కథ మళ్ళీ మొదటికి……

జి.కె. వార్తా వ్యాఖ్య
ప్రతి నిర్ణయం వెనుక ఓ పరమార్ధం, లక్ష్యం ఉంటాయి….ప్రతి సగటు జీవి ఈ దిశగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు…. అందులో వారు సఫలీకృతం కావడమనేది వారి వేసే అడుగులపై ఆధారపడి ఉంటుంది…. అయితే ఆ పయనంలో సదరు వ్యక్తులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ఆ ప్రభావం ఆ వ్యక్తికే లేదా ఆ కుటుంబానికే పరిమితమవుతుంది. అయితే ఒక పాలకుడు తీసుకున్న నిర్ణయం దేశ భవిష్యత్తును, కోట్లాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విషయంలో ఇపుడు అదే జరుగుతోంది. కొందరి చేతుల్లో కేంద్రీకృతమైన సంపదను ముఖ్యంగా దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికితీసి పేదలకు పంచాలన్న సముచిత ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఏడాది నవంబర్‌ 8న రూ.500, రూ.1,000 నోట్లను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జన జీవనాన్ని అతలాకుతలం చేసిన ఈ సంచలన నిర్ణయంతో జనం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ సమయంలో లింగ, వయో భేదం లేకుండా ప్రతి వ్యక్తి  బ్యాంక్‌ల ముందు క్యూలు కట్టి పాత పెద్ద నోట్లను జమచేశారు. అయితే  ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త నోట్లను, చెలామణిలో ఉన్న నోట్లను ముద్రించి సరఫరా చేయడంలో రిజర్వ్‌ బ్యాంక్‌ విఫలం కావడంతో  బ్యాంక్‌ల నుంచి తమ అవసరాలకు తగినంతగా ఖాతాల నుంచి సొమ్ము విత్‌ డ్రా చేసుకోవడానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయినా దేశాధినేత (ప్రధానమంత్రి) తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, దాని వల్ల భవిష్యత్‌లో పెద్ద ప్రయోజనమే ఉంటుందని భావించి ప్రతి వ్యక్తి పంటి బిగువున ఆ బాధలన్నింటిని ‘అచ్ఛా దిన్‌’ కోసం భరించారు. ఆ సమయంలో ప్రధానమంత్రి ఓ మాట అన్నారు….నోట్ల రద్దు కష్టాలు 50 రోజులేనని, ఆ తర్వాత ఎవరికీ కరెన్సీ కష్టాలు ఉండవని, బ్యాంక్‌ ఖాతాల్లో ప్రభుత్వం విధించిన పరిమితికి మించి జమ అయిన మొత్తాల నిగ్గు తేల్చి ఆ సొమ్మును పేదలకు పంచుతామని ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని చెప్పిన మాటలు పేదలకు పన్నీటి జల్లులా అనిపించాయి. అయితే 50 రోజులు కాదు కదా 120 రోజులు (నాలుగు నెలలు) అయినా ప్రజల కష్టాలు ఎంత మాత్రం తీరలేదు. పైగా కథ మళ్ళీ మొదటికి వచ్చిం ది. దీంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పరమార్ధం మాత్రం నెరవేరలేదనే చెప్పవచ్చు. నల్లధనం బహిర్గతం కాకపోగా ప్రజలకు కష్టాలు మాత్రం మిగిలాయి. ఇలా ఉండగా కరెన్సీ కష్టాలు మాత్రం ముగిసినట్టే ముగిసి మళ్ళీ మొదలయ్యాయి. డిసెంబర్‌ వరకు పాత పెద్ద నోట్లు జమ చేసుకోవడంతో సరిపోగా ఆ సమయంలో కొత్త నోట్లు, రూ. 100, రూ. 50 వగైరా కరెన్సీ పొందడానికి అష్టకష్టాలు పడవలసి వచ్చింది. చాలా బ్యాంక్‌లు తమ ఖాతాదారులకు కొత్తగా ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లను చేతిలో పెట్టడంతో  ఆ  నోటుకు బయట చిల్లర లభ్యం కాక చేతిలో డబ్బులు ఉన్నా అవసరం తీరక బాధ పడ్డారు. బ్యాంక్‌ ఖాతాల్లో సొమ్ము ఉన్నా విత్‌ డ్రాలపై పరిమితులతో అవసరాలకు అనుగుణంగా సొమ్ము పొందలేకపోయారు. ఇలా ఫిబ్రవరి మధ్య వరకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.  అదే సమయంలో నగదు రహిత లావాదేవీలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిజిటల్‌ లావాదేవీల నిర్వహణపై తగు సూచనలు, సలహాలు ఇచ్చేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే కొన్ని సిఫార్సులు చేసింది.  నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి  కేంద్రం కొన్ని చర్యలు కూడా చేపట్టింది. అయితే ప్రపంచంలోనే అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికా తదితర దేశాల్లోనే ఇంకా పూర్తి స్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరగకపోగా నిరక్ష్యరాస్య భారతావనిలో అదేలా సాధ్యమవుతుందనే సందేహం వ్యక్తమవుతోంది. ఆ దిశగా ప్రజల్ని కార్యోన్ముఖుల్ని చేయడం సమంజసమే అయినా ఖచ్చితం చేయడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదన్న విషయం మన పాలకులకూ తెలుసు. అయితే కొన్ని సంస్థలు, చివరకు కొన్ని రైతు బజార్లలో, పెట్రొల్‌ బంక్‌ల్లో  స్వౖౖెపింగ్‌ యంత్రాలను ప్రవేశపెట్టి నగదు రహిత లావాదేవీల వైపు ప్రజల్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టారు. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో తాజాగా కరెన్సీ కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి. బ్యాంక్‌ల నుంచి, ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పరిమితులను సడలించడంతో పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి క్షేత్రస్థాయి బ్యాంక్‌లకు నగదు రాక తగ్గిపోవడంతో ఇబ్బందులు తీవ్రమయ్యాయి. దీంతో   చాలా చోట్ల ఏటీఎంల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని బ్యాంక్‌ల ముందు నో క్యాష్‌  బోర్డులు సాక్షాత్కరిస్తున్నాయి. ఇపుడిపుడే నగదు ఉప సంహరణ పరిమితులను సడలించిన బ్యాంక్‌లు నగదు కొరతతో మళ్ళీ ఆంక్షల్ని బిగిస్తున్నాయి. ఓ వైపు నెల ప్రారంభరోజులు కావడంతో వేతనాలు, ఫించన్ల పంపిణీ ఇతర అవసరాలకు భారీగా నగదు అవసరమవుతోంది. పోనీ నగదు రహిత లావాదేవీలు చేద్దామంటే  పన్నుల భారాలు వినియోగదారులను ఆ దిశగా ముందడుగు వేయనీయడం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి బ్యాంక్‌ శాఖలకు నగదు రాక బాగా తగ్గిపోవడం, దీనికి తోడు బ్యాంక్‌ల నుంచి వెళతున్న సొమ్ము తిరిగి  చేరకపోవడంతో నగదు కొరత పెరిగిపోయి మళ్ళీ కరెన్సీకి కటకటలాడవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా కొనుగోలు చేద్దామంటే మన దగ్గర అంత సొమ్ము ఉందా? లేదా? అని సంశయిస్తాం…. అయితే ఇపుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. కళ్ళెదురుగా వస్తువున్నా, ఆ వస్తువు అవసరం మనకున్నా కొనుగోలు చేద్దామంటే మన జేబులో తగినంత సొమ్ము లేకపోవడం విచిత్రం. నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించడం ఆందోళన కలిగిస్తోంది. బ్యాంకుల్లో జమ చేసుకున్న తమ సొమ్మును ఎప్పుడు అప్పుడు తీసుకునే స్వేచ్ఛ ఖాతాదారులకు ఉంటుంది.  అయితే ఆ విత్‌డ్రాలపై ఆంక్షలతోపాటు పరిమితికి మించి చేస్తే ఛార్జీలు వసూలు చేస్తామనడం ఎంతమాత్రం సమంజసం కాదు.  అలాగే ఎక్కౌంట్లలో కనీస బ్యాలెన్స్‌లు నిర్వహించకపోతే జరిమానాలు విధించాలని బ్యాంక్‌ల దిగ్గజం ఎస్‌బిఐ యోచించడం పూర్తిగా అసమంజసం. ఇటువంటి చర్యలు ప్రజలను బ్యాంక్‌లకు చేరువ చేయడం మాట అటుంచి బ్యాంక్‌లంటే భయపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంక్‌ దృష్టిసారించి సరిదిద్దితేనే  ప్రజల కష్టాలు  తీరుతాయి.