“మిత్రుల” కపటనీతి – ప్రజావంచనలో దొందూ దొందే! (శనివారం నవీనమ్)

37

“మిత్రుల” కపటనీతి –
ప్రజావంచనలో దొందూ దొందే!
(శనివారం నవీనమ్)

పరస్పర ప్రశంసల మిత్రధర్మం పాటించిన బిజెపి, టిడిపి నేతలు ఇప్పుడు పరస్పర ఆరోపణలతో దుమ్మెతిపోసుకుంటున్న తీరు చికాకుగా వుంది. పరస్పర విమర్శలతో ఆ రెండు పార్టీల బండారం బట్టబయలౌతోంది. ఇన్నాళ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కనపడని అవినీతి, ఆశ్రితపక్షపాతం వంటి అంశాలు మైత్రీబంధం తెగగానే బిజెపి నాయకులకు కనపడటం వారి కపటత్వానికి నిదర్శనం. (సోమువీర్రాజుకి మినహా) ఆపార్టీకి ఇంతవరకూ కనబడని అవినీతి తెగతెంపులైపోగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ముందు ప్రత్యక్షమైపోయింది.

కేంద్ర ప్రభుత్వం చివరిబడ్జెట్‌లోకూడా రాష్ట్రానికి మొండి చేయి చూపడం, ప్రజలలో ప్రత్యేకహోదా సెంటిమెంటు ఉవ్వెత్తున రగలడంతో ఎన్‌డిఎ నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు రావడం తెలుగుదేశం పార్టీకి తప్పనిసరైంది . కొద్దిరోజుల కిందటి వరకు ప్రత్యేక ప్యాకేజికి చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని నినదిస్తున్నారంటే ప్రజల్లో నెలకొన్న ఆసంతృప్తి, వ్యక్తమవుతున్న ఆగ్రహమే కారణం. చంద్రబాబు మాటల్లో కూడా ఈ విషయం స్పష్టమౌతోంది. టిడిపి నిర్ణయంతో ప్రారంభమైన విమర్శల పర్వం చంద్రబాబునాయుడికి బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖతో మరో మలుపు తిరిగింది. కొత్త ప్రశ్నలను తెరమీదకు తీసుకువచ్చింది.

తొమ్మిది పేజీల సుదీర్ఘలేఖలో అమిత్‌ షా అనేక అంశాలను ప్రస్తావించారు. ఇప్పటికే విడుదల చేశామంటూ బిజెపి నాయకులు పదేపదే చెప్పిన నిధుల వివరాలను ఏకరువు పెట్టారు. పనిలో పనిగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అవినీతిని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. అన్నీ సక్రమంగా ఉంటే నిధుల వినియోగ ధృవీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్పించారు.

నిజానికి ఇవేమీ కొత్తవి కావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చాలాకాలంగా ఆరోపిస్తున్నవే. అయితే, బిజెపి నేతలు, అందులోనూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రస్తావించడంతో వాటికి ప్రాధాన్యత వచ్చింది. ఇంత జరుగుతున్నా బిజెపి నేతలు ఇన్నాళ్లు పెదవి ఎందుకు విప్పలేదన్నది ఇక్కడ కీలకమైన అంశం. మిత్రపక్షంగా ఉన్నాళ్లు ఊరుకుని, తెగతెంపులు కాగానే విరుచుకుపడటం బిజెపి దంద్వ నీతికి నిదర్శనం.

కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలను బిజెపి వేధిస్తోందంటూ ఇప్పటికే వస్తున్న ఆరోపణలను తాజా పరిణామం బలపరుస్తోంది. పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు, రాష్ట్రాభివృధ్ది తదితర అంశాలపై బిజెపికి ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను గతంలోనే బయటపెట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఉండాల్సింది. అలా ఎందుకు చేయలేదో అమిత్‌షా జవాబు ఇవ్వాల్సిఉంది. వీటన్నింటికి మించి ఎన్నికలకు ముందు ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామంటూ నమ్మబలికి, ఇప్పుడు మొండిచేయి ఎందుకు చూపిస్తున్నారో ప్రజలకు సంజాయిషీ ఇవ్వాల. అది జరగకుండా ఆంధ్రప్రదేశ్‌కు నిజమైన మిత్రులం తామేనంటూ కబుర్లు చెబితే రాష్ట్ర ప్రజలు నమ్మజాలరు.

బిజెపి చేస్తున్న మోసానికి ఇంతకాలం వంతపాడిన చంద్రబాబునాయుడు కూడా రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిఉంది. 26 సార్లు ఢిల్లీ వెళ్ళినా ప్రధానమంత్రి అప్పాయింట్‌మెంట్‌ ఇవ్వలేదంటూ ఇప్పుడు చెబుతున్న మాటలతో ప్రజల సానుభూతికి లభంచవచ్చు! తనఓర్పూ సహనాలను చాటుకోడానికి ఇది దోహదపడవచ్చు! అయితే అది మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు.

రాష్ట్రంలోని అఖిలపక్ష పార్టీలతో, కనీసం శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక ప్రతిపక్షంతో సంప్రదించకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజిని అర్ధరాత్రి హడావిడిగా ఎందుకు స్వాగతించారన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పుకోవలసి వుంది. హోదా సంజీవని కాదని, అందుకు ఉద్యమిస్తే జైలుకేనని హెచ్చరించిన బాబు ఇపుడు హోదా తప్ప ఏదీ వద్దు అనడంలో ఆయన నిలకడలేని తనమే కనబడుతోంది. ప్రత్యేకహోదా కోసం ప్రజలు ఉద్యమించకపోతే అరకొర నిధులతో సరిపెట్టాలన్న బిజెపి కుట్రకు ఆయన సహకరించేవారేనన్న అనుమానాన్ని బాబు తొలగించాలి.

రాష్ట్ర విభజన జరిగినప్పటినుండి ఇంతకాలం ఒక్క అఖిలపక్ష సమావేశాన్ని కూడా నిర్వహించని ఆయన ఇప్పుడు ప్రత్యేకహోదా కోసం ఆ తరహా సమావేశం నిర్వహించారంటే అది ప్రజాగ్రహ ఫలితమే! అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారిమళ్లించారన్న ఆరోపణలపై కూడా ఆయన పూర్తివివరాలతో సమాధానమివ్వాలి. శాసనసభలో ముఖ్యమంత్రి చెప్పిన వివరాల ప్రకారమే రాజధానికి ఇచ్చిన నిధుల్లో కొంత మొత్తానికి వినియోగ ధృవీకరణ పత్రాలు సమర్పించలేదన్నది స్పష్టమౌతోంది. అలా ఎందుకు జరిగిందో ఆయన వివరణవ్వాలి. పోలవరంతో పాటు వివిధ ప్రాజెక్టుల్లో చోటుచేసుకుంటున్న అవినీతి పైనా సమగ్రవివరాలను ప్రజల ముందుంచాలి.

లేని పక్షంలో టిడిపి, బిజెపిలు రాష్ట్ర ప్రజలను మోసం చేయడంలో ఒకదానితో మరొకటి పోటీ పడ్డాయని తటస్తులైన ప్రజానీకం భావిస్తుంది. దొంగల మధ్య తగాదా వస్తే ఎక్కడెక్కడ చేసిన దొంగతనాలు బయటపెట్టినట్లు కేంద్ర రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తూ కలిసి ప్రజలను మోసగించిన రెండు పార్టీలు ఇప్పుడు నీవు ప్రజలను మోసం చేశావు అంటే నీవు చేశావు అంటూ రెండూ ప్రజలకు చేసిన మోసాలను బయటపెట్టుకుంటున్నాయి.