గిల్లుడు

మనస్సాక్షి  – 1048
 
ఉన్నట్టుండి వెంకటేశం ఎడమకన్ను అదిరింది. దాంతో వెంకటేశంలో టెన్షన్‌ మొదలయింది. వెంకటేశం తెగ చదువుకున్నాడో, యింకా బోల్డన్ని లాజిక్కులు మాట్లాడేవాడూ అయ్యండొచ్చుగాక.. అయినా  యిలాంటివంటే భయమే. పెరిగిన వాతావరణం అలాంటిదాయె. దాంతో ఏం కొంప లంటుకుంటాయో అనుకుంటూ గిరీశం గారిం ట్లోకి దూరాడు. అయితే ఆపాటికి యింట్లో గిరీశం లేడు. బాబీగాడు మాత్రం టీవీ చూస్తు న్నాడు. వెంకటేశం రావడం చూడగానే ‘బాబాయ్‌’ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. వెంకటేశం వాడిని దగ్గరగా తీసుకుని ”ఏరా.. మీ మావయ్య ఎక్కడ్రా?” అన్నాడు. బాబీగాడు తల అడ్డంగా ఊపి ”ఏమో తెల్దు బాబాయ్‌.. ఏదో ఊరెళ్ళాడు” అన్నాడు. గిరీశం ఎక్కడికెళ్ళాడన్నది వెంకటేశానికి అర్థం కాలేదు. అంతలోనే  ఆరోజు ఆఖరి ఆదివారమని గుర్తొచ్చింది. దాంతో గిరీశం ఎక్కడికెళ్ళాడో అర్థమయిపోయింది. నెలలో ఆఖరి ఆదివారంనాడు భీమవరం దగ్గరున్న వేండ్రలో కోడిపందేలు జరుగుతుంటాయి. అదీ ఆ ఊరి చివర తోటల్లో. పండగలకీ, పబ్బాలకీ సంబంధం లేకుండా ఈ వ్యవహారం ఎప్పట్నుంచో జరుగుతోంది. యిక్కడుండి చేసేదేం ఉందని వెంకటేశం కూడా ఎర్రబస్సెక్కి ఆ ఊరు బయల్దేరాడు. మొత్తానికి యింకో మూడుగంటల తర్వాత వెంకటేశం వేండ్రలో దిగడం, అక్కడ్నుంచి ఆ కోడిపందేలు జరుగుతున్న తోటలోకి వెళ్ళడం జరిగాయి. ఆపాటికి గిరీశం మిగతావాళ్ళతో కలిసి  కోడి పందేల జోరులో ఉన్నాడు. అక్కడ ఓ అరగంట ఉండేసరికి వెంక టేశానికి బోరు కొట్టేసింది. దాంతో ఊళ్ళోనే ఉన్న తన స్నేహితుడి యింటికి వెళ్ళిపోయాడు. అదే మంచిదయింది. యింకో గంట తర్వాత కోడిపందేల రాయుళ్ళని పోలీసులు పట్టుకున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది. దాంతో వెంకటేశం ఆదరాబాదరా పోలీస్‌స్టేషన్‌కి పరి గెత్తాడు. ఆపాటికి గిరీశం సహా అంతా సెల్‌లో ఉన్నారు.
 
అఅఅఅ
 
యింకా మీడియాపక్షులికి ఉప్పందినట్టు లేదు. ఎవరూ లేరు. యింతలోనే ఎస్సై బయట నుంచి వచ్చాడు. తీరా సెల్‌లో ఉన్న గిరీ శాన్ని చూసి  ”అరెరె.. మీరా గిరీశం గారూ.. మిమ్మల్నిలా కలుసు కోవడం ఏదోలా ఉందనుకోండి. సరే.. జరిగిందేదో జరిగిపోయింది.  వెళ్ళిపోండి” అంటూ వారందరినీ విడుదల చేయించేశాడు. దాంతో గిరీశం ”మరి కేసదీ..” అన్నాడు. దాంతో ఎస్సై నవ్వేసి ”కేసేటండీ కేసు.. కోళ్ళకి బలవర్ధకమైన ఆహారం గురించి సూచనలు చేయ డానికి మీరొచ్చారనీ, వాటి శక్తి సామర్ధ్యాలు పరీక్షిస్తున్నారనీ, వీళ్ళంతా ఆ కోళ్ళ యజమానులనీ రాసుకుంటాం. అంతే. యింకే కేసూ ఉండదు” అన్నాడు. దాంతో గురుశిష్యులిద్దరూ మనస్ఫూర్తిగా ఎస్సైకి నమస్కారం పెట్టి బయటకొచ్చేశారు.
 
అఅఅఅ
 
వెంకటేశం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అంతా కల..! ‘యిదేంటీ… యిదేదో నాగయ్యగారి కాలంనాటి కలలా ఉందేంటీ..’ అను కున్నాడు. అటూ యిటూ చూస్తే  యింకా గురువుగారి జాడలేదు. దాంతో యింట రుగు మీదే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. ఈసారి యింకో కలొచ్చింది.
 
అఅఅఅ
 
”ఏరా బాబీ.. మీ మావయ్య ఏడిరా?” అన్నాడు వెంకటేశం వస్తూనే. ఆపాటికి టీవీ ఛానల్స్‌ మార్చుకుంటున్న  బాబీ ”ఊరె ళ్ళాడు బాబాయ్‌.. సాయంత్రం వసా ్తనన్నాడు” అన్నాడు. గురువుగారు ఎక్కడి కెళ్ళుంటారా అని వెంకటేశం ఆలోచిస్తుంటే టీవీలో ఏదో ఫ్లాష్‌ న్యూస్‌ రావడం మొద లయింది. ఈలోగా వేండ్రలో కోడి పందేలు ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారనీ. వారిలో రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యక్తి గిరీశం ఉన్నారన్నది’ ఆ వార్త. అది చూడగానే వెంకటేశం షాకయ్యాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. అంతలోనే ఓ నిర్ణయానికి వచ్చి నట్టుగా ఎవరెవరికో ఫోన్లు చేసి, ఆనక ప్రెస్‌క్లబ్‌కి పరిగెత్తాడు.. యింకో గంటలో ఆ ప్రెస్‌మీటేదో మొదలయింది. వెంకటేశం ఆవేశంగా మాట్లాడుతున్నాడు. వెంకటేశం చెప్పేది అందరూ రాసు కుంటున్నారు. ‘యిదెంత దారుణమని.. గిరీశం గారి లాంటి సంఘ సంస్కర్తలంటే ఆ ఎస్సైకి పడదని అర్థమయిపోతోంది. ఏం.. కోడిపందేలు ఆడేవాళ్ళు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరినీ అరెస్ట్‌ చేసి జైల్లో పడేస్తారా.. అలా అయితే జైళ్ళు సరిపోతాయా.. అసలిదంతా ఏదో కక్ష సాధింపు చర్యలా ఉంది. లేకపోతే అంత మహా మేధావి అయిన గిరీశం గారిని అరెస్ట్‌ చేయడమేంటీ?” అన్నాడు. వెంకటేశం చెప్పిందంతా మీడియాలో ప్రముఖంగా వచ్చింది. యిది జరిగిన రెండు గంటల తర్వాత వెంకటేశం వేండ్ర బయల్దేరాడు. అక్కడ పోలీస్‌స్టేషన్‌కి చేరుకున్నాడు. వెంకటేశం వెళ్ళేసరికి గిరీశం, యింకో అయిదుగురూ దేభ్యం మొహాలేసుకుని సెల్‌లో ఉన్నారు. ఎస్సై అయితే  స్టేషన్‌లోనే  ఉన్నాడు.  వెంకటేశం గబగబా ఎస్సై దగ్గరికి నడిచి తనని పరిచయం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఎస్సై మొహంలో మార్పొచ్చింది. కొంచెం క్రూరంగానే ”అయితే టీవీలో స్టేట్‌మెంట్లు యిచ్చిన వెంకటేశం నువ్వేనన్నమాట” అన్నాడు. వెంక టేశం అవునన్నట్టుగా తలూపాడు. దాంతో ఎస్సై చెలరేగిపోయాడు. గిరీశం వైపు తిరిగి ”కోడిపందేల బాపతు యితని దగ్గర పట్టుబడింది లక్షరూపాయలు” అన్నాడు. దాంతో గిరీశం కంగారుగా ”సార్‌.. నా దగ్గరున్నాయి అయిదువేలే. లక్ష నా దగ్గర లేదు” అన్నాడు. అయినా ఎస్సై ఊరుకోలేదు. ”లేదు.. లేదు.. మిగతా వాళ్ళ దగ్గర ఒక్క పైసా కూడా దొరకలేదు. మొత్తం డబ్బంతా నీ దగ్గరే ఉంది. అసలు ఈ కోడిపందేలు నిర్వహిస్తున్నది నువ్వేనట కదా” అన్నాడు. ఆపాటికి గిరీశానికి షాక్‌తో మాట పడిపోయింది. యింకా ఎస్సై కొనసాగిస్తూ ”ఆ మధ్యన చైన్‌ స్నాచింగ్‌ టీంలో నువ్వు మెంబర్‌వట. యింకా ఊళ్ళో జరిగిన అరడజను దొంగతనాలు ఓ అత్యాచారం వ్యవ హారంలో నీ పాత్ర ఉందట కదా” అన్నాడు. దాంతో అటు సెల్‌లో గిరీశం, సెల్‌ బయట వెంకటేశం పెద్దగా అరిచి కిందపడిపోయారు.
 
అఅఅఅ
 
మొహం మీద పొగ తగిలేసరికి  వెంకటేశం కళ్ళు తెరిచాడు. తీరా చూస్తే ఎదురుగా గిరీశం..! ”ఏవివాయ్‌ వెంకటేశం.. పగటికలలేవో కంటున్నట్టున్నావ్‌..” అన్నాడు. వెంకటేశం తలూపి ”గురూగారూ.. కొంపదీసి మీరు జైలుకి వెళ్ళిపోతారంటారా?” అన్నాడు.  దాంతో గిరీశం విసుక్కుని ”వెధవ ఆశలేం పెట్టుకోకుండా విషయమేంటో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలన్నీ చెప్పాడు. అంతా విన్న గిరీశం ”అయితే ఈసారి నీకలలో ఆర్జీవీ.. అదే.. రాం గోపాల్‌వర్మ దూరినట్టుంది” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. అప్పుడు గిరీశం కొంచెం వివరంగా చెప్పడం మొద లెట్టాడు. ”మరేం లేదోయ్‌.. ఎక్కడే సమస్యున్నా ట్విట్టరు ద్వారా అక్కడ వాలిపోవడం ఆర్జీవీకి అలవాటు. అంటే అదేదో ఆ సమస్య పరిష్కరించడానికి కాదు. కామెంట్స్‌ చెయ్యడానికి  దాంతో చాలా సార్లు విమర్శల పాలవడం కూడా జరిగింది. భావ వ్యక్తీకరణ తప్పు కాదు. ఈసారి ఆర్జీవీ డ్రగ్స్‌ మీద పడ్డాడు. తన శిష్యుడయిన పూరీలాంటి వాళ్ళని కాపాడే ఉద్దేశ్యం కావచ్చును. సిట్‌ అధికారుల మీదా, అకున్‌ మీదా విమర్శలు గట్టిగానే చేశాడు.  స్కూలు పిల్లల్ని కూడా యిలాగే పన్నెండేసి గంటలు విచారిస్తాంరా.. డ్రగ్స్‌ విషయంలో సినిమావాళ్ళనే ఎందుకు టార్గెట్‌ చేశారు.. ఈ విషయంలో సిట్‌ చేస్తున్నదేం బాలేదు’ లాంటి వ్యాఖ్యానాలు చేశాడు. అయితే దీని వలన ఆ విచారణ ఎదుర్కొంటున్న వాళ్ళకి ఏదో మంచి జరగడం మాట దేవుడెరుగు.. సమస్య మరింత జఠిల మయ్యే  ప్రమాద ముంది. ఏతావాతా చెప్పేదేంటంటే.. ఏ విషయం మీదయినా ప్రతి స్పందించే  హక్కు ఆర్జీవీకి ఉండొచ్చుగాక. అయితే  యిలాంటి కీలక అంశాలపై మాట్లాడకపోవడమే మంచిది. అలా మాట్లాడడం వలన అటు సిట్‌ అధికారుల నుంచే కాకుండా, యిటు సొంత యిండస్ట్రీ నుంచి కూడా అక్షింతలు పడతాయి” అంటూ వివరించాడు.
 
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి