వెనకేసుకునే రాళ్ళు – రువ్వబడే రాళ్ళు

మనస్సాక్షి
  వెంకటేశం కాస్తా డాక్టరయిపోయాడు అదీ పిల్లల డాక్టర్‌. అంతవరకూ బాగానే ఉంది. అయితే  అసలు సమస్యంతా అప్పుడే మొదలయింది. ప్రైవేటుగా ప్రాక్టీస్‌ పెట్టాలా,ప్రభుత్వ ఆసుపత్రిలో  డాక్టర్‌గా చేరాలా అని తేల్చుకోలేక సతమతం అయిపోయాడు. అప్పుడు గిరీశమో మహత్తరమయిన సలహా యిచ్చాడు.  ” ఏం లేదోయ్‌…శుభ్రంగా ఆ గవర్నమెంట్‌ ఉద్యోగంలో చేరిపో. సాయంత్రం యింటి దగ్గర ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకో. అలా చేస్తే గవర్నమెంట్‌ హాస్పటల్‌కి వచ్చే పేషెంట్లని కూడా సాయంత్రం యింటి దగ్గర క్లినిక్‌కి రమ్మనొచ్చు” అన్నాడు. ఈ సలహా ఏదో  వెంకటేశానికి భేషుగ్గా అనిపించింది. దాంతో ఆ ప్రకారమే  చేసేశాడు. ఈ కొత్త జీవితమేదో వెంకటేశానికీ బాగానే ఉన్నట్టుంది. యింతలోనే వెంకటేశానికి యింకొన్ని ఆదాయ మార్గాలు తెరుచుకున్నాయి. మెడికల్‌ కంపెనీల నుంచి, లేబ్‌ల నుంచీ కమీషన్లు రావడం మొదలయింది. మొదట్లో అయితే  ‘అబ్బే…నేనలాంటివాడిని కాదు’ అనే వాడు గానీ తర్వాత్తర్వాత అడిగి మరీ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. యింకో పక్క హాస్పిటల్‌ కోసం తెప్పించే  ఆక్సిజన్‌ సిలెండర్లని జాగ్రత్తగా తన క్లినిక్‌కి తరలించేస్తున్నాడు. మొత్తానికి డాక్టర్‌గా వెంకటేశం పరిస్థితి మూడు  పువ్వులూ, ఆరు కాయలుగా ఉంది. అయితే యింతలోనే అనుకోని సమస్యొకటి  వచ్చి పడింది. పెండింగ్‌ బిల్లులు రావడం లేదని కాంట్రాక్టరు కాస్తా హాస్పిటల్‌కి సప్లయి చేసే ఆక్సిజన్‌ సిలిండర్లు ఆపేసాడు.  దాంతో ఒక్కసారిగా అల్లకల్లోలమయిపోయింది. ఆక్సిజన్‌ సిలిండర్ల లేమితో ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు కాస్తా గాల్లో కలిసి పోయాయి. మాములుగా అయితే అంత సమస్య లేకపోవును. అయితే ఉన్న సిలిండర్‌లలో చాలా వరకు వెంకటేశంగారి ప్రైవేట్‌ క్లినిక్‌లో భద్రంగా ఉన్నాయాయో. మొత్తానికి రెండ్రోజుల్లో పరిస్థితి చూసి కంగారుపడి ఎందుకయినా మంచిదని డాక్టర్‌ వెంకటేశం ఆ సిలిండర్లలు తిరిగి హాస్పటల్‌కి తెప్పించేశాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. క్షణాల్లో మీడియా రంగంలోకి వచ్చేసింది. ఆ వెనుకే ప్రతిపక్షాలూ రంగంలోకి వచ్చేశాయి. సీఎం రాజీనామా చేయాలని గొడవ మొదలుపెట్టాయి. దాంతో సీఎం తలపట్టుకోవలసి వచ్చింది. డాక్టర్‌ వెంకటేశం మాత్రం సేఫ్‌.
——
1960 ల నాటి మాట లాల్‌బహదూర్‌ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా పనిచేస్తున్న  రోజులవి. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఒక పెద్ద రైలు యాక్సిడెంట్‌ జరిగింది.  తక్షణం ఆయన నైతిక బాధ్యతతో తన పదవికి రాజీనామా చేసేశారు. అది పెద్ద సంచలనమే రేపింది. అక్కడికీ ప్రధానమంత్రి సహా మంత్రులంతా వచ్చి ‘ఏంటీ పని ? నీకేవయినా మతి పోయిందా.. అసలు జరిగిందానికి నీకేవయినా సంబంధముందా? ఆ డిపార్ట్‌మెంట్లో  ఎవరో స్టాఫ్‌ చేసిన  తప్పు వలనే ఈ యాక్సిడెంట్‌ జరిగింది. నువ్వు రాజీనామా చేయవలసిన అవసరం ఎంతమాత్రం లేదు’ అని చెప్పి చూశారు. అయినా లాల్‌బహుదూర్‌ శాస్త్రి ఒప్పుకోలేదు. ” లేదు..లేదు యిది నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. కాబట్టి ఆ నైతిక బాధ్యత నాదే’ అంటూ తృణప్రాయంగా తన పదవి వదిలిపారేశాడు.
——-
మొత్తం మీద పొగ తగిలేసరికి  వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. తీరా చూస్తే అంతా కల! ఎదురుగా నోట్లో  చుట్టతో గిరీశం గారు నిలబడున్నారు. ” ఏవివాయ్‌ వెంకటేశం… జోరుగా కలలు కంటున్నట్టున్నావ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలలన్నీ చెప్పాడు. అంతా విని గిరీశం ఆలోచనలో పడ్డాడు. అప్పుడు వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ” లాల్‌బహుదూర్‌లా  ఈ రకంగా రాజీనామా చేసిన వాళ్ళనింకెవరినీ చరిత్రలో చూడలేం. తర్వాత ఎన్నో రైలు ప్రమాదాలు జరిగాయి. అయితే ఏ మంత్రీ రాజీనామా ఊసెత్తలేదు. అయితే యిక్కడ లాల్‌బహుదూర్‌ చేసింది సరయిందని చెప్పలేం. కానీ పదవులంటే అప్పటి వాళ్ళకి అంతా తృణప్రాయంగా ఉండేది. కానీ తన విన్యాసంతో లాల్‌బహుదుర్‌ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. యిక నీ మొదటి కలనే తీసుకుంటే  నేరస్ధులు తప్పించుకుని బాధ్యత లేని వాళ్ళు బలయిపోవలసి వస్తుంది. గోరక్‌పూర్లఓ జరిగిన సంఘటనే ఓ రకంగా నీ కలలో వచ్చింది. అక్కడేం జరిగింది! ఈ నెల నాలుగో తారీకునాడే నిధులు విడుదలయిపోయాయి. అయినా ఆ డబ్బేదో కాంట్రాక్టరుకు ఎందుకు చేరలేదన్నదే ప్రశ్న. కమీషన్లు అందక ఆసుపత్రి వర్గాల కాంట్రాక్టర్‌కు  బిల్లు చెల్లించలేదా అనేది తేలాలి. యింకా అక్కడ సిలిండర్స్‌ని సొంత క్లినిక్‌కి తరలించేసుకున్న  డాక్టర్‌ సంగతి తేలాల్సి ఉంది. యివన్నీ వదిలేసి అవకాశం దొరికింది కదాని ప్రతిపక్షాలు సీఎం ఆదిత్యనాథ్‌ మీద దాడి మొదలెట్టాయి.  అతడిని రాజీనామా చేయమని వొత్తిడి పెడుతున్నాయి. అసలిది ఎంతవరకు సమంజసమో వారే ఆలోచించుకోవాలి. యింకో పక్క సదరు ఆదిత్యనాథ్‌కి  గోసంరక్షణకి నిధులు  కేటాయించడంలో ఉన్న ఆసక్తి పిల్లల ఆరోగ్యానికి నిధులు యివ్వడంలో లేదు’ అన్న వాదన కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. యిదీ చాలా దారుణమయిన వాదనే.  ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజలకి ఏదో చేయాలని  నిరంతరం తపించే రాజర్షిలాంటి  ఆదిత్యనాథ్‌ విషయంలో ఈ వాదనలు మరీ అసమంజసం.  తను పాలించే  రాష్ట్రంలో ఎక్కడో ఏదో మూల ఆయా సంబంధిత విభాగాల వారి అవినీతి వలన, అలక్ష్యం వలన జరిగే వాటికి రాజీనామా చేయవలసి వస్తే  ప్రతి ముఖ్యమంత్రీ, మంత్రీ రోజుకో పదిసార్లు రాజీనామా చేసెయ్యాలి. అందుకని  అది సరయిన పరిష్కారం ఎంతమాత్రం కాబోదు.  ఈ ప్రతిపక్షాలు సహా అంతా చేయవలసింది.. ‘అసలేం జరిగింది! ఆ జరిగిందానికి కారకులెవరు? వారికి సరయిన శిక్ష పడిందా… భవిష్యత్తులో యిలాంటివి జరక్కుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ‘ అనేది నిలదీయడం. అది ఆరోగ్యకరమైన పరిమాణం” అంటూ వివరించాడు.
 డా.కర్రి రామారెడ్డి