పవన్‌ ఘాటుగా తిట్టేంత తప్పేమీ మోడీ సర్కార్‌ చేయలేదు

రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా చేయూతనిస్తున్నారు
హోదాకు మించిన సాయమే చేస్తున్నారు – ఆ విషయాన్ని ప్రజలు గుర్తించారు
విమర్శకులకు ఎమ్మెల్యే ఆకుల సమాధానం
రాజమహేంద్రవరం, జనవరి 28 :  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌  తీవ్ర పదజాలం ఉపయోగించేటంత తప్పేమీ నరేంద్రమోడీ సర్కార్‌ చేయలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పవన్‌కల్యాణ్‌ తమకు శత్రువేమీ కాదని, ఆయన ఇప్పటికీ తమకు మిత్రుడేనని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో  బిజెపి-తెదేపా అభ్యర్ధుల విజయంలో ఆయన పాత్ర ఉందన్న విషయాన్ని తాము మర్చిపోలేదన్నారు. స్ధానిక ప్రకాశంనగర్‌లోని తన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి అండగా ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును అర్ధం చేసుకోకుండా ఆయనపై పవన్‌కల్యాణ్‌ నోరుపారేసుకోవడం బాధాకరమన్నారు. పరిస్థితుల్ని,సమస్యల్ని అర్ధం చేసుకోకుండా పవన్‌, జగన్‌ మోసం చేశారంటూ ఒకే భావజాలంతో మాట్లాడటం తగదన్నారు. కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపీఏ సర్కార్‌ అశాస్త్రీయంగా, హడావిడిగా రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు ఏపీ కోసం రాజ్యసభలో ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులే గళమెత్తారని, అప్పుడు మెజార్టీ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా,హడావిడిగా విభజన చేసిన పరిస్థితుల్లో వారు ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుటి పరిస్థితులు, దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్ల దృష్ట్యా, నీతి ఆయోగ్‌ సూచనల మేరకు హోదాకు మించిన ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి రాష్ట్రానికి చేయూతనిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. హోదా విషయంలో పవన్‌ కల్యాణ్‌తో పాటు ప్రతిపక్ష నేత జగన్‌, మాజీ ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తదితరులు వాస్తవాలు అర్ధం చేసుకుని మాట్లాడి రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం అందిస్తే బాగుంటుందన్నారు. యూపీఏ హయాంలో నిత్యం భారీగా ప్రజా ధనాన్ని  కొల్లగొట్టే స్కామ్‌లు జరగడంతో ప్రపంచంలోనే భారత్‌ అంటే చులకన భావం ఏర్పడగా ఆ తర్వాత వచ్చిన ప్రధాని మోడీ తన విధానాలతో, నిజాయితీతో  దేశాన్ని, వ్యవస్థను గాడిలో పెట్టి ఓ గుర్తింపు తీసుకొచ్చారని, మోడీ సర్కార్‌ వచ్చిన ఈ మూడేళ్ళలో ఒక్క స్కామ్‌ జరగకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. సహకార సమాఖ్య విధానాన్ని గౌరవిస్తూ ప్రతిపక్ష పాలిత బిహార్‌ వంటి వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి చేయూతనిస్తూ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అభివృద్ధికి అన్ని విధాలా చేయూతనిస్తున్న మోడీ ప్రభుత్వంపై పవన్‌కల్యాణ్‌, జగన్‌ విమర్శలు చేయడం సహేతుకం కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు ఒనగూరుతున్నాయని, ఏపీ జీవనాడి పోలవరం ప్రాజక్ట్‌ను జాతీయ ప్రాజక్ట్‌గా గుర్తించి ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడం ద్వారా ఎలాంటి అవరోధాలు లేకుండా చేసి ప్రాజక్ట్‌ నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్న విషయాన్ని, ఏపీకి నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తూ పారిశ్రామిక ప్రగతికి అండగా ఉన్న విషయాన్ని, పారిశ్రామిక అభివృద్ధికి సహకరిస్తున్న అంశాన్ని ఈ విమర్శకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పోలీసుల నిర్భంధాన్ని కూడా అక్కడ వారు లెక్కచేయలేదని, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో రాజకీయ పార్టీల హడావిడి తప్ప ప్యాకేజీతో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారని అన్నారు. నిజంగా మోసం చేశారని ప్రజలు భావిస్తే వారే బయటకొస్తారని ఆకుల అన్నారు. ఇకనైనా పవన్‌, జగన్‌లు తమ వైఖరి మార్చుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. విలేకరుల సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ అయ్యల గోపీ, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, నాళం పద్మశ్రీ, అడ్డాల ఆదినారాయణమూర్తి, కారుమూరి గవర్రాజు, తంగుడు వెంకట్రావ్‌ తదితరులు పాల్గొన్నారు.