అశ్వమేథ యాగం

మనస్సాక్షి  – 1049
చాలా సంవత్సరాల మాట… గిరీశం చక్రవర్తి గారు పరిపాలిస్తున్న రోజులవి. ఆయన పాలనలో  ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆరోజు గిరీశం చక్రవర్తి గారు సభలో  కొలువుదీరి ఉన్న ప్పుడు ఆస్థాన పండితుడు ఆచార్యుల రావడం జరిగింది. కొంచెం సేపు మాటలు అయింతర్వాత ” మహాప్రభూ…మీకో మనవి.. మీరు అశ్వమేధ యాగం చేస్తే బాగుంటుందనిపిస్తుంది” అన్నాడు. దానికి గిరీశం ” అదెందుకు ఆచార్యా… మనం యిప్పటికే ఎన్నో రాజ్యాల్ని జయించేశాం కదా…” అన్నాడు. ఆచార్యులు తలూపి ” అవును మహా ప్రభూ…అయితే అక్కడక్కడా యింకా శత్రువులు తలెత్తుతున్నారు. వాళ్ళందర్ని ఏరిపారేయెచ్చు. యింకా మన విజయ ప్రాభవం అందిరికీ తెలు స్తుంది. పుణ్యం, పురుషార్థం అన్నాడు. యిదేదో గిరీశం చక్రవర్తికి నచ్చేసింది. దాంతో  యింకేం వాదించకుండా ఒప్పేసుకున్నాడు. అంతలో ఆచార్యులు ” మహాప్రభూ.. యాగాశ్వం వెంట  మన సేనాని వెంకూజీని పంపితే బాగుంటుంది” అన్నాడు. గిరీశానికి అది సరయిన నిర్ణయం అనిపించింది. అంతే కాదు. ఆ వెంటనే  ఆ యాగమేదో మొదలవడం, యాగాశ్వం వెంట సేనాని వెంకూజీని పంపడం జరిగింది.దాదాపు నెల గడిచిపోయింది. అన్ని రోజుల పాటు వెంకూజీ  నుంచి  ఎలాంటి సమాచారం లేదు. సరిగ్గా ముఫ్పై అయిదోరోజు వెంకూజీ తిరిగొచ్చాడు. అంతే కాదు. తనతో పాటు చీని చీనాంబరాలూ, యింకా ఎన్నో విలువయిన వస్తువులూ తెచ్చాడు. వెంకూజీ రాకతో గిరీశం చక్రవర్తి చాలా ఆనందపడ్డాడు. ”ఏం వెంకూజీ యిదేనా రావడం? అన్నాడు. వెంకూజీ తలూపి ” అవును మహాప్రభూ… మనకి జయం…జయం… పాటలీపుత్రాన్ని  జయించి వచ్చా” అన్నాడు. దాంతో గిరీశం చక్రవర్తి చాలా ఆనందించి  ”శభాష్‌ వెంకూజీ… నువ్వేదయినా సాధించగలవని నాకు తెలుసు. ఈసారి ఉత్తర భారతదేశం వైపు కాకుండా దక్షిణ భారతం వైపు వెళ్ళు ” అన్నాడు. వెంకూజీ తలూపి ” అలాగే ప్రభూ… యిప్పటికే దక్కను పీఠభూమిలో కొంచెంగా అడుగు పెట్టడం జరిగింది.  యిక మీదట చోళ, పాండ్ర, చేర రాజ్యాల్ని  మన ఆధీనంలోకి తెస్తా” అన్నాడు. గిరీశం అలాగే అన్నట్లుగా తలూపాడు. అలుపెరుగని వెంకూజీ ఆ మర్నాడే యాగాశ్వంతోనూ, కొంత సైన్యంతోనూ బయలుదేరాడు.
అఅఅఅ
వెంకటేశం ఉన్నట్టుండి లేచి కూర్చున్నాడు. అంతా కల…! యింకా గురువుగారి జాడలేదు. ‘యిదేంటీ… యిలాంటి కలొచ్చింది. అను కుంటూ ఆలోచనలో పడ్డాడు. ఆ ఆలోచనల్లోనే మళ్ళీ నిద్రలోకి జారుకోవడం, అందులో యింకో కల రావడం జరిగాయి
అఅఅఅ
వెంకటేశం వెళ్ళి అలకపాన్పు  ఎక్కేశాడు…! అంటే దానర్ధం ఏ కానుక కోసమో అత్తవారింట్లో అలక పాన్పు ఎక్కడం కాదు. గురువు గారి మీద అలిగి ఆ యింట రుగు మీదే తిష్ఠ వేశాడు…. దాంతో గిరీశం ” ఏవివాయ్‌ వెంకటేశం… యిప్పుడే మయిందని… ఈ బోడి అలకలేటంట?” అన్నాడు. దాంతో  వెంకటేశం ” ఆ యింకా నాకీ  పరిస్థితి ఎన్నిరోజులు గురూగారూ” అన్నాడు. దాంతో గిరీశం” యిదిగో … ఈ విషయంలో మీ తాత వెంకటేశం లక్షణాలు నీలో  బాగా దిగబడ్డాయోయ్‌… ఆయనా యింతే. అలాగే చీటికీ మాటికీ అలిగేయడం…సర్లే..సర్లే… యిప్పుడే నీ కోసం మాట్లడతా” అన్నాడు. దాంతో వెంకటేశం సంబరంగా తలూపాడు. ఈసారి గిరీశం ” ఓ సారి చిన్నప్పటి రోజుల్లోకెళ్ళు” అన్నాడు. వెంకటేశం ఓ సారి చిన్నప్పటి రోజుల్ని  గుర్తు చేసుకుని ” అవును గురూ గారూ…నిక్కరు వేసుకుని శాఖ కెళ్ళేవాళ్ళం కదా”  అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌… అందుకే నిన్ను మళ్ళీ శాఖకే పంపించేద్దామనుకుంటున్నా. మోడీ గారితో మాటా డతా” అన్నాడు. దాంతో వెంకటేశం అదిరిపోయి ” ఏంటీ…మోడీ గారితోనా? ” అన్నాడు. గిరీశం నవ్వేసి ‘ ‘ మోడీ కాకపోతే ఆయన పియ్యేతో మాట్లాడతా” అన్నాడు. మూడోరోజు ఉదయానికల్లా వెంకటేశం మోడీగారి పియ్యే కృష్ణ మాధవ్‌ దగ్గరున్నాడు. కృష్ణ మాధవ్‌కయితే వెంకటేశం వాలకం, మాట తీరూ నచ్చాయి. ” ఏవయ్యా… యింతకు ముందు శాఖలో పనిచేశా వంటకదా. యిప్పుడు మళ్ళీ శాఖలోకి వెళతావా? అన్నాడు. దాంతో వెంకటేశం ఆ..ఊ.. అన్నట్టుగా నసిగాడు. దాంతో కృష్ణ మాధవ్‌ ‘ ‘ సర్లే శాఖంటే పూర్తిగా సర్వీస్‌ ఓరియంటెడ్‌. రాజకీయాల్లో ఎద గాలనుకుంటే  కుదరదు. ఓ పని చేద్దాం నిన్ను పార్టీలోకే పంపించేస్తాలే” అన్నాడు. దాంతో వెంకటేశం మొహం వెలిగి పోయింది. యింతలో కృష్ణమాధవ్‌ ” అవునూ… యింతకీ నువ్వేం చదివావ్‌? అన్నాడు. దాంతో వెంకటేశం పులయి పోయాడు. ” ఎంబిఏ చదివా. యింకా ‘లా’ చేశాను. ఎమ్మెపోలి టిక్స్‌ కూడా అయింది. అన్నీ మన ఆంధ్రా యూనివర్శిటీ నుంచే చేశా అన్నాడు.  కృష్ణమాధవ్‌ తలూపి ‘ వెరీగుడ్‌. అయితే  నాక్కా వలసింది నీ చదువు కాదు. నువ్వు ‘పంచతంత్రం’ చదివావా అన్నాడు. దానికి వెంకటేశం ‘పంచతం త్రమా…అంటే ఆ నక్కలూ,ఏనుగులూ లాంటి జంతువుల కథలుంటాయి. అదే కదా” అన్నాడు. దాంతో కృష్ణ మాధవ్‌ ‘అవునదే. వాటిని చిన్న ప్పుడు ఎప్పుడో చదివుంటావ్‌. ఓ రెండు నెలల టైం తీసుకుని ఆ కథలని బాగా వంటబట్టించుకునిరా. దాంతో పాటు చాణుక్యుడి అర్ధశాస్త్రం కూడా వంటబట్టించు కునిరా” అన్నాడు. ‘యిదేంటీ… ఈ పాత చింతకాయపచ్చడి వ్యవ హారం ఏంటీ’ అనుకుంటూ  బయటకు నడిచాడు వెంకటేశం.
అఅఅఅ
ఎవరో తట్టి లేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. కలంతా చెదిరిపోయింది. ఎదురుగా గిరీశం నొట్లోచుట్టతో నిల బడుతున్నాడు. ” ఏవివాయ్‌ వెంకటేశం…పగటి కలలేవయినా కంటు న్నావా? ” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలు చెప్పాడు.  ” అయినా ఈ కలలకి అర్ధం ఏంటంటారు ?” అన్నాడు. దాంతో గిరీశం ”ఏవుందోయ్‌..యిదంతా ఆ మోడీ, అమిత్‌ షాల వ్యవ హారపు శైలి” అన్నాడు. వెంకటేశం ఆలోచనలో పడ్డాడు. యింతలో గిరీశం ‘అవునోయ్‌ మోడీగానీ, షా గానీ  కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తమ జీవితాలు ధారపోసిన వాళ్ళు. వాళ్ళకి ‘నా’ అనే వ్యక్తిగత జీవితం ఉండదు. వాళ్ళ ఆలోచనా, ఆశయం ఒక్కటే. దేశం బాగుండాలి. ఆ దేశంలో ప్రజలంతా బాగుండాలి. అంతే. దాని కోసం ఏం చేయాలన్నదే వారి నిరంతర పోరాటం. అందులో భాగమే ఈ చేదు మాత్రల్లాంటి నోట్ల రద్దు, జీఎస్టీ వ్యవహారాలు. యివేవో తాత్కా లికంగా ప్రజలకి ఇబ్బంది  కలిగించొచ్చుగాక.  కాని శాశ్వతంగా మధురఫలాల్ని  ప్రజలకు అందిస్తాయి. యిదేదో ప్రజలూ అర్ధం చేసుకోగలిగారు. యిటీవల కాలంలో  వేర్వేరు చోట్ల జరిగిన ఎన్నికల ఫలితాలే అందుకు ఉదాహరణ. అయతే మోదీ, షాలు తలపెట్టిన  ఈ మహత్తర యజ్ఞం సాగాలంటే తమ పార్టీ యిప్పుడే కాదు. మరిన్ని సంవత్సరాలు అధికారంలో కొనసాగాలి. యింకా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ  తమ ప్రాబల్యం విస్తరించుకోవాలి. అందుకే షా ఒక్కొ రాష్ట్రంలోనూ కమలాన్ని వికసింపజేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగానే మిత్రలాభం, మిత్రబేధం యింకా చాణుక్య నీతి ప్రయోగించడం. యివన్నీ పక్కనబెడితే ఓ విషయాన్ని  ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. అది…దశాబ్ధాలుగా దాదాపు అన్ని ప్రభుత్వాల హయాంలోనూ వేల కోట్లు రూపాయల స్కాంలు జరిగాయి. అయితే గత మూడేళ్ళుగా ఒక్క మంత్రి మీద కూడా అవినీతి ఆరోపణ రాకపోవడం ప్రజలకి ఎంతో శుభపరిణామం. అంతే కాదు. దేశంలో అవినీతి ప్రక్షాళన కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ  లెక్కన రాబోయే రెండేళ్ళలో  దేశం మరింత స్వచ్ఛత వైపు వెళ్ళడం ఖాయం ” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి