కొట్లన్నీ కట్టేయ్యండి !

 వెంకటేశం కాస్తా వ్యవసాయంలోకి దిగిపోయాడు…!
‘యిదేంటీ…యింత చదువూ చదివింది యిందుకా…’ అని అంతా అనుకున్నారు. అయితే వెంకటేశం యిలా అర్జంటుగా వ్యవసాయంలోకి  వచ్చేయ్యడానికో కారణముంది. ఓ పక్కన ఎంత చదువున్నా ఉద్యోగాలవీ రావడం లేదు. యింకో పక్క రాజకీయాల్లోనూ అవకాశం కనపడ్డం లేదు. వీటిని నమ్ముకుని కూర్చుంటే ‘ ఆ కుర్రోడు బొత్తిగా పనీ పాటాలేకుండా తిరుగుతున్నాడు’ అని సంబంధాలు రావడం మానేశాయి. అందుకే ఎడాపెడా ఆలోచించి వెంకటేశం యిలాంటి నిర్ణయానికి వచ్చేశాడు. మొత్తానికీ యిదేదో బాగానే పనిచేసింది. తొందర్లోనే గంగలకుర్రుకే చెందిన వెంకటలక్ష్మీతో పెళ్ళయిపోయింది. అంతే కాదు. ఆనక పిల్లాపీచులతో యిళ్ళంతా కళకళలాడిపోయింది కూడా.
వెంకటేశం జీవితంలో యిలాంటి విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే సమయంలోనే మన వ్యవస్థలో కూడా పెనుమార్పులు వచ్చాయి. ఎవరో మేథావుల కృషితో  పై స్థాయిలో కదలిక వచ్చింది. అసలయితే పది రూపాయల్లో వస్తువు తయారవుతున్నప్పుడు దానిని వినియోగదారుడు వంద రూపాయలకి కొనే పరిస్థితి నడుస్తోంది. దానిక్కారణం మధ్యనే ఉండే దళారీల వ్యవహారమే. ఆ దళారీల వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంతో అందరూ కూడా తమకు కావలసిన వస్తువుల్ని నేరుగా అవి తయారయే చోటు నుంచే చౌకగా కొనుక్కునే సౌలభ్యం ఏర్పడింది. యింకేముంది…యింతకు మునుపు  వంద రూపాయలకి కొనే వస్తువేదో యిప్పుడు పది లేక యిరవై రూపాయలకే దొరికేస్తుంది. దాంతో అందరి  జీవితాలూ  మారిపోయాయి. యింతకు ముందుతో  పోలిస్తే అయ్యే ఖర్చేదో  అయిదో వంతయిపోయింది. యిదంతా నాణేనికి ఒక వైపు. అయితే నాణేనికి రెండో వైపు చూస్తే…
———
 వెంకటేశం అప్పుడే పొలం నుంచి యింటికొచ్చాడు. గుమ్మంలోనే వెంకటలక్ష్మీ యింత మొహంతో ఎదురయిపోయింది. ” ఏవండోయ్‌… మీరు రేపు ఊరెళ్ళాలి” అంది. దాంతో వెంకటేశం  గుండెల్లో రాయి పడిపోయింది. ” ఏవయిందే?” అన్నాడు. వెంకటలక్ష్మీ తీరిగ్గా ” ఓ రెండు చీపుర్లు కావాలండీ…యింట్లో ఉన్న చీపుర్లు పాడయిపోయాయి” అంది. దాంతో వెంకటేశం నీరసంగా ” అయితే అవి  తేవడానికి రంపచోడవరం పోవాలన్నమాట” అన్నాడు. వెంకటలక్ష్మీ తలూపి ” ఆ… చెప్పడం మరిచా… యింట్లో బెల్లం కూడా నిండుకుంది. అక్కడ్నుంచి అలా అనకాపల్లి వెళ్ళి ఓ రెండు కేజీల బెల్లం కూడా  పట్టుకొచ్చేయండి” అంది. వెంకటేశం నీరసంగా తలూపాడు.
మర్నాడు పొద్దున్నే వెంకటేశం బండి టేంక్‌ నిండా ఆయిల్‌ పోయించుకుని బయలుదేరాడు. అలా బయలుదేరడానికి ముందు వెంకటలక్ష్మీ ఓ పొట్లమేదో కట్టి తెచ్చిచ్చింది. చాలా దూరం వెడుతున్నారు కదా. ఆకలేస్తే దారిలో తినడానికి” అంది ప్రేమగా. దాంతో వెంకటేశం నిట్టూర్చి ” పప్పల పొట్లం అని అనేవారటలే. మా తాత చెప్పేవాడు. నా కది గుర్తొస్తోంది” అన్నాడు బయల్దేరుతూ. యిక అక్కడ్నుంచి వెంకటేశం యాత్ర … అదే…సామానులు కొనడానికి వెళ్ళే ప్రయాణం ప్రారంభమయింది. దాదాపు మూడు గంటలు ప్రయాణం చేసి ఎక్కడో వందకిలోమీటర్ల అవతల ఉన్న రంపచోడవరం వెళ్ళి ఓ రెండు చీపుర్లు కొన్నాడు. అయితే రేటు యింతకు ముందులా వంద కాకుండా పాతికే ఉంది. మొత్తానికి రెండు చీపుళ్ళ మీదా ఓ నూటయాభై ఆదా అవడం వెంకటేశంలో కొత్త శక్తిని నింపింది. తర్వాత అక్కడో చాయ్‌ లాగించి అక్కడ్నుంచి అనకాపల్లి బయల్దేరాడు. మొత్తానికి మధ్యాహ్నం అయిపోబోతుండగా  అనకాపల్లి చేరుకున్నాడు. మధ్యలో ఓ చోట ఆగి భోజనం అయిందనిపించాడు. అనకాపల్లిలో  ఓ రెండు కేజీల బెల్లం కొని ఓ నూట యాభై ఆదా అయిందనిపించుకున్నాడు. యిక అక్కడ్నుంచి ఉప్పాడ వచ్చేసి చౌకగా ఓ కేజీ ఉప్పు కొన్నాననిపించుకుని అక్కడ్నుంచి యింటికొచ్చేశాడు. మొత్తానికీ యింటికొచ్చాక లెక్క చూసుకుంటే పెట్రొలూ, యితరత్రా ఖర్చులూ అన్నీ కలిపి దాదాపు ఎనిమిదొందల దాకా తేలింది. దాంతో వెంకటేశం తల పట్టుకున్నాడు.
 నాలుగు రోజుల తర్వాత యింకో విశేషం జరిగింది. వెంకటలక్ష్మీ కంగారుగా పరిగెత్తుకొచ్చింది. ” ఏవండోయ్‌… బన్నూగాడికి వొంట్లో బాలేదు. తలనొప్పి, జ్వరం, రొంపా…యింట్లో టేబ్లెట్లు ఏవీలేవు. అర్జంటుగా వెళ్ళి తెచ్చేయ్యండి” అంది. దాంతో వెంకటేశం బొత్తిగా అయోమయంగా మొహం పెట్టి ” చింతపండో, బెల్లమో అంటే  బండి మీద వెళ్ళి తెచ్చేయొచ్చు. ఈ మందులయితే యిక్కడెక్కడా దొరికి చావవు కదే. అవి తయారు చేసే ఫ్యాక్టరీలు ఏ హిమాచలప్రదేశ్‌లోనో ఉంటాయి” అన్నాడు. దాంతో వెంకటలక్ష్మీ ” ఏం పిల్లాడి కంటేనా… ఓ విమానం ఏదో మాట్లాడేసుకుని వెళ్ళి తెచ్చేయ్యండి” అంది. దాంతో వెంకటేశం పెద్దగా అరిచి కింద పడిపోయాడు.
 ———
 వెంకటేశం ఒక్కడికే కాదు. ఊరందరికీ యిదే సమస్య. మధ్యలో వాణిజ్య వ్యవస్థలన్నీ రద్దయిపోవడంతో ఎవరికే వస్తువు కావలసినా  నేరుగా తయారీదారుల దగ్గరే కొనుక్కొవలసి వస్తోంది. యిక మధ్యలో ఎక్కడా దొరకడం లేదు. దాంతో ఊరంతా ఓ మీటింగ్‌ పెట్టుకుని ‘ ఎవరయినా దక్షిణం వైపు ఓ పనుండి వెడితే అటు వైపున దొరిఏ వస్తువులన్నీ ఊరందరికీ కావలసినవన్నీ తెచ్చేయ్యాలి. అలాగే మిగతా దిక్కులకి వెళ్ళేవాళ్ళు కూడా’ అని నిర్ణయించారు. యిదేదో అందరికీ బాగానే ఉందనిపించింది. అయితే యిదేదో అంతిదిగా వర్కవుట్‌ కాలేదు. అలా తేవడానికి ఎవరూ అంత ఆసక్తి చూపించడం లేదు.
 అప్పుడే వెంకటేశానికో మహత్తరమయిన ఆలోచనొచ్చింది. తనే పెట్టుబడి పెట్టేసి ఊళ్ళో కావలసిన వస్తువులేవో కొన్ని తెచ్చేసి యింట్లో పెట్టుకుని అమ్మడం మొదలెట్టాడు. వాటిని కొన్న  ఖర్చూ, తేవడానికయిన ఖర్చూ, యింకా వడ్డీ, లాభం వేసుకుని మరీ అమ్ముతున్నాడు. దాంతో అందరి సమస్య తీరిపోయింది. అయితే యిప్పుడు వెంకటేశం అమ్మే వస్తువుల రేట్లు ఒకప్పుడు అందరూ కొనే రేట్లలాగానే ఉన్నాయి.
——
 ” గురూ గారూ… యిలాంటి గమ్మత్తయిన కలొచ్చింది. అభివృద్ధిలో ఓ వందేళ్ళు ముందుకెళ్ళగలిగితే, ఆ అభివృద్ధి ఫలాలు అందుకోవడం విషయంలో రెండొందల ఏళ్ళు వెనక్కిపోయినట్టుంది” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం  ”అయితే ఆచార్యుల వారు మళ్ళీ నీ బుర్రలో దూరినట్టున్నారోయ్‌. అందుకే యిలాంటి కలొచ్చినట్టుంది. మరేంలేదోయ్‌… మొన్న సదరు ఆచార్యుల వారు ‘ దళారీ వ్యవస్థ వలనే సమాజం నాశనం అయిపోతోంది. తయారు చేసే వాళ్ళ నుంచి  నేరుగా వినియోగదారులు కొనుక్కునేలా ఉండాలి’ అని శెలవిచ్చారు.  ఆచార్యుల వారు చెప్పిందీ నిజమే. ఆయన చెప్పినట్టు చేస్తే యిప్పుడు ఖర్చు పెట్టే దాంట్లో అయిదో వంతుకే ఏవయినా కొనేసుకోవచ్చు. అయితే ఆయన దృష్టిలో  దళారీ వ్యవస్థ… అదే… డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లు, యింకా మార్కెటింగ్‌ మొత్తంగా తీసి అవతల పారెయ్యాల్సిందే. అంటే అన్ని పరిశ్రమల్లో ఉన్న లక్షల మందో, కోట్ల మందో రోడ్డున పడిపోవలసిందే. అందుకే యిప్పటికయినా పెద్దదారి. ఏవయినా మాట్లాడే ముందు కాస్త ఆలచిస్తే  బాగుంటుంది. వస్తువుల తయారీకయ్యే ఖర్చుకీ వినియోగదారుడికి చేరే దానికీ మధ్య అంతరం ఎక్కువగా ఉన్నట్టయితే వాటిపై ప్రభుత్వం ప్రైస్‌ కంట్రోల్‌ విధిస్తే సరిపోతుంది” అంటూ వివరించాడు.
 డా. కర్రి రామారెడ్డి