జగన్‌, పవన్‌ వెనుక ఉండి ఆడించాల్సిన అవసరం బిజెపికి లేదు

అనుభవజ్ఞుడని అందలమెక్కిస్తే మీరు సాధించింది సున్న

సీఎం చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే ఆకుల ధ్వజం

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 27 : రాష్ట్రాభివృద్ధి కంటే రాజకీయ లబ్ధే ముఖ్యంగా భావించి కేంద్రం అందిస్తున్న సహాయాన్ని నిరాకరిస్తూ సానుభూతి కోసం ప్రజల్ని మభ్యపెడుతూ రాజకీయ లబ్ధి పొందాలన్న తాపత్రయంతో సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు, సిటీ ఎమ్మెల్యే డా. ఆకుల సత్యనారాయణ ధ్వజమెత్తారు. విభజన హామీలను నెరవేరుస్తూ హోదాకు మించిన సహాయాన్ని ప్యాకేజీ రూపంలో చివరి పైసా వరకు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉండగా సీఎం దానిని ఉపయోగించుకోకుండా వీలు కాదని చెప్పిన హోదా గురించే మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. స్ధానిక దానవాయిపేటలోని తన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన సీఎం, ప్రజలే తనకు రక్షణ కవచంలా ఉండాలని అనడం చూస్తుంటే ఆయనేదో తప్పు చేయడాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నారని అనుమానం ప్రజల్లో కలుగుతోందన్నారు. జగన్‌, పవన్‌కళ్యాణ్‌ జనాకర్షణ కలిగిన నేతలని, వారిని వెనుక ఉండి ఆడించవలసిన అవసరం బిజెపికి లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రాన్ని చిల్లుకుండలా మార్చేసి ప్రతి నిత్యం రాష్ట్రం కష్టాల్లో ఉందని, పైసలు లేవంటూ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజా ధనాన్ని మాత్రం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపిఎస్‌ అధికారి లక్ష్మీనారాయణ తన భవిష్యత్తు కార్యాచరణలో తొలిగా రైతుల సమస్యలపై గళమెత్తడం అభినందనీయమని, ఆ ప్రయత్నంలో ఆయన కృతకృత్యులు కావాలని ఆకాంక్షిస్తూ అటువంటి నిజాయితీ పరుడైన అధికారి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని, ఆయన బిజెపిలోకి వస్తే రెడ్‌ కార్పెట్‌ పర్చి స్వాగతిస్తామని ఎమ్మెల్యే అన్నారు. కాగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం బాగుపడి యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ హోదాకు మించిన ప్యాకేజీని ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వమే రాజకీయ ప్రయోజనాల కోణంతో ఆ ప్యాకేజీని నిరాకరిస్తోందన్నారు. హోదాయే సంజీవని అని మాట్లాడుతున్న అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం వీరికి పట్టడం లేదన్నారు. సీఎం చంద్రబాబు సమర్ధుడు, అనుభవజ్ఞుడని ప్రజలు అందలమెక్కిస్తే వారి విశ్వాసాన్ని, ఆశలను వమ్ము చేస్తూ రాష్ట్రాన్ని అవినీతిమయం చేసి ప్రచారటోపంతో ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు. గత నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం తప అవినీతిని, అమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్‌, నాళం పద్మశ్రీ, మట్టాడి చిన్ని అడ్డాల ఆదినారాయణమూర్తి, గంగిశెట్టి సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.