ఈ సంబరాలు ఆత్మహత్యాసదృశ్యమే !

జి.కె. వార్తా వ్యాఖ్య
 ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో భాజపా తిరుగులేని విజయాలను నమోదు చేయడంతో పాటు గోవా, మణిపూర్‌లో ఇతర పార్టీల, ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతుండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేకపోవడం సహజమే. ఈ ఫలితాలతో ప్రధాని నరేంద్రమోడీ కొత్త శకానికి నాంది పలికారని, మణిపూర్‌ వంటి మారుమూల రాష్ట్రంలో కూడా పార్టీ జీరో స్థాయి నుంచి అధికార పీఠానికి చేరువకు చేరుకునేలా చేయడం వెనుక మోడీ సమ్మోహనశక్తి ఉందని చాలా మంది భాజపా నాయకులు, భక్తులు దేశాధినేతను కీర్తిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎవరి పార్టీ రథసారథికి, జన్మోహనశక్తికి కేంద్ర బిందువుగా ఉన్న వారికి ఆ పార్టీ శ్రేణులు భజన చేయడం సహజ పరిణామమే….ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు కాని  కొంతమంది హస్తిన అమాత్యులు, నాయకులు మాత్రం అత్యుత్సాహంతో ఈ అద్భుత ఫలితాలతో పెద్ద నోట్ల రద్దుకు ప్రజామోదం లభించినట్లయిందని ఓ ఉచిత ప్రకటన చేసిపారేశారు. దేశంలో అతి పెద్ద రాష్ట్రంగా, హస్తినలో ఏ పార్టీ అధికారపీఠాన్ని అధి¸ష్ఠించాలన్న కీలకమయ్యే యూపీలో ఎగ్జిట్‌ పోల్స్‌, రాజకీయ పరిశీలకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ భాజపా భారీ విజయాలను నమోదు చేసినమాట వాస్తవమే. అయితే యూపీలో భాజపా భారీ విజయానికి చాలా కారణాలే పనిచేశాయి. యూపీ ఓటర్లు యువకుడైన  అఖిలేష్‌ యాదవ్‌కుకు వ్యక్తిగతంగా మద్ధతు ప్రకటించినా ఎన్నికల ప్రకటన వెలువడే వరకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్‌ కుటుంబంలో కలహాలు, పార్టీలో ఐక్యత లోపించడం, కుల,మత సమీకరణలు తదితర కారణాల వల్ల ఆ పార్టీ చావు దెబ్బతింది. అదే సమయంలో యూపీ,ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల ఎన్నికలు భాజపాకు చావోరేవో అన్నట్లు ప్రధానమంత్రి హోదాలో ఉన్న నేత గల్లీ గల్లీకి తిరగడం బహుశ ఇదే ప్రథమం కావచ్చు. ఏమైనా  మోడీ శ్రమకు తగ్గ ఫలితం లభించి నెహ్రూ, ఇందిరాగాంధీల హయాం తర్వాత యూపీలో ఒకే పార్టీకి 300కు పైగా స్థానాలు దక్కించిపెట్టిన ధీరునిగా చరిత్రలో ఆయన నిలిచిపోతారు. అలాగే ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో అంతర్భాగంగా ఉండి ప్రత్యేక రాష్ట్రంగా వేరుపడిన ఉత్తరాఖండ్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు విసుగుచెందడంతో సహజంగానే  మోడీ సమ్మోహన శక్తి  పనిచేసింది. ఇక పంజాబ్‌లో సంగతి తెలిసిందే. అక్కడ దశాబ్ధకాలంగా అధికారంలో ఉన్న  అకాలీదళ్‌-బిజెపి  సంకీర్ణ ప్రభుత్వం పనితీరుతో విసుగెత్తిన ప్రజలు ఆప్‌ను కాదని కాంగ్రెస్‌కు పట్టంకట్టారు. అలాగే గోవాలో భాజపా ప్రభుత్వ పనితీరుపై విసుగుచెందిన ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో అధికారానికి దగ్గరలోనే ఆగిపోవలసి వచ్చింది. అయితే ఇతరుల సహకారంతో గోవాలో,  కొత్తగా మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు భాజపా  ఇతరుల సహకారంతో సర్కార్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ వాస్తవాలను మరిచి గోవా, మణిపూర్‌లో కూడా మాదే విజయం అన్నట్లు భాజపా నేతలు  చంకలు గుద్దుకుంటే ఆత్మవంచనే అవుతుంది.  అయితే ఈ విజయోత్సాహంతో భాజపా నేతలు ఒంటెద్దు పోకడలతో ముందుకు వెళితే దెబ్బతినడం ఖాయం. ముఖ్యంగా భాగస్వామ్య పక్షాల పాలన కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఆ పార్టీ తన నిబద్ధతను నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది. తెదేపా-భాజపా ఏలుబడి ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో విభజన చట్టం అమలు విషయంలో, ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు విషయంలో భాజపా నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తగిన న్యాయం చేయలేదన్న భావన జనబాహుళ్యంలో బలపడింది. అయితే ఈ వాస్తవాలు మరిచి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా బలపడదామనుకుంటే అత్యాశే అవుతుంది. తాజా విజయం భాజపాకు తలకెక్కకుండా ఉంటేనే ఆ పార్టీకి శ్రేయస్కరం. ఈ విజయాలు తమ విధానాలకు, నిర్ణయాలకు  ప్రజామోదం అనుకుంటే పొరపాటే. విశాల భారతదేశంలో ఏదో మూల ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఎన్నికలు జరిగిన చోట్ల స్ధానిక అంశాలతో పాటు అక్కడి ప్రభుత్వాల వ్యతిరేకత కూడా ప్రత్యర్ధి పార్టీలకు సానుకూలమవుతుందన్న  విషయం జాతీయ పార్టీ నాయకులైన కమలనాథులకు తెలియని విషయమేమీ కాదు. నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తాజా ఎన్నికల ఫలితాలు సానుకూలత తెలియజేస్తున్నాయని భాజపాలో చోటామోటా నేతలు అన్యోపదేశంగా చెబుతుండటం చూస్తే నోట్ల రద్దు  కష్టాలు 50 రోజుల్లో తీరుతాయని, వచ్చే రోజులన్నీ ‘అచ్ఛా దిన్‌’లేనని  చెప్పిన వారు 50 కాదు కదా 120 రోజులైనా తీరకపోవడానికి ఏం సమాధానం చెబుతారు. ఈ ‘అచ్ఛా దిన్‌’ కాస్త ‘చచ్చే దిన్‌’గా మారిందని వస్తున్న వ్యాఖ్యలు ఈ పరిస్థితుల్ని చూస్తే నిజమేననిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ఎంతవరకు అదుపులోకి వచ్చిందో అందరికీ బాగా తెలుసు. మరో వైపు నకిలీ కరెన్సీ ప్రవాహానికి అడ్డుకట్ట పడలేదు. మన జిల్లాయే అందుకు ఉదాహరణ.  ఈ పరిస్థితులన్నీ చూస్తే అచ్ఛా దిన్‌ వచ్చిందో లేదో అందరికీ తెలుసు.  ఏది ఏమైనా నోట్ల రద్దు నిర్ణయానికి తాజా ఎన్నికల ఫలితాలు ఆమోదం అనుకుంటే ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందన్న విషయాన్ని కమలనాథులు గ్రహిస్తే వారికే మంచిది.