నగరంలో నేటితో మహాస్వామి పాదుకా యాత్ర పరిసమాప్తం

13

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు,పరమాచార్యులు, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి పవిత్ర పాదుకా యాత్రలో భాగంగా రెండవ రోజైన గత సాయంత్రం కోటిలింగేశ్వర క్షేత్రం నుంచి సీతంపేట జమీందారు మెట్ట శ్రీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరడంతో అక్కడ అక్కడ ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మీనాక్షి దంపతులు, కార్పొరేటర్‌ నండూరి రమణ,శాంతిశ్రీ దంపతులు సంప్రాదయ రీతిలో స్వాగతం పలికారు. మహాస్వామి పాదుకలను శివరామసుబ్రహ్మణ్యం శిరస్సున ధరించారు. లలితానగర్‌, శ్రీరామనగర్‌లలో ఊరేగింపు సాగింది. ఇక చివరిరోజు మంగళవారం ఉదయం పాదుకాయాత్ర జిఎస్‌ ఎల్‌ మెడికల్‌ కాలేజీకి వెళ్ళింది. అక్కడ నుంచి ప్రకాశం నగర్‌ రౌండ్‌ పార్కులోని వినాయకుని గుడి దగ్గర కు చేరడంతో పలువురు ప్రముఖులు వచ్చి పరమాచార్య ప్రతిమను, పాదుకలను దర్శించి పూజలు నిర్వహించారు. పురప్రముఖులు దాట్ల బుచ్చి వెంకట పతిరాజు,జయ జయ శంకర టీవీ సంస్థ సీఎండి సిహెచ్‌.వి.ప్రసాదరావు,వాడ్రేవు వేణుగోపాలరావు దంపతులు, ఎర్రాప్రగడ ప్రసాద్‌ దంపతులు, గంటి సర్వలక్ష్మి, వి ఎస్‌ ఎస్‌ క ష్ణకుమార్‌, లొల్ల విశ్వమోహనరావు తదితరులు హాజరయ్యారు. కాగా సాయంత్రం 4గంటలకు పాదుకా యాత్ర ప్రకాశం నగర్‌ వినాయకుని గుడి నుంచి దానవాయిపేట,గాంధీపురం,శ్యామలానగర్‌ ప్రాంతాల్లో సాగుతుంది. డిబివి రాజు, విహెచ్‌పి అంతర్జాతీయ సంఘటనా కార్యదర్శివైవి రాఘవులు,వేద గణిత విద్వాంసులు రేమెళ్ళ అవధాని తదితర ప్రముఖులు పాల్గొంటారు. ఏవి అప్పారావు రోడ్డులోని శ్రీ భూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, పరిసర ప్రాంతాల్లో పాదుకా యాత్ర, రాత్రి 7గంటలకు పాదుకా దర్శనం, పూజలు, రాత్రి 8 గంటలకు సరస్వతి ఘాట్‌ లో పరమాచార్య ప్రతిమ, పాదుకా దర్శనం, పూజలు జరుగుతాయి. దీంతో మూడు రోజుల యాత్ర పూర్తవుతుంది.