అన్యాయం…అవమానం చట్టంపై పట్టింపు లేని ప్రధాని! (శనివారం నవీనమ్)

29

అన్యాయం…అవమానం
చట్టంపై పట్టింపు లేని ప్రధాని!
(శనివారం నవీనమ్)

అత్యున్నత చట్టసభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అధికార, ప్రతిపక్షాలు, ప్రజాహితసంస్ధలు, ప్రజలూ మొరపెడుతున్నా పట్టించుకోని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చట్టం పట్ల దేశానికి ఏ సందేశం ఇస్తున్నారు? ఏ సంకేతం ఇస్తున్నారు?
చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వమే నిరాకరిస్తున్న స్ధితిని ప్రపంచం ఎలా అర్ధం చేసుకుంటుంది?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంజయ్యను ప్రధాని రాజీవ్ అవమానించారని గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ తనకూ, కింద నలుపు ఎరగని గరివింద గింజకూ తేడాలేదని మరచిపోయారు. కాంగ్రెస్ ను దుమ్మెత్తిపోయడానికి పాతగాయాన్ని ఎత్తిచూపిన మోదీ, 16 నెలలు వేచివున్నాక కాని చంద్రబాబు కి అపాయింట్ మెంటు ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్ ను అవమానించడమని అనుకోవడం లేదా? అడిగేవారు ఎవరూ లేరన్న అహంకారం కాకపోతే తాను చేసిన తప్పుని దాటవేసి ఎదుటి వాళ్ళకు బురదపూయడానికి తెగించగలరా?

పార్లమెంటు ఉభయ సభల్లోనూ మోదీ ప్రసంగం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రత్యేక హోదా విస్మరించడంతో పాటు, బడ్జెట్‌ కేటాయింపుల్లో మొండి చేయి చూపిన తీరుపై రాష్ట్రం రగులుతున్న సమయంలో మోదీ ప్రసంగం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల పట్ల, వారి ఆకాంక్షల పట్ల ఆయనకు, ఆయన నాయకత్వం వహిస్తున్న బిజెపికి ఉన్న తేలిక భావానికి అద్దం పట్టింది.

వైసిపితో పాటు, బిజెపి మిత్రపక్షమైన టిడిపి ఎంపీలూ పార్లమెంటు ఉభయసభల్లో నిరసన తెలుపినా ప్రధాని కళ్ళూ చెవులూ లేనట్టు వ్యవహరించిన తీరు దుర్మార్గం! ఆంధ్రప్రదేశ్‌కు బిజెపి చేసిన దగాపై అటు పార్లమెంటులోనూ, ఇటు బయట తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. వామపక్షాలు గురువారం తలపెట్టిన బంద్‌కు విస్తృత స్పందన లభించింది.

ఈ నేపథ్యంలో ప్రధాని ఎంతో కొంత ఊరట ఇస్తారని భావించిన వారిని, ఆయన ప్రసంగంలో వెక్కిరించారు. రాష్ట్ర ప్రజానీకం ఏక కంఠంతో ఏదైతే కోరుతోందో వాటిని తప్ప ఆయన అన్ని విషయాలనూ ప్రస్తావించారు. అసలు సమస్యలను మాత్రం గాలికి వదిలేసి అపహాస్యం చేశారు. మోదీ ప్రసంగం ప్రధాని స్థాయికి తగినట్టులేదు! ఆ పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించింది!

నరేంద్రమోడీ లోక్‌సభలో మాట్లాడుతూ తెలుగుప్రజలకు గతంలో ఎదురైన అవమానాలను ఏకరవు పెట్టారు. ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్నప్పుడు చోటు చేసుకున్న సంఘటనల నుండి అనేక అంశాలను వివరించారు. లోక్‌సభ తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేసి పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించుకున్న తీరునూ ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అంత ఘోరంగా వ్యవహరించింది కాబట్టే రాష్ట్రంలో ఆ పార్టీని ప్రజలు పాతిపెట్టారు.

సమైక్య రాష్ట్రాన్ని హడావిడిగా, అడ్డగోలుగా విభజించి, ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన పాపంలో బిజెపికీ భాగస్వామ్యం ఉంది. ఈ విషయాన్ని ఆయన విస్మరించినా ప్రజలు మరిచిపోలేరు.

అవమానాల విషయానికి వస్తే అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కూడా కాంగ్రెస్‌కు ఏమాత్రమూ తీసిపోలేదు. ప్రధానమంత్రి అప్పాయింట్‌మెంట్‌ కోసం సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి గతంలో ఎన్నడూ లేదు. రాజధాని శంకుస్థాపనకు వచ్చి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లతో సరిపెట్టడం ప్రజానీకాన్ని అవమానపరచడం కాక మరేమౌతుందో ఆయనే సెలవియ్యాలి!

పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోసం, ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా నామమాత్రంగా కూడా పట్టించుకోక పోవడమూ రాష్ట్ర ప్రజానీకాన్ని గౌరవించడమేనా? రాజ్యసభలోనూ ఆయన ప్రసంగం ఇదే మాదిరి సాగింది. బ్యాంకుల్లో పేరుకు పోయిన నిరర్ధక ఆస్తుల నుండి, నల్లధనం వెలికి రాకపోవడంతో దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలకూ కాంగ్రెస్‌ పార్టీయే కారణమన్నట్లు అధికారం చేపట్టిన నాలుగేళ్ల తరువాత ఆయన మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది.

ప్రధానిగా మోడీ ప్రసంగిస్తున్న సమయంలో లోక్‌సభలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం కావడం తరిగిపోతున్న ఆయన ప్రాభవానికి నిదర్శనం. వైసిపి, టిడిపిలు ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటులో ఆకుకు అందకుండా పోకకు పొందకుండా వ్యవహరిస్తున్నాయి. తెలుగుదేశం ఎంపిలైతే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకుండా వ్యూహ్యాత్మక విన్యాసాలకు పాల్పడుతున్నారు. ప్రధాని ప్రసంగ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు మౌనం పాటించినా వామపక్షాలు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై గళమెత్తాయి. కాంగ్రెస్‌ వారిని అనుసరిచింది. నిరసనలు లేకుండా ప్రసంగం సాగించాలన్న బిజెపి వ్యూహం విఫలమైంది.

నాలుగేళ్ల కాలంలో ఎన్నడూ లేని పరిస్థితిని మోదీ ఎదుర్కోవాల్సివచ్చింది. నిరసనల మధ్యే ఉపన్యాసాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ప్రధాని ప్రసంగంలో రాష్ట్రానికి మొండి చేయి చూపడంతో ఆందోళనల పర్వం కొనసాగనుందని తేలిపోయింది. అబద్దాల ప్రచారంతో ఎల్లకాలం మోసం సాగదని మోదీ గ్రహించాలి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటికీ ఆచరణ రూపమివ్వాలి. లేకపోతే కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే బిజెపికీ తప్పదు.