వోద్దనుకున్న దారిలోనే రాహుల్ ప్రయాణం! అంతటా, అన్నిటా వారసత్వమే!! (శనివారం నవీనమ్)

వోద్దనుకున్న దారిలోనే రాహుల్ ప్రయాణం!
అంతటా, అన్నిటా వారసత్వమే!!
(శనివారం నవీనమ్)

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల తన అమెరికా పర్యటన సందర్భంగా బర్కెలేలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత దేశంలో వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్నారు. దీనికి ఉదాహరణగా అఖిలేష్ యాదవ్, స్టాలిన్, అనురాగ్ థాకుర్, అభిషేక్ బచ్చన్ తదితరుల పేర్లు ఉదహరిస్తూ వారసత్వం విషయంలో తననొక్కడి వెంటే పడవలసిన అవసరం లేదన్నారు. భారత దేశంలో ప్రతీదీ వారసత్వంతో పని చేస్తోందన్నారు. కేవలం రాజకీయాలే కాదు, వ్యాపారం, సినిమా తదితర అన్ని రంగాల్లో వారసత్వ వ్యవహారం కొనసాగుతోంది, కేవలం తననొక్కడిని విమర్శించకూడదని ఆయన ఒక ప్రశ్నకు బదులిస్తూ చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పింది అక్షర సత్యం.

ప్రజాస్వామ్యం ముసుగులో వారసత్వ రాజకీయంప్రజాస్వామ్యానికి సమాంతర వ్యవస్థగా మారి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తోంది. కాంగ్రెస్, తెలంగాణా రాష్ట్ర సమితి, తెలుగుదేశం, సమాజ్‌వాదీ, నేషనల్ కాన్ఫరెన్స్, బి.జె.డి, ఎన్.సి.పి, తృణమూల్ కాంగ్రెస్, డి.ఎం.కె, ఆర్.జె.డి, అకాలీదళ్, పి.డి.పి తదితర పార్టీలు వారసత్వ రాజకీయాలను కొనసాగిస్తున్నాయి.

బి.జె.పి, వామపక్షాల్లో వారసత్వ రాజకీయం లేదు. వామపక్షాలు కాలం చెల్లిన సిద్ధాంతాలను పట్టుకుని వేలాడుతుంటే బి.జె.పిలో వ్యక్తి ఆధారిత రాజకీయం కొనసాగుతోంది. బి.జె.పికి సంబంధించిన కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయం ఉన్నది.

రాహుల్ గాంధీ కొత్తగా రాజకీయాలలోకి వచ్చినప్పుడు వారసత్వ రాజకీయాలను బాహాటంగా విమర్శించారు. యువజన కాంగ్రెస్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించటం ద్వారా వివిధ పోస్టులకు నాయకులను ఎన్నిక చేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నాయకుల ఆలోచనా విధానంలో మార్పు రాకపోవటంతో సంస్థాగత ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించే ప్రయత్నం విఫలమైంది.

వారసత్వ రాజకీయాల మూలంగానే లోకసభలో అడుగు పెట్టటంతోపాటు మొదట ప్రధాన కార్యదర్శి, ఆ తరువాత ఉపాధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. వారసత్వం మూలంగా రాజకీయాలలోకి వచ్చిన రాహుల్ గాంధీ పార్టీ సంస్థాగత ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలనే ఆలోచనకు కట్టుబడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఆయన తన ప్రారంభ ఆలోచనా విధానం, వారసత్వ వ్యతిరేకతకు కట్టుబడి ఉండలేకపోయారు. కాల క్రమంలో ఆయన కూడా వారసత్వ రాజకీయాన్ని ఆస్వాదించటం ప్రారంభించారు. అందుకే ఆయన ఇప్పుడు వారసత్వ రాజకీయాలను బలపరచటంతోపాటు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలను నామమాత్రంగా నిర్వహిస్తూ తనకు నచ్చిన వారిని వివిధ పదవుల్లో నియమిస్తున్నారు.

రాహుల్ గాంధీ ప్రకటన మూలంగా భారతదేశం పరువు, ప్రతిష్ట మంట కలిసిందంటూ కేంద్ర జౌళి, సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, ఐ.టి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తదితరులు రాహుల్ గాంధీపై దుమ్మెత్తిపోశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారసత్వ రాజకీయాల మూలంగా ఈ పదవులకు ఎంపిక అయ్యారా అంటూ స్మృతి ఇరానీ దుయ్యబట్టారు.

వారసత్వ, వ్యక్తి ఆధారిత రాజకీయాల మూలంగానే ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అవినీతిమయమైంది. వారసత్వ, వ్యక్తి ఆధారిత రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తే ఏమవుతోందనేది మనందరికి తెలిసిందే. అధికారమంతా అధినాయకుడు లేదా అధినాయకుడి కుటుంబ సభ్యుల వద్ద కేంద్రీకృతమవుతోంది. మిగతా మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు. అధినాయకులు తీసుకునే నిర్ణయమే శాసనంగా మారుతోంది. పేరుకు ప్రజాస్వామ్యమైనా వాస్తవానికి అధినాయకుడి ఆలోచనా విధానమే పార్టీ,ప్రభుత్వ విధానమవుతోంది. ప్రజాస్వామ్యం ప్రకారం అన్ని స్థాయిల్లో చర్చ జరిగిన అనంతరం నిర్ణయం తీసుకునే ప్రక్రియకు ఎప్పుడో చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారు.

కాంగ్రెస్, బి.జె.పి, టి.ఆర్.ఎస్, తెలుగుదేశం, తృణమూల్ కాంగ్రెస్, బి.జె.డి పార్టీల అధినాయకులు చెప్పిందే వేదంగా మారింది. వారసత్వ అధికార వ్యవస్థలు ప్రజాస్వామ్య పద్ధతిలో పని చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని కొందరు వాదిస్తున్నారు. వారసత్వ రాజకీయం అంటేనే కేంద్రీకృత అధికారం, దీనికి ప్రజాస్వామ్యం తోడు కావటం ఏమిటి? ఉత్తర, దక్షిణ ధృవాలు కలవనట్లు వారసత్వ రాజకీయం, ప్రజాస్వామ్య రాజకీయం ఎప్పటికీ కలిసి ఉండలేవు. దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో వారసత్వ రాజకీయం రాజ్యమేలటానికి ప్రధాన కారణం ప్రజల ఆలోచనా విధానమే. ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారు కాబట్టే వారసత్వ, కుటుంబ, వ్యక్తి ఆధారిత రాజకీయం కొనసాగుతోంది.

నరేంద్ర మోదీకి ప్రజలు బ్రహ్మరథం పట్టినందుకే వ్యక్తి ఆధారిత రాజకీయం పని చేస్తోంది. గతంలో ఇందిరా గాంధీకి కూడా ప్రజలు ఇలాగే మద్దతు ఇచ్చారు. తెలంగాణా ప్రజలు చంద్రశేఖరరావుకు ఊహించని మెజారిటీ ఇచ్చారు.

రాష్ట్ర విభజనతో మండిపోయిన ఆంధ్ర ప్రజలు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగించారు.

వారసత్వ రాజకీయాలు నాలుగు కాలాల పాటు నిలదొక్కుకునేందుకు నిరక్ష్యరాసత్యతతోపాటు అక్ష్యరాస్యుల అవగాహనా లోపం, కులం, వ్యక్తుల పట్ల ఉన్న దురభిమానం, ఏదో చేస్తారనే ఆశ, తమను తాము గౌరవించుకోకపోవటం, అర్థవంత ప్రత్యామ్నాయ లేమి ప్రధాన కారణాలు.

వారసత్వ, కుటుంబ, వ్యక్తి ప్రధాన ప్రభుత్వాల్లో పని తక్కువ, ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ ప్రభుత్వాలు గోరంతను కొండంతలు చేసి చూపించటం ద్వారా ప్రజలను మభ్యపెడతాయి. తామున్నాము కాబట్టి రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతోంది లేకపోతే వెనకబడిపోతాయంటూ తమను తాము ఎక్కువ చేసి చూపిస్తూ ప్రజలను తమ ఉక్కు పిడికిలిలో బిగించివేస్తాయి.

వీరు చివరకు పాలితుల ఆలోచనను సైతం అదుపు చేసేందుకు ప్రయత్నించటంతోపాటు ప్రాథమిక హక్కులకు సైతం భంగం కలిగిస్తారు. ఇలాంటి పరిస్థితి వ్యక్తికి, సమాజానికి, రాష్ట్రానికి, దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటుతున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించకపోవటానికి వారసత్వ, కుటుంబ, వ్యక్తి ప్రాధాన్య రాజకీయ పాలనే ప్రధాన కారణం.