ఈలలు, చప్పట్లు ఖరీదు

మనస్సాక్షి  – 1050
మధ్యాహ్నం మూడింటికి స్వాతంత్య్రం వచ్చింది. అదేంటీ… ఆ స్వాతంత్య్రం ఏదో అర్థరాత్రి వచ్చింది కదా అంటే అదీ నిజమే. అప్పుడొచ్చింది దేశానిక యితే… యిప్పుడొచ్చింది మన వెంకటేశానికి..! యింకా చెప్పాలంటే ఆ స్వాతంత్య్రం ఏదో రాలేదు. తనే తీసేసుకున్నాడు. గురువు గారికి కూడా చెప్ప కుండా హైదరాబాద్‌ బయల్దేరాడు. అదీ జగన్‌కి ముఖ్య సలహాదారుడు అనదగిన ప్రశాంత్‌ కిశోర్‌ దగ్గరకి.. అసలయితే రెండ్రోజుల నుంచీ వెంక టేశం దీని గురించే ఆలోచిస్తున్నాడు.  తను ఎదగా లంటే  ఏదో బడా నాయకుడి దగ్గర చేరాల్సిందే. అయితే ఆ చేరేదేదో అధికార పక్ష నాయకుడి కంటే ప్రతిపక్ష నాయకుడయితే మంచిది. ఎందు కంటే అధికారపక్ష నాయకుడిది కడుపునిండిన బేరం. ఆలోచనల్లో  పెద్ద పదును ఉండకపోవచ్చు. అదే ప్రతిపక్షనేత అయితే అనుక్షణం అవకాశాల కోసం చూస్తుం టాడు. ఏ అవకాశ మొస్తుందా.. దానిని ఆయుధంగా మలిచేసుకుని అధికార పార్టీని చావగొడదాం అని చూస్తుంటాడు. మరి అలాంటి ప్రతిపక్షనేతకే సలహాలు యిచ్చేవాడయితే మరీ గొప్పవాడయి ఉంటాడు. అయితే గియితే అలాంటివాడి దగ్గర శిష్యరికం చేయాలి. మరి జగన్‌కి సలహా లిచ్చేదెవరా అని ఆలోచిస్తే అది పీకే అనబడే ప్రశాంత్‌ కిశోర్‌ అని అర్థమయింది. దాంతో అప్పటికప్పుడు ఆ పీకే దగ్గరికి బయల్దేరాడు.
——
మర్నాడు పొద్దున్నే వెంకటేశం సదరు పీకేగారి ఆఫీసులో వాలి పోయాడు. ఒకళ్ళు తనని వెతుక్కుంటూ ఎక్కడ్నుంచో వచ్చారని తెలిసి పీకే ఆశ్చర్యపోయాడు. అదీగాక వెంకటేశం బాపతు డిగ్రీలవీ చూసి తెగ ముచ్చటపడిపోయి వెంటనే అపాయింట్‌మెంటు యిచ్చేశాడు. వెంకటేశం కూడా సూటిగా విషయంలోకి వచ్చేశాడు. ”సార్‌.. నాకు మీరంటే ఎంతో అభిమానం. మీ దగ్గర శిష్యరికం చేద్దామను కుంటున్నా” అన్నాడు. దానికి పీకే ”నా దగ్గర శిష్యరికం అంటే మాటలా.. చాలా ఖర్చవుతుందే” అన్నాడు. దాంతో వెంకటేశం ”యిప్పుడయితే నేనేవీ యిచ్చుకోలేనుగానీ మీరో దారి చూపిస్తే  తర్వాత తప్పకుండా మీ గురుదక్షిణ చెల్లించుకుంటా” అన్నాడు. ఆ మాటలకి పీకే తెగ ముచ్చటపడిపోయాడు. అంతేకాదు. ”ఓకే వెంకటేశం.. అలాగే నేను చెప్పింది చెయ్యడం మొదలెట్టు. మన బాస్‌.. అదే.. జగన్‌ గారి దగ్గర నీకు పని. మరేం లేదు. ఆయన రోజా ఎక్కడెక్కడో స్పీచ్‌లు యిస్తుంటారు. ఆ స్పీచ్‌ ఏంటనేది నాలు గ్గంటల ముందుగా నీకు అందజేయబడుతుంది. నువ్వు చేయవల సిందల్లా వాటిని జాగ్రత్తగా చదివి వాటి వలన ఎలాంటి మంచి జరగొచ్చో, ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చో విశ్లేషించి చెప్పాల్సి ఉంటుంది” అన్నాడు. వెంకటేశం అలాగేనని తలూపాడు. ఆ మర్నాడే వెంకటేశానికి  మొదటి ఆపరేషన్‌ తగిలింది. ఆరోజు సాయంత్రం జగన్‌ యివ్వబోయే స్పీచ్‌ తాలూకా మేటరంతా వెంకటేశానికి పంపబడింది. వెంకటేశం ఒకటికి మూడుసార్లు అదంతా చదివాడు. తర్వాత గబగబా జగన్‌ని కలుసుకోవడానికి  బయల్దేరాడు. అక్కడ ఆఫీసులో ‘అర్జంటుగా మాట్లాడాలి’ అని లోపలికి కబురు పంపిం చాడు. అంతకుముందే  వెంకటేశం నియామకానికి సంబంధించి పీకే చెప్పి ఉండడంతో జగన్‌ వెంటనే అతనిని లోపలికి పిలిపించేశాడు. ”ఊ.. చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ”సార్‌.. ఈ స్పీచ్‌లో ఓ చోట ‘చంద్రబాబుని నడిరోడ్డులో కాల్చి  చంపినా తప్పులేదు’ అనుంది. దాని వలన సంచలనాలు రేగుతాయి. ఆ మీటింగ్‌కొచ్చే లక్షా రెండులక్షలమంది చప్పట్లు కొడతారు. అయితే తర్వాత చాలా సమస్యలు వచ్చే అవకాశముంది. అధికారపక్ష నాయకులూ అన్ని చోట్లా మీ దిష్టిబొమ్మలు తగలేయవచ్చు. ఎవరయినా కోర్టులో కేసు పెట్టొచ్చు. యింకా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి రిపోర్టు చేసే అవకాశం ఉంది” అన్నాడు. అంతా విని ”జగన్‌ నిజమే. ఆ మాత్రం చప్పట్లు కొట్టించు కోడానికి యింత రిస్క్‌ అవసరం లేదు” అంటూ ఆ లైను తొలగించేశాడు.
——-
ఉన్నట్టుండి మోడీ తలపట్టుకున్నాడు.  పక్కనున్న షాకి యిది ఆశ్చర్యంగా అనిపించింది. ప్రపంచం తలకిందులయినా చలించనట్టుండే మోదీ యిలా ఆందోళన పడడం ఆశ్చర్యమే. దాంతో ”ఏవయింది మోదీజీ” అన్నాడు. దాంతో మోడీ ”ఏం చెప్పాలి… మన వాళ్ళ నిర్వాకం అలా ఉంది. ఆ రాహుల్‌గాంధీ తన నోటి దురుసుతో చేసిన వ్యాఖ్యలతో చాలా సార్లు దొరికిపోయాడు. యిప్పుడు మనవాళ్ళు ఆ రాహుల్‌ కాన్వాయ్‌ మీద దాడి చేసి కారు పగల గొట్టారు. దాంతో యిప్పుడా ఆయుధమేదో ఆ రాహుల్‌కి చేతికి యిచ్చి నట్టయింది.” అన్నాడు. దాంతో షా తలూపి ”అవున్నిజమే.. యిలాంటివి జరగకుండా చూడాలి. ఈ కార్యకర్తల విష యంలో మనం మరింత స్ట్రిక్ట్‌గా ఉండాలి” అన్నాడు. అక్కడితో వారి సమావేశం ముగిసింది.
——-
”అది గురూగారూ… నాకొచ్చిన  కలల వ్యవహారం” అన్నాడు వెంక టేశం. దాంతో గిరీశం అంటే దీనర్ధం రాజన్నవాడు స్థితప్రజ్ఞుడిగా ఉండాలని” అన్నాడు. దాంతో వెంకటేశం గుర్రుమని.. అదేంటి గురూ గారూ.. నేను చాంతాడంతటి కలలు చెబితే ఒక్క ముక్కలో తేల్చేస్తారా?” అన్నాడు. దాంతో గిరీశం ”మరి ఆ విశ్లేషణేదో నువ్వే చెప్పవోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం ఆలోచించి అప్పుడు వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”రాజకీయాల్లో కీలక స్థానాలకి వెళ్ళిం తర్వాత స్థితప్రజ్ఞత అలవరచుకోవలసిందే. అది అధికార పక్షానికయినా, ప్రతిపక్షానికైనా వర్తిస్తుంది. ఆ స్థాయిలో వాళ్ళ ప్రతి మాటా, చేతా అత్యంత ప్రభావితంగా ఉంటాయి. ఓ రకంగా అవే వయినా హద్దులు దాటితే అది తాత్కాలికంగా చప్పట్లు కొట్టించి, ఈలలు వేయించి సంచలనం కలిగించొచ్చు. అయితే అదేదో ప్రత్య ర్ధులకి ఆయుధం యిచ్చినట్టవుతుంది. జగన్‌నే తీసుకుంటే మొన్న చంద్రబాబు మీద చేసిన  కామెంట్‌ ఈరోజు ప్రళయం అయ్యే లాగుంది.  పబ్లిక్‌లో ఎప్పుడూ కొందరు ఏ పార్టీవైపు మొగ్గు చూప కుండా తటస్థంగానే ఉంటారు. వాళ్ళు ఈ నేతల మాటల్ని బట్టీ, చేతల్ని బట్టీ అటూ యిటూ మారుతుంటారు. ఆ మధ్య చంద్రబాబు పెన్షన్‌ల గురించీ, తర్వాత వేసిన రోడ్ల గురించీ నియంతలా చేసిన, కామెంట్ల వలన కొంతమేరకు విమర్శలొచ్చాయి.  అంటే యిలాంటివి ఆ తటస్థ ఓటర్లకు అవతలివైపుకు మరలిస్తాయి. ఇప్పుడు జగన్‌ తన నోటి దురుసుతో వ్యాఖ్యానాలు చేసి అవకాశాల్ని  పాడు చేసుకుంటున్నాడు. అలాగే గుజరాత్‌ బీజేపీ కార్యకర్తల విషయంలోనూ యిలాంటి ధోరణి గమనించొచ్చు. మోడీ, షాల వరకూ  స్థితప్రజ్ఞత పాటించొచ్చు. అయితే కిందస్థాయి కార్యకర్తలతో అది కనిపించలేదు. అది కూడా సమస్యే. దాని వలనే రాహుల్‌గాంధీ కాన్వాయ్‌ మీద దాడి చేయడం. దాని వలన మంచి ఆయుధమేదో రాహుల్‌గాంధీకి యిచ్చినట్టయింది. ఏతావాతా చెప్పేదేంటంటే.. రాజకీయ పార్టీలకి సంబంధించి అన్నిస్థాయిల్లోనూ స్థితప్రజ్ఞత పాటించినంతసేపూ అది వాళ్ళ మైలేజ్‌ పెంచుకోవడానికి పనికొస్తుంది. అలాగే మాటా, చేతా హద్దు దాటితే ప్రత్యర్ధికి చేతులారా ఆయుధం అందించినట్టే” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి