వీర్రాజే…ఇంకెవరు? (శనివారం నవీనమ్)

వీర్రాజే…ఇంకెవరు?
(శనివారం నవీనమ్)

వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ లో సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి సామర్ధ్యాలు బిజెపికి లేవు. అయితే ఆ పార్టీ కేడర్ లో, మద్దతుదారుల్లో, సానుభూతి పరుల్లో ఉత్సాహం నింపి ఓటింగ్ బలం పెంచుకోవడం మీదే బిజెపి హైకమాండ్ దృష్టివుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సారధ్యాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజుకి అప్పగించగల అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా విషయంలో బిజెపి మాటతప్పిందన్న ఆగ్రహం ప్రజల్లో వుంది. పెద్ద నోట్ల రద్దు విషయంగా ఎగువ మధ్యతరగతి, మధ్యతరగతి ఆదాయ వర్గాల్లో బిజిపి పై కోపం వుంది…పెద్దగా పట్టూ, బలమూ లేని బిజెపికి ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండూ కొత్తగా ఎదురౌతున్న వ్యతిరేకతలు.

ఎపిలో తెలుగుదేశం, బిజెపిల సంబంధాలు అంతంత మాత్రంగా వున్నాయి. ఇవి తెగిపోకుండా బిజెపిలో చక్రం తిప్పిన వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాలను (ఉపరాష్ట్రపతి అవుతున్న కారణంగా) విరమించారు. ఇపుడు ఆయన పాత్ర నిర్వహించేవారు బిజెపిలో ఎవరూలేరు.

ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా దాదాపు సోము వీర్రాజు పేరు ఖరారయినట్లు భావిస్తున్నారు.గత సంవత్సరం క్రితమే వీర్రాజు అభ్యర్థిత్వం ఖరారు కావాల్సి ఉండగా అప్పటి పరిస్థితుల్లో ఏర్పడిన అడ్డంకులు వలన మరికొంత కాలం కొనసాగాలని ప్రస్తుత అధ్యక్షుడు డా.హరిబాబును కొనసాగించటం జరిగింది.

అయితే ఒక్క అడుగు కూడా ముందుకు ఆ పార్టీ పెరిగే దిశగా సాగలేదని,అందుకు అనేక కారణాలున్నాయని ఆపార్టీ వర్గాలు సమాచారం సేకరించింది. వీర్రాజు  అధ్యక్షుడు కాకుండా నిలవరించటంలో వెంకయ్య నాయుడు అడ్డుపదినందుకే ఆగిందని ఫలితంగా బీజేపీ బలపడకుండా  చెయ్యటం లో కూడా విజవంతమయి బీజేపీ ని మాత్రం బలహీనపడిందని అధిష్టానం గ్రహించిందనే విషయం కూడా పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి కూడా.

2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో  బలపడే దిశలో బిజెపి ని నడిపించడానికి పూర్తీ స్థాయి అధ్యక్షుడి నియామకం అనివార్యమౌతోంది. మాజీ మంత్రి పురందేరేశ్వరి,  నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు ల పేర్లు కూడా వినిపించినా పురందేశ్వరి కి అధ్యక్ష పదవి కట్టబెడితే కొత్తగా వచ్చి చేరేవారు లేరని,అలాగే గంగరాజు కి సారధ్యం ఇచ్చినా  పెద్దగా కులబలం లేనందున పార్టీ కి కలిగే లాభం అంతంత మాత్రమేనని అధిష్టానం గ్రహించినట్లు భోగట్టా.

అంకిత భావంతో పనిచేస్తున్న వీర్రాజు గతంలోనే రాజమండ్రి లో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, అసభకు హాజరైన జాతీయ పార్టీ అధ్యక్షుడు  అమిత్ షా ముందు తన సత్తా చాటారని,అయితే కొన్ని లాబీలు అడ్డుపడి, అయన గూర్చి అధిష్టానానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డుపడ్డారనే విషయం ఆలస్యంగా గ్రహించిందని లేదంటే ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో బలపడి ఉండేదని గుర్తించినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాపు వర్గానికి చెందిన వీర్రాజు అధ్యక్షుడయితే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ తో విసిగి వేసారిన వర్గం బీజేపీ వైపు వచ్చే అవకాశాలను అధిష్టానం పరిశీలించిందని ఆ మార్గంలో వీర్రాజుకే అధ్యక్ష పట్టం కట్టేందుకు ఇప్పటివరకు వున్న అవరోధాలను తొలగించిందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.