పసి మొగ్గలపై ముప్పేట దాడి !

జీ కె వార్తా వ్యాఖ్య
దేశంలో నానాటికి అక్షరాస్యత శాతం వృద్ధి చెందుతోంది. అంటే చదువు పట్ల  తల్లిదండ్రులకు జిజ్ఞాస పెరుగుతోందన్న మాట. ఇది మంచి పరిణామమే. అయితే ఈ క్రమంలోనే కొన్ని అవాంఛనీయ, అమానవీయ పరిణామాలు చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశం. తమ బిడ్డలు చదువుకుని ఉన్నత స్ధాయికి ఎదగాలన్న తాపత్రయం తల్లిదండ్రుల్లో అధికం కావడం సంతోషమే.  దీంతో తమ బిడ్డలకు మూడేళ్ళు నిండితే చాలు పసిపిల్లల మానసిక పరిపక్వతను పట్టించుకోకుండా వారి వారి స్తోమతను బట్టి కిడ్స్‌ స్కూళ్ళలోనో, కాన్వెంట్లలోనో తీసుకొచ్చి చేర్చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ గడిపే సమయంలో నాలుగు గోడల మధ్య  ఉంటూ  అవసరమైతే అక్కడే కాలకృత్యాలు తీర్చుకుంటూ బాల్యాన్ని ఆ చిన్నారులు బంధీగా గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు జీవనక్రమం నేర్పి బడికి పంపకుండా తమ ఇంటి వద్ద వారి అల్లరి భరించలేమంటూనో, బాల్యం నుంచే వారికి విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలనో తాపత్రయంతోనే మొత్తం మీద నాలుగేళ్ళ ప్రాయం వచ్చే సరికి వారిని తీసుకొచ్చి ఉపాధ్యాయులకు, ఆయాలకు అప్పగించేస్తున్నారు. దీంతో అసలు సమస్య ఇక్కడ మొదలవుతోంది. ఆ పాఠశాలలో మన బిడ్డ ఒక్కరే కాదు కదా… మనలా ఆలోచించే వారి పిల్లలంతా అక్కడికే చేరుతుంటారు. మన బిడ్డ ఒక్కరినే మనం భరించలేక పాఠశాలల్లో చేర్చేస్తుంటే అంతమంది పసి మొగ్గలను లాలనగా చూడటం అంటే ఉపాధ్యాయ సిబ్బందికి తలకు మించిన భారమే. దీంతో అసలు సమస్య మొదలవుతోంది. పసిపిల్లలైనా… పదేళ్ళ ప్రాయం దాటిన పిల్లలైనా వారందరిని  అజమాయిషీ చేస్తూ పాఠాలు చెబుతూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం కత్తి మీద సామే. ఇందుకు ఉపాధ్యాయులకు ఎంతో ఓర్పు, నేర్పు కావాలి.  అయితే ఉపాధ్యాయులందరినీ ఒకే గాటకు కట్టలేము గానీ కొందరు ఉపాధ్యాయులు ముందు వెనుకా ఆలోచించకుండా క్రమశిక్షణ పేరుతో ఆటవికమైన శిక్షలు విధించడం…దండించడంతో కొన్ని సందర్భాల్లో ఊహించని ఘటనలు, పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలు ఆ చిన్నారులను మానసికంగా  తీవ్రంగా గాయపర్చి చదువంటే భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో కొందరు ఉపాధ్యాయులు పిల్లలపై భౌతిక దాడులకు పాల్పడుతుండటంతో ఆ చిన్నారులు దివ్యాంగులైన సందర్భాలు కూడా లేకపోలేదు. అక్కడా ఇక్కడా ఎందుకు? మన ఆంధ్రప్రదేశ్‌లోనే గతంలో ఓ 13 ఏళ్ల బాలుడిని ఓ ఉపాధ్యాయుడు చితకబాదడంతో ఆ బాలుడు మృత్యువాత పడటం ఆందోళన కలిగించే  పరిణామం.  పసి పిల్లలను  కొట్టడం శిక్షార్హమని లోగడ ఢిల్లీ హైకోర్టు తీర్పు నివ్వగా విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లలను భౌతికంగా, మానసికంగా వేధించడం నేరమే.  అంతే గాక బాలల న్యాయ చట్టం ప్రకారం కూడా 18 ఏళ్ళ లోపు పిల్లలను కొట్టడంతో పాటు ధూషించడం చేయకూడదు. అయితే విద్యా శాఖ, శిశు సంరక్షణ శాఖల పర్యవేక్షణ కొరవడటంతో దాదాపు అన్ని పాఠశాలల్లో ఈ వేధింపులు నిత్యకృత్యమైపోయాయి. అవి శృతిమించితే, ఆ చిన్నారికి ఊహించరానిది ఏదైనా జరిగితే మాత్రమే అవి వెలుగు చూస్తున్నాయి. పసి పిల్లలకైతే ఆలనగా…లాలనగా, ఆరవ తరగతి నుంచి బాధ్యత, భవిష్యత్‌ను భోధిస్తూ పాఠాలు నేర్పవలసిన కొందరు ఉపాధ్యాయులు  ఆ ప్రాథమిక  సూత్రాలను విస్మరించి దండనే సులభమైన సాధనమని, అలాగైతేనే పిల్లలకు భయభక్తులు ఉంటాయనే అపోహతో కొన్ని సందర్భాల్లో శృతిమించి ప్రవర్తిస్తుండటంతో   అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో పిల్లలు చదువంటే భయపడిపోయి  కొరకురాని కొయ్యలుగా తయారై విద్యకు దూరమైపోతున్నారు. హోం వర్కు చేయలేదనో, మార్కులు సరిగ్గా రాలేదనో, ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరిగిందనో, అల్లరి చేస్తున్నారనో చిన్నారులను ఎండలో గంటల తరబడి నిలబెట్టడం, గుంజీలు తీయించడం, బెత్తంతో విచక్షణ మరిచి వాతలు వచ్చేలా కొట్టడం, తోటి పిల్లల ఎదురుగా వారిని అవమానపర్చేలా నోటికొచ్చినట్లుగా అవమానకర రీతిలో మాట్లాడటం పరిపాటైంది. ఆదర్శంగా మెలగవలసిన ఉపాధ్యాయుల్లో కొందరు రాక్షసంగా ప్రవర్తిస్తూ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సున్నితంగా వ్యవహరించవలసిన ఉపాధ్యాయులు కర్కశంగా  మారడంతో  అది దుష్పరిణామాలకు  దారి తీస్తుంది. తాజాగా హైదరాబాద్‌లో స్కూల్‌ డ్రెస్‌ వేసుకురాలేదని ఓ బాలికను బాలుర మరుగుదొడ్డి వద్ద గంట సేపు నిల్చోబెట్టగా మేమూ తక్కువ తినలేదంటూ విజయవాడలో హోం వర్కు చేయలేదని ఓ బాలుడిని వాతలు వచ్చేలా కొట్టడం వెలుగు చూసింది. దీంతో చదువంటే ఆ చిన్నారులు భయపడిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.  అంతే కాదు పాఠశాలలకెళ్ళే ఆ చిన్నారుల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది. పాఠశాలల సిబ్బందితో పాటు యాజమాన్యాల నిర్లక్ష్య ఫలితంగా ఇంటి నుంచి పాఠశాలలకు వెళ్ళిన చిన్నారులు క్షేమంగా తిరిగొస్తారన్న నమ్మకం ఉండటం లేదు. వారిపై లైంగిక దాడులు పరిపాటిగా మారాయి.  ఢిల్లీలోని ఓ పాఠశాలలో తాజా ఘటనే ఇందుకు నిదర్శనం. చిన్నారులను కంటికి రెప్పలా కాపాడవలసిన సిబ్బందే వారిని కాటేసి అఘయిత్యాలకు పాల్పడుతూ మానవత్వాన్ని మంటగలుపుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కాలం చెల్లిన,  రెండవ శ్రేణి బస్సులను, వ్యాన్లను కొనుగోలు చేసి వాటి కండిషన్‌పై పర్యవేక్షణ చేయకపోవడంతో  ఆ బస్సులు తరుచు ప్రమాదాలకు కారణం కావడం, సిబ్బంది మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులు కావడం నిత్య కృత్యంగా మారాయి. పిల్లల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి వేలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేసే  యాజమాన్యాలకు ఇవేమీ పట్టడం లేదు. దీనికి కారణం విద్య కూడా వ్యాపార వస్తువుగా మారిపోవడమే. చదువులో వెనుకబడిన వారిపై శ్రద్ధ చూపవలసింది పోయి ముందంజలో ఉండే పిల్లల ఎదురుగా వారిని అవమానకర్చే రీతిలో మాట్లాడటం పరిపాటిగా మారడంతో విద్యార్ధుల మధ్య స్పర్థలు, ఈర్ష్య, ద్వేషాలు పెచ్చుమీరుతున్నాయి. మాతృదేవోభవ…పితృదేవోభవ… ఆచార్య దేవోభవ అన్న నానుడి…. ఈ ముగ్గురూ పిల్లలకు ప్రత్యక్ష దైవాలు. ఎందుకంటే చిన్నారుల బాల్యమంతా ఇంట్లో… ఆ తర్వాత బడిలోనో గడుస్తుంది. వారి ప్రవర్తన,  దండన విద్యార్ధులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.  ఇలాంటి పరిణామాలను కట్టడి చేసేందుకు ఇప్పటికే అనేక చట్టాలు ఉన్నా చట్టాలేమీ ఈ పోకడకు అడ్డు కట్ట వేయలేవు. ఉపాధ్యాయుల తీరు మారితే తప్ప విద్యా బోధనలో ఆరోగ్యకరమైన మార్పులు రావన్నది నిర్వివాదాంశం. ‘దండం దశ గుణ భవేత్‌’ అన్న ఆర్యోక్తిని ఈ నేపథ్యంలో పరిశీలించినట్లయితే  దానిని సక్రమ రీతిలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి…వేరే విధంగా ప్రయోగిస్తే దుష్ఫలితాలు సంభవిస్తాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు వ్యవహరిస్తే ఎలాంటి వివాదాలూ…అవాంఛనీయ ధోరణులకు తావుండదు.  అందుకు పాఠ్యాంశాల్లోనే కాదు విద్యా బోధనలోనూ మార్పులు రావలసి ఉంది. అందుకు చట్టాలున్నా అవి అక్కరకు రాకుండా ఉన్నందున ఉపాధ్యాయుల విద్యాబోధన తీరులో, వారి మనస్తత్వంలో మార్పులు రావలసిన అవసరం ఉంది. గురుశిష్యుల మధ్య సత్సంబంధాలు ఉంటేనే ఉభయ తారకమవుతుంది. తద్వారా విద్యా రంగంలో మనం ఆశిస్తున్న మార్పులను, ఫలితాలను సాధించడానికి వీలు కలుగుతుంది. అందుకు చట్టాలు కాదు త్రికరణ శుద్ధి అవసరమన్న విషయాన్ని గ్రహించడం శ్రేయస్కరం.