బాధ సహజం… తీరు అసహజం..

(జి.కె.వార్తా వ్యాఖ్య)
 
మంత్రివర్గంలో చోటు లభించాలని ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యే కోరుకుంటారు. అందునా సీనియర్లు, చిరకాలంగా పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న వారు ఆశించడంలో అసలు తప్పులేదు. పార్టీకి సేవలందిస్తున్న తమకు గుర్తింపు, గౌరవం దక్కాలని వారు కోరుకోవడం సహజమే. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై తెలుగుదేశం పార్టీలో  గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ధూళిపాళ నరేంద్ర, కాగిత వెంకట్రావ్‌ వంటి ఎందరో సీనియర్‌ శాసనసభ్యుల ఆవేదన అర్ధం చేసుకోదగినదే. అయితే వారు తమకు పదవి దక్కలేదని నిరసన తెలియజేయడం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు వారి స్వరంలో వినిపించాయన్న విషయాన్ని  ఆ పార్టీ శ్రేణులు సమర్ధిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కొందరు తమ  మనోభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయగా మరి కొందరు మర్మగర్భంగా వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో కార్యకర్త ఎమ్మెల్యే కావాలనుకోవడం, ఎమ్మెల్యే మంత్రి కావాలనుకోవడం తప్పుకాదని సాక్షాత్తూ తెదేపా అధినేత, సీఎం చంద్రబాబునాయుడే వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా ప్రస్తావనర్హం. సుదీర్ఘ కాలంగా పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు కాకుండా అటూ ఇటూ రంగులు మార్చే వారికి పార్టీ ప్రాధాన్యం ఇస్తోందని క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తి భావాలను పరిగణనలోకి తీసుకోవలసిన బాధ్యత పార్టీ శ్రేయస్సు దృష్ట్యా అధిష్ఠానానికి ఉందనడం నిర్వివాదాంశం. అయితే తమ అసంతృప్తిని పార్టీకి సముచిత మార్గంలో తెలియజేసే విధానం ఉండగా పార్టీని బ్లాక్‌ మెయిల్‌ చేసే విధంగా ధిక్కార ధోరణి ప్రదర్శించడం మాత్రం తెలుగుదేశం పార్టీలో సరికొత్త పరిణామం.  అయితే ఆ వ్యక్తీకరణ క్రమశిక్షణను ఉల్లంఘించి హద్దులు దాటడం ఏ పార్టీకైనా మంచిదికాదు. క్రమశిక్షణకు ప్రాణమైన తెలుగుదేశం పార్టీలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం అసలు మంచిది కాదు. రాజమహేంద్రవరంలో అధికార తెలుగుదేశం పార్టీలో పరిణామాలు ఇందుకు తాజా ఉదాహరణ. ఇక్కడ అధికార తెలుగుదేశం పార్టీ  కార్పొరేటర్లు  నగర పాలనలో కీలకమైన కార్పొరేషన్‌ బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించడమే కాకుండా మూడు రోజుల్లో తమ నాయకునికి తగిన గౌరవం ఇచ్చే విషయం తేల్చకపోతే రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ అధిష్ఠానానికి అల్టిమేటమ్‌ ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మూడున్నర దశాబ్ధాల తెలుగుదేశం క్రమశిక్షణాయుతమైన ప్రయాణంలో ఈ పరిణామాలే ఇపుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి. సహజ విరుద్ధమైన ఈ వ్యవహారాలు ఇపుడు తెలుగుదేశం నాయకత్వానికే గాక ఇతర పార్టీలకు కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. గతంలో మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తిని లోలోన వ్యక్తం చేయడమేగాని బహిర్గత పర్చడం తెదేపా ప్రయాణంలో బహుశ ఇదే ప్రథమం. రాజమహేంద్రవరంలో అయితే సీనియర్‌ నేత గోరంట్లకు అమాత్య పదవి ఇవ్వలేదన్న అసంతృప్తి, మనస్తాపంతో కార్పొరేటర్లు బడ్జెట్‌ సమావేశాన్ని బహిష్కరించారు. అయితే ఈ హైడ్రామాకు ఆయన సమ్మతి ఉంటుందని  నూటికి నూరుపాళ్ళు ఎవరూ భావించడం లేదు. ఎందుకంటే  బుచ్చయ్యచౌదరి ఎక్స్‌ అఫీషియో సభ్యుని హోదాలో నిన్నటి కౌన్సిల్‌ సమావేశానికి హాజరయ్యాక కాని తమ పార్టీ కార్పొరేటర్లు సమావేశానికి రాలేదన్న విషయం తెలియకపోవడమే ఇందుకు నిదర్శనం. బుచ్చయ్యచౌదరే కాదు ఆ పార్టీ శ్రేయస్సు కోరుకునే వారెవరూ రాజమహేంద్రవరం ప్రజల దృష్టిలో, ప్రతిపక్షాల దృష్టిలో పార్టీ పరువు ఈ విధంగా పోవడాన్ని హర్షించబోరు.  ఈ ధోరణి రాజమహేంద్రవరం నగర పాలక సంస్థగా ఆవిర్భవించాక జరిగిన మూడు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీని నమ్మి మూడు పర్యాయాలు ఆ పార్టీని గెలిపించిన ఓటర్లను అవమానించడమే. అధికార తెలుగుదేశం పార్టీ చర్యలపై ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు కూడా చెవిలో పువ్వులతో నిరసన తెలిపారు. ప్రతిపక్షంగా అది వారి బాధ్యత. నగర పాలనకు కీలకమైన బడ్జెట్‌ ఆమోదం పొందే విషయంలో అధికార పార్టీ సభ్యుల తీరు క్షమార్హం కాదు. తమ వ్యవహార శైలిపై వారు పునరాలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తమ డిమాండ్‌పై పార్టీ అధిష్ఠానం మూడు రోజుల్లోగా స్పందించకపోతే రాజీనామాలు చేస్తామన్న కార్పొరేటర్లు అందుకు తాము సిద్ధంగా ఉన్నామా? అన్న విషయాన్ని గుండెల మీద చెయ్యి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ పరిణామాలను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్న విషయాన్ని గుర్తెరగాలి…. తస్మాత్‌ జాగ్రత్త !!