నెల రోజుల్లో ఎందరికో సాంత్వన 

0
73
జక్కంపూడి ప్రజా వారధి సేవలకు అనూహ్య స్పందన
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : జక్కంపూడి  ప్రజా వారధి సంస్ధ ద్వారా నెలరోజుల్లో వేయి మందికి ఉచితంగా వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశామని ఆ సంస్ధ వ్యవస్థాపకులు నరవ గోపాలకృష్ణ, గౌరవ సలహాదారులు లంక సత్యనారాయణ తెలిపారు. విఎల్‌ పురంలోని సంస్ధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో వారు మాట్లాడుతూ తమ సేవా  కార్యక్రమాలకు ఊహించని   స్పందన లభించిందన్నారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా ఆసుపత్రుల్లో వైద్యులు, మందులు ఉండకపోవడం వలనే తాము నిర్వహించే వైద్య శిబిరాలకు భారీగా తరలి వస్తున్నారన్నారు. ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం తమను ఆశ్రయిస్తున్నారని, సీటిఆర్‌ఐకి చెందిన బేతా హర్షవర్ధన్‌ పుట్టుకతోనే మూగవాడని, అతడిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. శాటిలైట్‌సిటీకి చెందిన షేక్‌  ఫకీర్‌ సాహెబ్‌, నేమాల అప్పారావులు వికలాంగులని, వారికి ఫించన్‌ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇటువంటి సమస్యలపై రేపటి నుంచి ఉద్యమిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రి, నగర పాలక సంస్ధ, తహసీల్ధార్‌ కార్యాలయాల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తామన్నారు. సంస్ధ తరఫున ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని, నెలరోజుల్లో 1 6  మంది క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి చేర్చగలిగామన్నారు. ఈ నెల  20న ఆదర్శ హస్పటల్‌ సౌజన్యంతో మెగా మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నామన్నారు.  సంస్ధ కార్యదర్శి మార్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ సంస్ధకు అంబులెన్స్‌ ఉండటం ద్వారా చాలా మంది విలువైన సేవలం అందించగలుగుతున్నామన్నారు. సంస్ధ సేవలకు ఆకర్షితులపై జామి సాయిబాబా, నడిపూడి కృష్ణలు సంస్ధలో చేరారు. ఈ కార్యక్రమంలో సంస్ధ ఉపాధ్యక్షులు ఎస్‌.కృష్ణమూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరపు శ్రీనివాస్‌, లోవరాజు, జోసఫ్‌, సుశీల, సుధారాణి పాల్గొన్నారు.