వీధి బండి – పుల్లకూర

మనస్సాక్షి  – 1059
ఎంపి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందంటారు. ఆ మాటేమోగానీ ప్రస్తుతం మాత్రం వెంకన్న పెళ్ళి అటు సుబ్బన్న చావుకీ, యిటు మస్తాన్‌ చావుకీ వచ్చి పడింది. వెంకన్న అంటే  ఎవరో అనుకునేరు.. అచ్చంగా మన వెంకటేశమే. యింతకీ ఈ పెళ్ళి చావుల గోలేదో తెలుసు కోవాలంటే ఓసారి వెంకటేశం వైవాహిక జీవితం లోకి తొంగి చూడాల్సిందే. అసలయితే వెంక టేశానికి చిన్నప్పట్నుంచీ  జిహ్వ చాపల్యం ఎక్కువే. చిన్నప్పుడయితే వాళ్ళ బామ్మ రక రకాల వంటలు వండిపెడు తుంటే బాగా తినే వాడు. ఆ రుచులంత బ్రహ్మాండంగా ఉండేవి. తర్వాత్తర్వాత ఆ బామ్మ గుటుక్కు మనడం జరిగింది. ఆ తర్వాత అంతస్థాయిలో రుచికరంగా వండి పెట్టిన వారే లేరు. దాంతో వెంకటేశానికి కూడా ఆ జిహ్వ చాపల్య మేదో అలాగే ఉండిపో యింది. అందుకే పెళ్ళి సంబంధాల టైమ్‌లో పెళ్ళి కూతురు ఎలా ఉన్నా ఫర్లేదు. వంట బాగా వచ్చుండాలి అని షరతు పెట్టాడు. దాంతో సంబంధాలు రావడం కరువైపోయింది. ఎప్పటికో ఓ సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి బాపతు మేనమామ వెంకటేశం దగ్గరకొచ్చాడు. వెంకటేశమయితే హుషారుగా ”అమ్మా యికి వంట బాగా వచ్చా?” అని అడిగాడు. దానికి ఆ వచ్చిన గోవిందం ”అబ్బో… బ్రహ్మాండంగా చేస్తుంది. పాలు బాగా మరగ బెడుతుంది. యింకా పప్పు బాగా ఉడకబెట్టగలదు. మిగతా వంట లంటావా… అన్నీ ఒక్కోటీ నేర్చేసుకుంటుంది” అన్నాడు. దాంతో వెంకటేశానికి నీరసం వచ్చే సింది. ”అయితే వంటరాదన్నమాట” అన్నాడు. దానికి గోవిందం ”యిదిగో అబ్బాయ్‌.. ఉద్యోగం సద్యోగంలేని నువ్వు యిన్ని  డిమాండ్లు ఎలా చేస్తున్నావంట? అసలా మాటకొస్తే నీ సంబం ధమే మాకు యిష్టం లేదు” అంటూ చెప్పేసి చక్కాపోయాడు. యిదొక్కటే కాదు. తర్వాతొచ్చిన సంబంధాలన్నీ యిలాగే తగలడ్డాయి. దాంతో వెంకటేశం కొంచెంగా బెంగపెట్టుకున్నాడు కూడా. అలాంటి పరిస్థితిలో మంగతాయారు సంబంధం వచ్చింది. మంగతాయారు పెద్దగా చదువుకున్నదేం కాదు. అయితే వంట బ్రహ్మాండంగా చేస్తుందని బంధువర్గంలో పేరుంది. సమస్యేంటంటే మంగతాయారు ఎంత బాగా అయినా వంట చేస్తుంది గానీ తన వంటలని ఎవరయినా విమర్శించారంటే అస్సలు ఊరుకోదు. అలాంటి మంగతా యారుతో వెంకటేశం పెళ్ళి  ఝాం ఝమ్మని జరిగిపోయింది. అంతేనా… వెంకటేశమే స్వయంగా వేరు కాపురం పెట్టించేశాడు. అలా వేరుగా ఉంటేనే ఎంచక్కా తనక్కావలసిన  వంటలన్నీ మంగతాయారు చేత వండిచ్చు కోవచ్చని వెంకటేశం ఆశ. ఆ రకంగా వెంకటేశం జీవి తంలో కొత్త అధ్యాయం మొదలయింది…
అఅఅఅ
”డార్లింగ్‌.. నాకు బజ్జీలంటే చచ్చేంత యిష్టం. నీకు అవేవయినా చేయడం వచ్చా?” అనడిగాడు వెంకటేశం. ఆపాటికి వంటింట్లో కూరగాయలు తరుగుతున్న మంగతాయారు తలూపి ”వచ్చండీ.. ఏ బజ్జీ చేయమంటారు? అరటికాయ బజ్జీయా.. మిరపకాయ బజ్జీయా.. కాలీఫ్లవర్‌ బజ్జీయా…” అంది. దాంతో వెంకటేశం అదిరి పోయి ”అమ్మో.. అన్నీ తినలేనేయో… అన్నీ కొంచెం కొంచెంగా చేయి” అన్నాడు. మొత్తానికి సాయంత్రం నాలుగ్గంట లకి ఆ బజ్జీ లన్నీ చేసి పెట్టేసింది. వెంకటేశం అయితే వాటిని లొట్టలేసు కుంటూ లాగించేశాడు. తర్వాత ”డార్లింగ్‌.. కొంచెం యిరానీ టీ కూడా చేసిపెట్టు” అన్నాడు. అసలా యిరానీ టీ అనేది  ఎలా చేయాలో యూ ట్యూబ్‌లో చూసి నేర్చుకుని మరీ తయారు చేసిచ్చింది. దాంతో వెంకటేశం యింకా ఆనంద పడ్డాడు. మర్నాడు సాయంత్రం మంగతాయరు మళ్ళీ బజ్జీలన్నీ చేసిపెట్టింది. అవి తిన్నా తర్వాత వెంకటేశాన్ని ఎలా ఉన్నాయని అడిగింది. వెంకటేశం అయితే ”బాగానే ఉన్నాయిలే” అన్నాడు. అయితే ఆ మాటల్లో ముందు రోజంత ఊపులేదు. తన భర్తకి బోల్డంత యిష్టమని ఆ బజ్జీలేవో మూడోరోజూ, నాలుగోరోజు కూడా మంగతాయారు చేసి పెట్టింది. వెంకటేశం వాటిని అలా అలా తిన్నావనిపించింది. యిక అయిదో రోజుకొచ్చేసరికి సరిగ్గా తినడం కూడా చేయకుండా అటూ యిటూ కెలికాడు. బావుందనేవీ అనలేదు. యిరానీ చాయ్‌ విషయమూ అంతే. యిదేదో మంగతాయారుకి చాలా బాధయి పోయింది. యింకా బోల్డంత కోపం కూడా వచ్చేసింది. దాంతో యిద్దరి మధ్యా చిన్నపాటి కోల్డ్‌వార్‌లాంటిది మొదలయింది. సరిగ్గా ఆ సమయంలో గిరీశం దిగాడు. గిరీశాన్నయితే యిద్దరూ సాదరంగా ఆహ్వా నించారు. అయితే యింట్లో వాతావర ణంలో ఏదో తేడా ఉన్నట్టుగా గిరీశానికి అన్పించింది. కొంచెంసేపు మాటలయ్యాక  మంగతాయారు లోపలకెళ్ళి బజ్జీలు తెచ్చిపెట్టింది. గిరీశం వాటిని తినేసేక టీ కూడా యిచ్చింది. అప్పుడు ”అన్నయ్య గారూ… బజ్జీలూ, టీ ఎలా ఉన్నాయి?” అని అడిగింది. గిరీశం తలూపి ”బావున్నా యమ్మా… నువ్వే చేశావా?” అన్నాడు. మంగతాయారు తలూపింది.  అయితే అప్పుడో విశేషం జరిగింది. వెంకటేశం గబగబా బయటకెళ్ళిపోయి, వీధి చివరున్న సుబ్బన్న బడ్డీ కొట్టు నుంచి బజ్జీలూ, ఆ పక్కనున్న మస్తాన్‌ టీ కొట్టు నుంచి యిరానీ చాయ్‌ పట్టుకొచ్చాడు. వాటిని కూడా గిరీశానికి పెట్టేశాడు. గిరీశానికయితే యిలా ఎందుకనేది అర్థం కాలేదు గానీ వాటినీ లాగించేశాడు. అప్పుడు వెంకటేశం ”ఎలా ఉన్నాయి గురూగారూ?” అనడిగాడు. దాంతో గిరీశం కళ్ళు పరవశంగా మూసి ”అబ్బబ్బ… బ్రహ్మాండం అనుకో. అసలిలాంటి బజ్జీలు ఎప్పుడూ తినలేదు. బజ్జీలంటే యిలా ఉండాలి. యింక యిరానీ టీ అంటావా… అబ్బబ్బ… అమృతం నోట్లో పోసు కున్నట్టుంది” అన్నాడు. దాంతో ఒక్కసారిగా మంగతాయారు మొహం మాడిపోయింది. అప్పుడు వెంకటేశం ”చూశారా గురూ గారూ.. నేనిలా అంటున్నాననే  ఆవిడకి నచ్చడం లేదు” అన్నాడు. హఠాత్తుగా  మంగతాయారు కాస్తా సర్రుమని  పైకి లేచి పోయింది. కోపంగా ”సంగతేదో తేల్చి పారేస్తా” అంటూ బయటికి పోయింది. దాంతో గిరీశం కంగారుపడిపోయి ”ఏవివాయ్‌ వెంకటేశం… మీ ఆవిడ మన సంగతి తేలుస్తానంటుంది. కొంప దీసి నీతోపాటు నన్నూ ఉతికి ఆరేస్తుందంటావా?” అన్నాడు. వెంక టేశం తల అడ్డంగా ఊపి ”ఏమో.. నాకేం తెలుసూ?” అన్నాడు. అయితే మంగతాయారు ఎవరి సంగతి చూసిందన్నది ఆ మర్నాటికి బయటపడింది. మర్నాడు అన్ని పేపర్లలో ఓ వార్త ప్రముఖంగా వచ్చింది. అగ్రహారం వీధిలో ఉన్న సుబ్బన్న బజ్జీల కొట్టు మీరా, మస్తాన్‌ టీకొట్టు మీదా అధికారులు దాడి చేశారనీ, సుబ్బన్న తన కొట్లో అమ్మే బజ్జీల తయారీకి కుళ్ళిన మాంసం నుంచి తయారు చేసిన నూనె వాడుతున్నాడనీ, యిక మస్తాన్‌ తన కొట్లో తయారు చేసే టీ తయారుకి ఒకసారి వాడి పడేసిన టీ పౌడరుకి రంగు కలిపి, సువాసన కలిపే లూజు టీ పొడి వాడు తున్నాడన్నది ఆ వార్త..!
అఅఅఅ
”అది గురూగారూ… నాకొచ్చిన కల. ఈ లెక్కన ఆడంగులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం నవ్వేసి ”ఆ… మరివాళ్ళ ఈగో దెబ్బ తింటే ఊరుకుంటారటోయ్‌… అందుకే ఆ మంగతాయారు కాస్తా పోయి అసలా రుచులు అంత గొప్పగా ఎలా ఉన్నాయా అని ఈకలు పీకి వాళ్ళని పట్టించేసింది. అయితే యిక్కడ మనం నేర్చుకోవలసిన  విషయం ఏంటంటే… యిలా బయట తినే చిల్లర తిళ్ళ విష యంలో మనం తింటోంది విషమే అన్నది బయటపడింది. నూనెల విషయంలో ఓసారి వాడి తినేసిన నూనె మళ్ళీ వాడకూడదని ఆదేశాలున్నాయి. అందుకే స్టార్‌ హోటల్స్‌లో ఓసారి వాడి తినేసిన నూనెల్ని చవగ్గా అమ్మేస్తారు. వాటినే యింకా రక రకాల జంతువులు మాంసాల నుంచి తయారుచేసిన నూనెల్నీ  ఈ చిన్న కొట్ల వాళ్ళు వాడుతున్నారని బయటపడింది. మరందుకే ఆ బజ్జీలకే అంత టేస్ట్‌..! యిక టీ పౌడరు విషయంలోనూ  మొన్నో టీ పౌడరమ్మే మార్వాడీ మీద దాడి చేస్తే షాకింగ్‌ న్యూస్‌ బయటపడింది.  వాడి పడేసిన టీ పౌడరుని కొని, దానికి చెక్క పౌడరులాంటిది కలిపి, ఆపైన రంగు, రుచుల కోసం  రకరకాల రంగులవీ కలిపి  అమ్ముతాననీ, ఈ టీ కొట్ల  వాళ్ళంతా ఎప్ప ట్నుంచీ అది కొంటున్నారన్నది అతగాడు  చెప్పింది.  ఏతావాతా చెప్పేదేంటంటే… యింత ప్రమాదకరస్థాయిలో అమ్ముతున్న బయట తిళ్ళ జోలికి పోకుండా రుచి అటూ యిటూ  అయినా యింట్లో తిండే నయమని” అంటూ తేల్చాడు.
– డా. కర్రి రామారెడ్డి