నగర వీధుల్లో ఆర్టీసి సిటీ సర్వీస్‌లు

తొలి దశలో 10 బస్సులకు లైన్‌క్లియర్‌
రాజమహేంద్రవరం, జనవరి 28 : నగర రహదారులపై త్వరలో ఆర్టీసి సిటీ బస్సులు పరుగులు తీయనున్నాయి. మూడు ప్రధాన మార్గాల్లో పది బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.  నగరంలో గతంలో వివిధ రూట్లలో దాదాపు  వందకు పైగా ప్రైవేట్‌ సిటీ బస్సులు తిరగగా ఆటోల సంఖ్య విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వాటి పోటీని తట్టుకోలేక చాలా వరకు బస్సులు మూలనపడ్డాయి. ప్రస్తుతం రెండు, మూడు రూట్లలో పది వరకు మాత్రమే సిటీ బస్సులు నడుస్తున్నాయి. నగరంలో ఇప్పటికే 15 వేలకు పైగా ఆటోలు ఉండగా ట్రాఫిక్‌ ఇబ్బందులు దృష్ట్యా కొత్త వాటికి అనుమతి ఇవ్వొద్దని రవాణా శాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి నివేదించారు. ఆటోల్లో ప్రయాణం ఆర్థికంగా భారం కావడంతో పాటు ప్రమాదాల సంఖ్య కూడా బాగా పెరిగిపోవడమే గాక ఆటో డ్రైవర్ల ముసుగులో కొందరు అరాచకాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పరచాలని, ఆర్టీసి సిటీ బస్సులను ప్రవేశపెట్టాలని చాలా కాలంగా వినియోగదారుల మండలి, ప్రజా,మహిళా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గతంలో కూడా ఆర్టీసి సబర్బన్‌ సర్వీస్‌ల పేరుతో పది బస్సులను నడపగా ప్రైవేట్‌ బస్సుల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేకపోవడంతో వాటిని నిలిపివేశారు. అయితే ఇపుడు ప్రైవేట్‌ బస్సులు లేకపోవడంతో పాటు నగరానికి దూరంగా  ప్రాంతాలకు ప్రయోజనం కలిగేలా ప్రధాన రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేసి ప్రయోగాత్మకంగా పది బస్సులను నడిపేందుకు ఆర్టీసి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అధికారుల ప్రతిపాదనకు  ఆర్టీసి పచ్చజెండా ఊపడంతో వచ్చే నెల మొదటి వారంలో పది బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ బస్సులు తిరిగే రూట్‌ మ్యాప్‌లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సులను  ఉదయం 7-30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడుపుతారు. ఈ పది బస్సులు  రోజుకు 70 ట్రిప్పులు తిరగనున్నాయి. ఈ బస్సుల సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుని ప్రోత్సహిస్తే రానున్న రోజుల్లో మరిన్ని బస్సులు నడిచే అవకాశాలు ఉన్నాయి.
సిటీ బస్సులు తిరిగే మార్గాలు
1) గోకవరం బస్టాండ్‌ – కడియం : గోకవరం బస్టాండ్‌, చర్చిగేట్‌, కోటిపల్లి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, ఐఎల్‌టిడీ, బాలాజీపేట, బొమ్మూరు, హార్లిక్స్‌ ఫ్యాక్టరీ, వేమగిరి, కడియం.
2) రాయుడుపాకలు -కేశవరం : రాయుడుపాకలు, కోలమూరు, కొంతమూరు, కోరుకొండ రోడ్డు, గోకవరం బస్టాండ్‌, చర్చిగేట్‌, షెల్టన్‌ హోటల్‌, కోటిపల్లి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, బాలాజీపేట, బొమ్మూరు, రాజవోలు, కేశవరం.
3) క్వారీ మార్కెట్‌ – శాటిలైట్‌ సిటీ : క్వారీ మార్కెట్‌, ఆనంద్‌నగర్‌, పేపర్‌మిల్లు రోడ్డు, చిరంజీవి బస్టాండ్‌, గోకవరం బస్టాండ్‌, గోదావరి గట్టు, శ్యామలాసెంటర్‌, రాజమహేంద్రవరం ఆర్టీసి కాంప్లెక్స్‌, మోరంపూడి, పిట్టలవాని చెరువు, నామవరం, శాటిలైట్‌ సిటీ.