జి ఎస్ టి – నిజాలు అబద్దాలు (శనివారం నవీనమ్)

జి ఎస్ టి – నిజాలు అబద్దాలు
(శనివారం నవీనమ్)

జీఎస్టీ అమలును ప్రకటిస్తూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఒక అంశాన్ని ప్రస్తావించారు. పాదరక్షలు కొనుగోలుపైన అనిల్‌ అంబానీ, సామాన్యుడు ఒక విధమైన పన్ను చెల్లించవలసి ఉంటుందని మంత్రిగారు తమ పన్ను విధానాన్ని సమర్ధించు కొనేందుకు చెప్పారు. ఆ మాట నిజమే – అయితే అనిల్‌ అంబానీ రోజుకు ఎంత సంపాదిస్తాడు, వీధి వెంట తిరిగి కూరగాయలు అమ్ముకునే శ్రామికుడు, ఎంత సంపాదిస్తారు అన్న భేదాన్ని చూడవలసిన పనిలేదా? నల్లధనాన్ని తెల్లగా మార్చుకు నేందుకు, బ్యాంకుల నుంచి వందలు వేలకోట్ల రూపాయలు రుణం తీసుకొని ఎగవేసేం దుకు బడాబాబులకు అవకాశం కల్పిస్తున్న మన పాలనా విధానాలు సామాన్యుడు బ్యాంకునుంచి కనీసం పదివేలు సజావుగా అప్పు తీసుకునేందుకు ఎందుకు అనుమ తించవు? అంటే రాజకీయ పార్టీలు చేస్తున్న జిమ్మిక్కు కారణంగా ఆదాయంలో, సంపదలో, అవకాశాలలో వ్యత్యాసాలు కొనసాగుతూనే ఉన్నాయి.

జీఎస్టీతో దేశమంతటా ఒకే విధమైన పన్నుల విధానం అమలులోకి వచ్చింది కానీ ఒకేపన్ను అని పాలకులు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదు. రెండు, మూడు విధాలుగా పన్నుల భారం ప్రజలపైన పడుతుంది. పన్ను రెండు విధాలుగా ఉంటుంది. ప్రత్యక్షపన్ను, పరోక్షపన్ను. వివిధ పరిశ్రమలు, భారీ వాణిజ్య సంస్థలు, కంపెనీలు తమకు వచ్చే ఆదాయంపైన చెల్లించే పన్నును ప్రత్యక్ష పన్ను అంటాము. దేశంలో దాదాపు పదివేల కంపెనీలు ఉన్నప్పటికీ 250-300 బడా కంపెనీలే ఎక్కువ ఉత్పత్తి, వాణిజ్య లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. దేశ సంపదలో వీటి వాటా దాదాపు 54శాతం ఉంటుందని గణాంక నిపుణులు అంచనా వేశారు. వాస్తవ గణాంకాలను ప్రభుత్వం ప్రకటిస్తేనే మనకు తెలుస్తుంది. మనదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలించిన ప్రభుత్వాలన్నీ ప్రత్యక్ష పన్నులకు తక్కువ ప్రాధాన్యతనిచ్చి పరోక్ష పన్నులకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి ఆదాయం పెంచుకుంటున్నాయి.

ప్రతి కొనుగోలు దారుడూ పరోక్షంగా పన్ను చెల్లించ వలసిందే. అంటే పరోక్ష పన్నులు పెంచిన ప్రతిసారీ వినిమయ దారులపై భారం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరుగు తుంది. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రత్యక్ష పన్నులు చెల్లించే బడా కంపెనీలకు ప్రతి బడ్జెట్‌లో 5-6 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీ లిస్తున్నాయి. అంటే వీరు చెల్లించే పన్నులు గణనీయంగా తగ్గుతాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కువ పన్నులు చెల్లిస్తాయి, ప్రభుత్వ ఆదాయం వారినుంచే వస్తుందని సామాన్య జనం భావిస్తారు. ఇది వాస్తవం కాదు. ప్రపంచదేశాలలో ప్రత్యక్ష పన్నులు మూడింట రెండువంతులుండగా పరోక్ష పన్నులు ఒకవంతు మాత్రమే ఉంటాయని ఇటీవల విజయవాడలో ప్రజలపై జీఎస్టీ ప్రభావం అన్న అంశంపై ప్రసంగించిన ఢిల్లీ జేఎన్‌యూ ప్రొఫెసర్‌, ఆర్థిక నిపుణులు విశ్వజిత్‌ మజుందార్‌ తన అధ్యయనాన్ని వివరించడం ద్వారా ప్రభుత్వాల బండారాన్ని బయటపెట్టారు. మన పాలకులు ఆరాధ్యదైవంగా భావించే అమెరికాలో అసలు జీఎస్టీనే లేదు. కొన్ని దేశాలలో జీఎస్టీ ఉన్నప్పటికీ గరిష్టంగా 20 శాతానికి మించిలేదు.

 

జీఎస్టీ వల్ల ఉద్యోగులు, వ్యాపారులు, ఎగువ మధ్యతరగతి జనం, ఇంకా ఆదాయం అధికంగా ఉన్న వారు రెండు రకాల పన్నులు చెల్లించాలి. వీటికి తోడుగా వివిధ రకాల సెస్సులు, ఎవరికీ తెలియకుండా, బ్యాంకులు, ఇతర సంస్థలు పెంచివేసిన సేవల’ ఛార్జీలనూ చెల్లించవలసి ఉంటుం ది. ప్రభుత్వం వెంటపడే ప్రజలు బ్యాంకు ఖాతాల ఏర్పా టుకు ఒత్తిడి చేసి లావాదేవీలను అధికం చేయడం వల్ల సామాన్యు లతో సహా దాదాపు అందరూ సెస్సులు చెల్లించాల్సిందే. విద్యుత్‌ బిల్లులు, సెల్‌ఫోన్‌ బిల్లులు లేదా మరో విధమైన బిల్లులున్నా వాటిపై సెస్సులు లేదా ఇతర ఛార్జీలు తప్పవు.
‘పెద్ద మనుషుల’పై భారం లేకుండా వినియోగదారులపైనే భారం మోపిన మరో అంశాన్ని చూద్దాం.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌ 30-40 డాలర్ల దాకా తగ్గి ఇటీవల మళ్ళీ 50 డాలర్లకు అటూ ఇటుగా ఉంది. ధర తగ్గడం వల్ల వచ్చే ఆదాయాన్ని వినియోగదారులకు అందిస్తున్నారా? లేదు. ఆయా కంపెనీలు దిగుమతి చేసుకొని వినియోగదారులకు అందించే ప్రక్రియలో పన్నులు పెంచుతున్నారు. దీనివల్ల మనం కొనుగోలు చేసే పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరలు తగ్గడం లేదు. ఇక గ్యాస్‌పైన సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసేందుకు గాను నెలకు రూ.4చొప్పున సబ్సిడీ సిలిండరుపై ధర పెంచుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని, వ్యవసాయరంగ ఆదాయాన్ని రెట్టింపు చేస్తాంలాంటి ఎన్నో వాగ్దానాలు చేసిన నరేంద్రమోడీ ప్రభుత్వం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది.

పన్నులు, సెస్సులు కలిపితే మూడు రకాలుగా ప్రభుత్వా నికి చెల్లించవలసి రావడం వల్ల ప్రజలపైన ప్రత్యేకించి సామాన్యులపై భారం పెరిగి తీరుతుంది. పన్నుల వ్యవస్థ పూర్తిగా అమలులోకి వస్తే ప్రజలకు అంతా మేలే జరుగు తుందని పాలకులు అవకాశం దొరికిన ప్రతివేదికమీద మాట్లాడుతూ ప్రచారం చేయడంలో నిజం ఉందా? పెద్దనోట్ల రద్దునాడు కూడా ఇదే విధమైన ప్రచారం చేశారు. దీర్ఘకాలంలో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఊదరగొట్టారు. జీడీపీ వృద్ధిరేటు తగ్గిందన్న అంశాన్ని కప్పి పుచ్చుకునేందుకు గణాంక పద్ధతిని మార్చివేసి వృద్ధిరేటు 7శాతంగా ప్రకటించుకున్నారని, అసలు వృద్ధిరేటు 5 శాతమేనని మాజీ ఆర్థికమంత్రి, బీజేపీనేత యశ్వంత్‌సిన్హా ప్రకటించారు. మీడియా సంస్థలు కనీసం ఈ సమాచారాన్ని ప్రజలకు అందించలేదు.

అన్నంపెట్టే రైతును కూడా జీఎస్టీలో ప్రభుత్వం వదిలిపెట్టలేదు. ఇంతవరకు పన్నులేని వ్యవసాయ ఉపకరణాల పైన కూడా పన్నువేశారు. నీతి అయోగ్‌ సిఫారసు చేసినట్టు వ్యవసాయ ఉత్పత్తులపైన పన్ను విధించకుండా కనికరించారు. అయితే ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువెళ్ళి అమ్మితే పన్ను ఉంటుంది. కొనుగోలు చేసినా, విక్రయించినా పన్ను చెల్లించ వలసిందే. పోనీ ప్రజలనుంచి వసూలు చేసిన పన్ను ఆదాయాన్ని తిరిగి వాళ్లకోసం ఖర్చు చేస్తారా? అదీలేదు. నాలుగు, ఆరులైన్ల రహదారులు, విమానాశ్రయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం పలు అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ప్రధానమంత్రి నుంచి రాష్ట్రాల, కేంద్రమంత్రుల విదేశీ ప్రయాణాలకు వందలు, వేలకోట్ల ఖర్చు చేస్తున్నారు. ఏసీ రైళ్లు తిప్పుతున్నారు. వాటిలో సామాన్యుల కోసం ఒకటి, రెండు బోగీలు వేస్తారు. వాటిలో ఎక్కడానికి, దిగడానికి కూడా చోటులేక కిటకిటలాడుతుంటాయి. ఆధునిక రహదారులన్నీ ఎక్కువగా ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల వాహనాల కోసమేనని పలు సర్వేలు స్పష్టం చేశాయి. ‘పారదర్శక పాలనలో’ ప్రధానమంత్రి విదేశీ పర్యటనల కోసం ఎన్ని వేలకోట్లు ఖర్చు చేశారో తెలియదు. ఆర్‌.టి.ఐ. చట్టం కింద సమాచారం సైతం ఇవ్వలేదు.

జీఎస్టీ వల్ల బ్యాంకుల ద్వారా లావాదేవీలు పెరుగుతాయి. ఆన్‌లైను ద్వారా జరిగే లావాదేవీలన్నింటిపైన ఛార్జీలు వసూలు చేస్తారు. నోట్ల తర్వాత పాలకులు ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం చేసిన ఒత్తిళ్ల కారణంగా వసూలు చేసే వేలకోట్ల విదేశీ విసా, మాస్టర్‌కార్డు సంస్థలు ప్రయోజనం పొందాయి. సాంకేతిక పరిజ్ఞానం 70-80 శాతానికి పైగా ప్రజలకు లేదన్న అంశాన్ని సైతం పాలకులు విస్మరించడం ఆశ్చర్యం. పెద్దమొత్తాల్లో జరిగే లావాదేవీలకు ఆన్‌లైన్‌ను వినియోగించుకోవచ్చు. స్వల్ప మొత్తాల కొనుగోళ్లు, అమ్మకాలకు నగదు లావాదేవీలే మెరుగైన వని ప్రజల అనుభవం చెపుతుంది. ప్రజలకు ఉపయోగపడని పథకాలు ఫలితాలనివ్వవు.సీనియర్‌ పౌరులకు కొత్తగా ప్రకటించిన ప్రధానమంత్రి వయో వందన యోజన (పిఎంవివివై) పథకం గతంలో ఉన్న వరిష్ట బీమా యోజనలాంటిదే. వరిష్ట బీమా యోజన 2014 ఆగస్టు నుంచి 2015 ఆగస్టు వరకు అమలులో ఉంది. ఆ పథకానికి వడ్డీరేటు 9శాతం ఉండగా దాన్ని తాజా పథకంలో 8 శాతంగా నిర్ణయించారు. పిఎంవివివైలో చేరేందుకు 2018 మే 3వ తేదీ వరకు అనుమతిస్తారు. పదేళ్లు ఈ పథకం గడువు. లక్షన్నర కనీసం ఈ పథకంలో వేస్తే నెలకు వేయి రూపాయలు, గరిష్టంగా ఏడున్నర లక్షలు మదుపు చేస్తే నెలకు రు.5వేలు ఆదాయం వస్తుంది. దీంతో వృద్ధులైన భార్యాభర్తలు బతుకుతారా? చిన్న, చిన్న కుటుంబాలైపోయిన వ్యవస్థలో వృద్ధుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇప్పటికీ దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 30-40శాతం ఉందని అంచనా. ఆస్తుల కోసం పిల్లలు తల్లిదండ్రులను హింసిస్తూ, అవసరమైతే హతమారుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. రోజురోజుకీ బ్యాంకులలో పోస్టల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీరేట్లు తగ్గిస్తున్నారు. పదిలక్షలు బ్యాంకుల్లో వేసినా వచ్చే ఆదాయం 6,7 వేలు మించదు. 1960-70 మధ్యకాలంలో వడ్డీరేటు దాదాపు అర్ధ రూపాయి ఉండేది. మళ్ళీ ఇప్పుడు అదే వడ్డీరేటు ఉంది. నిరాదరణకు గురవుతున్న వృద్ధులను పరిహాసం చేసేదిలాగా ఉంది కొత్త పథకం. రకరకాల వ్యాధులతో తల్లడిల్లే వయసులో ఒకేసారి 3,4 లక్షలు అవసరమైతే ఎవరు ఆదుకుంటారు? ఈ పథకం కొంతమొత్తం వెనక్కి తీసుకుంటే వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. అప్పుడు జీవనం కష్టమవుతుంది.

వయోవృద్ధులు కనీసం పదిలక్షలు జీఎస్టీ లేకుండా బ్యాంకులలో వేసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటిస్తే వందలు, వేలకోట్లు బ్యాంకులకు చేరుతుంది. ఆ మొత్తాన్ని పరిశ్రమల స్థాపనకు వినియోగించు కోవచ్చు. కొత్తకొత్త పథకాల వల్ల ప్రయోజనం తక్కువ. వాస్తవ పరిస్థితులను లోతుగా అధ్యయనం చేయకుండా జీఎస్టీని, కొత్త పథకాలను ప్రకటించి వాటి ప్రచారానికి వందల కోట్లు ఖర్చు చేస్తే పాలకులకు పదవులు పదిలంగా ఉంటాయోమోగానీ ప్రజలకు ప్రయోజనం ఉండదు. గ్రామాల్లో రోజుకు 22 రూపాయలు, పట్టణాల్లో రోజుకు 32 రూపాయల ఖర్చుతో ఒక వ్యక్తి జీవించవచ్చునని గతంలో మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా అంచనా వేసిన దానికంటే మరింత దిగజారుడు పథకాలు ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అందమైన రహ దారులు, ఆకాశ హర్మ్యాల నిర్మాణం, లగ్జరీకార్లు, భారీ విమానా శ్రయాలు, ఏసీ రైళ్లు, ఐటి రంగం విస్తరణ, స్మార్ట్‌ఫోన్లు మాత్రమే అభివృద్ధి అనుకుంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. పాలకులు తమ చిత్తం వచ్చినట్టు తమ ఆశ్రితులకు, సంపన్ను లకు మాత్రమే ప్రయోజనం కలిగించే విధానాలు రూపొం దిస్తున్నారు. వీటిని సామాన్యజనం అర్థం చేసుకోకపోయినా, మధ్యతరగతి చదువరులు అర్ధం చేసుకోగలరు. ఇప్పటికైనా వీరు స్పందించక పోతే మరిన్ని కష్టాలపాలు కావల్సి వస్తుంది.
వివిధ దేశాల్లో జీఎస్టీ
కెనడా – 13-15%
ఫ్రాన్సు – 20%
బ్రిటన్‌ – 20%
న్యూజిలాండ్‌ – 15%
మలేషియా – 6%
సింగపూర్‌ – 7%

ఇండియా – 5 నుంచి 28 %