లంఖణాల ఆంధ్రప్రదేశ్ (శనివారం నవీనమ్)

లంఖణాల ఆంధ్రప్రదేశ్
(శనివారం నవీనమ్)

అంతుచిక్కని అతి ప్రాణాంతకమైన విష జ్వరాలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలనూ చుట్టుముట్టాయి. మలేరియా, సెరిబ్రల్‌ మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ, చికున్‌గున్యా, వైరల్‌, ఇంకా గుర్తించలేని జ్వరాలెన్నో జనాన్ని పీడిస్తున్నాయి.

ఇప్పటికే ఒక్కో జిల్లాలో వందలు, వేల సంఖ్యలో మలేరియా కేసులను గుర్తించారు. అది తూర్పుగోదావరి ఏజెన్సీ కావొచ్చు. రాజధాని అమరావతి ప్రాంతమూ కావొచ్చు. అనంతపురంలో అయితే డెంగ్యూ కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. కడపలో భయంకరమైన మలేరియా కేసులు ఆరోగ్య శాఖ దృష్టికొచ్చాయి.

ఈ సమాచారమంతా అధికారికంగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నవి. వాస్తవ పరిస్థితి చాలా భయంకరంగా తయారైందని స్థానిక మీడియాలో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి.

తొలుత ‘సిఎం కోర్‌ డాష్‌ బోర్డు’లో ఎప్పటికప్పుడు సమగ్ర వివరాలు పొందుపర్చేవారు. మీడియా సంస్థలు ‘సిఎం కోర్‌ డాష్‌ బోర్డు’ వెబ్‌సైట్‌ను సోర్స్‌గా చేసుకొని కథనాలు ప్రచురిస్తుండటంతో అప్‌డేట్‌ ఆపేశారు.

అమరావతి ప్రాంతంలో ప్రావాసాంధ్రులు నిర్మించతలపెట్టిన ప్రైవేటు సూపర్‌ స్పెషాల్టీ హాస్పిటల్‌ శంకుస్థానపన సభలో రాష్ట్ర ఆరోగ్య మంత్రివర్యులు మాట్లాడుతూ ఏపీలో యాభైశాతం మంది ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందించడమే లక్ష్యమని గొప్పగా ప్రకటించుకున్నారు. దానర్థం ప్రస్తుతం రాష్ట్రంలో సగం మందికి కూడా సర్కారీ వైద్యం అందుబాటులో లేదనే. ప్రస్తుతం ఎంత మందికి పూర్తి స్థాయిలో వైద్య సేవలందిస్తోందో ప్రభుత్వమే చెప్పాలి.

ఈ వర్షాకాలం మొదలయ్యాకనే తూర్పుగోదావరి మన్యంలో చాపరాయి అనే గిరిజన గూడెంలో మలేరియా బారినపడి 16 మంది మృత్యువాతపడ్డారు. ఆలస్యంగా స్పందించిన ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్యశాఖదే నిర్లక్ష్యం అని మండిపడ్డారు. తక్షణం ఏజెన్సీలో వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని హూంకరించారు. దాదాపు రెండు మాసాలవుతున్నా పోస్టుల భర్తీ అతీగతీ లేదు. విలీన ప్రాంతం చింతూరు ఏరియా ఆసుపత్రిలో 31 మంది సిబ్బందికిగాను ఎనిమిది మందే ఉన్నారు. సిఎం దత్తత తీసుకున్న విశాఖ ఏజెన్సీలోని ‘పెదలబుడు’లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలోని ఏడు ఐటిడిఎలలోని 90 శాతం ఆసుపత్రుల్లో గైనకాలజిస్టు, అనస్థిషియా, పీడియాట్రిక్‌ డాక్టర్లు లేరు. ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక పథకాలు, రాజ్యాంగం రీత్యా గవర్నర్‌ నేరుగా పర్యవేక్షించే ఏజెన్సీలోనే ఇంత ఘోరంగా ఉంటే తక్కిన ప్రాంతాల్లో ఇంకెలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్ర జనాభా, మొత్తం బడ్జెట్‌ ఈ రెండింటితో పోల్చితే వైద్య శాఖకు చేసే కేటాయింపులు నామమాత్రం. ప్రతిపాదనలే తక్కువ కాగా వాటినీ ఖర్చు చేయక పోవడం మరీ దుర్మార్గం. ముందటేడు 3.39 శాతం ఖర్చు చేయగా నిరుడు 4.50 శాతం ప్రతిపాదించి 4.34 శాతానికి సవరించారు. ఈ ఏడాది 4.47 శాతం నిధులం టున్నా చివరికి ఎంత ఖర్చు చేస్తారో తెలీదు. పిహెచ్‌సిలు, వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో సిబ్బంది మొత్తం సగానికి సగం మంది కాంట్రాక్టు మీదనే. వాటిలోనూ ఖాళీలున్నాయి. రూ.వెయ్యి, రెండు వేలతో పని చేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లే దిక్కు. చంద్రన్న సంచార కేంద్రాలు, 108 అంబులెన్స్‌లకు డీజిల్‌కే దిక్కు లేక చాలా మట్టుకు మూలనపడ్డాయి.

జనం సౌకర్యాలు అడుగుతుంటే, ఆసుపత్రుల్లో మరణించిన వారిని స్మశానానికి తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాలిస్తా మంటున్నారు ఆరోగ్యమంత్రి. సిఎం అయితే హెల్త్‌ టూరిస్టు హబ్‌ను ఏర్పాటు చేస్తామంటున్నారు. అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ప్రైవేటీకరణ వంటి ప్రపంచబ్యాంక్‌ ఆదేశిత చర్యలు సరేసరి. ఆరోగ్యశ్రీ ఉన్నా లేనట్టే లెక్క. జ్వరాలు, పలు అంటు వ్యాధులు అపారిశుధ్యం, కలుషిత తాగునీటి వలన వ్యాపిస్తాయి.

పట్టణాలు, గ్రామాలు మురికి కూపాలుగా మారాయి. కనీసం క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌కు నిధుల్లేవు. ఆరోగ్యం, పంచాయతీ, మున్సిపల్‌, నీటి సరఫరా అన్ని విభాగాలకూ సమృద్ధిగా నిధులు కేటాయించి, సమన్వయపర్చి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయిస్తేనే జ్వరాలు, డయేరియా వంటి అంటు వ్యాధులు అదుపులోకొస్తాయి. టెలీకాన్ఫరెన్స్‌లు, దోమలపై దండయాత్రలు, స్వచ్ఛభారత్‌ వంటి శుష్క నినాదాలతో రోగాలు నయం కావు.