ఇంత దిగజారుడా !

 జీ కె వార్తా వ్యాఖ్య
ఎన్నికల వరకే విమర్శలు…అవి కూడా సైద్ధాంతిక అంశాలపై మాత్రమే…వ్యక్తిగత ఆరోపణలకు తావే లేదు…అధికారంలోకి ఎవరొచ్చినా ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మక సహకారం…చట్ట సభల్లోనే కాదు బయట తారసపడినా గౌరవపూర్వకంగా పరస్పర వందనాలు…ఆత్మీయంగా గాఢంగనాలు…కుశల ప్రశ్నలు…పరస్పరం ఛలోక్తులు…మనసారా నవ్వుకోవడం…హుందాగా వ్యవహరించడం అయితే ఇదంతా గతం. నేటి వర్తమాన రాజకీయ ముఖచిత్రం అందుకు పూర్తి విరుద్ధం…ఎన్నికలు పూర్తయ్యాక అధికారంలోకి వచ్చిన పార్టీపై ఈర్ష్య, ద్వేషం, నిరంతరం విషం చిమ్మడం… వ్యక్తిగత విమర్శలు గుప్పించడం…చివరకు చట్టసభల్లో సైతం కనీస మర్యాదపూర్వకంగా అభివాదం చేసుకోకపోవడం..చర్చకు తావు లేకుండా నే పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా మూర్ఖత్వంగా వ్యవహరిస్తుండటంతో అర్ధవంతమైన చర్చకు ఆస్కారం లేకుండా పోతోంది. దీంతో అటు పార్లమెంట్‌ అయినా..ఇటు అసెంబ్లీ అయినా ముఖ్యమైన అంశాలు, చట్టాలు సైతం చర్చ లేకుండానే ఆమోదం పొందడం లేక సమావేశాలు  ప్రతిరోజు వాయిదాల పర్వంతో సాగిపోతుండటంతో  ఎంతో విలువైన సమయం…కోట్లాది రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడం ఇటీవల కాలంలో సర్వసాధారణమైంది. అత్యున్నతమైన శాసనవ్యవస్థకు వేదికలైన చట్టసభల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఆ సభలకు వెలుపల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో నంద్యాలలో నిన్న జరిగిన ఉప ఎన్నిక బహిరంగసభలో మన రాష్ట్ర ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రథసారథి వైఎస్‌ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలు  ఆయన బాధ్యతారాహిత్యానికి దర్పణం పడుతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడాల్సిన చట్ట సభ సభ్యుడే అందునా  ప్రతిపక్ష నేత హోదాలో, ఓ పార్టీకి సారథ్యం వహిస్తున్న నేతగా ఎంతో హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన జగన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చినా ఫర్వాలేదనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యప్రియులను, శాంతికాముకులను నివ్వెరపర్చింది. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన ‘ముఖ్యకంత్రీ’ అని, కాల్చినా ఫర్వాలేదనిపిస్తోంది అని వ్యాఖ్యానించడం ఎంత మాత్రం సమంజసం కాదు…ఏ మాత్రం సమర్ధనీయం కాదు… ప్రతిపక్షనేతగా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన జగన్‌ తరుచుగా సీఎంపై వివాదస్పద వ్యాఖ్యలు, కించపర్చేలా మాట్లాడటం పరిపాటైంది. గతంలో సీఎం కాలర్‌ పట్టుకోండి… చీపుర్లతో  కొట్టండి అంటూ కూడా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. జగన్‌ వ్యాఖ్యలు, ప్రవర్తన చూస్తుంటే అధికారం కోసం, ఉప ఎన్నికలో గెలపు  కోసం ఇంత బరి తెగించి విచక్షణ మరిచి ఉన్మాదంగా మాట్లాడతారా అనిపిస్తోంది. ఒక ఉప ఎన్నికలో గెలుపు కోసమే ఆయన ఇలా మాట్లాడితే 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఇంకెలా మాట్లాడతారో?, ఇంకెలా ప్రవర్తిస్తారోనన్న  అనుమానం కలుగుతోంది. ప్రతిపక్షనేత వ్యవహారం ఇలా ఉంటే ఆ పార్టీ నేతల ధోరణి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. ఉప ఎన్నికలో ప్రత్యర్థి పార్టీ వారు ఓటుకు రూ.5 వేలు ఇచ్చినా తీసుకుని ఓటు మాత్రం తనకు వేయండనడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. రాజకీయాల్లో, ఎన్నికల్లో ఎవరి సిద్ధాంతం వారు చెప్పుకుని ఓట్లు అడగడంలో ఎంత మాత్రం తప్పుకాదు. అంతే గాని స్థాయి కూడా చూడకుండా పూర్తి అక్కసుతో వ్యక్తిగత ధూషణలకు దిగడం, హింసను ప్రేరేపించేలా మాట్లాడటం ఎవరికీ తగదు. ప్రతిపక్షనేత తీరు ఇలా ఉంటే కుల విద్వేషాలు రెచ్చగొట్టేవారు కొందరు, ఎలాంటి వివాదాలతో సంబంధం లేని మహనీయుల విగ్రహాలను కూలగొట్టేవారు కొందరు తయారవుతుంటే వీరంతా ఈ  సమాజాన్ని ఎటు తీసుకెళుతున్నారో అర్థం కావడం లేదు. బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన రాజకీయ నాయకులు ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సమాజానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. రాజకీయాల్లో నైతిక విలువలు పతనమవుతున్నాయనడానికి జగన్‌ వ్యాఖ్యలే నిదర్శనం. నిర్మాణాత్మక సహకారంతో, సైద్ధాంతిక పోరుతో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకుని ప్రతిపక్షం అధికారంలోకి రావడానికి ప్రయత్నించాలే తప్ప ఇలా హింసాత్మక ధోరణి రెచ్చగొట్టేలా స్థాయిని,సభ్యతను మరచి మాట్లాడటం ఎంత మాత్రం తగదు. దీనివల్ల పొలిటికల్‌ మైౖలేజ్‌ కంటే మైనస్సే అధికమన్న సత్యాన్ని గ్రహిస్తే వారి రాజకీయ భవిష్యత్‌కు శ్రేయస్కరం.