ప్రజల నెత్తిన బండ (శనివారం నవీనమ్)

ప్రజల నెత్తిన బండ
(శనివారం నవీనమ్)

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపకుండా వంట గ్యాస్‌ ధరలను అమాంతం భారీగా పెంచేసి పేద,సాద జనం వంట ఇళ్లల్లో మంటలు మండిస్తున్నారు.

గృహావసరాలకు వాడే రాయితీ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.90, వాణిజ్య సిలిండర్‌పై రూ.148 పెంచుతున్నట్లు చమురు సంస్థలు బుధవారం ప్రకటించాయి. ఈ హెచ్చింపులు ఆ రోజు నుంచే అమల్లోకి వస్తున్నాయి. గత నెలలో 14.2 కిలోల రాయితీ సిలిండర్‌ ధర రూ.738 కాగా ఇప్పుడది రూ.835 అవుతుంది. ఆయిల్‌ కంపెనీలు తాము రూ.90, రూ.148 పెంచుతున్నట్లు వల్లెవేస్తున్నా రాష్ట్రాలు వడ్డించే వ్యాట్‌, రవాణా ఛార్జీలు అమాంబాపతులన్నీ లెక్కేసుకుంటే ఇంకో ఏడెనిమిది రూపాయలు కలుస్తుంది. యుపిఎ ప్రభుత్వం సిలిండర్‌పై ఐదో పదో పెంచినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నానా యాగీ చేసేది. ప్రజలపై కాంగ్రెస్‌ ఎనలేని భారాలూ మోపుతోందని విరుచుకుపడేది. అలాంటిది ఉన్నపళంగా వంద రూపాయలు పెంచడం ఏవిధంగా సమంజసమో  ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బిజెపి పెద్దలపై ఉంది.

ఇదేనా కాంగ్రెస్‌ కంటే బిజెపి విభిన్నత? రాయితీ సిలిండర్ల ధరల పెంపును మాత్రమే ప్రజలు మోస్తారని, కమర్షియల్‌ సిలిండర్ల ధరలను వ్యాపారస్తులు భరిస్తారని ఎన్‌డిఎ సర్కారు చేసే వాదనలో అర్థం పర్థం లేదు. పైగా ప్రజలను మోసగించడానికే ఈ టక్కు టమార గారడీ మాటలు. కమర్షియల్‌ సిలిండర్‌ ధర పెరిగితే వ్యాపారులు వారు ఉత్పత్తి చేసే వస్తువుల ధరలు పెంచేస్తారు. అంతిమంగా పెంపు భారం మోయాల్సింది ప్రజలే.

ప్రతి పెట్రోలు బంకు దగ్గరా ఇంత మంది ధనికులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నారని తాటికాయంత అక్షరాలతో మోడీ ముఖారవిందంతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. నిజంగానే అంత పెద్ద మొత్తంలో సబ్సిడీలు ఆదా అయితే బీద, బిక్కిపై ఎందుకు అదనపు భారం వేయాల్సి వస్తోంది? ఈ ప్రచారం ప్రజలను క్రమంగా సబ్సిడీలకు దూరం చేయడానికేనని ధరల పెంపు మూలంగా బోధ పడుతోంది.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎక్కువ రోజులు తగ్గడమో, స్థిర పడటమో జరగ్గా,  పెట్రోలు, డీజిలు, గ్యాస్‌ ధరలను మోడీ సర్కారు ఎందుకు పెంచుతోందో పెద్ద ప్రశ్న.

గతంలో బ్యారెల్‌ 160 డాలర్లున్నప్పుడు కూడా ఇంతగా పెట్రో ఉత్పత్తుల రేట్లు పెరగలేదు. అలాంటిది రెండేళ్లుగా బ్యారెల్‌ 40-60 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్నా ఎందుకు లెక్కకుమించినన్ని సార్లు ఛార్జీలు పెరుగు తున్నాయో, మతలబు ఏమిటో అంతుబట్టట్లేదు. పైపెచ్చు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ దామాషాలో ప్రజలకు ధరలు తగ్గించట్లేదు సరికదా ఆదాయ లోటు పూడ్చుకునేందుకు వివిధ రకాల సుంకాలను బాదుతోంది. ముడిచమరు ధరలు తగ్గడం వలన ఆయిల్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి ఏడాదికి వేల కోట్ల రూపాయలు మిగులుతున్నాయి. అయినాసరే, మోడీ ప్రభుత్వం వచ్చాక ఎన్నిసార్లు పెట్రోలు, డీజిల్‌ ఛార్జీలు పెరిగాయో లెక్కే లేదు. చివరికి నిరుపేదలు వినియోగించే సబ్సిడీ కిరసనాయిల్‌ రేట్లు సైతం పెంచిందంటే సర్కారు నైజం ఏమిటో తెలుస్తూనే ఉంది. దేశంలోని సహజ వనరులు, చమురు నిక్షేపాలను రిలయన్స్‌ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేసి, అవి శాసిస్తున్నట్లు ప్రజలపై భారాలు మోపడం అన్యాయం. కాంగ్రెస్‌ హయాంలో కార్పొరేట్ల దోపిడీ తారా స్థాయికి చేరగా, బిజెపి ప్రభుత్వంలో వాటి లూటీ పరాకాష్టకు చేరింది.

పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరిగినప్పుడు చంద్రబాబు, ఆయన పార్టీ ఎన్ని వినూత్న తరహా నిరసన ప్రదర్శనలు చేసిందో తెలుగు ప్రజానీకానికి గుర్తుంది. కాగా ప్రస్తుతం రెండు చోట్లా అధికారంలో ఉన్న టిడిపికి ధరల పెరుగుదల అస్సలుకే కనబడట్లేదు. కనీసం ధరలు తగ్గించాలని కేంద్రాన్ని నామమాత్రం కూడా అడగట్లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినప్పుడు సర్‌ఛార్జీలను వేసి మరీ ఆదాయం పిండుకున్న దుర్మార్గం చంద్రబాబు సర్కారు స్వంతం. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మహిళా సాధికారత అనే అంశం కింద ఎన్నో హామీలు గుప్పించారు. ప్రతి పేద కుటుంబానికీ దీపం పథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తామని, ఆధార్‌కార్డుతో సంబంధం లేకుండా ఏడాదికి 12 సిలిండర్లను రూ.వంద సబ్సిడీపై అందజేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ హామీలు అమలు కాలేదు.

కేంద్రం ఛార్జీలు పెంచిన మీదట రాష్ట్రం సిలిండర్‌పై రూ.వంద సబ్సిడీ ఇస్తే ప్రజలపై కొంతైనా అదనపు భారం తగ్గుతుంది. కేంద్రం పెంచిన గ్యాస్‌ ధరలను ఉపసంహరించుకోవాలి. అందుకు రాష్ట్రం కేంద్రంపై ఒత్తిడి చేయాలి.