వెదురుపాక గాడ్‌ సహధర్మచారిణి సీతామహలక్ష్మీ కన్నుమూత 

రాజమహేంద్రవరం, మార్చి 27 : వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్‌)కు సతీ వియోగం కలిగింది. గాడ్‌ సహధర్మచారిణి సీతామహలక్ష్మీ (70) నిన్న కన్నుమూశారు. ఆమె మరణంతో గాడ్‌ భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న ఉదయం ఆమె అస్వస్థతకు గురి కాగా కుటుంబసభ్యులు, భక్తులు వెంటనే రాయవరంలోని ఓ  ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే ఆమెకు గుండెనొప్పి అధికమై తుది శ్వాస విడిచారు. ఆసుపత్రికి తీసుకెళ్ళాక వైద్యులు ఈ విషయాన్ని నిర్ధారించారు.  ఆమె మరణ వార్త తెలియగానే జిల్లా నలుమూలల నుంచి అనేకమంది భక్తులు సీతామహలక్ష్మీ భౌతికకాయానికి నివాళులర్పించారు.ఆమె పార్థివదేహానికి గత సాయంత్రమే రాజమహేంద్రవరం కోటిలింగాలపేటలోని రో టరీ కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించారు. వెదురుపాక గాడ్‌ ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో ఆయనకు జీవితాంతం చేదోడు వాదోడుగా నిలిచిన సీతామహలక్ష్మీ ఆకస్మిక మరణాన్ని ఆయన బంధువర్గం, కుటుంబ సభ్యులే గాక గ్రామ వాసులు, ఆప్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె మృతి పట్ల పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పలువురు శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఆధ్యాత్మికవేత్తలు, సాహితీవేత్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరానికి చెందిన ప్రముఖ వస్ర ్త వ్యాపారి , జిల్లా ధార్మిక మండలి అధ్యక్షులు, గాడ్‌ భక్తులు  తుమ్మిడి రాంకుమార్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.