చంద్రబాబుకి ఉండవల్లి లేఖ – కోర్టులో కౌంటర్‌ దాఖలు చేయాలని వినతి
రాజమహేంద్రి, మే 11 : ఎన్‌డిఏ నుంచి తెలుగుదేశం బయటకు వచ్చినందున ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ చూపి వచ్చే వర్షాకాల సమావేశాల్లో టిడిపి ద్వారా విభజన ప్రహసనంపై నోటీసు ఇచ్చి చర్చ జరిగేలా చూడాలని, తాను కోర్టులో వేసిన కేసుపై కౌంటర్‌ వేయించాలని మాజీ పార్లమెంట్‌ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరారు. వై-జంక్షన్‌లోని ఆనం రోటరీ హాలులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ సమైక్యాంధ్రప్రదేశ్‌ విభజన అన్యాయంగా చేశారని, ఈ విషయాన్ని ఎన్నోసార్లు గొంతెత్తి చెప్పానని, చివరికి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించానన్నారు. అందరికీ అర్థమయ్యేలా అన్ని వివరాలతో ఒక పుస్తకాన్ని కూడా ముద్రించానన్నారు. ప్రత్యేక హోదాపై  ఉద్యమిస్తున్న జగన్‌ను ఢిల్లీలో ఉద్యమించాలని సలహానిచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆయన కూడా ఏపీలో ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదాను  ఏ విధంగా సాధిస్తారో చెప్పాలన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు మోడీ రాజీనామాచేయాలని డిమాండ్‌ చేయడం వల్ల అది మనసులో ఉంచుకుని ఇప్పుడు వివక్ష చూపిస్తున్నారని సీఎం చంద్రబాబు ర్నూలు సభలో అన్నారని, పైగా ఏపీ అభివృద్ధి చెందితే గుజరాత్‌ కంటే ముందుకు వెళతామనే దురుద్దేశ్యంతో హామీలను అమలు పరచడంలేదని ఆయన వ్యాఖ్యానించడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. ఓ వైపు తలసరి ఆదాయం పెరిగిపోయిందని చెబుతుంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా విభజన ప్రహసనంపై నోటీసు ఇస్తే బావుంటుందని సూచించారు. 2013-14 నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అదే పరిస్థితి 2018-19లో తీసుకువస్తున్నారని, దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విలేకరుల సమావేశంలో పొడిపిరెడ్డి అచ్యుతదేశాయ్‌, అల్లు బాబి, నక్కా శ్రీనగేష్‌, చవ్వాకుల వీర రాఘవరావు, పసుపులేటి కృష్ణ, చవ్వాకుల వీర రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.