పోలవరమే పెద్ద ఆశ ఎన్నికల నాటికి సగం పనులైనా అయ్యే ఆవకాశమే లేదు (శనివారం నవీనమ్)

పోలవరమే పెద్ద ఆశ
ఎన్నికల నాటికి సగం పనులైనా అయ్యే ఆవకాశమే లేదు
(శనివారం నవీనమ్)

పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 25 శాతం పనులు పూర్తి అయ్యాయని ప్రాజెక్టు సిబ్బంది ఢల్లీ నుంచి వచ్చిన ఒక అధయాయన బృందానికి చెప్పారు. వాస్తవంగా 18 శాతం మాత్రమే పూర్తయినట్టుగా ఇరిగేషన్ ఇంజనీర్లు కూడా వున్న ఆటీమ్ గుర్తించింది

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేసి క్రెడిట్ మొత్తం తెలుగుదేశం ప్రభుత్వానికి ఆపాదించాలని ఆశ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక కారణాలతో పనులు వేగవంతంగా సాగడంలేదు. ప్రధానంగా ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం, కాలువలకు సంబంధించి భూసేకరణ, రైతులకు, ముంపు బాధితులకు వారు ఆశిస్తున్న స్థాయిలో పరిహారం ఇవ్వడం, ఆ స్థాయిలో వారిని ఒప్పించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి కేవలం నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నదిఒడ్డున వున్న దేవీపట్నం మండల పరిసర గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఇంతవరకు నోటీసులు కూడా రాలేదని వారు ఆటీముకి చెప్పారు. ఇలాగే తెలంగాణ నుంచి ఏపీలో కలసిన కుకునూరు తదితర ఏడు మండలాల్లో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. ఆ ప్రాంతంలో చాలావరకు రైతులకు, ముంపు ప్రజలకు పరిహారం చెల్లిస్తున్నారని తెలిసింది. ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదని, అయినా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ పెంటపాటి పుల్లారావు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసారు. ఈ పిటిషన్ మీద ఇంకా విచారణ కొనసాగుతునే వుంది.

రాక్‌ఫిల్ డ్యాం, ఈసీఆర్ డ్యాం, స్పిల్‌వే, స్పిల్ ఛానల్ రూపాలలో నాలుగు విభాగాలుగా మొత్తం 48 గేట్లతో 1128 మీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది. తాజాగా 58,319.06 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసారు. ఈ సవరణ నివేదికను 22-08-2017న ఢిల్లీలో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కేంద్ర జలసంఘానికి, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు నివేదిక రూపంలో సమర్పించారు. ప్రధాన పనికి 42,905.78 కోట్లు, ఎడమ కాలువకు 6362. 29కోట్లు, కుడి కాలువకు 4835.33కోట్లు, విద్యుత్ కేంద్రానికి 4205.66 కోట్లు, ఎడమ కాలువ భూసేకరణకు 1401.46 కోట్లు కావాలని కోరారు. గతంలో 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం 1610.45 కోట్లుగా అంచనా వేసారు. ఇప్పుడు అది తాజా అంచనాలతో 58 వేలకోట్లకు చేరింది. ఇప్పటివరకు ఇంచుమించు మట్టిని తవ్వే పని చాలావరకు పూర్తి కావచ్చింది. తరువాత కాంక్రీట్ నిర్మాణం చేపట్టాలి. పునాది నుంచి 57.90 మీల ఎత్తుకు నిర్మించాలి. అక్కడ 16మీ.లు+20మీ.లు గేట్లు ఏర్పాటు చేస్తారు.

డ్యాంనుంచి వచ్చే నీటిని కుడి ఎడమ కాలువల్లోకి తీసుకెళ్లేందుకు కొండలు అడ్డంగా వున్నందున సొరంగాల ద్వారా కాలువలు తవ్వుతున్నారు. ఎడమవైపు 918 మీటర్ల పొడవున ఒకటి, 890 మీల పొడవున మరొకటి రెండు సొరంగాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో దాదాపు పది లక్షల ఎకరాలకు పైగా సాగునీటి సౌకర్యం లభిస్తుంది. విశాఖ నగరానికి మరియు చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం కూడా లభిస్తుంది.
80 టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా నదిలోకి కలపడానికి అవకాశం ఏర్పడుతుంది. తద్వారా తరచు కరువుకు గురవుతున్న రాయలసీమకు, అక్కడ నిర్మాణంలో వున్న హంద్రీ నీవా, గాలేరు నగరి ఎత్తిపోతల పథకాలకు సాగునీటి సమస్య కూడా తీరుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అమల్లోకి రానుండడంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రైతులకు, పారిశ్రామిక వేత్తలకు విద్యుత్ కొరత తీరడమే కాక పక్కరాష్ట్రాలకు అమ్ముకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

కాగా దేవీపట్నం, రంపచోడవరం ఏజెన్సీలనందు గిరిజనులకు, గిరిజనేతరులకు భూవివాదాల సమస్య వున్నందున పరిహారం చెల్లింపునందు క్లిష్టతరమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వుంది. గిరిజనులకు నక్సల్స్ (మావోయిస్టులు) మద్దతు వున్నందున ఈ సమస్య మున్ముందు శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం వుంది. ఇటువంటి మరికొన్ని సమస్యలను ప్రభుత్వం తగిన చతురతతో, జాగ్రత్తతో మొగ్గలోనే తుంచివేసి, ఇప్పుడు ఏ విధమైన వేగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెడుతున్నారో ఇదే తరహాలో మున్ముందు కూడా వెడితే 2019 ఎన్నికల నాటికి 50 శాతం పనులు పూర్తయి తరువాత 2025 నాటికి ప్రాజెక్టు నిర్మాణ పనులు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉంది. కాటన్ మహాశయుడు గోదావరినది పై ధవిళేశ్వరం ఆనకట్ట, కృష్ణా నది పై ప్రకాశం ఆనకట్ట నిర్మించాక అనూహ్యంగా సర్కారు జిల్లాల అర్ధిక వికాసం సంభవించిన విధంగానే పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణప్రదేశ్’గా మారుతుంది.