ఆర్జిత సేవ అనే జీతగతం

మనస్సాక్షి  – 1047
వెంకటేశం కొంచెం టెన్షన్‌గా ఉన్నాడు. అసలే యిప్పుడు మాట్లాడబోయేది మామూలు వ్యక్తితో కాదాయె. రాస్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రిగారితో. గురువుగారు ఏ స్థాయిలో ఎవర్ని మేనేజ్‌ చేశారో ఏంటో మొత్తానికి సీఎంగారి దగ్గరకి తనని పంప గలిగారు. యింతలోనే లోపల్నుంచి పిలు పొచ్చింది. దాంతో వెంకటేశం గబగబా లోపలికి నడిచాడు. అయితే  లోపల వాతావరణం అంత టెన్షన్‌గా లేదు. బాబుగారయితే ”ఆ..రావోయ్‌ మిస్టర్‌ వెంకటేశం.. నీ గురించి మీ జిల్లా నుంచి మూడు నాలుగు ఫోన్లొచ్చాయి. ఊ..యిప్పుడు చెప్పు ఎందుకొచ్చావో?” అన్నాడు. దాంతో వెంక టేశం హుషారుగా ”ఏం లేద్సార్‌.. నాకు ఎప్ప ట్నుంచో రాజకీయాలంటే యింట్రెస్ట్‌. అందు లోనూ మీరంటే నాకు చాలా అభిమానం. మీ దగ్గరుండే ఎడ్వైయిజరీ కమిటీలో చేరాలనుంది” అన్నాడు. దాంతో చంద్రబాబు నవ్వేసి ”యిప్పటికే ఆ కమిటీలో చాలామంది మేధావు లున్నారు. కొత్తగా నువ్వొచ్చి చేసేదేముంటుంది?” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. తన మేధోతనం ఏదో నిరూపించు కోవలసిన పరిస్థితి ఏర్పడింది. యింతలోనే బాబు ”సరే.. ఒకటి చెప్పు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. అది తగ్గించాలంటే  వాళ్ళకి ఉద్యోగాలు యివ్వాలి. కానీ యివ్వడానికి అన్ని ఉద్యో గాలేంలేవు. ఒకవేళ అలా యిచ్చినా అందరికీ జీతాలిచ్చే పరిస్థితి లేదు. ఓ రకంగా ఉన్న ఉద్యోగులకే జీతాలు యివ్వడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో నీ సలహా ఏంటి?” అన్నాడు. దాంతో వెంక టేశం ఆలోచనలోపడ్డాడు. యిప్పుడు తను చెప్పబోయే దాని మీదే తన భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాంతో యింకా తీవ్రంగా ఆలోచిం చడం మొదలెట్టాడు. అప్పుడు తట్టిందా ఆలోచన. ఒక్కసారిగా హుషా రొచ్చేసింది. తనకొచ్చిన ఆలోచనకి తనని తానే అభినందించు కున్నాడు. బాబు వంక తిరిగి ”సార్‌… ఈ నిరుద్యోగుల్లో చాలా మందికి వెంటనే ఉద్యోగం యిచ్చెయ్యండి” అన్నాడు. బాబుకయితే బొత్తిగా అర్థం కాలేదు. ఏవయినా పిచ్చెక్కిందా అన్నట్టుగా వెంకటేశం వైపు చూశాడు. ”ఏంటీ.. ఓ పక్కన ఉన్నా ఉద్యోగస్తులకు జీతా లివ్వలేక ఖజానా ఖాళీ అవుతుంటే కొత్త ఉద్యోగాలెలా?” అన్నాడు. దాంతో వెంకటేశం చిద్విలాసంగా నవ్వి ”ప్రీమియం ఉద్యోగాలు సృష్టిద్దాం సార్‌.. అంటే మరేంలేదు. రకరకాల డిపార్ట్‌మెంట్లలో రక రకాల ఉద్యోగాలు ఉంటాయి. వాటిని యిప్పటికే ఎవరో చేస్తుం టారు. ఉదాహరణకి ఓ పోలీస్‌స్టేషన్లో ఎస్సై పోస్ట్‌ ఉంటుంది. ఆ పోస్ట్‌ అలా ఉండగానే అదే స్టేషన్‌కి యింకో ఎస్సై పోస్టు సృష్టిస్తాం. అయితే ఈ కొత్త ఎస్సై పోస్ట్‌కి మనం జీతాలవీ యివ్వం. అలా జీతాలవీ లేకుండా పనిచేయడానికి యిష్టపడేవాళ్ళనే ఆ పోస్ట్‌లోకి తీసుకుంటాం. అంతేకాదు. ఈ ప్రీమియం పోస్టులకి పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే టెండర్లు పిలిచి దాంట్లో ఎక్కువ గవర్నమెంటుకి యిస్తామన్న వాళ్ళకి ఆ పోస్ట్‌లు యిస్తామన్నమాట. దాంతో ఖజానాకి బోల్డంత ఆదాయం” అన్నాడు. వెంకటేశం చెప్పిం దాంతో అంతటి బాబు కూడా అదిరిపోయాడు. ”అసలిది సాధ్య మేనా? జీతాలు లేకుండా పైగా ఎదురొచ్చి ఈ ప్రీమియం పోస్ట్‌లు కొనుకుంటారంటావా?” అన్నాడు. దానికి వెంకటేశం ”తప్పకుండా సార్‌..” అన్నాడు. తర్వాత బాబు అంగీకరించడం, మిగతా ఏర్పాట్లకి పురమాయించడం జరిగిపోయాయి.
—–
రాష్ట్ర చరిత్రలో గొప్ప సంచలనం రేగింది. రాష్ట్రంలోని అన్ని డిపార్ట్‌ మెంట్లలో, అన్ని స్థాయిలలో యింతకు ముందే ఉన్న పోస్టులకు సమాంతరంగా అదేస్థాయి ప్రీమియమ్‌ ఉద్యోగాలు సృష్టించ బడ్డాయి. యిక ఈ ఉద్యోగాలకి టెండర్లు పిలిచేసరికి కుప్పలు తెప్ప లుగా వచ్చిపడ్డాయి. జీతం ఏదీ రాకపోయినా ఫర్వాలేదంటూ  బోల్డంత రేట్లకి కోట్‌ చేసి మరీ ఆ ప్రీమి యమ్‌ ఉద్యోగాల్లో చేరిపోయారు. యింకే ముంది.. వారం తిరక్కుండా ప్రభుత్వ ఖజానా నిండిపోయింది. రాష్ట్రంలో సగం నిరుద్యోగ సమస్య తీరిపోయింది. యిక ఈ కొత్త ప్రీమియమ్‌ ఉద్యోగస్తులు ప్రతి పనికీ యింతని తీసేసుకుని పనులన్నీ చకచకా చేసి పారేస్తున్నారు. దాంతో వాళ్ళ జేబులూ నిండుతున్నాయి. యింకోపక్క డబ్బులు ఖర్చయినా జనాల పనులు చకచకా పూర్తయి పోతున్నాయి. ఏతావాతా.. అందరూ హేపీ సర్వేజనా సుఖినోభవంతు.
—–
అది గురూగారూ… రాత్రి నాకలాంటి గమ్మ త్తయిన కలొచ్చింది. అయినా ఈ కలేదో బొత్తిగా లాజిక్కు లేనట్టుగా ఉందేంటీ?” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”యిందులో అంత ఆశ్చర్యం ఏవుందోయ్‌.. వ్యవస్థ నడుస్తున్న తీరు యిలాగే ఉందిగా” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టుగా చూశాడు. దాంతో గిరీశం ”అవునోయ్‌.. ఆ వెంకన్నబాబు గుడికెడితే ఏం చేస్తాం… మనమే ఖర్చుపెట్టి ఆ భగవంతుడికి ఆర్జిత సేవలు చేస్తాం.. సరే.. ఆ దేవుడి గురించి వదిలెయ్‌. మనల్ని పాలించే దేవుళ్ళనే తీసుకో. అదే మన నాయకుల సంగతిలే. వాళ్ళేం చేస్తారు? కోట్లు ఖర్చుపెట్టి మరీ ఎలక్షన్లో నెగ్గుతారు. ఎందుకంట? ప్రజాసేవ ఎడాపెడా చేసెయ్యడానికా? అవునంటే అవును. కాకుంటే కాదు. ఖర్చు పెట్టిందానికి వందరెట్లు సంపాదించడానికి. కొంతమంది ! అలాగే ఉద్యోగస్తుల విషయం తీసుకున్నా చాలామంది విషయంలో అవి నీతి, లంచగొండితనం చూడొచ్చు. వాళ్ళకి జీతభత్యాలతో పనే లేదు. పై సంపాదనే వారికి ఆక్సిజన్‌. ఒక మామూలు స్థాయి ఉద్యోగి దగ్గర వందకోట్లు దొరకడం, పైస్థాయి అధికారి దగ్గర  వెయ్యి కోట్లు పైగా దొరకడం దానికి ఉదాహరణ. ఏతావాతా మన వ్యవస్థలో మొత్తంగా నడుస్తోంది ఈ ఆర్జిత సేవల వ్యవహారమే” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి