రావణ విరచితం

మనస్సాక్షి
వెంకటేశం వస్తూనే ” గురూ గారూ…యిందాకో ఉత్తరం వచ్చింది” అన్నాడు. దాంతో గిరీశం అదిరిపోయి ” యింకా ఈరోజుల్లో ఉత్తరాలు రాసేవాళ్ళెవరున్నారోయ్‌…
కొంపదీసి  ప్రేమలేఖ కాదు కదా” అన్నాడు. వెంకటేశం తల అడ్డంగా ఊపి ” ఆ..అంతదృష్టం కూడానా… ఆ.. రాసిందేదో మా లక్ష్మీకాంతం పెద్దమ్మలెండి… నన్నర్జంటుగా రమ్మని రాసేసింది” అన్నాడు. గిరీశం అలాగా అన్నట్టుగా తలూపి ” కొంపదీసి ఆవిడ బాపతు ఆస్తిపాస్తులేవన్నా రాస్తుందేమో” అన్నాడు. వెంకటేశం  కాదన్నట్టుగా తలూపి ” అదేం కాదులే గురూ గారు.. మన  గంగలకుర్రులో ఏవో రెండు గుళ్ళు  కట్టించాలంట..దాని గురించి మాట్లాడడానికి” అన్నాడు. దాంతో గిరీశం హుషారుగా ”గుళ్ళా…కొంపదీసి నీకో గుడి నాకో గుడీ అంటావా” అన్నాడు.  వెంకటేశం తలూపి ” ఆ… గొప్ప శిష్యుడిని తయారు చేసినందుకు మీకూ, యింత గొప్పోడినయిపోయినందుకు నాకూ కట్టిస్తారు” అన్నాడు. గిరీశం నవ్వేసి ” సర్లే..నువ్వు వెళ్ళిరా” అన్నాడు. వెంకటేశం తలూపి బయటికి నడిచాడు. యింకో గంట తర్వాత ఎర్ర బస్సెక్కి గంగలకుర్రు బయలేర్దాడు.
——–
 గంగలకుర్రు… లక్ష్మీకాంతం అయితే వెంకటేశాన్ని చూడగానే చాలా ఆనందపడిపోయింది. ” రారా ఎంకన్నా… ఉత్తరం వేయగానే వచ్చినందుకు చాలా సంతోషం. నాకా వయసయిపోతోంది. ఓ పది లక్షలు పెట్టి మనూళ్ళో రెండు గుళ్ళు కట్టించాలనుకుంటున్నా. అలా అయితే  నా పేరు ఊళ్ళో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ గుళ్ళు కట్టించడానికి నిన్ను మించిన యోగ్యుడెవరూ కనిపించ లేదు.  మిగతా ఎవరినీ నమ్మే పరిస్థితి లేదు” అంది. దాంతో వెంకటేశం తలూపి ” అద్సరే పెద్దమ్మా… మరీ పది లక్షలంటే స్థలం కూడా  రాదు కదే” అన్నాడు. దాంతో లక్ష్మీకాంతం ”స్ధలాల సమస్య లేదురా. ఆ చెరువు పక్కన ఓ నూటయాభై గజాల స్ధలం. మార్కెట్‌ వీధిలో యింకో స్థలం ఉన్నాయి.వాటిలో కట్టించేద్దూ గానీ” అంది. దాంతో వెంకటేశం ” అలాగయితే ఓకె… యింతకీ ఏ దేవుళ్ళ  గుళ్ళు కట్టించాలి పెద్దమ్మా ” అన్నాడు.  దానికి లక్ష్మీకాంతం ” ఎవరివయినా ఫరవాలేదురా” అంది. దాంతో వెంకటేశం ఏదో ఆలోచన వచ్చినట్టుగా ” మన గిరీశం తాతగారి గుడయినా ఫర్వాలేదా? ” అన్నాడు. దాంతో లక్ష్మీకాంతం నవ్వేసి ” ఫర్లేదు. ఆయనదనేంటీ… ఆఖరికి మీసాల వీరప్పన్‌ గుడయినా ఫర్వాలేదు” అంది. దాంతో వెంకటేశం కూడా  నవ్వేసి ” సరే పెద్దమ్మా… వెంటనే పని మొదలుపెట్టించేస్తాలే” అన్నాడు. ఈలోగా లక్ష్మీకాంతం కొంత డబ్బు తెచ్చి వెంకటేశానికిచ్చి ” యిదయ్యాక మళ్ళీ యిస్తా” అంది. వెంకటేశం తలూపి బయటికి నడిచాడు.
 ఆ మర్నాడే ఆ గుడి పనులేవో మొదలయ్యాయి.
————–
 మూడు నెలలు తిరిగేసరికల్లా గంగలకుర్రులో రాములోరి గుడి రడీ అయిపోయింది.  వెంకటేశం కూడా తన పెద్దమ్మ తన మీద పెట్టిన నమ్మకానికి తగ్గట్టుగా ఏ కక్కుర్తులూ పడకుండా బ్రహ్మండంగా ఆ గుడేదో కట్టించేశాడు. యిక గుడి ప్రారంభోత్సవం  రోజయితే వచ్చేసింది. అయితే వెంకటేశానికి కొంచెం పబ్లిసిటీ దురద ఎక్కువ. దాంతో ఆ గుడి ప్రారంభోత్సవం విషయాన్ని మీడియాకి గట్టిగానే తెలియజేశాడు. యింకా ఊళ్ళో బోల్డంత పబ్లిసిటీ కూడా యిచ్చాడు. అనుకున్న సమయానికి గుడి ప్రారంభోత్సవం జరిగిపోయింది. అయితే పెద్దగా ఎవరూ రాలేదు. మర్నాడు అన్ని పేపర్లలో ఈ వార్తేదో బ్రహ్మండంగా వచ్చేస్తుందని వెంకటేశం తెగ ఆశపడిపోయాడు. దాంతో మర్నాడు పొద్దున్నే పేపర్లన్నీ కొనేసి గబగబ జిల్లా ఎడిషన్లన్నీ తిరేగేసేశాడు. దాంతో  ఎక్కడా ఏవీ లేదు…! ఏదో ఓ రెండు పేపర్లలో ఓ మూల ‘గంగలకుర్రులో రామాలయం ప్రారంభోత్సవం’ అని చిన్నగా వచ్చిందంతే. దాంతో వెంకటేశం చాలా నిరాశపడిపోయాడు. ఆ బాధతోనే గిరీశం గారి దగ్గర వాలిపోయాడు. ” గురూ గారూ. యింత కష్టపడి బ్రహ్మండంగా రాములోరి గుడి కట్టించానా… అయినా మీడియా పెద్దగా పట్టించుకోలేదు” అన్నాడు బాధపడిపోతూ.  దాంతో గిరీశం నవ్వేసి ” పరే… యింకా ఆవ రెండో గుడి కట్టించాలి కదా…అప్పుడేం చేస్తావంటే” అంటూ ఏం చేయాలో చెప్పాడు. దాంతో వెంకటేశం హుషారుగా తలూపి ఆ రెండో గుడి నిర్మాణం పనులు మొదలెట్టేశాడు. మొత్తానికి రెండు నెలలు తిరుక్కుండానే  ఆ గుడేదో తయారయిపోయింది. అయితే ఈసారి ఓ విశేషం జరిగింది. ఆ రెండో గుడి ప్రారంభోత్సవానికి ఊరు ఊరే కాదు… చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనాలు పొలోమని తరలివచ్చేశారు. యిక మర్నాడయితే  అన్ని ఛానల్స్‌లో, అన్ని పేపర్లలో ఈ గుడి గురించి ప్రముఖంగా వచ్చింది. గుడితో  పాటు వెంకటేశం పేరు అంతా మార్మోగిపోయింది. అంతా ఆ గుడి గురించి చర్చలే. యింతకీ ఆ గుడిలో పెట్టింది ఏ రాముడ్నో, కృష్ణుడ్నో కాదు. రావణాసురుడి విగ్రహం.
———-
” అదీ గురూ గారూ… నాకొచ్చిన కల. కొంపదీసి నేను ఎదురుమతం గాడిలా తయారయిపోతున్నారంటారా?” అంటూ అడిగాడు వెంకటేశం అనుమానంగా దాంతో గిరీశం విసుక్కుని ” ఆ… యిలాంటి లక్షణాలేవో మీ తాత వెంకటేశం టైం నుంచీ కనబడుతున్నాయిలే. యింతకీ ఈ కలకి అర్ధం ఏంటో తెలుసా? అసలిదంతా నెగిటివ్‌ యట్రాక్షన్‌ వ్యవహారం. మనిషినెప్పడూ మంచి కంటే చెడే ఎక్కువగా ఆకర్షిస్తుంది. అప్పట్లో సంచలనం సృష్టించిన  ఒనిడా టీవీ యాడ్‌ గుర్తుందా. ఓ పిల్ల భూతంతో తీసిన నెగిటివ్‌ యాడ్‌ సూపర్‌హిట్‌ అయింది. యిదేదో ఆ యాడ్‌  అనే కాదు. అన్నీ రంగాలకీ వర్తిస్తుంది. సినిమా రంగాన్నే  తీసుకుంటే అప్పట్లో తన క్రియేటివిటీతో ఓ వెలుగు వెలిగిన  ఓ డైరక్టర్‌ యిప్పడా క్రియేటివిటీ కొండెక్కి పోయినా సంచలనాత్మక   స్టేట్‌మెంట్లతో తన ఉనికిని చాటుకుంటున్నాడు. అదే రాజకీయాల్ని తీసుకుంటే  కష్టపడి పైకి రావాలంటే ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అదే అడ్డదారిలో అంటే అడ్డదిడ్డమైన స్టేట్‌మెంట్లు యిస్తే చాలా తొందరగానే పైకొచ్చేయెచ్చు. ఆనాటి నందిని నుంచి ఈనాటి గులాబీ వరకు యిలా పాపులర్‌ అయినవాళ్ళే. యిక ఈ మధ్య ఓ కులాన్ని టార్గెట్‌ చేసి స్టేట్‌మెంట్లిచ్చిన ఆచార్యుల వారు రాత్రికి రాత్రే పాపులర్‌ అయిపోవడం తెలిసిందే. ఏతావాతా చెప్పేదేంటంటే ఈ వ్యవస్థలో  కావలసింది రామతత్వం కాదు రావణతత్వం ” అన్నాడు.
 డా. కర్రి రామారెడ్డి