జయహొ భారత్‌…జయహొ ఇస్రో

శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ పుష్కరఘాట్‌లో కార్యక్రమం
రాజమహేంద్రవరం, జనవరి 28 : శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న పిఎస్‌ఎల్‌వి సి-37 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పుష్కరఘాట్‌ వద్ద ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌, సారధి స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైకాపా ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.పి. మురళీమోహన్‌ మాట్లాడుతూ గతంలో అందరూ కలెక్టర్‌, ఇంజనీర్‌, డాక్టర్‌ అవుతానంటూ తన లక్ష్యాన్ని విద్యార్ధులు చెప్పేవారని, ఇప్పుడు మాత్రం అబ్దుల్‌ కలాంల శాస్త్రవేత్తను అవుతామంటూ చెప్పడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి మన శాటిలైట్లను పంపేవారమని, కానీ ఇప్పుడు మాత్రం మనదేశం నుండే ఇతర దేశాల శాటిలైట్లను కూడా పంపేస్థాయికి ఎదిగామని చెప్పారు. పిఎస్‌ఎల్‌వి సి-37 కూడా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ దేశభక్తుని,  శాస్త్రవేత్తల గొప్పతనాన్ని తెలియపర్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ పిఎస్‌ఎల్‌వి సి-37 ప్రయోగంలో అమెరికాకు చెందిన శాటిలైట్లు కూడా ఉండటం గర్వకారణమని, ఖచ్చితంగా భారతదేశం ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలుస్తుందని ఆకాంక్షించారు. స్థానిక కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు మాట్లాడుతూ విద్యార్ధులు ఉన్నతమైన కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకునే దిశగా కృషిచేయాలని సూచించారు. అబ్దుల్‌ కలాం, సి.వి.రామన్‌ వంటి వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సారధి స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు కుడుపూడి పార్ధ సారధి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఎం.డి.బాలా త్రిపుర సుందరి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్‌ ఎస్‌.పి.గంగిరెడ్డి, రాజమహేంద్రి కళాశాల కరస్పాండెంట్‌ టి.కె.విశ్వేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, బొంతా శ్రీహరి, బెజవాడ రాజ్‌కుమార్‌, పెనుగొండ విజయభారతి, రెడ్డి పార్వతి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, పిల్లి నిర్మల, రాజమండ్రి రైజింగ్‌ అడ్మిన్‌ మాటూరి సిద్ధార్థ, కార్టూనిస్ట్‌ శేఖర్‌, విజ్జల అప్పయ్యశాస్త్రి, అక్షరశ్రీ స్కూల్‌ ఎం.డి. నాగరత్నం, తదితరులు పాల్గొన్నారు. శాస్త్రవేత్తలకు ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ పుష్కరఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన సంతకాల బ్యానర్‌పై తొలిగా ఎం.పి. మురళీమోహన్‌ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రిప్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్ధులు రాకెట్‌ లాంచర్‌ ఆకారంలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.