సిద్ధాంతం-రాద్ధాంతం

మనస్సాక్షి
వెంకటేశం ఎప్పుటిలాగే వాలిపోయాడు.అయితే ఆ రోజు గిరీశం గారింట్లో వాతావరణం ఎప్పటిలా లేదు. కొంచెం హడావిడిగా ఉంది. బాబీగాడయితే  ఒకటే హడావిడిగా అటూ యిటూ తిరిగేస్తున్నాడు. యిక గిరీశం సంగతి సరేసరి. యింకా బిజీగా ఉన్నాడు. జుట్టుకీ, మీసాలకీ రంగులేసే పనిలో ఉన్నాడు. దాంతో వెంకటేశం ‘ముసలోడికి దసరా పండుగన్నట్టు… వీటికేం తక్కువ లేదు’ అని గొణుక్కున్నాడు. పైకి మాత్రం ”ఏంటి గురూ గారూ…ఏదయినా హీరో ఛాన్స్‌ లాంటి దేవయినా వచ్చిందా…” అంటూ  అడిగాడు.  దాంతో గిరీశం కూడా పదునుగా ” నీకు మరీ అంత వేళాకోళం పనికిరాదోయ్‌…ఈరోజు మన బాబీగాడి స్కూల్లో  ఏవో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ ఉన్నాయంట. నన్నూ నాలుగు మాటలు మాట్లాడమన్నారులే”. అన్నాడు. వెంకటేశం అలాగా అన్నట్టుగా తలూపాడు. యింతలో గిరీశం ” అవునూ… నువ్వెలాగా  ఖాళీయే కదా. నువ్వూరా” అన్నాడు. దాంతో  వెంకటేశం కూడా వారితో స్కూల్‌కి బయల్ధేరాడు. వాళ్ళు వెళ్ళేసరికి స్కూలంతా హడావిడిగా ఉంది. పెరెంట్స్‌ అంతా కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ కోసం చూస్తున్నారు. యింతలో బాబీగాడు గ్రీన్‌ రూమ్‌లో దూరాడు. యింకో పక్క స్కూలు తాలుకా ఎవరో గిరీశాన్నొచ్చి నాలుగు మాటలు మాట్లాడమన్నారు. దాంతో గిరీశం హుషారుగా స్టేజెక్కేశాడు. మైక్‌ని చూసేసరికి ఊపొచ్చిసింది. అందులోనూ మీడియా కవరేజ్‌ కూడా ఉందాయె. యింకేముంది చెలరేగిపోయాడు. అయితే అదేదో  మరీ ఎక్కువ చెలరేగిపోవడానికి వీల్లేకుండా పోయింది. ఎందుకంటే  ఆ రోజు ప్రోగ్రాం ఉపన్యాసాలదికాదు. కల్చరల్‌ ప్రోగ్రామ్‌ది. అందుకే గిరీశం కొంచెం క్లుప్తంగానే విలువలతో కూడిన విద్య గురించి రొటీన్‌ మాటలు చెప్పేసి దిగిపోయాడు. యింకో పది నిమిషాల్లో కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ మొదలయ్యాయి. ముందుగా ఏదో మోడ్రన్‌ సినిమా పాట మొదలయింది. ఆ డేన్స్‌  చేస్తుంది కూడా బాబీగాడూ, యింకో అమ్మాయి. అసలా గెటప్‌లో బాబీగాడిని గుర్తు పట్టడమే కష్టంగా ఉంది. అసలు బాబీగాడి డ్రెస్సదీ చూస్తుంటే  గిరీశం, వెంకటేశం అదిరిపోయాడు. యిక బాబీగాడు ఓ పక్కన చెలరేగిపోయి గంతులేస్తుంటే  ఆ అమ్మాయి కూడా ఎంతమాత్రం తగ్గడం లేదు. డేన్స్‌ మధ్యలో  బాబీ ఆ అమ్మాయిని దగ్గరకి తీసుకోవడం, నడుం మీద చెయ్యేసి గిర్రున తిప్పడం లాంటివి కూడా ఉన్నాయి. దాంతో వెంకటేశం కొంచెం యిబ్బంది పడి ” గురూగారూ…యిదేదో  కొంచెం తేడాగా ఉన్నట్టుంది” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ” ష్‌ అదంతా కల్చరోయ్‌” అన్నాడు. దాంతో వెంకటేశం ‘ ఆ.. ఏం కల్చరో ఏంటో…వీడికి ఆ సీనియర్‌ గిరీశం గారి కళలేవో తగలడ్డట్టున్నాయి’ అనుకున్నాడు. అదనే కాదు. తర్వాత  కార్యక్రమాల్లో సగం అలానే ఉన్నాయి. యింకో మూడు గంటల్లో కార్యక్రమం పూర్తయింది. యిక బయటికి రావడానికి గిరీశం, వెంకటేశం లేస్తుండగా  వారిని చూసి విలేఖర్లు దగ్గరకొచ్చారు. ” యిప్పుడు నడుస్తున్న ఈ డేన్స్‌ పోకడల మీద మీ అభిప్రాయం ఏంటి?” అంటూ గిరీశాన్ని అడిగారు. మైకులు చూసేసరికి గిరీశానికి చిన్నపాటి పూనకంలాంటిదొచ్చేసింది. ” కాలంతో పాటు మనమూ మారాలి. పంచె కట్టుల్నుంచి ప్యాంటులి వచ్చాం కదా. అలాగే కాలానికనుగుణంగా  మనమూ ముందుకిపోవాలి” అని శెలవిచ్చాడు. దానిని అంతా రాసుకున్నారు.
——–
 వారం తర్వాత…” అబ్బబ్బ…దురదలు ఎక్కువయిపోయాయి” అన్నాడు గిరీశం ఉన్నట్టుండి. దాంతో వెంకటేశం ” అందుకే  ఆ చర్మ వ్యాధుల డాక్టర్‌ గారి దగ్గరికి  వెళ్ళమన్నది” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని” ఊర జోకులెయ్యకోయ్‌…నేన్నంటున్న దురదలు పేపర్లో నా పేరు పడడం గురించి” అన్నాడు.  దాంతో వెంకటేశం ” ఆ…రోజు పేపర్లో పేరు పడడానికి మీరేవీ సెలబ్రిటీ కాదు కదా..” అన్నాడు. గిరీశం తలూపి ” అవునోయ్‌… సెలబ్రిటీ అయితే  బాధేం ఉందట…ఏదో కొంచెం కొంచెంగా అందరికీ తెలిసిన వ్యవహారంమూలానే ఈ పాట్లు” అన్నాడు. గిరీశం మాట పూర్తయ్యేలోగా ఏకాంబరం ఫోన్‌ చేశాడు. ” యిదిగో గిరీశం గారూ…మంచి అవకాశం ఒకటి వచ్చేసింది. మీరు  అర్జంటుగా బయలుదేరి బస్టాండ్‌కి వచ్చేయండి” అన్నాడు. దాంతో గిరీశం ఆదరాబాదరాగా వెంకటేశాన్నీ తీసుకుని బయల్దేరాడు.
 వాళ్ళిద్దరూ బస్టాండ్‌కి వెళ్ళేసరికి ఏకాంబరం ఒక్కడే ఉన్నాడు. ఏకాంబరం కూడా బస్సు డ్రైవర్‌ని ఏదో బతిమాలుతున్నాడు. డ్రైవరయితే ‘టైమయిపోయింది. వెళ్ళిపోవాలి” అంటున్నాడు. దాంతో ఏకాంబరం  సమోసాలూ, టీ తెప్పించి డైవర్‌ని బుట్టలో వేస్తున్నాడు. యిదంతా చూసి గిరీశం ఏకాంబరం దగ్గరకెళ్ళి” వాడి ని బతిమాలుతున్నావేంటీ? అన్నాడు. దాంతో ఏకాంబరం ” ఏం లేదు. అదేదో అర్జునరెడ్డి సినిమా అట.హీరో హీరోయిన్లు నోట్లో నోరెట్టేసుకుని మరీ ముద్దెట్టుకునే పోస్టరేదో ఈ బస్‌ మీద అంటించి ఉంది. దానిని యిప్పుడు చింపాలి” అన్నాడు. దాంతో గిరీశం హుషారుగా ” యింకెందుకాలస్యం రా చింపేద్దాం” అన్నాడు. దాంతో  ఏకాంబరం విసుక్కుని ” మీడియా వాళ్ళు రాకుండా ఈ చింపడాలు ఎందుకంట… ఏదో మీడియా కవరేజ్‌ కోసం తప్ప వాళ్ళెవరో ముద్దు పెట్టుకుంటే మనకేంటి? లేకపోతే యింకేదో పైత్యం పని చేస్తే మనకేంటి? అన్నాడు. గిరీశం అవునన్నట్లుగా తలూపాడు. యింతలోనే  మీడియా పక్షులు దిగిపోయాయి. దాంతో ఏకాంబరం, గిరీశం గబగబా బస్‌కి అంటించి ఉన్న ముద్దు పోస్టర్‌ని చింపే పనిలో పడ్డారు. అదయింతర్వాతా గిరీశం ” చూశారా…మన సంస్కృతి ఎలా దిగజారిపోతుందో… అందుకే మా ఈ నిరసన” అంటూ  ఆవేశంగా అన్నాడు. విలేఖర్లు అదంతా రాసుకున్నారు.  అంతే కాదు.  మర్నాడు గిరీశం చెప్పిందంతా మీడియాలో ప్రముఖంగా వచ్చింది.
 ————-
” అసలు  మీ ప్రవర్తన నాకేం అర్ధం కావడం లేదు. అసలు  మీరు ఏ సిద్ధాంతంలో ఉన్నారు? ఏ వైపు నిలబడ్డారు?” అంటూ వెంకటేశం అనుమానంగా అడిగాడు. దాంతో గిరీశం నవ్వేసి ” నేను ఏ సిద్ధాంతంలోనూ లేనోయ్‌…ఉన్నదల్లా వార్తల్లో అదీ ముఖ్యం. దాని కోసమే  యిదంతా. ఆ పెద్దాయననే తీసుకో. మొన్న ఆ సినిమా పోస్టర్‌ అశ్లీలంగా ఉందని ఎంత హడావిడి చేశాడని ! అదంతా గొప్ప  చిత్తశుద్ధితో చేశాడా అంటే అవునని చెప్పలేం. అతగాడు నిజంగానే కల్చర్‌ పాడయిపోతుందని అంత బాధపడిపోయేవాడయితే వేలంటైన్స్‌ డే నాడు లవర్స్‌ పబ్లిక్‌లో ముద్దుల కార్యక్రమం ఏర్పాటు చేస్తే   ఎందుకు మాట్లాడలేదు? ఏదయినా చిత్తశుద్ధితో చేయాలంటే  సమస్యని మూలాల నుంచి పెకలించడానికి కృషి చేయాలి. అంతే గానీ యిలా పోస్టర్‌లు చింపడం లాంటి పైపైన పనులు చేయడం వార్తల్లో నానే చీప్‌ ట్రిక్కే ! యింతకీ చెప్పదేంటంటే… ఈ సగటు పొలిలీషియన్లు ఏం చేసినా, ఏం మాట్లాడినా అదేదో వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అనుకుంటే పొరబాటే. కేవలం తమ ఉనికిని చాటుకోవడానికే  పొలిటీషియన్లు యిలాంటి విన్యాసాలు చేస్తుంటారు” అని తేల్చాడు.
డా. కర్రి రామారెడ్డి