అప్ డేట్ అయితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు! (శనివారం నవీనమ్)

అప్ డేట్ అయితేనే కాంగ్రెస్ కు భవిష్యత్తు!
(శనివారం నవీనమ్)

సామాన్య ప్రజానీకంలో పెరుగుతున్న చైతన్యాల కంటే రాజకీయ పార్టీల వైఖరులు వెనుకబడి పోతున్నట్టు వున్నాయి. ఇందులో అప్ డేట్ అయిన పార్టీలే ముందుంటాయి. మతతత్వ వ్యతిరేక సెక్యులరిజం పార్టీ లైన్ గా కాంగ్రెస్ చాలాకాలం బిజెపిని నిలువరించింది. అయితే అధ్వానీ రథ యాత్ర, వాజ్ పాయ్ రాజకీయ ఉదారత్వ స్వభావం కలసి కాంగ్రెస్ సెక్యులరిజం లైన్ ను నిర్వీర్యం చేశాయి.

బిజెపి హిందుత్వ లైన్ మారక పోయినప్పటికీ, నరేంద్ర మోదీ ‘అభివృద్ధి’ నినాదం బిజెపి ముఖ చిత్రంగా మారిపోయింది. పెద్దనోట్ల రద్దు, జి ఎస్ టి అమలు వంటి ప్రయోగాల్లో వైఫల్యాలు బిజెపి ‘ఫేస్’ లో ఆకర్షణను కళా కాంతులను తొలగిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో మోదీ ముఖాన్ని పక్కన పెట్టి, యోగీ ఆదిత్యనాధ్ దాస్ వంటి హిందుత్వ ఫేస్ లు ముందుకు వచ్చినా ఆశ్చర్యం వుండదు. బిజెపి లో నరేంద్ర మోదీకి మించిన క్రౌడ్ పుల్లర్ లేకపోయినా కూడా అవసరమైతే ఆయన ఫేస్ మార్చేయగల ‘పరివారం’ బిజెపికి వుంది.

మోదీ చేతిలో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ ఇప్పటికీ నాయకత్వం సంక్షోభం నుంచి బయట పడనే లేదు. సోనియా స్ధానంలో పార్టీ సారధ్య బాధ్యతలు స్వీకరించడానికి రాహుల్ గాంధీ ఇపుడిపుడే సిద్ధమవుతున్నారు. ఆయన పార్టీ అధ్యక్షుడు కావడం, సొంత టీమ్ ని రూపొందించుకోవడం ఒక ఎత్తయితే, పార్టీ లైన్ నిర్ధారించుకుని ఆంతర్గత ఆమోదం సాధింకుకోవడం మరో ఎత్తు. వీటన్నిటికీ వ్యవధి తక్కువగా వుంది. అయితే ఆర్థిక వృద్ధి రేటు ఆందోళనకరంగా వుండడం, జిఎస్టీ అమలు పలు చిక్కులకు దారి తీస్తూ వుండడం, ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన లేకపోవడం, బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి ఆరోపణల్లో వుండటమే వినియోగించుకోగలిగితే కాంగ్రెస్ కు పెద్ద అవకాశం.

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో నాలుగేళ్ల తరువాత కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఘన విజయం సాధించడం, బిజెపికి బలమైన ప్రాంతంగా భావించే గురుదాస్‌పూర్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి 2 లక్షల ఆధిక్యతతో గెలుపొందడం కాంగ్రెస్‌కు పెద్ద ఆశలు కలిగిస్తున్నాయి.

రాహుల్ గాంధీ సారధ్యంలో కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నకలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మరో ఎనిమిది రాష్ట్రాల ఎన్నికలు రాబోతున్నాయి. అన్ని చోట్లా నేరుగా బిజెపికి కాంగ్రెస్‌తో తలపడవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. గుజరాత్‌లో 20 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదు. అక్కడ 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా సాధించిన అభివృద్ధిని దేశ ప్రజలకు చూపి, గుజరాత్ మోడల్ పేరుతో నరేంద్రమోదీ ప్రధాని కాగలిగారు. అలాంటి గుజరాత్ లో బి జె పి ని ఓడిస్తే కాంగ్రెస్ కు పూర్వ వైభవం అసాధ్యం కాదు.

బలహీన వర్గాల రక్షణ నినాదం చాలాకాలం పాటు కాంగ్రెస్ కు మరోపేరుగా వుండిపోయింది.
పేదరికం నిర్మూలన నినాదం ఇందిరాగాంధీని జాతీయ నాయకురాలిగా నిలబెట్టింది. అధ్వానీ రధయాత్ర బిజెపిని అధికారంలో కూర్చోబెట్టింది. ప్రజలను నేరుగా స్పృశించే నినాదాలు రూపొందించే సృజనాత్మకత, కమ్యూనికేషన్ టెక్నాలజీలను శక్తివంతంగా వినియోగించుకునే సామర్ధ్యం నరేంద్ర మోదీని బిజెపి తో సరిసమానంగా నిలబెట్టాయి. ఇలాగే, కాల మాన స్ధితిగతులకు అనుగుణంగా అప్ డేట్ కాగలిగితే దేశరాజకీయాల్లో కాంగ్రెస్ ప్రత్యామ్నాయ శక్తిగా మారవచ్చు!

ప్రజల చైతన్యానంతో మ్యాచ్ అయ్యే పార్టీ లైన్ / వైఖరులను ఖరారు చేసుకుని, ప్రజల్లోకి చేరుకోడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోగలిగితే కాంగ్రస్ తిరిగి అధికారంలోకి రావడం అసాధ్యం కాదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇది జరుగుతుందా అన్నదే అసలు ప్రశ్న!