మరో ఖాతా

 మనస్సాక్షి
” నల్లా యిరికన్‌…నల్లా  యిరికియా” అన్నాడు వెంకటేశం వస్తూనే. దాంతో గిరీశం కంగారుపడి ” ఏవివాయ్‌ వెంకటేశం… పొద్దున్నే  అరవంలో అరుస్తున్నావే?” అన్నాడు. దాంతో వెంకటేశం ” ఏం లేదు గురూ గారూ… రేపు తిరుచిరాపల్లి వెళదామనుకుంటున్నా. ఆ పక్క పల్లెటూర్లో  నా ఫ్రెండ్‌ రామనాథన్‌ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అక్కడికి పోతే నాకేదో దారి చూపిస్తానన్నాడు” అన్నాడు. దాంతో గిరీశం నిట్టూర్చి  ” పొరుగింటి పుల్లకూర  రుచంటారు. సరే వెళ్ళిరా” అన్నాడు. ఆ రోజు సాయంత్రమే వెంకటేశం తిరుచిరాపల్లి బయలుదేరాడు….
రామనాథన్‌ అయితే వెంకటేశాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు. ” ఎప్పట్నుంచో  చెపుతుంటే  యిప్పటికీ వచ్చావన్నమాట” అన్నాడు. వెంకటేశం తలూపి” అవున్రా…అక్కడ ఎంతసేపటికీ  మా గురువుగారి చుట్టపొగ  తప్ప యింకొకటి బుర్రలోకి దూరి చావడం లేదు” అన్నాడు. రాంనాథన్‌ తలూపి ” సరే… యిక్కడ నీ తెలివితేటలేంటో నిరూపించుకో… నీకో బ్రహ్మండమయిన  దారి చూపిస్తా” అన్నాడు. వెంకటేశం తలూపాడు. అయితే రెండ్రోజులు తిరక్కుండానే తన తెలివితేటలేవో  నిరూపించుకోవడానికి వెంకటేశానికో అవకాశం వచ్చింది.
…అది జయలలిత మరణ రూపంలో. ఆవిడ మరణంతో అంతా విషాదంలో మునిగిపోయారు. ఎక్కడ చూసినా ఆవిడ మరణం గురించి చర్చే. యిది జరిగిన మూడో రోజు ఆ ఊళ్ళో ఉండే  తంగవేలు పోయాడని తెలిసింది. దాంతో రామనాథన్‌ వెంకటేశాన్ని తీసుకుని హడావిడిగా వాళ్ళింటికి వెళ్ళాడు. అసలది పల్లెటూరు కావడంతో పెద్దగా వార్తలేవీ ఉండవు. అందుకు ఆఖరికి ఊళ్ళో మాములు చావులకి కూడా రాంనాథన్‌ కెమెరా పట్టుకుని పోతుంటారు. ఆ రోజు అలాగే వెళ్ళాడు. వెంకటేశం అనుసరించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి తంగవేలు శవం యింటి ముందు ఉంది. యింట్లో వాళ్ళే కాకుండా బంధువులు కొద్ది మంది కూడా ఉన్నారు. పెద్దగా ఏడుపులు లేవు.యింతలో  రాంనాథన్‌, వెంకటేశం రావడం చూసి అంతా ఏడుపు అందుకున్నారు. రాంనాథన్‌ శవం దగ్గరకెళ్ళి దణ్ణం పెట్టుకుని ఓ పక్కన నిల్చున్నాడు. కొంచెంసేపాగి ఆ శవం తాలూకా  కొడుకునీ, కోడల్ని పక్కకి పిలిచాడు. వాళ్ళిద్దరూ వచ్చాక ” తంగవేలు గారు నాకు ఎప్పట్నుంచో తెలుసు. అసలు నేనిలా జర్నలిస్టునయ్యానంటే కారణం ఆయనే .. అవునూ.. యింతకీ ఆయనెలా పోయారు? అన్నాడు. తంగవేలు కొడుకు కళ్ళు తుడుచుకుని ” ఆయన వయసు 81 దాటిందిలెండి. నిద్రలోనే పోయారు. ఏదో ఆయనలా ఉంటే  పెద్ద దిక్కుగా ఉండేది” అన్నాడు. ఈలోగా కోడలు ” అవునవును. పెద్దగా సంపాదించి యిచ్చింది లేకపోయినా పెద్ద దిక్కుగా ఉండేవారు” అంది మాట విరుస్తూ. రాంనాథన్‌ అలాగా అన్నాడు. మొత్తానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూస్తుంటే అంతంతమాత్రంగానే ఉన్నట్టుంది. సరిగ్గా అప్పుడు వెంకటేశం రంగంలోకి దిగాడు. ” నేను చెప్పినట్లు చేస్తే ఆ పెద్దాయన  పేరు చెప్పి మీకో మంచి ఎమౌంట్‌ వచ్చేలా చూస్తా” అన్నాడు. దాంతో అంతా ఆసక్తిగా చూశారు. యింతలో వెంకటేశం ” నిన్న రాత్రి తంగవేలు గారు టీవీలో వార్తలు చూస్తూ పోయారు కదా ” అన్నాడు. దాంతో తంగవేలు కొడుకు ” అబ్బే… ఆయనకి టీవీ చూడటమంటే చెడ్డ చిరాకు” అన్నాడు. దాంతో వెంకటేశం విసుక్కుని ” అబ్బబ్బ…చెప్పింది వింటారా… ఆయన  టీవీలో వార్తలు చూస్తూ  హార్ట్‌ ఎటాక్‌తో పోయారు. సరేనా” అన్నాడు. వాళ్ళు సరేనన్నారు. యింతలో వెంకటేశం ” మొన్న జయలలిత మరణించినప్పటీ నుంచి ఆయన దిగులుతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు  కదా” అన్నాడు. ఈసారి తంగవేలు కొడుకు  ” అబ్బే… ఎవడు పోయినా ఆయనేం పట్టించుకోడు. ‘ అయితే నాకేంటీ’ అన్నట్టుంటారు” అన్నాడు. ఈసారి వెంకటేశం వాళ్ళ వంక కోపంగా చూశాడు. దాంతో వాళ్ళు నాలుక్కరచుకున్నారు. యింతలో వెంకటేశం ” ఎవరొచ్చి అడిగినా నేనిందాకా చెప్పినట్టే చెప్పాలి” అన్నాడు. వాళ్ళిద్దరూ తలూపారు. తర్వాత రాంనాథన్‌, వెంకటేశం బయటి కొచ్చేశారు. అప్పుడేం చేయాలనేది వెంకటేశం రాంనాథన్‌కి చెప్పాడు. దాంతో రాంనాథన్‌ హుషారుగా ఎవరెవరితోనో మాట్లాడాడు. మర్నాటికల్లా  ఓ వార్త ప్రముఖంగా మీడియాలో వచ్చింది. ‘ జయలలిత మరణాన్ని తట్టుకోలేక ఆవిడకీ వీరాభిమాని అయిన తంగవేలు హార్ట్‌ఎటాక్‌తో చనిపోయారన్నది’ ఆ వార్త. యిదొక్కటే కాదు. యిలాంటి  బెంగ మరణాలు యింకో రెండొందలదాకా రాష్ట్రంలో నమోదయ్యాయి.  అప్పటికప్పుడే శశికళ, పన్నీరులు కలిసి యిలా బెంగతో మరణించిన వాళ్ళ కుటుంబాలకీ ఓ అయిదు లక్షలూ, ఓ ఉద్యోగం ఏర్పాటు చేసేశారు.
——-
 ”  అది గురూగారూ… రాత్రి నా కొచ్చిన కల” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం” అయిత టైం మెషిన్లో ఆర్నెల్లు వెనక్కిపోయావన్న మాట” అన్నాడు. వెంకటేశం నవ్వేసి ఊరుకున్నాడు. తర్వాత యిద్దరూ కబుర్లలో పడ్డారు. యింతలో ఫోన్‌ మోగింది.ఆ పాటికి గిరీశం చుట్ట గుప్పుమనిపిస్తుండడంతో వెంకటేశం ఫోన్‌ తీసుకున్నాడు. అవతల ఫోన్‌ చేసింది బాబీగాడి స్కూల్‌ హెడ్మాస్టర్‌. దాంతో వెంకటేశం కుతూహలంగా ” ఏంటార్స్‌… మళ్ళీ మా బాబీగాడేవయినా కొంపలంటించేడా?” అనడిగాడు. దానికీ అవతల్నుంచి హెడ్మాష్టర్‌ కొండయ్య ” లేదు లేదు. వేరేగా నా కొంపలంటుకునేలా ఉన్నాయి. అర్జంట్‌గా నువ్వూ , మీ గిరీశం గారు యిక్కడికి రావాలి. యింట్లోనే ఉన్నా” అన్నాడు.  వెంకటేశం అలాగేనంటూ ఫోన్‌ పెట్టేసి ” గురూ గారూ… మనం అర్జంటుగా వెళ్ళాలి. బాబీగాడి హెడ్మాస్టర్‌ కొండయ్య గారు ఏదో సమస్యలో ఉన్నారంట అన్నాడు. దాంతో గిరీశం పైకి లేచి ” పద.. పోదాం” అంటూ బయటికి నడిచాడు. వెంకటేశం అనుసరించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళేసరికి కొండయ్య యింట్లోనే ఉన్నారు. మొహం చూస్తే పది లంఖణాలు చేసినట్టున్నాడు. గిరీశాన్ని చూడగానే కొండయ్య  బోరుమన్నంత పనిచేసి ” గిరీశం గారూ.. చాలా పెద్ద సమస్యలో యిరుక్కున్నా. మీరే ఏదో చేయాలి” అన్నాడు. గిరీశం ఏవయిందన్నట్టుగా చూశాడు. దాంతో కొండయ్య ” మీకు తెలుసు కదా. నేను పిల్లలందర్నీ జాగ్రత్తగా చూసుకుంటాను. వాళ్ళు బావుండాలనీ ఎవరయినా తప్పు చేసినా తిడుతుంటాను. అలాగే ఈ మధ్య స్కూలుకి సరిగ్గా రావడం లేదని ఆనంద్‌ అనే కుర్రాడిని గట్టిగా మందలించాను. యిదంతా నిన్న మధ్యాహ్నం జరిగింది. అయితే రాత్రి  ఆ వెధవ ఆత్మహత్య చేసుకున్నాడంట. యిప్పుడు వాడి బంధువులు వచ్చి నా  నా మీద పడతారో, నా స్కూలు ధ్వంసం చేస్తారో  అని భయంగా ఉంది” అన్నాడు. ఆ పాటికి విషయం ఏంటనేది గిరీశం, వెంకటేశంలకి అర్థమయిపోయింది. గిరీశం అయితే  వెంటనే రంగంలోకి దిగిపోయాడు. వెంటనే ఎవరికో ఫోన్‌ చేసి ” ఆ..నేనూ గిరీశాన్ని. ఆ బ్లూ వేల్‌ దెబ్బ మనూరి మీదా పడింది. దాని దెబ్బతో రాత్రి ఓ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు”  అంటూ  యిన్ఫర్మేషన్‌ యిచ్చేశాడు. తర్వాత అలాంటి ఫోన్లే యింకొన్ని చేశాడు. యింకేముంది…యింకో పావుగంటలో మీడియా మొత్తం వాలిపోయింది. అంతా వచ్చా గిరీశం ” చివరిఇ ఈ విషయం నేను మీడియాకి చెప్పవలసి వచ్చి ంది. ఆనంద్‌ అనే కుర్రాడు ఈ బ్లూవేల్‌  గేమ్‌లో చిక్కుకుని రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు” అంటూ వివరించాడు. యింకేముంది మర్నాడు ‘ బ్లూ వేల్‌కి బలయిపోయిన యింకో కుర్రాడు’ పేరుతో అన్ని పేపర్లలో, ఛానల్స్‌లో ప్రముఖంగా వచ్చింది.
——-
 ” గురూ గారూ… మొత్తానికి ఆ చావుని ఖాతా మార్చేసి కొండయ్యగారిని కాపాడేశారన్నమాట” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ” అయినా అందులో తప్పేం ఉందోయ్‌… అయినా యిదంతా వ్యవస్థలో ఎప్పట్నుంచో నడుస్తూనే ఉంది కదా.  నీ కలలో వచ్చిందేంటంట? పెద్ద పెద్ద నాయకులు చనిపోయినప్పుడు పార్టీకి మైలేజ్‌ పెంచుకోవడానికి రకరకాల చావుల్ని  ఆ ఖాతాకి మళ్ళించడం గమనించవచ్చును. ఏతావాతా చెప్పేదేంటంటే… ‘ కాదేదీ కవితకనర్హం’ అని శ్రీశ్రీ ఎప్పుడో చెప్పినట్టుగా ‘ కాదేదీ మోసాలకి అనర్హం” అని యిప్పటి పార్టీలు నిరూపిస్తున్నాయి. ఈ చావు ఖాతాల ట్రాన్స్‌ఫర్‌ ఈ బాపతే. ఏదేవయినా యిలాంటి మనస్థత్వం అలవరుచుకోగలిగితేనే రాజకీయాల్లో మనగలిగేది” అంటూ వివరించాడు.
డా. కర్రి రామారెడ్డి