వీరవరపులంక వద్ద ఘటన – 80 మంది ప్రయాణీకులు క్షేమం
సొమ్మసిల్లిన యాత్రికులు – ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా
రాజమహేంద్రి, మే 11 : వేసవి సెలవుల్లో గోదావరి ప్రకృతి అందాలను తిలకించేందుకు పాపికొండలు యాత్రకు వెళ్ళిన పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు ఉదయం పాపికొండలు వెళుతున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బోటులో ప్రయాణిస్తున్న 80 మంది ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది సొమ్మసిల్లి పడిపోయారు.  స్థానికుల సహకారంతో పర్యాటకులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. వివరాలలోకి వెళితే.. దేవీపట్నం వీరవరపులంక వద్ద పాపికొండలు యాత్రకు వెళుతున్న ఓ బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గండిపోశమ్మ గుడి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా బోటులో మంటలు వ్యాపించడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు.  మంటలు చెలరేగడంతో బోటు డ్రైవర్‌ పడవను ఒక్కసారిగా వీరవరపులంక ఇసుక తిన్నెలవైపు మళ్ళించాడు. వెంటనే ప్రయాణీకులు ఇసుక తిన్నెలపైకి దూకి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ సంఘటనను తెలుసుకున్న వీరవరపులంక వాసులు నదిలో ఈదుకుంటూ వెళ్ళి 40 మంది ప్రయాణీకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని స్థానికుల సహకారంతో మిగతా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మంటల ధాటికి బోటు పూర్తిగా దగ్ధమైంది. పర్యాటక బోటులోని జనరేటర్‌లో షార్ట్‌ సర్క్యుట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా బోటు ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రాతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ప్రయాణీకులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రయాణీకుల క్షేమ సమాచారంపై ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని ఆదేశించారు.  పాపికొండలు పర్యాటకానికి సంబంధించి పటిష్ట భద్రత అవసరమని ఆయన సూచించారు.

0 Comments

Leave a Comment

This is a Sidebar position. Add your widgets in this position using Default Sidebar or a custom sidebar.