ఇంద్రజాలకుల్ని మరిపిస్తున్న చంద్రబాబు పాలన

21

మీ మోసాలు ఇంకెన్నో రోజులు సాగవు : మాజీ ఎమ్మెల్యే రౌతు ధ్వజం

రాజమహేంద్రవరం, జనవరి 12 : ”ఉన్నది లేనట్టు…లేనిది ఉన్నట్టు” తమ కనికట్టుతో చూపించగలిగే ఇంద్రజాలకుల్ని సైతం మరిపించేలా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు వ్యంగ్యంగా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, సంక్షేమం అంతా అంకెల్లోనూ, చంద్రబాబు మాటల్లోనే తప్ప ఆచరణలో లేదని చెబుతూ గతంలో ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలకుడు పీసీ సర్కార్‌ సైతం చంద్రబాబు తనను మించిన గొప్ప ఇంద్రజాలకుడని వ్యాఖ్యానించారని రౌతు ఈ సందర్భంగా ప్రస్తావించారు. పది రోజుల పాటు సాగిన జన్మభూమి ఓ తంతుగా ముగిసిందని, గత జన్మభూమిలో వచ్చిన ఆర్జీలే ఇంతవరకు పరిష్కారం కాకపోగా తిరిగి జన్మభూమి నిర్వహించడం ఓ ఫార్సు కాకపోతే మరేమీటని ఆయన అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రౌతు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారని సీఎం చెబుతున్నారని, మరో వైపు జన్మభూమిలో 31 లక్షల ఆర్జీలు వచ్చాయని కూడా ముఖ్యమంత్రే చెబుతున్నారని, 80 శాతం మంది సంతృప్తిగా, సంతోషంగా ఉంటే ఇన్ని ఆర్జీలు ఎందుకొస్తాయని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 600 వాగ్ధానాలు చేసి ఒక్కటీ సక్రమంగా అమలు చేయకపోగా తిరిగి అధికారం కోసం కొత్త వాగ్ధానాలు చేస్తున్నారని అన్నారు. గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రజాపథం కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు రోజుకు రెండు డివిజన్లలో ప్రజా సమస్యలను సావధానంగా ఆలకించి అన్నింటిని పరిష్కరించేవారని, అయితే ఇపుడు నాలుగు గంటల్లో ఎనిమిది డివిజన్లలో జన్మభూమి గ్రామసభలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఊకదంపుడు ప్రసంగాలు చేయడమే గాని ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన అన్నారు. ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించకపోగా ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామసభల్లో పాల్గొనివ్వకుండా వారిని గృహ నిర్బంధంలో ఉంచడం చూస్తే ఇక ఈ కార్యక్రమం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కొన్ని గ్రామాల్లో ప్రజలు గతంలో సమస్యలనే పరిష్కరించనందున ఈ పర్యాయం తమ గ్రామానికి రావొద్దుంటూ బ్యానర్లు కట్టి అడ్డుకున్న ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చినపుడు జన్మభూమి విజయవంతంగా సాగిందని ఎలా చెబుతున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో ప్రవేశపెట్టిన అనేక జనరంజక పథకాలను నీరుగార్చిన చంద్రబాబు తాను వస్తే జాబ్‌ గ్యారంటీ అని చెప్పి ఎవరికీ ఉద్యోగాలివ్వలేదని, ఇంతవరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని రౌతు అన్నారు. పాలనలో చంద్రబాబు అనుభవజ్ఞుడైనా రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. తెలుగుదేశం పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాలకు భగవంతుడిని కూడా వదలడం లేదని, విజయవాడ దుర్గ గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించడం ఇందుకు నిదర్శనమన్నారు. పోలవరం, రాజధాని అమరావతి అంటూ నిత్యం ప్రజలకు గ్రాఫిక్స్‌ చూపించడమే గాని పనులు జరగడం లేదని, చంద్రబాబు మోసాలు ఎన్నో రోజులు కొనసాగవని, ఆయన పాలనకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైందని రౌతు అన్నారు. విలేకరుల సమావేశంలో ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిళారెడ్డి, కార్పొరేటర్‌ మజ్జి నూకరత్నం, పార్టీ నాయకులు లంక సత్యనారాయణ, కానుబోయిన సాగర్‌, మాసా రాంజోగ్‌, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్‌, మురుకుర్తి నరేష్‌కుమార్‌, ఉప్పాడ కోటరెడ్డి, ఆరీఫ్‌, సాలా సావిత్రి పాల్గొన్నారు.