కృష్ణాడెల్టాకు ”పట్టిసీమ” భిక్ష! (శనివారం నవీనమ్)

కృష్ణా నదిలో నీళ్ళు అత్యంత నిరాశను కలిగిస్తున్నాయి. నైరుతి రుతుపవనాల వల్లవచ్చే వాననీరే ఈ నదికి నీటివనరులో 74 శాతం వుంది. జూలై రెండోవారం ముగుస్తున్నా ఈఏడాది 10 శాతం నీరుకూడా నదిలో లేదు. అయితే ప్రకాశం బ్యారేజి నుంచి పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టు వున్న కృష్ణా గుంటూరు జిల్లాల్లో కృష్ణా డెల్టాకు  నీరు బాగా అందుతున్నది. బ్యారేజి నుంచి 7 వేల క్యూసెక్కుల వరకూ నీరు సముద్రంలోకి పోతున్నది.

నదిలో నీరు లేకపోయినా డెల్టా పచ్చగా వుందంటే అది పట్టిసీమ ఎత్తిపోతల పధకం ఫలితమే! అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదు, కాకూడదు. గోదావరిలో ఇపుడు నీళ్ళ పరిస్ధితి బాగానే వుంది కాబట్టి ఈ నీరు కృష్ణా డెల్టాకు వెళ్ళినా అభ్యంతరం వుండదు… గోదావరిలో నీళ్ళు లేనప్పుడు కూడా ఇప్పటి తరలింపే కొనసాగితే అది ప్రాంతీయ తగాదాలకు దారితీస్తుంది. ఈ విషయమే నేను ఫేస్ బుక్ లో ట్విట్టర్ లో రాసినప్పుడు, నేను లేనిపోని తగాదాలు పెడుతున్నానని బండబూతులు మొదలయ్యాయి. అలా కామెంట్లు రాసిన వారంతా కృష్ణా, గుంటూరు జిల్లాల వారే! నా పోస్టులకి కామెంట్ల ద్వారా మద్దతు ఇచ్చిన గోదావరి జిల్లాల వారు నలుగురే! సోషల్ మీడియాలో కూడా కృష్ణా గుంటూరు జిల్లాల వారే ముందున్నారనడానికి మాత్రమే ఇది ఉదాహరణ! అంతే తప్ప, బండబూతులు మినహా నా ప్రతిపాదనకు ఖండనా లేదు. విమర్శా లేదు.

గత ఏడాది గోదావరిలో వెయ్యి క్యూసెక్కుల కంటే తక్కువ నీరు వున్నప్పుడు కూడా పట్టిసీమనుంచి కృష్ణానదికి నీరు వదిలేశారు. అపుడు గోదావరి డెల్టాల రైతులు తమ కే నీరు చాలడంలేదని గగ్గోలు పెట్టాకే పట్టిసీమ ఎత్తిపోతలను నిలుపుదల చేశారు.

పట్టిసీమ ఎత్తిపోతల అనేది ఒక ఏర్పాటు మాత్రమే…పరిష్కారం కాదు…ఏర్పాటు ఎప్పటికీ వివాదమే! మానీళ్ళు వాళ్ళు ఎత్తుకుపోతున్నారంటే వాళ్ళకు కోపం వస్తుంది…కృష్ణా డెల్టాకు పట్టిసీమ భిక్ష అంటే వారికి నచ్చదు. ఎందుకంటే ఇది అధికారంలో వున్న వాళ్ళ ఇష్టారాజ్యమే అవుతుంది…అంతే కాని అందరికీ ఆమోదయోగ్యమైన నీటి పంపకంకాదు.

గోదావరి నదికి కూడా నైరుతీ రుతుపవనాల ద్వారానే అత్యధిక నీరు లభిస్తుంది. ధవళేశ్వరం ఆనకట్టకు పైభాగంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడి ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తక్కుగా ఉన్నాయి. అయినా, గోదావరి నది దిగువ ప్రాంతంలో వర్షపు నీరు పుష్కలంగా లభిస్తున్నది. ధవళేశ్వరం ఆనకట్ట గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 2.93 టియంసిలు.ఆ మేరకు నీటిని నిల్వ చేసి, గోదావరి డెల్టాకు సాగు నీరు విడుదల చేస్తున్నారు. ఇంకా 88,265 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం ఆనకట్ట నుండి క్రిందికి వదిలేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ వెబ్ సైట్ లో పొందు పరచిన గణాంకాలను బట్టి ఈ రోజు ప్రకాశం బ్యారేజీలోకి 7,668 క్యూసెక్కుల నీరు చేరుతున్నది. ఇందులో అత్యధిక భాగం పట్టిసీమ ఎత్తి పోతల  ద్వారా తరలిస్తున్న గోదావరి నీరే.

జూలై రెండో వారం పూర్తయినా కృష్ణా నదిలో నీటి లభ్యత ప్రశ్నార్థకంగా ఉంటే, గోదావరి నది నీరు సముద్రం పాలౌతున్నది. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేస్తే తప్ప వృధాగా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోలేం.