పో..పో…. రా..రా !

 మనస్సాక్షి
 వెంకటేశం కంగారుపడ్డాడు.దానిక్కారణం గిరీశం గారింట్లోంచి పొగలొస్తుండడమే. ఆ పొగలేవో గురువుగారూ కాల్చే ఘంట మార్కు చుట్టలవి కాదు. మరి ఈ పొగలేంటా అనుకుంటూ  లోపలికి నడిచాడు. తీరా చూస్తే  గిరీశం గారు హాలో ్లనే ఉన్నారు. ఆ పొగలొస్తోంది కూడా ఆయన బుర్రలోంచే. దాంతో వెంకటేశం కంగారుపడిపోయి ” ఏంటి గురూగారూ.. అంత కొంపలంటుకుపోయే ఆలోచనలేంటంట”? అన్నాడు. ఆ పాటికి తేరుకున్న గిరీశం ” ఏం లేదోయ్‌.. ఈ ఆలోచనలన్నీ బాబీ గాడి గురించిలే. వాడు రోజూ  ఓ రెండు మూడు గంటలు ఎక్కడికో పోతున్నాడు. ఎక్కడికంటే అదేదో కళ అంటున్నాడు. యిందాకయితే ఓ పదివేలు కూడా అడిగాడు. అదీ అందుకే  అంటున్నాడు” అన్నాడు. దాంతో వెంకటేశం ” అయితే మొత్తానికి మీ తాత గిరీశం గారి కళలేవో వీడి కొచ్చినట్టున్నాయి” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ఏదో అనబోయేంతలో లోపల్నుంచి బాబీగాడు పరిగెత్తుకొచ్చాడు. వెంకటేశం ఓ సారి వాడిని దగ్గరికి పిలిచి ” ఏరా.. అదేదో కళలో కళాసేవో అంటూ తిరుగుతున్నావంట…” అన్నాడు. దాంతో బాబీగాడు ” అవును బాబాయ్‌…నా టాలెంట్‌ చూస్తావా…” అంటూ  లోపలికి పరిగెత్తికెళ్ళి ఓ బొమ్మని పట్టుకొచ్చాడు. అదేంటా అని  యిద్దరూ ఆశ్చర్యంగా చూశారు. బాబీ ఆ బొమ్మని చూపిస్తూ  ” చూడండి నేనీ బొమ్మతో మాట్లాడతా” అన్నాడు. దాంతో యిద్దరూ అలా ఆసక్తిగా చూస్తుండగానే బాబీగాడు  ఆ బొమ్మని వొళ్ళో పెట్టుకుని చిన్న షోలాంటిది మొదలెట్టాడు. ” ఓయ్‌… నీ పేరేంటో చెప్పు” అన్నాడు. దానికి ఆ బొమ్మ ఏం మాట్లాడలేదు. దాంతో బాబీ ” యిదిగో బొమ్మా…నువ్వ మాట్లాడకపోతే  నా పరువుపోతుంది. నీ పేరేంటో చెప్పు” అన్నాడు. దాంతో ఆ బొమ్మ ” మరి బొమ్మంటే నాకు కోపం రాదా… నా పేరు బుడుగులే” అంది. దాంతో గిరీశం, వెంకటేశం చప్పట్లు కొట్టారు. ” మొత్తానికి బాబీగాడు వెంట్రిలాక్విజం మీద మంచిపట్టు సాధించేశాడు అన్నాడు గిరీశం నెమ్మదిగా. ఈలోగా బాబీగాడు మరికొన్ని  ప్రశ్నలడగడం, బొమ్మ వాటన్నిటీకీ గమ్మతయిన సమాధానాలు చెప్పడం జరిగింది. యింతలో బాబీగాడు ” నీకు హిందీ వచ్చా?” అనడిగాడు. బొమ్మ తలూపి ” వో…బ్రహ్మాండంగా వచ్చు అంది. దాంతో బాబీ ” యిలా రా… అని హిందీలో చెప్పు” అన్నాడు. దానికా బొమ్మ ” ఆ..యింతేనా… యిదర్‌ ఆవో” అంది. ఈ సారి బాబీ” సరే..  అక్కడికి వెళ్ళి చెప్పాలంటే” అన్నాడు. ఈ సారి బుడుగు అనబడే ఆ బొమ్మ బుర్ర గోక్కుంది. తర్వాత ” ముందు నన్నక్కడికి తీసుకెళ్ళు” అంది. బాబీ ఆ బొమ్మని ఎత్తుకుని అక్కడకెళ్ళి ” ఆ యిప్పుడు చెప్పు” అన్నాడు. అప్పడా బొమ్మ ” యిదర్‌ ఆవో” అంది. దాంతో గిరీశం, వెంకటేశం పగలబడి నవ్వేరు. యింతలో గిరీశం ” ఆ భలే చేశావురా అదేదో కళ..కళ అన్నావ్‌..యిదేనా” అన్నాడు. బాబీ తలూపి ” అవును మామయ్య…పదివేలడిగింది కూడా ఈ బొమ్మలాంటిది కొనుక్కోడానికే. ఈ బొమ్మ మా మేస్టారిది. తిరిగి యిచ్చేయాలి” అన్నాడు. దాంతో గిరీశం ” సరే.. పదరా… ఏటీఎంకి వెడదాం. నీకా డబ్బు డ్రా చేసి యిస్తా” అంటూ బయటికి నడిచాడు. బాబీగాడయితే  చిన్నగా ఈలేసుకుంటూ  హుషారుగా అనుసరించాడు. వెంకటేశం మాత్రం  వెళ్ళకుండా అక్కడో పడక్కుర్చీలో వాలి చిన్నగా కునుకు లాగించే పనిలో పడ్డాడు.  ఆ కునుకులో చిన్న కలొచ్చింది…
ఎప్పుడో  80 ల నాటి మాట.అప్పటికింకా తిరుపతిలో సౌకర్యాలు అంతగా లేవు. భక్తుల రద్దీ మాత్రం ఎక్కువగానే ఉండేది. రోజూ వేలాదిగా వచ్చే ఆ భక్తుల్ని కంట్రోల్‌ చేయడం దేవస్థానం సిబ్బందికి కష్టంగానే ఉండేది. ఎంతమంది భక్తులొచ్చినా ఏరోజుకారోజు దర్శనం చేయించి పంపించెయ్యాల్సిందే.  లేకపోతే మర్నాటికీ మళ్ళీ వచ్చి పడిపోతారు. దాంతో వేలాదిగా వచ్చే ఆ భక్తులందరినీ ” పోండి…పోండి” అంటూ సిబ్బంది బలవంతంగా  తోసెయ్యాల్సి వసో ్తంది. అందరికీ ఆ స్వామి  దర్శనం జరగాలి కాబట్టి అలా చేయడం దైవ కార్యంగానే సిబ్బంది భావించే వారు. అయితే ఈ విషయంగా బయట విమర్శలు గట్టిగా మొదలయ్యాయి. అలా పోండి…పోండి అనడం భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తుందన్న విమర్శలు గట్టిగా మొదలయ్యాయి. యిదంతా ఆలయ ఈవోగా ఉన్న వెంకటేశానికి తలనొప్పిగా తయారయింది. దాంతో ఏం చేయాలో తోచక తన గురువుగారయిన  గిరీశానికి  ఫోన్‌ చేశాడు. ” గురూగారూ… ఏదో ఆ ఏడుకొండలవాడి దయవలనా, మీ ఆశీర్వాదం వలనా యిక్కడ  ఈవో కాగలిగేను. యిక్కడంతా బానే ఉంది గానీ ఓ సమస్యొచ్చిపడింది” అంటూ తనకొచ్చిన సమస్యంతా చెప్పాడు. అంతా విన్న గిరీశం ” ఓస్‌ యింతేనా… అంటూ ఏం చేయాలో చెప్పాడు. అది వినగానే  వెంకటేశం చాలా ఆనందపడిపోయాడు. ఆ రోజు సాయంత్రమే  ఆలయ సిబ్బందిని పిలిచి మాట్లాడాడు. కొన్ని కొన్ని సూచనలిచ్చాడు.  అంతే … ఆ మర్నాటి నుంచి ఓ కొత్త విషయం అమల్లోకి వచ్చింది. ” పో… పో.. అని సిబ్బంది భక్తుల్ని  తోయడం మానేశారు. రండి.. రండి  మనసారా స్వామిని దర్శించుకోండి” అంటూ స్వామివైపు లాగేస్తున్నారు. అంతే…సమస్య కాస్తా పరిష్కారం అయిపోయింది. భక్తులు ఎప్పటిలా వేలాదిగానే వస్తున్నారు. వాళ్ళు స్వామి వారిని దర్శించుకునే ఆ పదిహేనూ, యిరవై సెకన్ల సమయమూ మారలేదు. అయితే పో..పో.. బదులు ”రండ్రండి” వ్యవహారంతో  బయట్నుంచి విమర్శలు ఆగిపోయాయి.
—— –
 ఎవరో తట్టిలేపేసరికి వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. గిరీశం, బాబీ పక్కనే నిలబడున్నారు. దాంతో వెంకటేశం తనకొచ్చిన కలని గుర్తు చేసుకుని ” భలే గమ్మ త్తయిన కలొచ్చింది గురూ గారు ”అంటూ తనకొచ్చిన  కలంతా చెప్పాడు. దాంతో గిరీశం నవ్వేసి ” యిందాక బాబీ గాడి బొమ్మ కామెడీ చూశావు కదా. అదేదో నీ బుర్రలో దూరినట్టుంది. అయితే అంతకు మించిన  వ్యవహారం కూడా యిందులో ఉంది” అన్నాడు.  వెంకటేశం అదేంటా అని ఆలోచనలోపడ్డాడు. అప్పుడు గిరీశమే అదేదో చెప్పడం మొదలెట్టాడు. ” మోడీ గారు చాలా విలక్షణమైన వ్యక్తి. ఆయన  ఆలోచనలన్నీ ప్రజాశ్రేయస్సు కోసమే. అందుకోసం ఏవయినా చేసేస్తాడు. ఎవరినీ లెక్కచేయడు. అందుకే ఈ మూడేళ్ళ పాలనలో  ఆయనన్ని సంచలన నిర్ణయాలు తీసుకోగలిగింది.దశాబ్ధాల తరబడి  అవినీతిమయమైపోయిన ఈ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయడమే ఆయన లక్ష ్యం. దాని కోసం ఆయన నిద్రపోడు. తన టీంని..అదే తన మంత్రివర్గాన్ని  నిద్రపోనివ్వడు. పరుగులు పెట్టిస్తాడు.  అందులో ఎవరయినా తన అంచనాలు అందుకోలేకపోతుంటే వారిని నిర్ధాక్షిణ్యంగా తొలగించడానికి కూడా వెనుకాడడు. యిప్పడదే జరుగుతోంది. లక్ష ్య సాధనలో వెనుకబడిన  మంత్రులు కొందర్ని తొలగించడం జరిగింది. అయితే ఎంతయినా వాళ్ళు తన కంటే సీనియర్లాయే. వాళ్ళని తొలగిస్తే  పార్టీలో అసంతృప్తి ఏర్పడటం ఖాయం. అలాగని వాళ్ళని కొనసాగించే పరిస్థితి లేదు. అందుకే  మోడీ గారు నీ కలలోలాంటి ” ఫో…ఫో.. రా…రా.. ” సూత్రాన్ని పాటించారు. తొలగించబడిన పెద్దాయనతో ” మీరు నా కంటే ఎంతో అనుభవజ్ఞులు. నా వయస్సు మీ అనుభవమంత ఉండదు. అందుకే మీలాంటి వాళ్ళు నా కింద పనిచేయడమేంటీ…  ఒక గవర్నర్‌గా మీ సేవలు దేశానికెంతో అవసరం అని శెలవిచ్చి గవర్నర్‌ని చేస్తున్నారు. అలాగని మిగతా వాళ్ళకి కూడా పార్టీ పదవులిచ్చి గౌరవంగా తోలెయ్యడం జరుగుతోంది. ఏతావాతా చెప్పేదేంటంటే  రాజకీయాల్లో చేసే పనేదో చేసెయ్‌… అయితే అదేదో ” పో పో పద్ధతిలో కాకుండా ” రా… రా..” పద్ధతిలో చెయ్యి ” అంటూ వివరించాడు.
డా.కర్రి రామారెడ్డి