘తద్దినం’ అంటే తప్పుడు పని, ఉపయోగం లేని క్రియ అన్నట్లుగా ఓ వర్గం మనోభావాల్ని కించపర్చేలా మాట్లాడటం వారి దిగజారుడుతనానికి దర్పణం పడుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అనాలోచిత నిర్ణయంతో విభజించబడిన శేషాంధ్రప్రదేశ్‌ను తిరిగి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి గత మూడేళ్ళగా అహర్నిశలు సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారు. ఈ విషయాన్ని యావత్‌  రాష్ట్ర ప్రజానీకం గుర్తించింది. అయితే సీఎం ఎంత కష్టపడుతున్నా ఏదో ఓ స్థాయిలో..ఎక్కడో అక్కడ జరిగిన తప్పిదం ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. దాంతో సహజంగానే ప్రభుత్వం అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడంలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్నది నిర్వివాదాంశం. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉండగానే అధికారంలోకి వస్తే ఇవి చేస్తాం అంటూ ఆచరణ సాధ్యం కాని వాగ్ధానాలు గుప్పిస్తూ మేనిఫెస్టోను విడుదల చేయడం, అందులోనూ ప్రతిపక్షనేత జగన్‌ తెలివితేటలు…సొంత ఆలోచనలు లేకుండా ప్రశాంత్‌ కిశోర్‌ అనే ఎన్నికల వ్యూహకర్తకు బాధ్యతలు అప్పగించేసి ఆయనను పార్టీ శ్రేణులకు పరిచయం చేయడం…. అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటానని పగటి కలలు కంటూ ప్రకటనలు చేయడం చూస్తే వారి అధికారకాంక్ష ప్రస్ఫుటమవుతోంది. వాగ్ధానాలు గుప్పించడంతో పాటు రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని జగన్‌ ప్రకటించగా దానిని పాదయాత్రగా ఎవ్వరూ భావించడం లేదు. దీనిని అంతులేని ఓదార్పు యాత్ర కొనసాగింపేనని అంతా భావిస్తున్నారు. నిర్మాణాత్మకంగా వ్యవహరింవలసిన ప్రతిపక్షం ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూస్తూ విమర్శలు చేస్తూ నిర్మాణాత్మకంగా గాక విచ్ఛిన్నకర శక్తిగా తయారు కావడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం.  ప్రతిపక్షమంటే అధికారపక్షాన్ని గుడ్డిగా  వ్యతిరేకించడం కాదన్న విషయం అధికారంకై పరితపిస్తున్న జగన్‌ తెలుసుకుంటే అది ఆయనకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా శ్రేయస్కరం. అమరావతి వద్ద నవ్యాంధ్ర రాజధానిని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న  జగన్‌ తాను అధికారంలోకి వస్తే రాజధాని ప్రాంతాన్ని మార్చివేస్తారా? అన్న విషయమై స్పష్టత లేదు. మరో వైపు  నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి, ఇతరత్రా అభివృద్ధి పనులకు రుణం ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంక్‌ను కోరడం, క్షణం క్షణం ఆలోచనలను మార్చుకోవడం.. చూస్తే మూడు దశాబ్ధాలు సీఎంగా ఉంటానన్న నాయకునికి ఉండవలసిన లక్షణమేనా? ప్రతిపక్షనేతగా అధికారపక్షం లోపాల్ని ఎత్తిచూపడంలో తప్పులేదు.. అయితే అది నిర్మాణాత్మకంగా..సహేతుకంగా ఉండాలే గాని నోరుందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం నాయకుని సలక్షణం కాదు. అధికార పక్షం తప్పుల్ని వెలుగులోకి తేవడానికి సదరు ప్రతిపక్షనేతకు పార్టీ యంత్రాంగంతో పాటు బలమైన శక్తిగా ఉన్న మీడియా కూడా చేతిలో ఉంది. ప్రతి అంశాన్ని విమర్శనాకోణంలో చూస్తూ కేవలం భజన కోసమే నీ సొంత ప్రయోజనాల కోసం ఈ మీడియాను ఉపయోగిస్తే దాని వల్ల ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుందన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే ఆయనకు అంత శ్రేయస్కరం. జగన్‌ తీరు..పంథా మార్చుకోకపోతే మరో 30 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండటం మాత్రం ఖాయం.