ఆటలో (ఓటులో) అరటిపండు

మనస్సాక్షి  – 1051
ఏదయినా షాకింగ్‌ న్యూస్‌ విన్నప్పుడు నోట్లోంచి చుట్ట జారి కింద పడిపోవడం గిరీశానికి అల వాటు. ఆరోజు అలాంటిదొకటి  జరిగింది. గిరీశం ఎప్పటిలాగే అరుగుమీద కూర్చుని వీధిలోకి చూస్తూ చుట్ట గుప్పు గుప్పు మనిపిస్తుండగా వెంకటేశం దిగబడ్డాడు.  వచ్చీ రాగానే  సూటిగా విషయంలోకి వచ్చేశాడు. ‘ గురూ గారూ నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నాను. నామి నేషన్‌ కూడా వేసేశా” అన్నాడు. దాంతో గిరీశం ఒక్కసారిగా అదిరిపోయాడు. షాక్‌తో నోరెళ్ళ బెట్టాడు. నోట్లో చుట్ట కాస్తా కిందపడిపోయింది. అంతలోనే తేరుకుని ” ఏలివాయ్‌ వెంకటేశం… ఈ విషయంలో  నా సలహా కోసం వచ్చావా…లేకపోతే  చేసిన ఘన కార్యం చెప్పడానికొచ్చావా? అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిగా నవ్వాడు. ” అది  గురూ గారూ..ఏదో అలా అయిపోయిందంతే” అంటూ  యింకా ఏదో అనబోతుండగా రోడ్‌ మీంచి సుబ్బరాజు పిలవడం వినిపించింది. సుబ్బరాజంటే  ఆ పక్కింట్లోనే ఉంటాడు. దాంతో గిరీశం గబ గబా మెట్లు దిగి సుబ్బరాజు దగ్గరకెళ్ళాడు. దాంతో వెంకటేశం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ‘ హామ్మయ్య…గురూ గారికి విషయం చెప్పడం అయిపోయింది.’ అనుకున్నాడు. ఆ తర్వాత గురువు గారి కోసం ఎదురు చూడడం మొదలెట్టాడు. అయితే  ఓ పట్టాన అక్కడ సుబ్బ రాజుతో కబుర్లేవీ తెమిలేట్టు లేదు. దాంతో వెంకటేశం చిన్నగా ఆవు లిస్తూ అలా అరుగుమీదే నిద్రలోకి  జారకున్నాడు. అందులో ఓ కలొచ్చింది.
  ——-
 నంద్యాల… రాష్ట్రం మొత్తం దృష్టి అక్కడే ఉంది. దానిక్కారణం అక్కడ జరగబోతున్న ఉప ఎన్నికే. మాములుగా అయితే  అంత హడావిడి ఉండకపోవును. అయితే పోటీలో ఉన్న  పార్టీలు రెండూ అక్కడ గెలవడాన్ని  ప్రెస్టేజ్‌గా తీసుకున్నాయి. యింకో ప్రక్క రెండు పార్టీల్లో అగ్ర నాయకులూ రెచ్చిపోయి రకరకాల  ఛాలెంజ్‌లు చేసుకోవడం కూడా జరిగింది. దాంతో వ్యవహారం యింకా రసకం దాయంలో  పడింది. యిక రెండు పార్టీలూ  అక్కడ గెలుపు కోసం తమ సర్వం ఒడ్డే పనిలో పడ్డాయి. రెండు పార్టీల్లో  పెద్ద తలకాయలూ అక్కడే మకాం వేసేశాయి.  యింకా ఏవేం పనులు చేయకూడదని ఎలక్షన్‌ కమిషన్‌ చెబుతుందో అవన్నీ అక్షరాలా అక్కడ జరుగుతున్నాయి. రంగంలోకీ డబ్బూ, మద్యపానం, యింకా యితరత్రా నజరానాలు దిగిపోయాయి.  అదీ అలా యిలా కాదు.  ఓటరు ఉక్కిరిబిక్కిరయ్యేటంత. యింకో పక్క పార్టీల నాయకులు వ్యక్తిగత ధూషణలతో టీవి ఛానల్స్‌ రేటింగ్‌ పెంచే పనిలో  పడ్డారు. చివరికి ఎవరు గెలుస్తారో తెలీదు కానీ పరిస్థితి మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. అలాంటి పరిస్థితుల్లో యింకో విశేషం జరిగింది. అది…వెంకటేశం యిండిపెండెంట్‌గా నామినేషన్‌ వేయడం. ఏ పార్టీ లోనూ  లేకుండా, ఏ బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా వెంకటేశం ఏ ధైర్యంతో అక్కడ పోటీ చేస్తున్నాడనేది ఎవరికీ అర్ధం కాలేదు. అయితే వెంక టేశం కూడా తనదైన ముద్రని చూపించాడు. పోటీలో ఉన్న మిగతా కేండిడేట్లలాగా ఆవేశపడిపోవడం లేదు. తెలివితేటలతో వ్యవహరిస్తు న్నాడు. కాలేజ్‌లకెళ్ళి అక్కడ తన చదువు గురించి ప్రస్థావించాడు. చదువుకున్నవాళ్ళు పదవిలోకి వస్తే  సొసైటీకి అదెంత ఉపయోగమో వివరించాడు. అదేదో వాళ్ళకి బాగా పట్టేసింది. వెంకటేశానికే  ఓటేసేయాలని వాళ్ళలో  చాలా మంది నిర్ణయించేసుకున్నారు కూడా. అలాగే వెంకటేశం కొంచెం పాత తరం మనుషుల దగ్గర గిరీశం గారికీ  బావమరిది అయిన వెంకటేశానికి తను స్వయానా మనువడినని చెప్పుకొచ్చాడు. వెంకటేశం చేసిన మరో యింకో మంచి పని పోటీలో ఉన్న  ఎవరిమీదా ఎక్కడా నోరుపారేసుకోకపోవడం. తనని గెలిపిస్తే  తనేం చేస్తాడన్నది చెప్పుతున్నాడంతే. యిదీ చాలా మందికి నచ్చింది. మొత్తానికి ఎల క్షన్‌  దగ్గరకొచ్చేసరికి ఆ మిగతా రెండు పార్టీల అభ్యర్ధుల పేర్లతో పాటుగా వెంకటేశం పేరు కూడా  అందరి నోళ్ళలో నానుతోంది. చివరికా ఎలక్షన్‌ రోజేదో రావడం, రకరకాల గొడవల మధ్య ఆ ఎలక్షన్‌ పూర్తవడం జరిగిపోయాయి. యిక కౌంటింగ్‌ రోజయితే  అందరికీ ఒకటే టెన్షన్‌గా ఉంది. కౌంటింగ్‌ జరుగుతుంటే రౌండురౌండుకీ ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య లీడింగ్‌లు మారిపోతున్నాయి. యింకో పక్క వెంకటేశానికీ  కూడా కొంచెం కొంచెంగా ఓట్లు పడడం తెలుస్తోంది. మొత్తానికి కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి  ఓ పార్టీకి 46 శాతం ఓట్లు, యింకో పార్టీకి 44 శాతం ఓట్లు వచ్చాయి. మిగతా పది శాతం ఓట్లలో అయిదు  శాతం బరిలో ఉన్న మిగతా అందరికీ కలిసి వచ్చాయి. యింకో అయిదు శాతమయితే వెంకటేశం ఒక్కడికే వచ్చాయి. యింకేముంది. ఆపరేషన్‌ సక్సెస్‌…పేషెంట్‌ డెడ్‌ అన్నట్టుగా అన్ని వర్గాల నుంచీ ఎంతో కొంత ఓట్లయితే రాబట్టగలిగాడు గానీ ఓడిపోవడం జరిగింది…!
    ——-
” వీల్లేదు..అలా జరగడానికి వీల్లేదు” అంటూ వెంకటేశం అరుస్తూ లేచి కూర్చునాడు. ఆ కేకలకి అప్పటికింకా  సుబ్బరాజుతో కబుర్లు చెపుతున్న గిరీశం గబగబ పరిగెత్తుకువచ్చాడు.” ఏలివాయ్‌ వెంక టేశం… చేసిన ఘన కార్యాల చాలక  మళ్ళీ ఈ కలలొకటా? ” అన్నాడు. దాంతో వెంకటేశం సిగ్గుపడి, తనకొచ్చి కలంతా చెప్పాడు. ‘ అయితే గురూ గారూ….ఈ లెక్కన  నేను దారుణంగా  ఓడిపోయి నట్టేనంటారా?”అన్నాడు. గిరీశం ఒక్క క్షణం ఆలోచించి  ”లేదోయ్‌… ఈ  ఎలక్షన్లో నువ్వే విజేతవి” అన్నాడు. దాంతో వెంకటేశం ముఖం వెలిగిపోయింది.” అయితే రీకౌంటింగ్‌లో నేను గెలిచేస్తానంటారా?”  అన్నాడు. దాంతో గిరీశం గట్టిగా విసుక్కుని ‘ఏదయినా ఆశకి హద్దు లొండాలోయ్‌…  అక్కడో పార్టీకి 46 శాతం ఓట్లు వచ్చాయంటున్నావ్‌. నీవేమో అయిదు శాతం  వచ్చాయంటున్నావే. యిదేవయినా రీ కౌంటింగ్‌లో గెలిచే వ్యవహారం అంటావా? దాంతో వెంకటేశం సిగ్గుపడి మరెలా అన్నట్టుగా చూశాడు. అప్పుడు గిరీశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ‘ మరేం లేదోయ్‌… నీ కలలో వచ్చింది ఓ రకంగా ఆటలో అరటిపండులాంటి వ్యవహారమే. అయితేనేం.. అక్కడెవరు గెలిచినా అదేదో నీ పుణ్యమే. ఓ రకంగా నువ్వు కింగువి కాలేకపోయినా కింగ్‌ మేకర్‌వి అయిపోయావన్నమాట. గత ఎలక్షన్స్‌లో టీడీపి, వైసీపీల మధ్య ఓట్ల శాతంలో తేడా రెండు శాతం లోపే. ఏతావాతా చెప్పేదేంటంటే.. నీకు పడ్డ ఓట్లు  ఓ అభ్యర్ధిని ఓడగొట్టావన్నమాట. పార్టీలు తమకంటూ  పటిష్టమైన  ఓటు బ్యాంక్‌ నిర్మించుకోగలగాలి. అదే జరగాలంటే పార్టీలో అంతర్గత కుమ్ము లాటలూ, అవతలి పార్టీల మీదా విమర్శలూ మాని  ప్రజల శ్రేయస్సుకి ఏదో చెయ్యడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి” అంటూ వివరించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి