‘ఈగో’ల

మనస్సాక్షి
వెంకటేశానికి దేవుడంటే నమ్మకం లేదు. అలాగని నాస్తికుడేంకాదు. పెద్దగా పూజలు, పునస్కారాలూ చేయడంతే. అలాంటి వెంకటేశం కాస్తా ఉన్నట్టుండి దేవుడిని ప్రార్థించడం మొదలెట్టాడు. గ్రామ దేవత నుంచి వెంకన్నబాబు దాకా అందరికీ దణ్ణం పెట్టుకున్నాడు. యింతకీ వెంకటేశం అంతిదిగా ప్రార్థనలు చేస్తోంది ఏ అనుష్కతోనో, తమన్నాతోనో పెళ్ళి కావాలనీ కాదు…. లేకపోతే ఏ ఎంపీ సీటో కావాలనీ కాదు. మరి….
——-
 అప్పుడే సెకండ్‌ షో అయింది.
వెంకటేశం సినిమా చూసి అప్పుడే బయటికొచ్చాడు. అక్కడ్నుంచి ఆ సినిమాలో పాటేదో పాడుకుంటూ యింటి మొహం పట్టాడు. దారిలో గిరీశం గారిల్లు కనపడేసరికి అటువైపు తొంగి చూశాడు. ఆ పాటికి యింట్లో ఏదో హడావిడి వినిపిస్తోంది. దాంతో గబ గబా లోపలికి నడిచాడు. ఆ పాటికి గిరీశం ట్రిమ్‌గా తయారయే పనిలో ఉన్నాడు. దాంతో వెంకటేశం అనుమానంగా ” ఎక్కడికి బయల్దేరుతున్నట్టున్నారు. మీ వైపు బంధువు ఎవరయినా బాల్చీ తన్నేశారా?” అని అడిగాడు. దాంతో గిరీశం విసుక్కుని ” శుభం పలకరా పెళ్ళి కొడకా అంటే ఏదో అన్నట్టు… అలా ఉంది నీ తీరు. ఓ మంచి పని కోసం బయల్దేరుతుంటే ఈ మాటలేంటంట?” అన్నాడు. దాంతో వెంకటేశం నాలుక్కరచుకుని ” సరే గురూ గారూ…యింతకీ యిప్పుడెక్కడికి వెడుతున్నట్టు?” అన్నాడు. ఈలోగా గిరీశం మీసాలు దువ్వుకుంటూ  ” వైజాగ్‌ వెళ్ళాలోయ్‌… ఏ ట్రయిన్లున్నాయో చూడకూడదూ…” అన్నాడు. వెంకటేశం ఏదో ఆలోచించి ” ఆ యిప్పుడు ట్రయిన్‌లేవీ ఉండవు. ఏ గోదావరన్నా ఎక్కినా బోల్డంత రష్‌గా ఉంటుంది” అన్నాడు. గిరీశం తలూపి ” ఆ ఎక్స్‌ప్రెస్‌లు లేకపోతేనేం…ఒంటిగంటకి పాసింజర్‌ ఉంది కదా… దానికే పోతా” అన్నాడు. దాంతో వెంకటేశం ప్రపంచం తలకిందులయినంతగా అదిరిపోయి ” ఏంటీ… ఆ దొంగల బండి కెడతారా…క్షేమంగా చేరిపోదామనే”… అన్నాడు. గిరీశం అర్ధం కానట్టు ” అదేం మాటోయ్‌… రైలు నిండా బోల్డంత మందుంటారు కదా. యింకా దొంగలేం చేస్తేస్తారంట? అన్నాడు. అయితే వెంకటేశం ఒప్పుకోలేదు. ”లేదు గురూ గారూ… అసలే దానిపేరు దొంగల బండి. రైలుని  ఏ పెదబ్రహ్మదేవంలోనో? రావికంపాడులోనో? ఆపేసి   దొంగలెక్కి దోచుకుపోతారు” అన్నాడు. ఈసారి గిరీశం ” ఆ దోచుకోవడానికి నా దగ్గర ఏముంటుందోయ్‌… ఈ ట్రంకు పెట్టి తప్ప” అన్నాడు. అయినా వెంకటేశం పట్టు వదల్లేదు.   ” ఆ దొంగలికి మీ మెళ్ళో ఉన్న రోల్డ్‌గోల్డ్‌ చెయిన్‌ చాలు” అన్నాడు. అయినా గిరీశం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా ” లేదు… లేదు నేను ఆ బండిలోనే పోతా” అన్నాడు. అయితే అదేదో వె ంకటేశానికి పెద్దగా నచ్చినట్టుగా లేదు. అయిష్టంగానే  తలూపాడు. అక్కడే అరుగు మీద సెటిలయ్యాడు. యింకొంచెం సేపటి తర్వాత గిరీశం స్టేషన్‌కి వెళ్ళిపోయాడు. వెంకటేశం మాత్రం అక్కడే అరుగు మీద చిన్నగా కునికిపాట్లు పడుతూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే ఏదో కలొచ్చింది. గిరీశం వెడుతున్న రైలుని దొంగలు ఆపేసినట్టూ, ఆనక ఆ దొంగలు రైల్లో అందరినీ దింపేసి నగలూ, సామాన్లూ దోచుకుంటున్నట్టూ ఆ కల సారాంశం దాంతో వెంకటేశం ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. కలేనా… నిజం కాదన్నమాట’ అని గొణుక్కుంటూ  హాల్లో దేవుడి పటం దగ్గరికి నడిచాడు. ఓ సారి భక్తిగా దణ్ణం పెట్టేసుకుని ” స్వామీ…ఎలాగయినా మా గురువుగారు వెళ్ళిన దొంగల బండిలో దొంగలు పడి మొత్తం దోచుకుపోవాలి. అందరినీ చితకబాదాలి” అని ప్రార్థించాడు. తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు. ఈసారి యింకో కలొచ్చింది. దాంట్లో గుర్రాల మీద దొంగలొచ్చి రైలాపేసి, అందరినీ దింపేసినట్టూ, తుపాకులతో బెదిరించి అందరి దగ్గర  సామాన్లూ లాక్కున్నట్లు కలొచ్చింది. వెంకటేశానిఇ మళ్ళీ మెలకువొచ్చేసింది. అయితే ఈ సారి మళ్ళీ పడుకోలేదు. గబగబా వెళ్ళి టీవీ ఆన్‌ చేశాడు. న్యూస్‌ ఛానల్స్‌ అన్నీ అటూ యిటూ మార్చడం మొదలెట్టాడు. ఎక్కడయినా ఆ దొంగల బండిలో దొంగతనం లాంటిదేవయినా జరిగిందన్న వార్త వస్తుందేమో అని ఆత్రంగా చూడటం మొదలెట్టాడు. అయితే అలాంటిదేవీ కనిపించలేదు. దాంతో తనన్నమాట నిజం కావడం లేదే అన్న దిగులుతో అలాగే మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.
——
 మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుండగా గిరీశం తిరిగొచ్చాడు. ఆ పాటికి వెంకటేశం యింకా అక్కడే ఉన్నాడు. అయితే  మొహం పధ్నాలుగు లంఖణాలు చేసినట్టున్నాడు. యింతలో గిరీశం రావడం చూసి ” గురూ గారు… క్షేమంగానే వెళ్ళారా?” అంటూ అడిగాడు. దాంతో  గిరీశం నవ్వేసి  ” ఆ భేషుగ్గా వెళ్ళి పని పూర్తి చేసుకొచ్చేశా…” అన్నాడు. వెంకటేశం అయితే బొత్తిగా డీలా పడ్డట్టుగా కనిపించాడు. దాంతో గిరీశం ” ఏలివాయ్‌ వెంకటేశం… నేను వెళ్ళిన రైల్లో దొంగతనం ఏదీ జరగలేదని బోల్డంత బెంగెట్టుకున్నట్టున్నావ్‌…” అన్నాడు. దాంతో వెంకటేశం యిబ్బందిగా తలూపి ”అయినా నేనింత దారుణంగా తయారయ్యేనేంటంటారు?” అన్నాడు. దాంతో గిరీశం ” ఆ.. యిది నీ  సొంతపైత్యం కాదులే. ఈ ఈగో అంతా  ఆ మమతా బాపతుది. ఆవిడేదో అటూయిటూగా నీలో దూరినట్టుంది” అన్నాడు. వెంకటేశం అర్థం కానట్టు చూశాడు. గిరీశం కొంచెం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ” మమతా బెనర్జీనే తీసుకో ఆవిడ మామూలు పొలిటిషియన్‌ కాదు. చాలా  ఈగోయిస్టిక్‌ పర్సనాలిటీ. తన మాటే నెగ్గాలనే పంతం ఎక్కువ. అలా నెగ్గకపోతే తట్టుకోలేదు. ఎంతకయినా తెగించేస్తుంది. మొదట్నుంచి యిది కనపడుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఏం జరిగిందో తెలుసా? దసరాల్లో అమ్మవారి ఉత్సవాలు ఎంత బాగా జరుగుతాయో తెలుసుకదా. అందులోనూ బెంగాల్‌లో. అలాంటిది మొహర్రం, నిమజ్జనం ఒకే రోజు రావడం వలన  శాంతి భద్రతల దృష్ట్యా ఆ రోజు అమ్మవారి నిమజ్జనం కార్యక్రమం చేయడం కుదరదనీ, అదింకో రోజుకీ మార్చుకోవాలనీ ప్రకటించింది. యిదేదో ఖచ్చితంగా భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడమే. దాంతో హైకోర్టు ‘ రెండు పండుగలూ  ఒకే రోజు వచ్చినా రెండు జరపడానికి ఏర్పాట్లు చేయవలసిందే. ముంబయిలో, హైదరాబాద్‌లో జరపట్లేదా? అని గట్టిగానే మొట్టికాయలేసింది. యిదేదో మమతా ఈగోని  గట్టిగానే దెబ్బతీసింది. ‘ అలా అయితే జరిగే పరిణామాలకీ నా బాధ్యత లేదు. ఏం జరిగినా హైకోర్టే బాధ్యత వహించాలి’ అని హైకోర్టునే బాధ్యుల్ని చేసేసింది. ఆవిడ ఈగోకి యిది పరాకాష్ట. ఏతావాతా చెప్పేదేంటంటే… ఒక వ్యక్తిలో ఉండే  ఈగో తన వ్యక్తిత్వానికీ, తన జీవితానికీ మాత్రమే చేటు చేస్తుంది. అలాగే పార్టీలో  కీలక స్థాయిలోని ఉన్న వారి ఈగో కొంత మేర పార్టీకి నష్టం కలిగిస్తుంది. కానీ ప్రజల్ని పాలించే అత్యంత బాధ్యతాయుతమయిన పదవిలో  ఉన్న వ్యక్తిలో ఈగో వ్యవస్థ మొత్తాన్ని యిబ్బందుల్లోకి నెడుతుంది” అంటూ వివరించాడు.
డా. కర్రి రామారెడ్డి