పెద్దనోట్ల రద్దు మోదీ ఘోరమైన తప్పు ! (శనివారం నవీనమ్)

పెద్దనోట్ల రద్దు మోదీ ఘోరమైన తప్పు !
(శనివారం నవీనమ్)

* 4 లక్షల కోట్ల అంచనా -16 వేల కోట్లే నల్లధనం?
* నగదు చలామణి 20 శాతం తగ్గుదల
* పెద్దల సొమ్ముని తాకలేకపోయిన డీమోనిటైజేషన్
* పేదలు సామాన్యులకే మిగిలిన కష్టం
* చతికిలపడ్డ సర్వీసు రంగాలు
* దేశాభి వృద్ధి పతనం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్రదినోత్సవ ఉపన్యాసంలో డీమానిటైజేషన్‌ వలన రూ.3 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికి తీశామన్నారు. అది నిజం కాదని ఆర్ బి ఐ (రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదికను బట్టి స్పష్టమౌతున్నది.

15.44 లక్షల కోట్ల రూపాయల నోట్లను రద్దు చేయగా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.15.28 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. వెనక్కి రానివి కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమే.

ప్రధాని మోదీ రూ.500, రూ.1,000 నోట్లు ఉన్నపళంగా రద్దు చేస్తున్నట్లు గత నవంబరు 8 రాత్రి చేసిన ప్రకటన ఇంకా చెవుల్లో వినిపిస్తున్నట్టే వుంది. జనం చెవుల్లో గింగురుమంటోంది. ఐదు లక్ష్యాల సాధనకు పెద్ద నోట్ల రద్దు చేస్తున్నామని నమ్మించారు.

నల్లధనాన్ని పారద్రోలడం, నకిలీ కరెన్సీ నోట్లను ఏరిపారేయడం, ఉగ్రవాదులకు నిధులు అందకుండా కట్టడి చేయడం, పన్నుల వసూళ్లు పెంచడం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం ఆ ఐదు లక్ష్యాలుగా చెప్పుకొచ్చారు.పెద్ద నోట్ల రద్దు వలన తక్కువలో తక్కువ రూ.4 లక్షల కోట్ల నల్లధనం వెలికి వస్తుందని, వాటితో ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టవచ్చని బిజెపి సర్కారు ఊదరగొట్టింది.

చెలామణిలో ఉన్న 86 శాతం నోట్ల రద్దు తర్వాత తొమ్మిది మాసాలకు ఆర్‌బిఐ వెల్లడించిన నివేదిక ప్రకారం ఆ లక్ష్యాలేమీ చేరలేదు సరికదా దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని తేటతెల్లమైంది.

ఈ సమయంలో ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులు, ఎటిఎంల ముందు క్యూలైన్లలోనే వందలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. వేతనాలందక సంఘటిత, అసంఘటిత కార్మికులు, ఉపాధి హామీ కూలీలు పస్తులున్నారు. పంట రుణాలందక రైతులు నానా అవస్థలూ పడ్డారు. పిల్లల పెళ్లిళ్లకు నగదు దొరకక గుండెలు ఆగిపోయిన తల్లితండ్రులు వున్నారు.

వ్యాపార కార్యకలాపాలు స్తంభించి చిన్న చితకా వర్తకులెందరో నష్టపోయారు. సమస్త ప్రజానీకానికీ పూడ్చుకోలని నష్టాలను, కష్టాలను నోట్ల రద్దు మిగిల్చింది.నిర్దేశిత లక్ష్యాలు సాధించలేకపోతే తనను కాల్చేయాలని ఉద్వేగపూరితంగా మోదీ చెప్పడం టివిల్లో మనం చూశాము.

ఒకే ఒక్క శాతం ఫలితం కోసం ఇంతగా ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం సృష్టించాలా? ఆర్‌బిఐ నివేదికలో కళ్లు బైర్లు కమ్మే అంశాలే ఉన్నాయి. ఇప్పటి వరకు వెయ్యి నోట్ల లెక్కలే తేలాయి. ఇంకా ఐదొందల నోట్ల లెక్క తేల్లేదు. వెయ్యి నోట్ల లెక్కల ఆధారంగా ఐదొందల నోట్ల లెక్కలు చెపుతున్నారు. ఆ లెక్కలూ పూర్తయితే అర శాతం నోట్లే తిరిగి రానివుంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్‌ఆర్‌ఐల వద్ద, సహకార బ్యాంకుల వద్ద ఇంకా రద్దయిన పెద్ద నోట్లు ఉన్నాయంటున్నారు. వాటిని కూడా కలిపితే రద్దయిన నోట్ల కంటే ఐదు నుంచి పది శాతం అధికంగా బ్యాంకులకు వచ్చినట్లే. అంటే నల్ల ధనం రాకపోగా దొంగనోట్లు ఎంచక్కా రాచమార్గంలో మంచి నోట్లుగా మారినట్లే భావించాలి.

నకిలీ కరెన్సీని ఏరిపారేసే లక్ష్యాన్ని డీమానిటైజేషన్‌ సాధించలేదని ఆర్‌బిఐ నివేదిక ద్వారా అర్ధమౌతున్నది. నోట్ల రద్దుకు ముందు ఏడాదిలో 6.32 లక్షల నకిలీ నోట్లను గుర్తించగా, డీమానిటైజేషన్‌ అనంతరం 7.62 లక్షల నకిలీ నోట్లను గుర్తించారు. కొత్త నోట్ల ముద్రణ వలన దాదాపు రూ.4,500 కోట్లు ఆర్‌బిఐపై ఆదనపు ఖర్చు అయింది. కేంద్రానికి ఆర్‌బిఐ డివిడెండ్‌ చెల్లించలేకపోయింది. బ్యాంకు ఆదాయం 23.56 శాతం తగ్గగా వ్యయం 107.84 శాతం పెరిగింది. ఆర్‌బిఐ మిగులు రూ.65 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లకు తగ్గింది. చెలామణిలో ఉన్న రూ.15.44 లక్షల కోట్లను రద్దు చేయగా ప్రస్తుతం 13.10 లక్షల కోట్లు చెలామణిలో ఉన్నాయి. నోట్ల లభ్యత 20 శాతం తగ్గింది. డిజిటల్‌ లావాదేవీలేమీ ఆశించన మేరకు వృద్ధి చెందలేదు.

భారత వృద్ధి రేటు పడిపోవడానికి ప్రధాన కారణం పెద్ద నోట్ల రద్దు ప్రక్రియేనని ప్రపంచ బ్యాంకు మాజీ ముఖ్య ఆర్థికవేత్త కౌసిక్‌ బసు విమర్శించారు. వృద్ధి పతనం చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. నోట్ల రద్దు చర్యతో భారీ మూల్యం చెల్లించుకున్నట్లయ్యిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 5.7 శాతానికి పతనమై మూడేళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన తయారీ రంగం నోట్ల రద్దుతో వెలవెలపోయింది.

ఇదే విషయాన్ని గురువారం కేంద్ర గణాంకాల శాఖ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది వరకు ప్రపంచ బ్యాంకుకు వైస్‌ ప్రెసిడెంట్‌, ముఖ్య ఆర్థికవేత్తగా పని చేసిన బసు ప్రస్తుతం న్యూయార్క్‌లోని కర్నెల్‌ యూనివర్శిటీలో అర్ధశాస్త్రం ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వృద్ధి రేటుపై శుక్రవారం ఆయన పిటిఐకి ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు.

ఆ వివరాలు.. వృద్ధి రేటు ఆరు శాతం కంటే దిగువకు పడిపోవడం ఆర్థిక వ్యవస్థకు పెద్ద షాక్‌ అని బసు అభివర్ణించారు. అంచనాల కంటే మరీ తక్కువగా 5.7 శాతం వృద్ధి రేటు చోటు చేసుకుందన్నారు. 2003 నుంచి 2011 కాలంలో భారత్‌ ఏకంగా 8 శాతం వృద్ధి సాధించిందన్నారు. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంలోనూ దేశం 6.8 శాతం వృద్ధిని కనబర్చిందన్నారు. ప్రస్తుత నూతన జిడిపి లెక్కింపు విధానాలతో పోల్చితే ఆ సమయంలోనూ 8 శాతం ప్రగతి చోటు చేసుకుందన్నారు. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు తక్కువ స్థాయిలోనే ఉన్నాయన్నారు. తిరిగి 8 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు.

నోట్ల రద్దు వల్లే వృద్ధి రేటు 2.3 శాతం పతనమై 5.7 శాతానికి పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నోట్ల రద్దు వల్ల జరిగిన పొరపాట్లు, ఎగుమతుల రంగం కూడా అంతంత మాత్రంగా ఉండటం వల్ల స్థూల ప్రగతి నిరుత్సాహ పర్చిందన్నారు. ఈ తప్పులను సరిదిద్దుకోవాలని బసు సూచించారు.

నోట్ల రద్దు చర్య వల్ల ప్రధానంగా చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారని బసు పేర్కొన్నారు. ధనవంతులు తమకున్న మార్గాల్లో పెద్ద నోట్లను సులువుగా మార్చుకున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరహాలో మళ్లీ పొరపాటు చేస్తే 2018 నాటికి కూడా ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోలేదన్నారు. వచ్చే రెండు త్రైమాసికాల్లోనూ వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉంటుందని బసు అంచనా వేశారు. ముఖ్యంగా గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసే త్రైమాసికంలో వృద్ధి రేటు మరీ మందగించిందన్నారు. నోట్ల రద్దు వల్ల ఈ సమయంలో రైతులు అత్యంత ఒత్తిడిని ఎదుర్కొన్నారని విమర్శించారు. సాధారణ ప్రజల వద్ద నగదు లేకపోవడం, కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోలేక పోయారన్నారు. నోట్ల రద్దుతో గతేడాది నవంబర్‌ తర్వాత ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయిందని, దీన్ని పెంచాలని సూచించారు. రెండోది ఆర్థిక, ద్రవ్య పరపతి విధానాల ద్వారా ఎగుమతులను పెంచుకోవాలన్నారు. సాధారణ ప్రజల కొనుగోలు శక్తి పడిపోయినందున తయారీదార్లు కూడా ఒత్తిడిని ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలో సులభ వ్యాపార పద్ధతిని ప్రోత్సహించడం ద్వారా ఎగుమతులకు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు.

డిజిటల్‌కు వెళ్లే ప్రయత్నంలో రిస్క్‌ ఉంటే నగదు రూపంలో వెళ్లడమే మంచిదని బసు తెలిపారు. అనేక ధనిక దేశాలు డిజిటల్‌ రూపంలోకి మారడానికి దీర్ఘకాలం సమయం తీసుకున్నాయన్నారు. కాగా భారత్‌ లాంటి దేశంలో ఇప్పటికీ సగం మందికి బ్యాంకు ఖాతాలు లేవన్నారు. అనూహ్యంగా తక్షణమే డిజిటల్‌ నగదులోకి మారాలనుకోవడంలో అర్ధం లేదన్నారు. దీని వల్ల పేదలు చాలా నష్టపోతారన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది పేదల వ్యతిరేక విధానమన్నారు. ఇలాంటి పొరపాట్లు చేయకపోతే తిరిగి 2018లో మంచి వృద్ధిని సాధించవచ్చని సూచించారు. ఇందుకోసం వ్యవస్థలో నగదు ప్రవాహం పెంచాలన్నారు.