6శాతం పడిపోయిన బ్యాంకు డిపాజిట్లు
(శనివారం నవీనమ్)

పన్నెండు రాష్ట్రాల్లో డిమాండ్‌కనుగుణంగా నగదు సరఫరా లేదని బ్యాంకింగ్ వర్గాలు దృవపరుస్తుండగా అందులో మొగటివి తెలుగు రాష్ట్రాలే. స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బిఐ) అధ్యయనంలోనే దేశ వ్యాప్తంగా రూ.70 వేల కోట్ల నగదు కొరత ఉన్నట్లు తేలింది. ఇవేమీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ చెవికెక్కట్లేదు.

నరేంద్ర మోడీ సర్కారు పెద్ద నోట్లను రద్దుపర్చి ఏడాదిన్నరవుతున్నా ప్రజలకు నగదు కష్టాలు తొలగకపోగా కరెన్సీ సంక్షోభం మరింతగా ముదరడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా దేశ వ్యాప్తంగా నగదు లభ్యం కాక జనాలు గగ్గోలు పెడుతుంటే ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి జైట్లీ, రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ త్రయం అసలు సమస్యే ఉత్పన్నం కాలేదన్నట్లు ప్రవర్తించడం దారుణం.

నగదుకు డిమాండ్‌ పెరగడానికి రైతులు పంటలను మార్కెట్‌కు తరలించడమే కారణమని, ఒకేసారి చెల్లింపులు చేయాల్సి రావడంతో అనూహ్యంగా సమస్య తలెత్తిందని ఆర్‌బిఐ ఇస్తున్న వివరణ హాస్యాస్పదం. ప్రతి ఏడాదీ పంటల సీజన్‌లో రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోవడం సర్వసాధారణం. ఒకవేళ నిజంగానే అదే సమస్య అనుకున్నా తెలిసిన వ్యవహారమే కనుక అందుకు తగిన విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రం, ఆర్‌బిఐలదే.

నగదు కొరతకు ఆర్‌బిఐ వల్లెవేస్తున్న మరో కారణం కర్నాటక ఎన్నికలు. అక్కడ భారీఎత్తున రూ.2000 నోట్లను అక్రమంగా దాచారంటోంది. అక్రమంగా నగదు పోగుబడకుండా చూడాల్సింది కేంద్రం, ఆర్‌బిఐలే. తమ పని తాము చేయకుండా దాన్నొక కారణంగా పేర్కొనడమంటే తమ తప్పును అంగీకరించినట్లే. సంక్షోభం తీవ్రమయ్యాక, నగదు కోసం ప్రజలు రోడ్డెక్కాక ఇప్పుడు తీరిగ్గా వచ్చే వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. 

ముందటేడు నవంబర్‌ 8 రాత్రి ఉన్నపళంగా అప్పటి వరకు చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదిగా చెప్పుకున్న ఆయన పాత నోట్లు భారత ఆర్థిక వ్యవస్థకు ఎన్నో అనర్ధాలు తెచ్చిపెడుతున్నాయని తెగ బాధ పడ్డారు. ఉగ్రవాదాన్ని నిరోధించడం, అవినీతిని అంతం చేయడం, నల్ల ధనాన్ని అరికట్టడం, నకిలీ కరెన్సీని అడ్డుకోవడం ఇవీ పెద్ద నోట్ల రద్దు లక్ష్యాలని నమ్మబలికారు. వాస్తవంలో ఆ లక్ష్యాలేవీ నెరవేరకపోగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజలకు ఇబ్బందులొచ్చి పడ్డాయి.

స్థూలోత్పత్తి తగ్గిపోగా చిన్న పరిశ్రమలు చితికిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. ఇన్ని వైఫల్యాలు మూటగట్టుకున్నా పెద్ద నోట్ల రద్దు సత్ఫలితాలిచ్చిందని మోడీ, జైట్లీ, వారి భక్తజనసందోహం వత్తాసు పలకడం పెద్ద దగా. పాత రూ.500, రూ.1000 నోట్ల వల్లనే బ్లాక్‌మనీ పోగుపడుతోందనుకుంటే అంతకంటే పెద్దదైన రూ.2000 నోటు ప్రవేశపెట్టడం ఏంటి? రూ.నాలుగైదు లక్షల కోట్ల నల్ల ధనం వెలికి తీస్తానని చెప్పగా నూటికి నూరుపాళ్లూ రద్దు చేసిన నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయంటే దానర్ధం బ్లాక్‌ మనీ కాస్తా వైట్‌ అయిందనేగా?

ఇప్పటికీ బ్యాంకులకు చేరిన రద్దయిన నోట్లను లెక్కించలేని స్థితి కొనసాగుతోందంటే ఘోర వైఫల్యం కాదా? దాచుకున్న చిల్లర డబ్బుల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు పడి చనిపోయిన వందలాది బాధితులు, ఒత్తిళ్లను తట్టుకోలేక తనువు చాలించిన బ్యాంక్‌ ఉద్యోగుల ఉసురు ఊరికినే పోవాలా? 

ఎన్‌డిఎ సర్కారు వచ్చాక ప్రణాళికాబద్ధంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ నిర్వీర్యమవుతోందనడానికి వరుస కుంభకోణాలే సాక్ష్యం. మద్యం వ్యాపారి విజరుమాల్యా, ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోడీ వంటి వారు రూ.వేల కోట్లను బ్యాంకులకు ఎగనామంపెట్టి విదేశాలకు ఉడాయించారు. ఇదే సమయంలో బడా కార్పొరేట్ల బ్యాంక్‌ రుణాలను ఎన్‌పిఎల పేర బ్యాంకులు మాఫీ చేశాయి.

ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను బిజెపి సర్కారు దూకుడుగా అమలు చేస్తోంది. బ్యాంకుల విలీనం చేపట్టింది. డిపాజిట్‌దార్ల హక్కులను హరించే ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు ప్రతిపాదించింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు పదిలం కాదన్న భయం వలన ఈ కాలంలో ప్రజల డిపాజిట్లు తగ్గాయి. నిరుడు డిపాజిట్ల వృద్ధిరేటు 15 శాతం కాగా ఈ ఏట 6 శాతం మేర డిపాజిట్లు తగ్గడానికి, కరెన్సీ తిరిగి బ్యాంకులకు చేరకపోవడానికి కారణం అక్కరకు నగదు అందన్న భయమే. ఏడాది కాలంలో సగటున రోజుకు ఐదు ఎటిఎంలను మూతేస్తున్నారు.

ఈ పరిణామం డిజిటల్‌ లావాదేవీలను పెంచి మొబైల్‌ వాలెట్‌ సంస్థలు, పేటిఎం, మొబిక్విక్‌, ఫోన్‌పే వంటి సంస్థలకు ఆయాచిత లబ్ధి చేకూరుస్తోంది. కరెన్సీ ఇబ్బందులు కొన్ని రోజుల్లోనే తీరిపోతాయని ప్రధాని హామీ ఇవ్వగా నేటికీ కొనసాగడం ముమ్మాటికీ వాగ్దానభంగం. నోట్ల ముద్రణకు ఇంకు లేదు, కాగితం లేదనడం సాకులే.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.