జల్లికట్టుకు జై అంటున్నవారు సతీ సహగమనాన్నీ సమర్ధిస్తారా?

(జి.కె.వార్తా వ్యాఖ్య)
జల్లికట్టు…..నేడు జనం నోళ్ళలో నానుతున్న మాట ఇది….. తమిళనాట ఏటా జనవరి మాసంలో నాలుగు రోజులు జరుపుకునే సంక్రాంతి వేడుకల్లో భాగం ఈ జల్లికట్టు. వ్యవసాయం ఫలప్రదం కావడానికి దోహదపడే ఎడ్లకు కృతజ్ఞతులు చెబుతూ వాటిని ఆలింగనం చేసుకునే వేడుకగా మొదలై, ఎడ్ల మధ్య పోటీగా మారి, అనంతరం పశువుకీ, మనిషికీ మధ్య పోటీగా ఇది రూపాంతరం చెందింది. పూర్వం ఎద్దు కొమ్ములకు  బంగారు తొడుగులు తొడిగి ఎద్దును ధైర్యంగా ఎదిరించి కొమ్ములు వంచి  వాటిని తీసుకున్నవారిని ధీరులుగా గుర్తించేవారు. అయితే రాన్రాను ఎద్దును రెచ్చగొట్టడం, హింసించడం ఎక్కువ కావడంతో జంతు ప్రేమికులు ఈ క్రీడను నిషేధించాలంటూ కోర్టుకు వెళ్ళగా 2014లో సుప్రీంకోర్టు దీనిని నిషేధించింది. ఆ తర్వాత కొన్ని మార్పులతో జల్లికట్టు వంటి క్రీడను అనుమతిస్తూ కేంద్ర అడవులు,పర్యావరణ శాఖలు ప్రకటనలు జారీ చేశాయి. అయితే దీనిని కొన్ని సంస్ధలు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ  నెల 16న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ శాఖల ప్రకటనలపై స్టే ఇచ్చింది. కావాలంటే కంప్యూటర్‌లో ఎద్దులతో కుస్తీ పట్టే ఆటలు ఆడుకోండి…ఎద్దులను హింసించడం ఎందుకు? అంటూ కేసు విచారణ దశలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కూడా. జల్లికట్టుకు సుప్రీంకోర్టు అనుమతిని నిరాకరించడంతో తమిళనాట మొదలైన ప్రజా ఉద్యమం విస్తృత రూపం దాలుస్తుండటంతో అక్కడి పాలక, ప్రతిపక్షాలు ఏకమై చివరకు తాము అనుకున్నది సాధించగలిగాయి.  తమిళ ప్రజలు దేశం పట్ల జాతీయ భావన కంటే తమ ప్రాంతం పట్ల నిబద్ధతను ఎక్కువ ప్రదర్శిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అనాదిగా వస్తున్న తమ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం వాటిల్లుతోందంటూ తమిళనాట పాలక, ప్రతిపక్షాలే గాక సినీ, రాజకీయ ప్రముఖులు, విద్యార్ధి,యువజన లోకం ఇలా ఒకరేమిటీ అబాల గోపాలం ఏకమై మెరీనా తీరాన గర్జించాయి. విద్యార్ధి, యువజనులు ప్రారంభించిన ఈ ఉద్యమం ఉధృతరూపం దాల్చడంతో అందరూ పోటీ పడి మరీ భాగస్వాములయ్యారు. దీంతో దేశమంతా ముఖ్యంగా దక్షిణాదిన సమస్యలన్నీ పక్కకుపోయి ఇదే హాట్‌ టాఫిక్‌గా మారింది. చివరకు ప్రపంచ సంగీత చక్రవర్తి, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏ ఆర్‌ రెహ్మాన్‌ కూడా ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. చివరికి ఈ విషయం ఎలా మారిందంటే జల్లికట్టు వ్యవహారంలో ముందుకు వెళ్ళకపోతే ఎక్కడ వెనకబడిపోతామోనన్న భయాందోళనే వారినందరినీ ఏకోన్ముఖుల్ని చేసింది.  జల్లికట్టుకు అనుమతి ఇవ్వడం వంటి అంశం ఉమ్మడి జాబితలో ఉన్న కారణంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. మొత్తం మీద తమిళుల ఉద్యమం, రాయబారాలు ఫలించాయి. తమిళుల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయమంటూ  అక్కడ వారంతా జల్లికట్టును సమర్ధించారు. అలాగే వారి ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. ఫలితంగా తమిళ సర్కార్‌ ఆర్డినెన్స్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ వెంటనే ఆమోదం తెలపడం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కేంద్రం తక్షణమే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, ఆ మరునాడే అంటే నిన్న జల్లికట్టును అధికారికంగా ప్రారంభించడం అన్నీ చకా చకా జరిగిపోయాయి. జంతు హింసతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న ఈ క్రీడపై అందరిలో ఉన్న భయాలను నిజం చేస్తూ  నిన్న ప్రారంభమైన జల్లికట్టులో ఇద్దరు ప్రాణాలు కోల్పొవడం, అనేక మంది గాయపడటం జరిగింది. తమిళనాట జల్లికట్టు వ్యవహారాన్ని ప్రస్తావించుకున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల గురించి కూడా ప్రస్తావించుకోవలసిన అవసరం ఉంది. బొబ్బిలి రాజుల కాలం నుంచి వస్తున్న ఈ కోడి పందేలపై చాలా ఏళ్ళుగా నిషేధం విధించారు. కక్షలు, కార్పణ్యాలను పెంచడంతో పాటు కుటుంబాలను ఆర్ధికంగా తీవ్రంగా దెబ్బతీసే జూద క్రీడ వంటి కోడి పందేలకు కూడా న్యాయస్థానం అనుమతి నిరాకరించినా మొన్న సంక్రాంతి పండుగ రోజుల్లో ఈ పందేలు యదేచ్ఛగా జరిగాయి. చట్టం అమలు చేయవలసిన ప్రభుత్వ యంత్రాంగం ఆ మూడు రోజులు కళ్ళు మూసుకుని తెలిసి తెలియనట్టుగా వ్యవహరించింది.  ఏమైనా అంటే సంస్కృతి సంప్రదాయం అంటున్నారు. జల్లికట్టు ప్రాచీనంగా రెండు వేల సంవత్సరాల నుంచి వస్తున్న క్రీడగా చెబుతుండగా తమిళ వాజ్ఞ్మయంలో దీనిని ‘ఎరుతలవడై’ (ఎద్దును కౌగిలించుకోవడం)గా వ్యవహరిస్తారని చెబుతుంటారు. ఆ తర్వాత కాలంలో 400 సంవత్సరాల నుంచి ఒక వధువు కోసం చాలా మంది పోరాడితే ఆ వధువుని పెళ్ళాడేందుకు ఎంపిక చేసే వరుల మధ్య నిర్వహించే ఎద్దుల పోటీ జల్లికట్టుగా రూపాంతరం చెందిందని కూడా చెబుతారు.  ఆ తర్వాత కాలంలో ఇది రాక్షస క్రీడగా మారింది. ఎప్పుడో 200, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన జల్లికట్టును నిలబెట్టుకోవడానికి అండదండలందించడం సమంజసమని భావిస్తే రామాయణ, మహాభారతాల నాటి కాలంలో  సతీ సహగమనం ఉందని  చెప్పి నేటి ఆధునిక సమాజంలో ఆ సాంఘిక దురాచారాన్ని  సమర్ధిస్తారా? అన్న విషయానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రజల్లో సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుందామనుకునే వారికి  భవిష్యత్‌లో ప్రజా జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎంతమాత్రం పట్టబోవు. ఏది ఏమైనా ‘మేం బాగుంటే చాలు’ అనే భావనతో పాలకులు, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తే భవిష్యత్‌లో సాంఘిక దురాచారాలు కూడా తిరిగి పడగవిప్పే ప్రమాదం లేకపోలేదు. జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో ఏదో విధంగా కాలిడి అక్కడ ఖాతా తెరవాలని ఉవ్విళ్ళూరుతున్న కమలనాథులకు సారధ్యం వహిస్తున్న మన దేశ ప్రధాని నరేంద్రమోడీ కూడా జల్లికట్టు అంశాన్ని ఓ ఆయుధంగా వినియోగించుకోవాలని ప్రయత్నించడం నిజంగా బాధాకరం. జల్లికట్టుకు అనుమతిచ్చే ఆర్డినెన్స్‌ జారీ వెనుక నీతి కబుర్లు చెబుతూ ఉక్కు మనిషిగా అభివర్ణింపబడుతున్న  మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహకారం ఉందని కొందరు చెప్పుకోవడం ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడమే.  సంస్కృతిని,సంప్రదాయాలను, భాషను కాపాడుకోవాలనుకోవడం తప్పు లేదు కాని జంతు హింసకు పాల్పడుతూ మనుషుల ప్రాణాలకు ముప్పు తెచ్చే ఈ జల్లికట్టును సమర్ధించడం మాత్రం తప్పు. జల్లికట్టును ఆడాలనుకునేవారు  ఎడ్లను హింసించకుండా దేశవాళీ పశుసంపద వృద్ధి కావడానికి వీలుగా ఈ క్రీడను మలుచుకోవాలి.